అమరనాధ్ హిందూ భక్తి యాత్రను మోసేది కాశ్మీర్ ముస్లింలే -ఫోటోలు


కాశ్మీరీ జాతి స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పరితపించే కాశ్మీరీలను వేర్పాటువాదులుగా ముద్ర వేసి ద్వేషించడం హిందూ మతోన్మాదులకు పరిపాటి. తమ వర్తమానం, భవిష్యత్తు తమకే అప్పజెప్పాలని కోరే కాశ్మీరీ యువకులను టెర్రరిస్టులని చెప్పి కరకు తుపాకులకు బలి చేయడం భారత మిలట్రీ దశాబ్దాలుగా సాగిస్తున్న దుశ్చర్య. హిందూ మతోన్మాదం తమ ప్రజాస్వామిక ఆకాంక్షలపై విద్వేషం వెళ్లగక్కుతున్నప్పటికీ అమర్ నాధ్ హిందూ భక్తి యాత్రీకులను కాశ్మీరీ యువతే తమ భుజస్కందాలపై మోసి గమ్యం చేర్చే సంగతి చాలా మందికి తెలియదు.

హిమాలయ పాద పీఠాన బేస్ కేంపుల్లో గుడారాలు వేసి ఆశ్రయం కల్పించడం దగ్గర్నుండి మార్గమధ్యంలో చనిపోయిన యాత్రికుల విగత శరీరాలను సంబంధీకులకు తిరిగి అప్పగించేవరకూ ‘అమరనాధ్ భక్తి యాత్ర’కు పూర్తి అండదండలు అందించేది టెర్రరిస్టులని ఈసడించుకునే కాశ్మీర్ ముస్లిం యువకులేనని ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి. అతి ప్రమాదకరమైన మంచు హిమపాతాలనుండి రక్షణ కల్పిస్తూ, తటాలున జారిపోయే పర్వతాల ఏటవాలుల్లో చేయూతనిచ్చి దాటవేస్తూ, పిల్లలను, స్త్రీలను, ముసలివాళ్లనూ భుజాలపై మోస్తూ అమరనాధ్ భక్తియాత్రకు సహకరిస్తున్న ఈ కాశ్మీరీలకు కృతజ్ఞతలు చెప్పుకోవడం మాని తమ యాత్రకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలకు తెగించడం మతోన్మాదులకు మాత్రమే సాధ్యం.

కాశ్మీర దేశం అంటే ఉనికిలో లేని భరతమాత నుదుటి తిలకం కాదనీ, శతాబ్దాల ఉనికి కలిగిన 1.3 కోట్ల కాశ్మీరీల బతుకు పోరాటమనీ తెలిసిన భారతీయులు బహు తక్కువ. మతోన్మాద విద్వేషానికి మతసహన పూర్వకమైన సేవలతో బదులు తీర్చుతున్న ఈ కాశ్మీరీలకు సెల్యూట్ చేద్దాం!

బోస్టన్ డాట్ కామ్ వెబ్ సైట్ ఈ ఫొటోలను అందించింది.

31 thoughts on “అమరనాధ్ హిందూ భక్తి యాత్రను మోసేది కాశ్మీర్ ముస్లింలే -ఫోటోలు

 1. హిందూ మతోన్మాదులన్న మాట అభ్యంతరకరం. హిందూ మతం అంటూ యేమీ లేదూ, కేవలం ఇది సనాతనధర్మమన్న స్పృహ లేని వారితో వాదించటం కష్టమే. సనాతనధర్మం ఉన్మాదపూరితం అయ్యుంటే బారతభూమిలో ఇస్లాము మతం నిలద్రొక్కుకునేదే కాదు సుమా. కాశ్మీరీ యువకులందరినీ టెర్రరిస్టులని యెవరూ అనరు. ఇలా అనటం అతివ్యాప్తిగా చెప్పటమే. టెర్రరిష్టులు భారతభూమి పట్ల ద్రోహచింతన ఉన్నవారు మాత్రమే. ‘అమరనాధ్ భక్తి యాత్ర’కు పూర్తి అండదండలు అందిస్తున్న కాశ్మీరీ యువకులు తమ భుక్తికోసం చేస్తున్నా వారికి యాత్రీకులు కృతజ్ఞులై ఉంటారనటంలో సందేహం లేదు.
  ఉనికిలో లేని భరతమాత అన్న ఒక్క ప్రయోగం చాలు మీ విద్వేషపూరిత మనస్తత్వం బయటపడ వేయటానికి. వేర్పాటువాదానికి మీరు బతుకు పోరాటమని పేరు పెట్టటం బాగాలేదు.

 2. శ్యామలరావు గారూ, హిందువులంటేనే మతోన్మాదులని నేను చెప్పలేదు కదా! మతోన్మాదుల్ని మాత్రమే అలా అన్నాను. ఉదాహరణకి ఇక్కడే ఒక వెధవ బూతులు రాశాడు. అలాంటివారు మాత్రమే ఉన్మాదులు అవుతారు. హిందు మతాన్ని నమ్మేవారంతా ఉన్మాదులేనని నేను భావించడం లేదు. మీరు చెప్పిన సనాతన ధర్మం గురించి కూడా నేనేమీ రాయలేదు.

  స్ధానిక సంస్కృతిపై ఆధిపత్యం వహించనంతవరకూ సాధారణ ప్రజలు ఎవరినైనా తమలో కలిపేసుకుంటారు. అది ప్రజల గొప్పతనం. వ్యాపారం పేరుతో వచ్చి దోపిడికి తెగబడడం వల్ల బ్రిటిష్ వారిని అదే ప్రజలు తరిమి కొట్టారు

  భారత దేశంలోని ముస్లింలు ఇక్కడివారే. ఆర్.ఎస్.ఎస్ గురువు గోల్వాల్కర్ కూడా ఆ విషయాన్ని చెప్పారు. కాకపోతే ముస్లింలుగా మారాక వారి ఆత్మ భారతీయ ఆత్మ కాదు గనక ఇక్కడినుండి వెళ్లిపోవాలన్నారు. ఇప్పటి ఆర్.ఎస్.ఎస్ గురువులు ముస్లింలను వెళ్లిపోవాలని చెప్పడం లేదని కొంతమంది మిత్రులు ఈ బ్లాగ్ లోనే తెలియజేశారు. హిందూమతంలో కుల అణచివేతను భరించలేక మతం మారిన భారతీయులే భారత ముస్లింలని గుర్తిస్తే ఇస్లాం మతం ఇక్కడ నిలదొక్కుకోవడానికి కారణం ఇక్కడి ప్రజల్లోని కొంతమంది దానిని ఆమోదించి స్వీకరించడమేనని అర్ధం అవుతుంది.

  భారత రాజ్య మిలట్రీ నిత్య పహారాలో కాశ్మీరు ప్రజలు బతుకుతున్నారు. భద్రతాదళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ) వల్ల మిలట్రీకి అక్కడి ప్రజలపై సర్వాధికారాలు దఖలు పడ్డాయి. టెర్రరిస్టులన్న ముద్ర వేసి కాశ్మీరు యువకులను అరెస్టు చేసి మాయం చెయ్యడం ఇటీవలివరకూ నిత్యకృత్యం అక్కడ. ఇప్పటికీ అనేకమంది ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ బాధితులుగా ఉన్నారు. మనం చూడకపోయినా భారత రాజ్యం (ప్రజలు కాదు) కాశ్మీరు ప్రజలని టెర్రరిస్టులుగానే చూస్తున్నదని చెప్పడానికి ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టమే సాక్ష్యం. ఈ చట్టానికి హిందూ మతోన్మాద పార్టీలు, సంస్ధల మద్దతు ఉంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలన్న ప్రజల డిమాండ్ ను బి.జె.పి దాని సోదర సంస్ధలు వ్యతిరేకిస్తున్నాయి. హిందూ మతోన్మాదులు కాశ్మీరీలందరినీ టెర్రరిస్టులుగానే చూస్తున్నారని నేను చెప్పడానికి ఈ అంశాలు కారణం.

  “హిందూ మతోన్మాదం అనగానే హిందువులందరూ మతోన్మాదులే అని చెప్పినట్లు మీరు లాగిన అర్ధం ఒక్కటి చాలు మీ ఉన్మాదం ఏపాటిదో చెప్పడానికి?” అని నేననవచ్చా శ్యామలరావు గారూ? కాశ్మీరీల బతుకు పోరాటాన్ని టెర్రరిజంగా మీరు చెబుతారు. నేను మాత్రం ఉన్మాదాన్ని ఉన్మాదంగా చెప్పకూడదేం?

  నా విద్వేషం ఎవరిమీదని మీ ఉద్దేశ్యం? నాకూ ఒక మతమూ, భక్తీ ఉంటే నాకు విద్వేషం అనొచ్చు. అదేమీ లేకుండానే నాకు విద్వేషం అంటగట్టి మీ విద్వేషాన్ని మీరే బయటపడవేసుకున్నారు.

  కాశ్మీరు కాశ్మీరు ప్రజలది. ఆంధ్ర ప్రజలదో ఇతర ప్రదేశ్ ల ప్రజలదో కాదు. ఆ ప్రాంతం ఈ దేశంలో భాగంగా ఉండాలంటే కాశ్మీరీల మనసులను గెలుచుకోవాలి. అంతే తప్ప మిలట్రీ చట్టాలు తెచ్చి అణచివేస్తే ఏ ప్రజలైనా తిరగబడతారు. అణచివేతపై తిరగబడడం ప్రకృతి ధర్మం. కాశ్మీరు మాదే అని చెప్పడం వెనుక భారత ధనికవర్గాల ప్రయోజనాలు ఉన్నాయి. వారి ప్రయోజనాల కోసం భారతమాత, నుదుటి తిలకం అంటూ సెంటిమెంట్లు రెచ్చగొట్టి పెట్టారు. చూడబోతే మీరూ ఆ ట్రాప్ లో పడినట్లు కనిపిస్తోంది. ఏ జాతికైనా స్వయం నిర్ణయాధికారం స్వతస్సిద్ధం అని గుర్తించలేకపోతే ఇలా ధనికవర్గాల పని సులువయిపోతుంది.

 3. మీరు సెల్యూట్ చేయడానికి వాళ్ళేమి ఫ్రీ గా చేయడం లేదు కదా.
  అక్కడ ఉపయోగించుకునే ప్రతీ సేవకి డబ్బులు చెల్లించాలన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది.
  ఇంకో విషయం ఏంటంటే వాళ్లకి అది జీవనోపాధి , యాత్రికుల ద్వారానే వాళ్ళు సంపాదించుకుంటారు.
  వ్యవసాయం ద్వారా సంపాదించేది తక్కువ గా ఉన్నప్పుడు , మనుషులు వేరే జీవనోపాధి వెతుక్కోవడం లో ఆశ్చర్యం లేదు, కాని అది సేవ గా లెక్కగట్టి ఆహా ఒహో అని కీర్తించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
  అక్కడ ఉండేది ముస్లిమ్స్ మాత్రమె. అటువంటప్పుడు వేరే వాళ్ళు ఎలా కనిపిస్తారు, ఒక వేల కనిపించిన అది సేవ కాదు. డబ్బులు తీసుకుని చేసేది సేవ ఎలా అవుతుంది.
  మీరు కాశ్మీరి పండిట్స్ మీద కూడా ఒక పోస్ట్ రాయండి.

 4. వెంకట్. గారూ

  సెల్యూట్ చేస్తే ఫ్రీ సర్వీస్ వచ్చేపనైతే ఉన్మాదులు కూడా సెల్యూట్ చేస్తారు.

  నేనిలా రాశాను.

  “మతోన్మాద విద్వేషానికి మతసహన పూర్వకమైన సేవలతో బదులు తీర్చుతున్న ఈ కాశ్మీరీలకు సెల్యూట్ చేద్దాం! ”

  సెల్యూట్ ఎందుకు చెయ్యాలో ఈ వాక్యంలో చెప్పాను. అయినా, అడిగారు గనక ఈ వివరణ ఇస్తున్నాను.

  కాశ్మీరీలపై టెర్రరిస్టు ముద్ర వేయడానికి హిందూ సంస్ధలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. హిందూమతం పేరుచెప్పి తమపై విద్వేషం వ్యక్తం చేస్తున్నా, అదే హిందూ భక్తి యాత్రలకు అదే కాశ్మీరీలు సహకరిస్తున్నారు. అందుకే వారికి నా సెల్యూట్స్!

  మీరన్నట్లు, కాశ్మీరీలు ముస్లింలు. హిందూ ఉన్మాదానికి బదులు తీర్చుకోదలిస్తే వారు యాత్రలకు సహకరించరు. బదులు తీర్చుకుంటే ఎలా ఉంటుందో గుజరాత్ మారణకాండ తెలియజేబుతుంది. పాక్ అనుకూల శక్తుల ముస్లిం మతోన్మాద బోధనలకు ప్రభావితం కాకుండా, భుక్తి కోసమైనా సరే, వైరి మతయాత్రలకు సహకరించడం గొప్పతనమని నా అభిప్రాయం. ఆ గొప్పతనానికే నా సెల్యూట్స్!

  మతోన్మాదానికి రెచ్చిపోయే అవకాశాన్ని తొక్కి పెట్టినందుకే నా ఆహా, ఓహో! గుజరాత్ లో లాగా రెచ్చిపోయి మూకుమ్మడి హత్యలకు తెగబడనందుకే నా అభినందన.

  ఎంత డబ్బిస్తే వారి శ్రమకి పూర్తి ధర చెల్లించినట్లు? తొంభైల్లో వందల్లో ఉన్న యాత్రీకుల సంఖ్య ఇపుడు లక్షలకు చేరింది. ఆదాయ మార్గాలున్న చోట అనివార్యంగా జనం కూడతారు. ఆ విధంగా మాత్రమే అది జీవనోపాధి. అది కూడా సంవత్సరంలో కొద్ది కాలమే. అతి కొద్ది కూలీ డబ్బులకి శరీరాన్నంతా అప్పగించి శ్రమ చేయడం నిస్సందేహంగా సేవే.

  సందర్భం వచ్చినపుడు పండిట్ల గురించి తప్పకుండా రాస్తాను. అందుకు నాకు వ్యతిరేకత ఏమీ లేదు. హిందూ మతోన్మాదం ఉన్నట్లే ముస్లిం మతోన్మాదం కూడా ఉంది. కొందరి ఉన్మాదానికి ఆధిపత్య దాహం పునాది అయితే మరి కొందరి ఉన్మాదానికి ‘అణచివేతకి వ్యతిరేకంగా తలెత్తే తిరుగుబాటు’ పునాది. కొందరు కాశ్మీరీలు దారి తప్పి టెర్రరిస్టు ఎత్తుగడలకు దిగుతున్న మాట వాస్తవం. వీరిలా మారడానికి పాక్ ధనికవర్గాల ప్రోత్సాహం ముఖ్యకారణం. అదే సమయంలో టెర్రరిజం తలెత్తడానికి తగిన పరిస్ధితులు కాశ్మీర్ లో ఉన్నాయనీ, ఆ పరిస్ధితులకు కారణం భారత పాలకులని (ప్రజలు కాదు) గుర్తించాలి.

  హిందూ, ముస్లిం మత సెంటిమెంట్ల కంటే ముందు కాశ్మీర్ ప్రజల బాగోగుల్నీ చూడగలిగితేనే వాస్తవ కాశ్మీర్ సమస్య ఏమిటో అర్ధం అవుతుంది.

 5. దైవం దయ వల్ల కొంతకాలం క్రిందట మేము అమరనాధ్ యాత్ర, వైష్ణవీ దేవి యాత్ర చేసి వచ్చాము. ఇందుకు సహకరించిన దైవానికి మరియు అందరికి కృతజ్ఞతలు.

  ఈ యాత్రలో సైనికులు మరియు కశ్మీర్ వాసులు కూడా మాకు ఎంతో సహాయసహకారాలను అందించారు.

 6. “హిందూ మతోన్మాదం తమ ప్రజాస్వామిక ఆకాంక్షలపై విద్వేషం వెళ్లగక్కుతున్నప్పటికీ అమర్ నాధ్ హిందూ భక్తి యాత్రీకులను కాశ్మీరీ యువతే తమ భుజస్కందాలపై మోసి గమ్యం చేర్చే సంగతి చాలా మందికి తెలియదు.”………

  మరి ముస్లిం మతోన్మాదం ఎంతగా ఉన్నప్పటికీ సహనంతో ఉన్న మామూలు ప్రజలకు కూడా సలాం చెయ్యల్సిందే కదా… అది కూడా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా…మరి ఆ సామాన్యుల గురించి రాయరు ఎందుకని ?

  “కాశ్మీర దేశం అంటే ఉనికిలో లేని భరతమాత నుదుటి తిలకం కాదనీ”……..మరి దేశం అంటే తల్లి అయితే భరత మాత కూడా ఉన్నట్లే కదా…అది మీకు తెలియదు అనుకోవాలా… తల్లి నుదుటి మీద తిలకం ఉంటుంది అని నేను అంటే…నేను హిందువుని కాబట్టి తల్లి తలమీద సింధూరం ఉంటుంది అన్నట్లేనా … కాశ్మీర్ భరత మాత తలపై సింధూరం అనగానే మతొన్మాదులు అవుతారా ?…

  Every place/every person should get treated treated equally well. There is no doubt about…but dishonoring country is not a good way ….

 7. నాగ సతీష్ గారూ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ఏ మతోన్మాదాన్నయినా తలకెక్కించుకోకుండా ఉన్నవారెవరైనా అభినందనీయులే. ప్రతికూల పరిస్ధితుల్లోనూ, ఉన్మాదుల రెచ్చగొట్టుడికి రెచ్చిపోకుండా సంయమనం పాటించే సామాన్యులందరికీ సలాము చెయ్యవలసిందే.

  ‘ఉనికిలో లేని భరతమాత’ అంటే నా ఉద్దేశ్యం భారతదేశం ఉనికిలో లేదని కాదు. భరతమాత అన్నది ఒక ప్రతీక మాత్రమే. ఒక ప్రతీకాత్మక భావనలోకి కాశ్మీరు ప్రజల వాస్తవ జీవనాన్ని కూడా ప్రతీకాత్మకంగానే చూడడం సరికాదని నా ఉద్దేశ్యం. తల్లి అనే భావన దేశభక్తిని కలిగి ఉండాలన్న అవసరాన్ని గుర్తు చేసే భావన. ఆ భావనను యధార్ధంలోకి తెచ్చి ఆవేశపడినట్లయితే వాస్తవ ప్రజల ఆకాంక్షలను సరైన పద్ధతిలో అర్ధం చేసుకోలేము.

  భారతీయులకి కాశ్మీరు భరతమాత తలపై సింధూరం అయితే కాశ్మీరు ప్రజలకి ఏమిటి? ఇతర రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లోని ప్రజలకి జీవనాన్ని అందించే వనరులకి నిలయం అయినట్లే కాశ్మీరు కూడా అక్కడి ప్రజలకి జీవనాన్ని అందించే ప్రకృతి వనరులకి నిలయం. కాశ్మీర్ వనరులకోసం భారత్, పాక్ పాలకవర్గాలు (ప్రజలు కాదు) కొట్లాడుకుంటూ కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను అణచివేస్తున్నారు.

  కాశ్మీరు గురించి తలచుకున్నపుడు అక్కడి ప్రజలు వారి జీవనం గుర్తుకి రావాలి. దాని బదులు భరతమాత, నుదుటి తిలకం ఇవన్నీ గుర్తుకు వస్తే అక్కడి ప్రజలకు మనం ఏమి గౌరవం ఇచ్చినట్లు? వారి జీవనానికి, సంస్కృతికి, ఆచార వ్యవహారాలకూ, ప్రజాస్వామిక ఆకాంక్షలకు విలువ ఇవ్వకుండా మనకి ఉన్న ప్రతీకాత్మక భావనలు చెక్కుచెదరకుండా ఉండాలని డిమాండ్ చేయడం ఏమి న్యాయం?

  కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గుర్తించడం అంటే దేశ గౌరవాన్ని తిరస్కరించినట్లు కాదు. ఒక జాతి ప్రజల గౌరవాన్ని గుర్తించేవారు మరొక జాతి గౌరవాన్ని తిరస్కరించలేరు. అలా తిరస్కరించడం జాతి విద్వేషం అవుతుంది.

 8. > హిందూమతంలో కుల అణచివేతను భరించలేక మతం మారిన భారతీయులే భారత ముస్లింలని గుర్తిస్తే ఇస్లాం మతం ఇక్కడ నిలదొక్కుకోవడానికి కారణం ఇక్కడి ప్రజల్లోని కొంతమంది దానిని ఆమోదించి స్వీకరించడమేనని అర్ధం అవుతుంది…..

  ఈ మాటలు వింతగా ఉన్నాయి. హిందువులని మీరూ‌, కాఫిర్లని మహమ్మదీయులూ అంటున్న జనబాహుళ్యాన్ని ఇస్లామీకరించటానికి భారతదేశంపైన దందయాత్రలతో‌వచ్చి పడిన విమతీయులు ప్రయత్నించలేదనీ, కులవ్యవస్థను వ్యతిరేకించి కొందరు ప్రజలే‌ఐఛ్ఛికంగా ఇస్లాంలోకి మారారనీ అనటం సత్యవిరుధ్ధం అని నా అభిప్రాయం. ఇస్లాం మతస్థుల దృష్టిలో అభినందన సంపాదించుకోవాలని ఇలాంటి వాదనలు పుట్టాయేమో‌ తెలియదు. అహమ్మదీయులనీ, షియాలు సున్నీలనీ ఇంకా మరికొన్ని రూపాలతో కులవ్యవస్థ ముస్లిం సమాజంలో మాత్రం లేదా?

  > కాశ్మీరీల బతుకు పోరాటాన్ని టెర్రరిజంగా మీరు చెబుతారు…
  నా అభిప్రాయం అది కాదే! వేర్పాటువాదాన్నుంచి మీరు దానిని విడిగా చుడలేకపోతున్నారు, దానికే బతుకు పోరాటమని పేరు పెట్టే పొరబాటు చేస్తున్నారని నా అభిప్రాయం. మీకన్నా భిన్న మైన అభిప్రాయం కలిగి ఉండటమూ ఉన్మాదమే అని మీరు అనుకుంటే అది కూడా ఒక రకమైన టెర్రరిజం క్రిందికే‌వస్తుందని నా అభిప్రాయం.

  >భారతమాత, నుదుటి తిలకం అంటూ సెంటిమెంట్లు రెచ్చగొట్టి ….
  నేనేమీ సెంటిమెంట్లు రెచ్చగొట్టి వ్యాఖ్యానించ లేదే? భారతమాత అనేది యావధ్బారతాన్ని మాతృమూర్తిగా గౌరవించే‌భావన. అది ఉదాత్తం కాదూ, యెక్కడి కక్కడ మావూరొక జాతీ మా పేటొక జాతీ అంటూ కొట్టుకు చచ్చే
  నిర్ణయాధికారభావన దేశానికీ, ప్రపంచానికీ‌మంచిదనే మీ భావనతో యేకీభవించటం నాలాంటి ఛాందసులకు కష్టం.

 9. శ్యామలరావు గారూ, నాది మొదట విద్వేషం అన్నారు. ఇపుడు టెర్రరిజం అంటున్నారు. ఈ విమర్శకి సమాధానం ఇస్తే మరో మాట అనేట్టున్నారు. మీ నిందల జోలికి నేను పోను.

  హిందూ మతంలో కుల అణచివేతనుండి విముక్తి పొందే ఆశతో ఈ దేశంలోని నిమ్నకులాలవారు ఇస్లాం, బౌద్ధం మతాల్లోకి మారడం ఒక వాస్తవం. చరిత్రకారులు, సామాజిక పరిశోధకులు చెప్పిన వాస్తవం ఇది. ఫ్యూడల్ ప్రభువుల దండయాత్రలు ప్రధానంగా ఆర్ధిక ప్రయోజనాల కోసం జరిగాయి. మత విస్తరణ జరిగితే అది ఆర్ధిక ప్రయోజనాలకు అనుబంధంగా జరిగినదే. ఈ విషయాన్ని కూడా నేను చరిత్ర చదివి తెలుసుకున్నదే.

  ముస్లిం మతంలో షియా, సున్నీ తదితర తెగలున్నట్లే హిందూ మతంలో కులాలు ఉన్నాయని అది పెద్ద సమస్య కాదనీ మీరు చెబుతున్నట్లున్నారు. నేను మతవాదిని కాను. అన్ని మతోన్మాదాలకీ నేను వ్యతిరేకం. కుల వ్యవస్ధకి కూడా నేను వ్యతిరేకం. భారత దేశ ప్రజల సామాజిక జీవనం నుండి కులం తొలగిపోవాలని నా బలీయమైన కోరిక. అలాగే, హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్ధ భారత దేశంలో ఇస్లాం, క్రిస్టియన్ మతాలకి కూడా పాకిందన్న సంగతి నా దృష్టిలో ఉంది. కుల అణచివేతనుండి బయటపడాలన్న ఆశతో ఇతర మతాలను స్వీకరించిన నిమ్నకులాల ప్రజలు తమ ఆశ నెరవేర్చుకోలేకపోయారని కూడా నా దృష్టిలో ఉంది. అందుకే కుల నిర్మూలనకి మతం మారడం మార్గం కాదని నేను నమ్ముతాను.

  కాశ్మీరు మొదటి నుండి స్వతంత్ర రాజ్యమే. పాక్ నుండి రక్షణ పొందడానికి కాశ్మీర్ పాలకులు భారత్ సహాయం కోరారు. మూడు మంత్రిత్వ శాఖలను మాత్రమే భారత ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచడానికి అంగీకరించి కాశ్మీర్ స్వతంత్రతను కాపాడుకునే ప్రయత్నం చేశారు అప్పటి కాశ్మీర్ పాలకులు. కాశ్మీర్ లో ఫ్లెబిసైట్ జరపడానికి భారత ప్రభుత్వం హామీ ఇచ్చి ఉల్లంఘించింది. హామీ నెరవేర్చమని కోరినందుకు షేక్ అబ్దుల్లాను రెండు దశాబ్దాలు జైల్లో కుక్కారు. స్వయం ప్రతిపత్తి అని చట్టం చేసి దాన్ని కూడా నీరు గార్చారు.

  అప్పట్లో ఫ్లెబిసైట్ ని పాక్ పాలకులు వ్యతిరేకిస్తే, ఇపుడు భారత పాలకులు వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు భారత్ పట్ల కాశ్మీర్ ప్రజలకి ఉన్న ఇష్టం ఇప్పుడు అయిష్టంగా మారింది. దానికి కారణం కాశ్మీర్ ప్రజలపై భారత పాలకులు సాగించిన అణచివేత.

  మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది చరిత్ర. ఈ చరిత్రలో ఎవరిది ద్రోహం? భారత పాలకులదే (ప్రజలు కాదు) ద్రోహం. దాన్ని పక్కనబెట్టి తమ రాజ్యం తమకి ఇవ్వాలని కోరుతున్న కాశ్మీరీలది విద్రోహం అని చెప్పడం చరిత్రను చూడడానికి నిరాకరించడమే.

  మన యిష్టా యిష్టాలకి అతీతంగా ఉండే వాస్తవాలను ఉన్నది ఉన్నట్లు చూడడమే ఎవరైనా చేయవలసింది. వాస్తవాలను చర్చించడమే నేను చేస్తున్నాను. మీలాంటి చాందసులని సంతృప్తి పరచేలా రాయడం నాకు సాధ్యం కాకపోవచ్చు.

 10. మీరు … “..కాశ్మీర దేశం అంటే ఉనికిలో లేని భరతమాత నుదుటి తిలకం కాదనీ,…”…..అని రాసిన వాక్యం చదివితే బాధగా అనిపించింది. మీరు …కాశ్మీరు మొదటి నుండి స్వతంత్ర రాజ్యమే….. అని వ్రాశారు. అయితే, ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి పుట్టిన గాంధారదేశం ఇప్పుడు విదేశాల్లో ఉంది.

  అమరనాధ్ యాత్రలో , మేము నడవలేక గుర్రాలపై వెళ్ళాము. అయినా మేము నీరసంతో శివ నామాన్ని ఎక్కువగా …… అనలేకపోయాం. కానీ గుర్రాలను నడిపిస్తూ ప్రక్కన నడుస్తున్న వాళ్ళు ముస్లింస్ అయినా శివనామాన్ని చక్కగా అన్నారు. వారు అలా శివ నామ స్మరణ చెయ్యటం మాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. కొందరు హిందువులు కూడా అల్లాహ్ అని ప్రార్ధిస్తారు. .ఏ పేరుతో పిలిచినా .దైవం ఒకరే..
  …………………
  మేము తెలుగులో మాట్లాడుకోవటం చూసి అక్కడ కాపలాగా నుంచున్న ఒక తెలుగు సైనికుడు మీరు తెలుగువారా … …అంటూ ఎంతో ఆనందంగా అడిగాడు. కుటుంబాలకు దూరంగా , అలా కాపలా విధులు నిర్వర్తించటమంటే ఎంతో కష్టం. అతను చిన్న వయసున్న యువకుడు. ఇలాంటి యువకులు అలాంటి టెన్షన్ వాతావరణంలో దేశాన్ని కాపలా కాస్తుంటే , దేశంలో కొందరు యువత సినిమాల వ్యామోహంలో జీవితాలను గడుపుతున్నారు. కొందరు సైనికులు, కానిస్టేబుల్ వంటి పోలీసులు కూడా చాలా మంది సామాన్య, మధ్య తరగతి నుంచి వచ్చే వాళ్ళే.

  ప్రపంచంలో ఎన్నో సమస్యలకు కారణం కొందరు స్వార్ధపరుల స్వార్ధమేనండి…..

  కొన్ని సమస్యలను కాలమే ( దైవమే ) పరిష్కరించాలి..

 11. anrd గారూ మీరు చెప్పినట్లు ప్రపంచంలో ఎన్నో సమస్యలకు కొందరు స్వార్ధపరుల స్వార్ధమే కారణం.

  మీ సెంటిమెంట్ ని అవమానించడం నా ఉద్దేశ్యం కాదు. కాని కొన్ని వాస్తవాలు మన నమ్మకాలకి విరుద్ధంగా ఉన్నపుడు, బాధగా ఉన్నా, వాటిని వాస్తవాలుగా చూడవలసి ఉంటుంది. మరోలా భావించకుండా పైన నాగ సతీష్ గారికి ఇచ్చిన సమాధానం ఒకసారి చూడగలరు.

 12. హిందూ మతం కాదు సనాతన ధర్మం అన్నంత మాత్రాన వారు చేస్తున్న దానిని కప్పి పుచ్చుకోలేరు. అది మతం కాకపోతే సనాతన ధర్మ ఉన్మాదం అవుతుంది. తేడాలేదు.
  అలాగే కొందరు బౌధ్ద మతం అనకుండా బౌధ్ద ధర్మం అంటుంటారు లేదా ఒక జీవన విధానం అంటుంటారు. ఏదైతేనే అది చేసేది తప్పయితే పేరు మార్చుకున్నంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదు.

 13. మతమనేది అది సర్వమానవను సమానంగా చుస్తుందనీ, అది అన్ని మతాలనూ గౌరవిస్తుందనీ, మనుషుల మద్య కలహాలు లేకుండా చేస్తుందనీ, చాలామంది చిలకపలుకులు పలుకుతారు.అది పుర్తిగా వాస్తవవిరుద్దం. చరిత్ర చుస్తె అది ఎన్ని దారుణాలకు వడికట్టిందొ తెలుస్తుంది. దాని వెనుక ఆర్దిక కారణాలు వున్నా పైకి ఇది కప్పి వుంచుతుంది. (edited)… మతమనే మత్తుమందు బాగా పనిచేస్తుంది. పాలక వర్గాలకుడా అదే కావలసింది. వాళ్ళను తిరుగు బాట్లు చెయ్యనీకుండా ఎదొ ఒక వ్యసనంలొ వుండేటట్లు చేస్తుంది.

 14. జీవనోపాధికి మతంతో సంబంధం లేదు. శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలలో హిందూ పండగలకి పూలు అమ్మేది ముస్లిం వ్యాపారులే. పండగ రోజులు తప్ప వేరే రోజులలో వీళ్ళకి పెద్ద వ్యాపారం ఉండదు. అమర్నాథ్ మంచు లింగాన్ని కనిపెట్టినది ఒక గొర్రెల కాపరి. గొర్రెలు కాస్తూ తిరుగుతున్న ఒక వ్యక్తికి ఒక గుహలో ఒక మంచు శిల కనిపించింది. అతను ముస్లిం అయినా అతనికి హిందూ మతం గురించి కొద్దికొద్దిగా తెలిసి ఉండడం వల్ల ఆ మంచు శిల లింగాకారంలో ఉందని గుర్తు పట్టగలిగాడు. అతను ఆ విషయం గ్రామస్తులకి చెప్పడంతో ఆ వార్త ఊరూరా పాకి అదొక యాత్రా స్థలం అయ్యింది. మంచు కొండలు చూడడానికి వచ్చి నడవలేక గుఱ్ఱాలూ, గాడిదల మీద కూర్చునేవాళ్ళు ఉంటారు. గుఱ్ఱాలూ, గాడిదలని అద్దెకి ఇచ్చేవాళ్ళకి కూడా ఆ యాత్ర వల్ల లాభసాటి వ్యాపారం అయ్యింది. యాత్రికులు అంత మంది వచ్చి డబ్బులు ఇస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉంటున్నవాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా తమ ఉపాధి మార్గాన్ని ఎందుకు వదులుకుంటారు?

 15. ప్రవీణ్, మీ వ్యాసం చదివాను. చక్కగా రాసారు. మీరు ఇలాంటి వ్యాసాలు రాసినప్పుడల్లా మీపట్ల ఉండే ఆశ్చర్యం రెట్టింపు అవుతుంటుంది.

  ఒక సూచన. సిద్ధాంత వ్యాసం రాసేటపుడు సైద్ధాంతిక పటిమ చివరికంటా కొనసాగిస్తే ఆ వ్యాసానికి సంపూర్ణత్వం వస్తుంది. మొదటి మూడు పేరాల్లో ఉన్న పటిమ ఆ తర్వాత ఉదాహరణల దగ్గర బలహీనపడినట్లు కనిపిస్తొంది. సిద్ధాంతాన్ని వివరించడానికి ఇచ్చే ఉదాహరణలు కూడా సైద్ధాంతిక స్ధాయిలో ఉంటే వివరణ బలంగా ఉంటుంది. మీరు తీసుకున్న ఉదాహరణలు నిజమే అయినా సైద్ధాంతిక స్ధాయికి తగ్గినట్లుగా నాకు అనిపించింది. ఇది విమర్శ కాదు, సూచన.

 16. రాళ్ళబండి వెంకటేశ్వరరావు గారు వ్రాసిన గతితార్కిక భౌతికవాద సూత్రాల వివరణ పుస్తకం చదివిన తరువాత ఈ విషయాలు మళ్ళీ గుర్తొచ్చి వ్రాసాను. అలాగే http://jajimalli.wordpress.com/2012/10/03/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%AE%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B5/ లో భౌతిక ధర్మం గురించి చర్చ జరగడం వల్ల కూడా విషయాలు గుర్తొచ్చాయి.

 17. చివరి పేరాగ్రాఫ్ మళ్ళీ చదవండి:
  >>>>>
  సమాజం ఉనికిలో ఉంది. కనుక సమాజం గురించి ఆలోచించే మార్క్సిస్ట్ ఒక భౌతికవాదే. వ్యక్తిగత జీవితం ఉనికిలో ఉంది. కేవలం వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే వైయుక్తికవాది కూడా ఒక భౌతికవాదే. సమాజం విషయంలో మార్క్సిస్ట్‌లకీ, వైయుక్తికవాదులకీ మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చు. కానీ భౌతికంగా ఉనికిలో ఉన్న దాని గురించి ఆలోచించేవాళ్ళు ఫండమెంటల్‌గా భౌతికవాదులే అవుతారు. మార్క్సిస్ట్‌లైనా, వైయుక్తికవాదులైనా వీళ్ళందరూ భౌతిక పరిస్థితులలో జీవిస్తూ భౌతిక జీవితం గురించి ఆలోచిస్తున్నవాళ్ళే. భౌతిక జీవితం గురించి ఆలోచిస్తూ బతికేవాళ్ళని భౌతికతకి దూరమైన ఊహల ఆధారంగా రచించబడిన కట్టుకథలూ, పిట్ట కథలూ ఎలా ప్రభావితం చేస్తాయి? ‘అబద్దాలు చెపితే దేవుడు కళ్ళు పోగొడతాడు‌’ అని అంటారు. ‘అబద్దాలు చెప్పేవాళ్ళు ఇంత మంది ఉన్నారు. వీళ్ళందరికీ కళ్ళు పోవడం లేదు కానీ దేవుడు నా ఒక్కడి కళ్ళే ఎందుకు పోగొడతాడు?’ అనే సందేహం భౌతిక జీవితంలో బతికేవాళ్ళకి రావడం సహజం. ‘దానాలు చెయ్యకపోతే బిడ్డలు పుట్టరు‌’ అని అంటారు. ‘దానాలు చెయ్యడానికీ, బిడ్డలు పుట్టడానికీ మధ్య సంబంధం ఏమిటి?’ అనే ఒక్క ప్రశ్న చాలు, ‘పుణ్యం కొద్దీ పురుషుడు – దానం కొద్దీ బిడ్డలు‌’ అనే సామెత అపహాస్యం అయిపోవడానికి. “దళిత సమస్య పరిష్కారానికి” పుస్తకంలో రంగనాయకమ్మ గారు ఇదే విషయం వ్రాసారు “సృష్టిని దేవుడు సృష్టించాడని సృష్టివాదులు అంటారు. కానీ దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే ఒక్క ప్రశ్న చాలు, మత గ్రంథాలలోని సృష్టి కథలన్నీ అపహాస్యమవ్వడానికి” అని. భౌతికతకి అందని మంత్రాలూ, మహిమలూ, శక్తుల ఆధారంగా వ్రాయబడిన కట్టు కథలూ, పిట్ట కథలూ భౌతిక జీవితాలని ప్రభావితం చెయ్యలేవని భౌతిక జీవితాలని పరిశీలించేవాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది.
  >>>>>

  ఇక్కడ సైద్ధాంతికత బలహీనపడినట్టు నాకైతే అనిపించలేదు.

 18. ప్రవీణ్ గారూ మతాన్ని నమ్మెవాళ్ళు ఇతర విషయాలలొ బాగానే వున్నా దాని దగ్గరకు వచ్చెటప్పటికి విటండ వాదులుగా మారిపొతారు ఎమాత్రం తర్కానికి చొటివ్వరు. నావాదనే గెలవాలనే గట్టి పట్టుదలతొ వుంటారు. దాన్ని వాళ్ళు నమ్మినా, నమ్మకపొయినా అదీకాక వాళ్ళు సైంటిస్టున్నే వాళ్ళు సపొర్ట్ తెచ్చుకుంటున్నారు ఎదైనా రాకెట్ ప్రయొగం సెచేముందు తిరుమలకు రావడం ఆనవాయితీ అయింది కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ స్వభావం కుడా అర్దం కావాలి .

 19. మతాన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళతో వాదిస్తే టైమ్ వేస్ట్. నేను వ్యాపారం చేసే రోజులలో నా షాప్‌కి ఒక రెగ్యులర్ కస్టమర్ వచ్చేవాడు. ఫలానా షాపింగ్ కాంప్లెక్స్ యజమాని వాస్తు దోషం వల్ల అదేదో వ్యాధి వచ్చి చనిపోయాడు కనుక నన్ను కూడా వాస్తు చూసుకోమని సలహా ఇచ్చాడు. ఆయన చెప్పిన షాపింగ్ కాంప్లెక్స్‌లో వాస్తు దోషం లేదు. ఒకవేళ వాస్తు దోషం ఉంటే ఆ దోషం ఆ కాంప్లెక్స్‌లో అద్దెకి ఉన్న వ్యాపారులందరికీ వర్తిస్తుంది. ఆ కాంప్లెక్స్‌లో వ్యాపారం చేస్తున్నవాళ్ళు ఎవరికీ లేని బెంగ షాప్‌లకి కస్టమర్‌గా వెళ్ళే ఆయనకి మాత్రమే పట్టుకుంది. అలాంటి వాళ్ళతో మనం ఏమి వాదించగలం?

 20. వాస్తు దోష ప్రభావం గృహంలో ఉన్నవాళ్లందరి పైనా పడుతుందని వాస్తు పండితులే చెపుతుంటారు. ఒక వేళ ఆ షాపింగ్ కాంప్లెక్స్‌లో వాస్తు దోషం నిజంగా ఉండి ఉంటే అందులో ఈ నమ్మకాలు లేని ఒకరిద్దరు తప్ప ఎవరూ అద్దెకి దిగేవాళ్ళు కూడా కాదు. ఈ జ్ఞానం కూడా ఆ వాస్తు విశ్వాసిలో ఉదయించలేదు.

 21. విశేఖర్ గారూ,

  మన గ్రామాల్లో, మారుమూల ఊర్లలో నివసిస్తున్న అనేక మంది ముస్లింల శరీర రంగు,ముఖకవలికలు చాలు ముస్లింలు ఇక్కడి ఆదివాసులే అని చెప్పడానికి. శేర్వాని వేసుకు తిరిగే పాతబస్తీ ముస్లింలను చూసి గుర్తుపట్టవచ్చు గానీ, ఇతర ప్రాంతాల్లో నివసించే ముస్లింలని వారి పేరు చెప్పేవరకూ ముస్లింలని గుర్తుపట్టలేం.

  గుర్రాలపై దండయాత్రలు చేయడానికి వచ్చిన వారి ద్వారా భారత ఉపఖండానికి ఇస్లాం పరిచియమైన మాట వాస్తవమే, కానీ అనంతరం దేశంలోని అనేక వెనుకబడిన,బడుగు బలహీన వర్గాల వారు ఇస్లాం స్వీకరించడం వల్లనే అది ఇక్కడ వ్యాప్తి చెందింది. ఈ మాట ఓ సారి స్వామి వివేకానంద గారే స్వయంగా చెప్పి ఉన్నారు. కానీ, ఈ భావనని అంగీకరించడం తమ కుటిల రాజకీయాలకి విరుద్ధమైంది కావడం వల్ల అతివాద హిందూ గ్రూపులు, ముస్లింలు బయటి వారని ప్రచారం చేస్తుంటాయి.

  ఇక ప్రస్తుత జనరేషన్ వారికి కాశ్మీర్ చరిత్ర, అది ఏ పరిస్థితుల్లో భారత దేశంలో విలీనం చేయబడింది లాంటివేమీ తెలీవు. వీరు కేవలం ఎంసెట్లు, బిటెక్లు మాత్రమే చదివిన వారు కావడం వల్ల వారికి చరిత్ర, రాజ్యాంగం లాంటివి చదివే అవకాశం,అవసరం కూడాలేవు. అతివాద నాయకుల అడ్డగోలు ప్రసంగాలు, బార్డర్,రోజా లాంటి సినిమాల్లోని వన్ సైడెడ్ మెలోడ్రామా డైలాగుల్ని బట్టే వీరు కాశ్మీర్ లాంటి విషయాల మీద తమ అభిప్రాయాల్ని ఏర్పర్చేసుకుంటారు.

  పైగా, “మనం మంచోళ్ళం, అమాయకులం కాబట్టి వారు మనల్ని దేచేసుకుంటున్నారహో”, టైపు ఆత్మస్థుతి-పరనింద డైలాగులు సహజంగానే ఎవరినైనా ఆకర్షిస్తాయి. కాబట్టి, వీరందరూ మేము-వారు టైపు సరిహద్దుల్ని గిరిగీసుకుని తమ భావాలకు విరుద్ధమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేసిన వారందరినీ ద్వేషించడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి వారు మీ రచనల్ని రెగ్యులర్గా చదవుతుంటే కాస్తైనా ఉపయోగం ఉంటుంది. Thanks

 22. మన ఇంజినీరింగ్ విద్యార్థులు సమాజం గురించి గానీ వర్గం గురించి గానీ తెలిసినవాళ్ళు కాదు. వాళ్ళకి చరిత్ర & మతం లాంటి విషయాల గురించి మాత్రం ఏమి తెలుస్తుంది? ఈ లింక్ చదవండి: http://hegelian.mlmedia.net.in/2012/10/blog-post_12.html

  రాజకీయ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడితే లేదా సినిమా నిర్మాతలు ఒక వైపు కోణం చూపించే సినిమాలు చూపిస్తే రెచ్చిపోతారు. నిజమే. సమాజం గురించి అజ్ఞానంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది.

 23. ఇక్కడ ఒక విషయం గమనించాలి. హిందూ మతం అనేది ఒక వ్యవస్థీకృత మతం కాదు. హిందూ మతాన్ని వ్యవస్థీకరించడానికి ప్రయత్నాలు బ్రిటిష్‌వాళ్ళ కాలంలో మొదలయ్యాయి. ఇస్లాం & క్రైస్తవ మతం మొదటి నుంచి వ్యవస్థీకృత మతాలు కాబట్టి హిందువులతో పోలిస్తే ఆ మతాలవాళ్ళలో మతతత్వం ఎక్కువగానే ఉంటుంది. అంతమాత్రానికే “మనది ఓర్పు సహనాలు ఉన్న మతం కాబట్టే ముస్లింలు & క్రైస్తవులు ఇలా చేస్తున్నారు” అని అంటే అది అజ్ఞానమే అవుతుంది.

  చిన్నప్పుడు మా నాన్న నన్ను స్కూల్ పుస్తకాలు తప్ప ఏమీ చదవనివ్వలేదు. కనీసం మత గ్రంథాలు కూడా చదవనివ్వలేదు. నన్ను కేవలం కెరీర్ ఓరియెంటెడ్‌గా పెంచాడు. ఆన్లైన్‌లో పరిచయమైన ఒక టోరాంటో అమ్మాయి సలహా ప్రకారం మార్క్సిస్ట్-లెనినిస్ట్ సాహిత్యం కొని చదివాను. మార్క్సిజం చదివిన తరువాత మొదట్లో నాకు కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్టే అనిపించింది. సమాజం గురించి ఏమీ తెలియని స్థితి నుంచి అప్పుడప్పుడే బయటకొచ్చిన సమయంలో మార్క్సిజం చదివితే అలాగే ఆశ్చర్యం కలుగుతుంది. మార్క్సిజం చదవకుండా, కనీసం మత గ్రంథాలు కూడా చదవకుండా సామాజిక ప్రభావాల వల్ల ఏర్పడిన రొటీన్ సంకుచిత అభిప్రాయాలని నమ్ముతూ కులం పేరుతోనో, మతం పేరుతోనో మార్క్సిస్ట్‌ల మీద పడి ఏడ్చేవాళ్ళకి మనం చెప్పగలిగేది ఏమీ ఉండదు.

 24. శేఖర్ గారు,

  క్రైస్తవ మతం లో దళితులకు జరిగే అన్యాయలను మీరు ఎలా విశ్లేషిస్తారు? ఆమధ్య హైదరాబాద్,చెన్నై, తమిళనాడు లో ఇటువంటి సంఘటనలు (దళితులను రెండో తరగతి పౌరులుగా ట్రిట్ చేయటం, అదికూడా ఆ చర్చికి వేళ్లే వారిలో అధిక శాతం దళితులే) తరచుగా పేపర్ లో వస్తుండేవి.

  Dalit Christians protest non-inclusion of priests
  The protesters questioned the motive for suspending six dalit priests

  http://www.ucanindia.in/news/dalit-christians-protest-noninclusion-of-priests/19277/daily#

  ఈ ప్రశ్న మిమ్మల్ని ఇబ్బంది పెడితే సమాధానం ఇవ్వనవసరం లేదు.

 25. Sri గారు
  మీ అనుమానం ఏమిటో నాకు సరిగా అర్ధం కాలేదు. దళితులకి ఒక్క హిందూ మతంలోనే అన్యాయం జరుగుతోందనీ, మిగిలిన మతాల్లో సమానంగా చూస్తున్నారని నేను ఎప్పుడూ చెప్పలేదు కదా.

  తమిళనాడులో హిందూ దేవాలయాల్లో దళితులని పూజారులుగా నియమించడానికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయినా దేవాలయాల్లో పూజారులుగా వారిని నియమించలేదు. ఈ విషయమై నిరసనలు జరిగాయి. మీరు చెబుతున్న సంఘటనల్లో ఇదీ ఒకటా?

  మీరు ఇచ్చిన వార్త లింక్ లో వివరాలు లేవు. నాకు అర్ధం అయిందాన్ని బట్టి అగ్రకుల క్రిష్టియన్ లకు ప్రాధాన్యం ఇచ్చి దళిత పూజారులపై వివక్ష చూపడంపై నిరసన తెలిపారు. ఇందులో నన్ను ఇబ్బంది పెట్టే విషయం ఏమిటి?

  నేను పైన శ్యామలరావుగారికి ఇచ్చిన సమాధానంలో ఇలా రాసాను.

  “నేను మతవాదిని కాను. అన్ని మతోన్మాదాలకీ నేను వ్యతిరేకం. కుల వ్యవస్ధకి కూడా నేను వ్యతిరేకం. భారత దేశ ప్రజల సామాజిక జీవనం నుండి కులం తొలగిపోవాలని నా బలీయమైన కోరిక. అలాగే, హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్ధ భారత దేశంలో ఇస్లాం, క్రిస్టియన్ మతాలకి కూడా పాకిందన్న సంగతి నా దృష్టిలో ఉంది. కుల అణచివేతనుండి బయటపడాలన్న ఆశతో ఇతర మతాలను స్వీకరించిన నిమ్నకులాల ప్రజలు తమ ఆశ నెరవేర్చుకోలేకపోయారని కూడా నా దృష్టిలో ఉంది. అందుకే కుల నిర్మూలనకి మతం మారడం మార్గం కాదని నేను నమ్ముతాను.”

  మీ ప్రశ్నకి ఇది సమాధానం అవుతుందనుకుంటా. అనుకుంటా అని అనడం ఎందుకంటే మీ ప్రశ్న నాకు సరిగా అర్ధం కానందున.

 26. కుల వ్యవస్థకి మతం కంటే ఆర్థిక అసమానతలతో ఎక్కువ సంబంధం ఉంది. అటువంటప్పుడు మతం మారడం వల్ల కులం ఎలా పోతుంది? పైగా కుల వ్యవస్థ లేని దేశాలలో కూడా డబ్బున్నవాళ్ళనీ, పేదవాళ్ళనీ వేరువేరుగా చూస్తారు కదా. కుల వ్యవస్థని నమ్మేవాళ్ళు కూడా ఇదే సమాధానం చెప్పి కుల వ్యవస్థ పెద్ద సమస్య కాదని అంటారు. దళితులు ఇస్లాం మతంలోకి మారడం గత 1400 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అలాగే క్రైస్తవ మతంలోకి మారడం గత 500 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఆర్థిక అసమానతలు పోనంత వరకు ఈ మత మార్పిడుల ప్రక్రియ మరో 5000 సంవత్సరాలు కొనసాగినా కులం మాత్రం పోదు.

 27. తాము హిందూ మతం కారణంగానే కమ్యూనిజంని వ్యతిరేకిస్తున్నాము అని కొందరు చెప్పుకుంటుండడం వల్ల వాళ్ళకి సమాధానంగా ఈ వ్యాసం వ్రాసాను: http://hegelian.mlmedia.net.in/2012/10/blog-post_26.html
  ఈ వ్యాసానికి కూడా వాళ్ళు ఆవు వ్యాసం లాంటి ఇంకో సమాధానం చెపుతారని నాకు తెలుసు.

 28. కాశ్మీర్ పాకిస్తాన్‌కి వెళ్ళకుండా ఇండియన్ యూనియన్‌లో కొనసాగడానికి కారణం ముస్లింలైన షేక్ అబ్దుల్లాహ్ కుటుంబ సభ్యులేననే విషయం చాలా మంది ముస్లిం ద్వేషులకి తెలియదు. రాఘవ రాం కౌల్ అనే కాశ్మీరీ బ్రాహ్మణుడు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారి షేక్ ముహమ్మద్ అబ్దుల్లాహ్ అని పేరు మార్చుకున్నాడు. అతని కుటుంబానికి చెందినవాడే షేక్ అబ్దుల్లాహ్. ఇప్పుడు కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒమర్ అబ్దుల్లాహ్ షేక్ అబ్దుల్లాహ్‌కి మనవడు.

 29. చీకటి గారు, రోజా సినిమా నేను చిన్నప్పుడు చూశాను. అదేమీ చారిత్రాత్మక సినిమా కాదు. తెలంగాణా ఉద్యమ బ్యాక్‌గ్రౌండ్‌ని తెలుసుకోవడానికి “కెమెరామేన్ గంగతో రాంబాబు” సినిమాని ప్రమాణం అనుకోవడం ఎలాంటిదో, కాశ్మీర్ ఉగ్రవాదం యొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని తెలుసుకోవడానికి రోజా, మిషన్ కాశ్మీర్ లాంటి సినిమాలని ప్రమాణాలని అనుకోవడం కూడా అలాంటిదే. రోజా సినిమా సూపర్‌హిట్ సినిమా కాబట్టి ఆ సినిమాని నమ్ముతారు, కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా విడుదలైన మొదటి రోజే కాంట్రోవర్సీ అయ్యింది కాబట్టి ఆ సినిమాని నమ్మరు. ఇక్కడ ప్రమాణం విషయంలో మౌలికమైన తేడా అదే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s