ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతోంది -ఐ.ఎం.ఎఫ్


పొదుపు విధానాలపై స్పెయిన్ ప్రజల నిరసన -ఫొటో: సి.ఎన్.ఎన్

2008 ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకుంటోందని భావిస్తున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతున్నదని ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాల విధానాలు నమ్మకాన్ని పునరుద్ధరించడంలో విఫలం కావడంతో ప్రపంచ ఆర్ధిక వృద్ధి క్షీణ దశలోకి జారిపోయిందని ప్రపంచ ద్రవ్య సంస్ధ తన తాజా నివేదికలో తెలియజేసింది. ఆర్ధిక వ్యవస్ధ మరింతగా క్షీణించే సూచనలు గణనీయంగా ఉన్నాయని కూడా ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. 2013 లో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు 3.9 శాతం ఉంటుందని గత జులై నెలలో అంచనా వేయగా దానిని ఇప్పుడు 3.6 శాతానికి తగ్గించుకుంది.

ఎమర్జింగ్ దేశాల్లో గణనీయ ఆర్ధిక వృద్ధి నమోదవుతున్నప్పటికీ, అదుపులోకి రాని యూరప్ ఋణ సంక్షోభం, మరింత క్షీణిస్తున్న అమెరికా ఆర్ధిక వృద్ధి లు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధపై ప్రతికూల ప్రభావాన్ని పడేస్తున్నాయని ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. సమీప భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్ధిక ఉత్పత్తి బలహీనంగానే కొనసాగుతుందనీ, ఎమర్జింగ్ దేశాల్లో మాత్రం సాపేక్షికంగా దృఢమైన ఆర్ధిక వృద్ధి కొనసాగుతుందనీ తెలిపింది. యూరప్, అమెరికాల ప్రభుత్వాలు తీసుకోబోయే నిర్ణయాలపైనే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడం అనేది ఆధారపడి ఉన్నదని కూడా ఐ.ఎం.ఎఫ్ స్పష్టం చేసింది.

ఇ.ఎస్.ఎం పై ఐ.ఎం.ఎఫ్ ఆశలు

యూరో జోన్ ఋణ సంక్షోభ పరిష్కారం కోసం యూరోపియన్ దేశాలు సోమవారం ప్రారంభించిన ఇ.ఎస్.ఎం (యూరోపియన్ స్టబిలిటీ మెకానిజం), మార్కెట్లను పెద్దగా సంతృప్తిపరచలేదని పత్రికల వార్తలను బట్టి తెలుస్తున్నది. ఋణ సంక్షుభిత యూరోపియన్ దేశాల కోసం 2014 నుండి అమలులోకి రానున్న 500 బిలియన్ యూరోల (650 బిలియన్ డాలర్లు) నిధి సేకరణ, పంపిణీలకు ఉద్దేశించినదే ఇ.ఎస్.ఎం. యూరోపియన్ దేశాలకు సహాయం చేయడం కోసం శాశ్వత ప్రాతిపదికన ఇ.ఎస్.ఎం ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇ.యు దేశాలు ప్రకటించాయి. సోమవారమే లక్సెంబర్గ్ లో ఇ.ఎస్.ఎం కార్యాలయం ప్రారంభమయినప్పటికీ ప్రపంచ వ్యాపితంగా స్టాక్ మార్కెట్లు పెద్దగా స్పందించలేదు.

ఋణ సంక్షోభం పరిష్కారం కోసం ఇ.సి, ఇ.సి.బి, ఐ.ఎం.ఎఫ్ (ట్రొయికా) లు ప్రకటిస్తూ వస్తున్న వివిధ పధకాల విశ్వసనీయతను కొలవడానికి మార్కెట్ల స్పందనను ఒక ప్రాతిపదికగా లెక్కిస్తున్నారు. ఇ.ఎస్.ఎం ప్రారంభానికి మార్కెట్లు సానుకూలంగా స్పందించకపోవడం అంటే ఋణ సంక్షోభ పరిష్కారం కోసం ట్రొయికా ప్రకటించిన వైద్యం పై మార్కెట్లకు విశ్వాసం కలగలేదని అర్ధం. ఇ.ఎస్.ఎం నిధికి ప్రవేటు బ్యాంకుల నుండి, కంపెనీల నుండే ఎక్కువగా నిధులు (అప్పులు) సేకరించవలసిన దృష్ట్యా నిధిపై అప్పుడే అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. అయితే శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటయిన నిధి ప్రభావాన్ని అప్పుడే పూర్తిగా అంచనా వేయడం సరైనది కాకపోవచ్చు.

అయితే ఇ.ఎస్.ఎం పై ఐ.ఎం.ఎఫ్ ఆశలు పెట్టుకుంది. యూరోపియన్ దేశాల బ్యాంకింగ్ వ్యవస్ధల్లో ఇ.ఎస్.ఎం జోక్యం చేసుకోవాలనీ, దేశాల సావరిన్ రుణాలకు కూడా అది మద్దతు ఇవ్వాలని ఐ.ఎం.ఎఫ్ కోరుతోంది. యూరప్ దేశాల జాతీయ నాయకులు మానిటరీ యూనియన్ (యూరో జోన్) భవిష్యత్తును నిజమైన అర్ధంలో స్ధాపించడంలో మరింత కృషి చేయాలని కూడా ఐ.ఎం.ఎఫ్ కోరింది. మానిటరీ యూనియన్ కి సంబంధించిన నిజమైన అర్ధం అంటే జర్మనీ కోరుతున్నదే. యూరో జోన్ సభ్య దేశాలు తమ ఆర్ధిక సార్వభౌమత్వాన్ని పాక్షికంగానైనా వదులుకుని యూరో జోన్ వ్యవస్ధకు అప్పజెప్పాలని జర్మనీ చాలా కాలంగా కోరుతున్నది. తమ తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధల్లో నిర్ణయాధికారాన్ని యూరోపియన్ కమిషన్ (ఇ.సి), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇ.సి.బి) లాంటి వ్యవస్ధలకు అప్పజెపితే సంక్షోభం పరిష్కారం అవుతుందని జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్తో పాటు ఐ.ఎం.ఎఫ్ కూడా నచ్చజెబుతోంది. జాతీయ బడ్జెట్లలో జోక్యం చేసుకునే అధికారం కూడా ఇ.సి.బి కి కావాలని జర్మనీ డిమాండ్ చేస్తున్నది.

జర్మనీ, ఐ.ఎం.ఎఫ్ లు ప్రతిపాదిస్తున్న వైద్యానికి అంగీకరిస్తే యూరోప్, అమెరికాల్లోని బహుళజాతి కంపెనీలు మాత్రమే లబ్ది పొందుతాయి. యూరోప్ ప్రజలు మాత్రం మరింత నిరుద్యోగంలోకీ, దరిద్రంలోకి జారిపోవడం ఖాయం. ఋణ సంక్షోభం పరిష్కారం కోసం అంటూ ప్రకటించిన యూరోపియన్ స్టబిలిటీ మెకానిజం బహుళజాతి కంపెనీల, బ్యాంకుల లాభాలను స్ధిరీకరించినప్పటికీ యూరోపియన్ ప్రజల జీవనాన్ని మరింతగా అస్ధిరంపాలు చేస్తాయి. ఇ.ఎస్.ఎం కోసం సేకరించిన రుణాల భారం తిరిగి యూరోపియన్ ప్రజలపైనే మోపనున్నారు. గ్రీసు, పోర్చుగల్, స్పెయిన్ తదితర దేశాలకు ఇ.సి, ఇ.సి.బి, ఐ.ఎం.ఎఫ్ లు ఇస్తున్న బెయిలౌట్ల పుణ్యమాని ఆ దేశాల్లో నిరుద్యోగం 25 శాతానికి చేరుకుంది. ప్రభుత్వ కంపెనీలను ప్రవేటు సంస్ధలకు అయినకాడికి అమ్మేయడంతో ఆ దేశాల ఆర్ధిక వ్యవస్ధల ఆదాయాలను గణనీయంగా తగ్గిపోయాయి. ఇ.ఎస్.ఎం కూడా మరో విడత బెయిలౌట్ లాంటిదే. అలాంటి ఇ.ఎస్.ఎం ను యూరప్ ఋణ సంక్షోభానికి పరిష్కారంగా ఐ.ఎం.ఎఫ్ బాకా ఊదుతోంది.

అమెరికా ఫిస్కల్ క్లిఫ్

2013 జనవరి నుండి అమెరికాలో ఫిస్కల్ క్లిఫ్ పరిస్ధితి ఏర్పడనున్నదని ఐ.ఎం.ఎఫ్ కొద్ది కాలంగా హెచ్చరిస్తున్నది. ఈ పరిస్ధితి రాకుండా ఉండడానికి అమెరికా ప్రభుత్వం కృషి చేయాలని ఐ.ఎం.ఎఫ్ కోరుతున్నది. అమెరికా ఋణ పరిమితి పెంపుదల కోసం రిపబ్లికన్ పార్టీ మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభకూ, డెమోక్రటిక్ అధ్యక్షుడు ఒబామా కి మధ్య గత సంవత్సరం ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం జనవరి 1 నుండి అమెరికా ప్రజలపై పెద్ద ఎత్తున పన్నుల మోత మోగనుంది. బి.బి.సి ప్రకారం దాదాపు 90 శాతం అమెరికన్లపై ఈ పన్నుల ప్రభావం పడనున్నది. ఒకవైపు పన్నుల భారం పెరగనుండగా మరోవైపు ప్రభుత్వ ఖర్చులో భారీ కోతలు విధించనున్నారు. ప్రభుత్వ ఖర్చులో కోతలంటే యూరప్ పొదుపు విధానాలకు మల్లే కార్మికులు, ఉద్యోగులు తదితర కార్మికవర్గ ప్రజల వేతనాల్లో కోతపెట్టడం, సదుపాయాలు తగ్గించేయడం, ప్రభుత్వ సంస్ధలను మరింతగా ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పడం, సంస్కరణల పేరుతో పెన్షన్లు, ఆరోగ్య భద్రతలను తగ్గించడం మొ.వి.

ఒకవైపు ప్రజల ఆదాయాల్లో కోతపెట్టడం, మరోవైపు పన్నుల మోత మోగించడాన్ని ఫిస్కల్ క్లిఫ్ గా అభివర్ణిస్తున్నారు. పొదుపు విధానాలంటే ప్రజల ఖర్చుల కోసం ప్రభుత్వం చేసే అప్పును కూడా గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అటు ఆదాయాలు తగ్గిపోయి, ఇటు ప్రభుత్వ రుణాలు తగ్గిపోయి మరో పక్క పన్నులు పెరిగినట్లయితే అమెరికా ఆర్ధిక వృద్ధి కూడా పెద్ద ఎత్తున తగ్గిపోతుంది. ఈ పరిస్ధితిని నివారించాలని ఐ.ఎం.ఎఫ్ కోరుతున్నది. అమెరికా విధానకర్తలు ఒక ఒప్పందానికి వచ్చి అమెరికా ఋణ పరిమితిని పెంచనట్లయితే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ మాంద్యం లోకి జారడం ఖాయమని ఐ.ఎం.ఎఫ్ హెచ్చరించింది. అమెరికా మాంద్యంలోకి జారితే ప్రపంచం మొత్తం మరొకసారి సంక్షోభంలోకి జారుతుందని తెలిపింది.

ఆర్ధిక వృద్ధి క్షీణత

ఈ పరిస్ధితుల నేపధ్యంలో రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాపితంగా వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు బలహీన ఆర్ధిక వృద్ధిని నమోదు చేస్తాయని ఐ.ఎం.ఎఫ్ తన నివేదికలో తెలిపింది. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం 0.4 శాతం మేరకు కుచించుకుంటుందని అంచనా వేసింది. గత జులై నెలలో ఈ వృద్ధి 0.2 శాతం ఉంటుందని అంచనా వేసిన ఐ.ఎం.ఎఫ్ దాన్ని తీవ్ర స్ధాయిలో -0.4 శాతానికి తగ్గించుకుంది. 2013 లో బ్రిటన్ 1.4 శాతం వృద్ధి నమోదు చేస్తుందని జులైలో చెప్పగా దానిని 1.1 శాతానికి తగ్గించుకుంది. అదే విధంగా ప్రపంచ ఆర్ధిక వృద్ధి అంచనాను 3.5 శాతం నుండి 3.3 శాతానికి తగ్గించుకుంది.

అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్ధలతో పోలిస్తే ఎమర్జింగ్ దేశాల వృద్ధి మెరుగ్గా ఉంటుందని చెప్పినప్పటికీ ఎమర్జింగ్ దేశాల ఆర్ధిక వృద్ధి అంచనాలను కూడా ఐ.ఎం.ఎఫ్ తగ్గించింది. పశ్చిమ దేశాల ఆర్ధిక క్షీణత వల్ల ఆసియా లాంటి ఎమర్జింగ్ దేశాల ఎగుమతులు తీవ్రంగా పడిపోవడంతో పశ్చిమ దేశాల ప్రభావం ఎమర్జింగ్ దేశాల ఆర్ధిక వృద్ధిపై పడుతున్నదనీ, అందువల్లనే ఆ దేశాల వృద్ధి కూడా క్షీణ దశలో కొనసాగుతున్నదనీ ఐ.ఎం.ఎఫ్ నివేదిక తెలిపింది. ఫలితంగా చైనా ఆర్ధిక వృద్ధి ఈ సంవత్సరం 8 శాతం ఉండగలదని జులైలో అంచనా వేయగా దానిని 7.8 శాతానికి తగ్గించుకుంది. భారత దేశం ఈ సంవత్సరం 6.1 శాతం వృద్ధి చెందుతుందని జులై లో చెప్పిన ఐ.ఎం.ఎఫ్ దానిని గణనీయంగా తగ్గించుకుని 4.9 శాతం మాత్రమే వృద్ధి నమోదవుతుందని తెలిపింది. బ్రెజిల్ వృద్ధి అంచనాను కూడా 2.5 శాతం నుండి 1.5 శాతానికి ఐ.ఎం.ఎఫ్ తగ్గించింది.

అంతిమంగా చెప్పేదేమంటే, ప్రపంచ ఆర్ధిక రికవరీ కోసం ఐ.ఎం.ఎఫ్ ప్రతిపాదిస్తున్న వైద్యం అమెరికా, యూరప్ ప్రజలకు అత్యంత నష్టదాయకం కాగా బహుళజాతి కంపెనీలకు లాభదాయకం. కంపెనీలకు కూడా తాత్కాలిక లబ్ది మాత్రమే చేకూరుతుంది. ఐ.ఎం.ఎఫ్ విధానాల వల్ల ప్రజల ఆదాయాలు పడిపోయి ఆర్ధిక సంక్షోభం మరింత తీవ్రం అవుతుందే తప్ప ఉపశమించే అవకాశాలు లేవు. మూడేళ్లుగా యూరప్ లో అమలవుతున్న ఐ.ఎం.ఎఫ్ విధానాలే దానికి ప్రత్యక్ష రుజువు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s