శిఖండి టర్కీ అండగా, సిరియా దురాక్రమణలో అమెరికా మరో అడుగు


సిరియాపై అమెరికా ప్రత్యక్ష దురాక్రమణ దాడి మొదలయినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాల అండతో 18 నెలలుగా సిరియా ప్రజలపై టెర్రరిస్టులు సాగిస్తున్న మారణకాండ అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యక్ష జోక్యానికి సాకులు వెతుకుతున్న నాటో కూటమి తానే ఒక సాకును సృష్టించుకుంది. టర్కీ భూభాగం నుండి సిరియాలోకి చొరబడిన టెర్రరిస్టులు టర్కీ పైకే జరిపిన దాడిని అడ్డు పెట్టుకుని సిరియాపై ఆయుధ దాడికి టర్కీ (నాటో సభ్యురాలు) మిలట్రీ తెగబడింది. ఇరాక్ పై దురాక్రమణ దాడికోసం అమెరికాకి తన భూభాగాన్ని అప్పజెప్పిన టర్కీ,  సిరియా దురాక్రమణలో కూడా అదే శిఖండి పాత్ర పోషిస్తున్నది. నాటో దేశాల మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం ఉన్న నేపధ్యంలో టర్కీని ముందు నిలిపి సిరియాలో ప్రత్యక్ష జోక్యం చేసుకునే వైపుగా నాటో అడుగులు వేస్తోంది.

టర్కీ మిలట్రీ బుధవారం సాయంత్రం సిరియాపై ఫిరంగులతో దాడి చేసింది. సిరియా వైపునుండి జరిగిన బాంబుదాడిలో టర్కీ సరిహద్దు పట్టణంలోని ఐదుగురు పౌరులు మరణించడాన్ని టర్కీ తన దాడికి సాకుగా చూపింది. సిరియా వాయవ్య పట్టణం ఇడ్లిబ్ ను టర్కీ లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని సిరియా ప్రభుత్వ ప్రతినిధులను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి. టెర్రరిస్టుల విచక్షణారహిత మారణకాండలో ఇడ్లిబ్ కూడా ఒక బాధితురాలు. “సరిహద్దులోని మా సాయుధ బలగాలు సిరియానుండి వచ్చిన దాడికి తక్షణం సమాధానం ఇచ్చాయి. రాడార్ లో గుర్తించిన సిరియా లక్ష్యాలపై ఫిరంగులతో దాడి చేశాం” అని టర్కిష్ ప్రధాని కార్యాలయం బుధవారం ప్రకటించింది. నాటో సభ్య దేశాలను సమావేశపరచాల్సిందిగా నాటో అధిపతి ఏండర్స్ ఫాగ్ రాస్ముస్సేన్ ను కోరామని ఈ ప్రకటన తెలిపింది. 

నాటో హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్ (బెల్జియం) నుండి మరో ప్రకటన వెలువడింది. సిరియా దాడిని ఖండిస్తూ, టర్కీకి మద్దతు ప్రకటించింది. సిరియా దాడి అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం అంటూ గొప్ప జోక్ పేల్చింది. పల్లంలో నీరు తాగుతున్న మేక, కాలవ నీటిని కలుషితం చేస్తున్నదంటూ మెరకలో నీరు తాగుతున్న తోడేలు ఆక్షేపించినట్లుగా సిరియా మేకకి,  నాటో తోడేలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు బోదించింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఉనికిలోకి వచ్చింది లగాయితు వాటిని ఉల్లంఘించడమే పనిగా పెట్టుకున్న నాటో, 18 నెలలుగా సిరియా ప్రజలని ఊచకోతకోస్తూ న్యాయసూత్రాలు అప్పజెప్పడం అత్యంత హాస్యాస్పదం.

ఆగ్నేయ టర్కీ ప్రాంతంలోని అకాకలే పట్టణంపై సిరియా వైపు నుండి మంగళవారం మోర్టార్ దాడి జరిగింది. ఈ దాడిలో ఒక మహిళ, ఆమె నలుగురు పిల్లలు చనిపోయారు. టర్కీనుండి చొరబడిన టెర్రరిస్టులపై సిరియా బలగాలు పోరాడుతున్న సందర్భంగా ఒక మోర్టార్ షెల్ ప్రమాదవశాత్తూ అకాకలే పట్టణంపైకి వచ్చిందని కొందరు చెబుతుండగా, అదసలు సిరియా బలగాలు చేసిన దాడి కాదనీ, టర్కీని యుద్ధంలో దించడానికి ఉద్దేశ్యపూర్వకంగా ఇళ్లపై దాడి చేసి పౌరులను చంపారని కొందరు టర్కీ వ్యాఖ్యాతలు చెబుతున్నట్లుగా గ్లోబల్ రీసెర్చ్ వెబ్ సైట్ తెలిపింది.

ఈ దాడికి ఎవరు కారకులన్నదీ అధికారికంగా ఇంతవరకూ తేలలేదు. ఘటనపై విచారణ చేస్తున్నామనీ, సంయమనం పాటించాలనీ సిరియా ప్రభుత్వం టర్కీని కోరింది. అయితే టర్కీ సిరియా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. టర్కీ, సిరియా సరిహద్దుల్లో తిష్టవేసిన టెర్రరిస్టులు సిరియా భద్రతతో పాటు, ప్రాంతీయ భద్రతకు కూడా ప్రమాదంగా మారినందున సమయమనం పాటించాలని సిరియా సమాచారమంత్రి ఒమ్రాన్ జోబియోన్ కోరినప్పటికీ టర్కీ ఖాతరు చేయలేదు. మరిన్ని ట్యాంకులు, ప్రత్యేక బలగాలను సిరియా సరిహద్దుకు తరలించి సిరియాపై ఫిరంగి దాడులు కొనసాగించింది.

సెప్టెంబర్ 28 తేదీన ఇలాంటి దాడి ఒకటి ఆకాకలే పట్టణంపై జరిగింది. అయితే ఇందులో ఎవరూ చనిపోలేదు. ఆ రోజే టర్కీ దురహంకార ప్రకటన చేసింది. మరోసారి దాడి జరిగితే ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించింది. దాడి చేసేవారు, దానికి స్పందించేవారు ఒకరే అయినప్పుడు, ఏదో విధంగా సిరియాపై దాడి చెయ్యడమే నాటో లక్ష్యం అయినపుడు స్పందించగల అవకాశం వచ్చేవరకూ దాడులు జరుగుతాయన్నది స్పష్టమే.

ఇదిలా ఉండగా టర్కీ సరిహద్దుకి సమీపంలో సిరియా బలగాలకూ, నాటో ప్రవేశపెట్టిన కిరాయి బలగాలకూ మధ్య మూడువారాలుగా తీవ్రమైన పోరు జరుగుతోంది. ఈ నేపధ్యంలో సిరియా కేంద్రంగా అంతర్జాతీయ స్ధాయిలో ఉద్రిక్తతలు రోజు రోజుకీ తీవ్రం అవుతున్నాయి. సిరియా వైపునుండి జరిగిన దాడిని అడ్డుపెట్టుకుని సిరియాలో జోక్యం చేసుకునే సాహసం చేయవద్దని మంగళవారమే రష్యా పశ్చిమ రాజ్యాలను హెచ్చరించింది. సంయమనం పాటించాలని మరోవైపు విజ్ఞప్తి కూడా చేసింది. పశ్చిమ దేశాల మద్దతుతో చెలరేగుతున్న తిరుగుబాటు బలగాలు టర్కీని రంగంలోకి దించడానికి ఉద్దేశ్యపూర్వకంగా సరిహద్దులో దాడులు చేయవచ్చని రష్యా ఉప విదేశాంగ మంత్రి గెన్నడీ గతిలోవ్ మగళవారం హెచ్చరించాడు.

ఉద్రిక్తతలు తగ్గించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా అమెరికా మాత్రం అందుకు వ్యతిరేక దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కజకిస్ధాన్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ సిరియా చేసిన దాడి ‘దౌర్జన్యపూరితం’ అని వ్యాఖ్యానించింది. సిరియా సివిల్ వార్ టర్కీలోకి వ్యాపించడం అత్యంత ప్రమాదకరంగా ఆమె అభివర్ణించింది. టర్కీతో మాట్లాడి భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయిస్తామని ప్రకటించింది. సిరియాలో ప్రత్యక్ష జోక్యానికి టర్కీ పట్టణం పై దాడిని సమర్ధవంతంగా వినియోగించేందుకు వ్యూహ రచన చేయడమే హిల్లరీ చెప్పే భవిష్యత్ కార్యక్రమం.

టర్కీ పట్టణం అకాకలే లో మరణించిన మహిళ, ఆమె పిల్లలు అమాయకులు కావచ్చుగానీ టర్కీ మాత్రం అమాయకురాలు కాదని ‘వరల్డ్ సోషలిస్ట్ వెబ్ సైట్’ పత్రిక చేసిన వ్యాఖ్యానం సరైనది. అంతేకాక టర్కీ మరణాలను దౌర్జ్యన్యంగా అభివర్ణించగల నైతిక స్ధాయి కూడా హిల్లరీ క్లింటన్ కి లేదు. సిరియాలో హత్యాకాండలకు పాల్పడుతున్న ‘ఫ్రీ సిరియన్ ఆర్మీ’ కి టర్కీయే స్ధావరాల వసతి కల్పిస్తోంది. టర్కీ లోని అదానా పట్టణంలో ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ ఏర్పాటు చేసుకోవడానికి సి.ఐ.ఎ కి టర్కీ ప్రభుత్వం వసతి కూడా కల్పించింది. ఇక్కడే అమెరికా ‘ఇన్సిర్లిక్ ఎయిర్ బేస్’ నిర్వహిస్తున్నది. సిరియాలోకి ఆయుధాలు, మందుగుండు, డబ్బు తదితర సరఫరాలను ఈ కమాండ్ సెంటర్ నుండే సి.ఐ.ఎ నిర్వహిస్తోంది. సిరియాలోకి కిరాయి తిరుగుబాటుదారుల సరఫరాను కూడా సి.ఐ.ఎ పర్యవేక్షిస్తున్నది. సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను పదవీచ్యుడిని చేయడానికీ, వీలయితే చంపేయడానికీ ఈ వ్యవహారాలను అమెరికా నడుపుతోంది. అలాంటి నీచ అమెరికా రాజ్యం తగుదునమ్మా అంటూ ‘అంతర్జాతీయ న్యాయ సూత్రాలు’ వల్లించడం పెద్ద మోసం.

9 thoughts on “శిఖండి టర్కీ అండగా, సిరియా దురాక్రమణలో అమెరికా మరో అడుగు

 1. నపుంసకులని కించపరచడానికి ఉపయోగించే “శిఖండి” అనే పదం ఇక్కడ ఉపయోగించడం అవసరమా? దయచేసి పోస్ట్ టైటిల్ ఎడిట్ చెయ్యండి. మహాభారతం కథ ప్రకారం కూడా శిఖండి నపుంసకుడు కాదు. అతను పురుష వేషం వేసుకున్న స్త్రీ.

 2. ప్రవీణ్ గారూ,

  భీష్మాచార్యుడిని ఓడించలేక అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకున్నాడని భారతం చెబుతుంది. కిరాయి తిరుగుబాటుతో సిరియా ప్రభుత్వాన్ని కూల్చలేక అమెరికా టర్కీని అడ్డుపెట్టుకుని ప్రత్యక్ష దాడికి పావులు కదుపుతోంది. నపుంసకత్వాన్ని అవమానపరిచే పోలిక కాదిది. టర్కీ పాత్రని వివరించే పోలిక. శిఖండి నపుంసకుడు కాదు గనక అవమానం అన్న సమస్యే లేదు.

 3. సాధారణంగా రాజకీయాలలో ఆ పదాన్ని ఉపయోగించేది తమ ప్రత్యర్థిని నపుంసకునితో పోల్చడానికే. గతంలో కెసి‌ఆర్‌ని శిఖండి అని తిడుతూ అతని ప్రత్యర్థులు విమర్శలు చేశారు. తెలుగువన్.కమ్ లాంటి అశ్లీల వెబ్‌సైట్‌లలో కూడా “Imagine KCR in saree” లాంటి అశ్లీల వ్యాఖ్యలు వచ్చాయి. “శిఖండి” అనే పదం “నపుంసకుడు” అనే పదానికి synonymగా మారి చాలా కాలం అయ్యింది.

 4. ” మహాభారతం కథ ప్రకారం కూడా శిఖండి నపుంసకుడు కాదు. అతను పురుష వేషం వేసుకున్న స్త్రీ.”

  ““శిఖండి” అనే పదం “నపుంసకుడు” అనే పదానికి synonymగా మారి చాలా కాలం అయ్యింది.”

  ఇవి రెండూ మీరు రాసినవే. శిఖండి నపుంసకుడు కాదంటూనే నపుంసకులను అవమానిచొద్దన్నారు. ఇంతలోనే శిఖండి అంటే నపుంసకుడే అంటున్నారు. ‘నపుంసకత్వం’ అన్న దృష్టే నాకు లేదని వివరణ ఇచ్చాను కదా. లేని విషయాన్ని పొడిగించకండి.

 5. టైటిల్ చూసినవాళ్ళు దీని గురించి నెగటివ్‌గానే అర్థం చేసుకుంటారు అని అన్నాను. అంతే కానీ శిఖండి నపుంసకుడని నేను అనలేదు.

 6. ప్రవీణ్ గారూ, మీరు ఊహించింది కొంతవరకు నిజమే. ఆ ఉద్దేశ్యంతోనే నేను వివరణ ఇచ్చాను. నపుంసకులను అవమానించకూడదన్న విషయాన్ని మీ చర్చ పాఠకుల దృష్టికి తెచ్చింది. అయితే, ఏ చర్చయినా లాజికల్ గా ముగిస్తేనే అర్ధవంతంగా ఉంటుంది. అందుకే పొడిగించవద్దు అన్నాను.

 7. “శిఖండం” అంటే నెమలి ఫించం. “శిఖండి” అంటే తల మీద నెమలి ఫించాన్ని ఆభూషణంగా పెట్టుకునేవాడు అని అర్థం. మనలో చాలా మందికి సంస్కృతం తెలియదు కాబట్టే ఈ పదాలని wrong contextలో ఉపయోగిస్తుంటారు. ఆ మాటకొస్తే నేను కూడా సంస్కృత పండితుణ్ణి కాదు. నాకు తెలిసిన సంస్కృతమంతా కొన్ని డిక్షనరీలు చూసి తెలుసుకున్న పరభాషా పరిజ్ఞానమే.

 8. ఈ విషయాలను చదివే మన పాఠకులకి “ఒక దళారి పశ్చాత్తాపం” ఇంగ్లీష్ “కన్ఫెషన్స్ అఫ్ యాన్ ఎకనామిక్ హిట్మాన్” రచయత జాన్ పెర్కిన్స్ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవమని ప్రార్ధన.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s