సిరియాలో ప్రత్యక్ష జోక్యానికి అమెరికా కొత్త కుట్ర


సిరియా కిరాయి తిరుగుబాటు ఎంతకీ ఫలితం ఇవ్వకపోవడంతో ఆ దేశంపై ప్రత్యక్ష దాడికి అమెరికా కొత్త మార్గాలు వెతుకుతోంది. రష్యా జోక్యంపై అబద్ధాలు సృష్టించి ఆ సాకుతో తానే ప్రత్యక్షంగా రంగంలో దిగడానికి పావులు కదుపుతోంది. జులైలో సిరియాలో జొరబడిన టర్కీ విమానాన్ని సిరియా ప్రభుత్వం కూల్చివేయడం వెనుక రష్యా హస్తం ఉందంటూ తాజాగా ప్రచారం మొదలు పెట్టింది. సిరియా కిరాయి తిరుగుబాటుకి ఆర్ధిక, ఆయుధ సహాయం చేస్తున్న సౌదీ అరేబియాకి చెందిన చానెల్ ఆల్-అరేబియా ఈ కుట్రలో మొదటి అడుగు వేసింది. కాగా, దొంగ సాక్ష్యాలతో సిరియాలో జోక్యానికి తెగబడితే సహించేది లేదని రష్యా పశ్చిమ దేశాలను హెచ్చరించింది.

జులై నెలలో సిరియా గగనతలంలోకి చొరబడిన టర్కిష్ యుద్ధ విమానాన్ని సిరియా ప్రభుత్వం కూల్చివేసింది. ఈ కూల్చివేతలో సిరియాకు రష్యా సహాయం చేసిందని, అందుకు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ‘ఆల్-అరేబియా’ చానెల్ మంగళవారం ఒక వార్త ప్రసారం చేసింది. తమ వార్తను రుజువు చేసే ‘ఉన్నతస్ధాయి రహస్య డాక్యుమెంట్లు’ తమ వద్ద ఉన్నాయని సదరు చానెల్ తెలిపింది. టర్కీ విమానం కూల్చివేతలో రష్యా ‘గైడెన్స్’ ఇచ్చిందనీ, విమానం కూలిపోయాక పైలెట్లు బతికే ఉన్నప్పటికీ వారిని కూడా చంపేశారనీ తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయని చానెల్ తెలిపింది. ‘అత్యంత రహస్యమైన సిరియా భద్రతా పత్రాలు తమ వద్ద ఉన్నాయ’ని తెలిపింది.

‘ఆల్-అరేబియా’ చానెల్ వార్తను నాన్సెన్స్ గా రష్యా కొట్టిపారేసింది. వ్యాఖ్యానించడానికి కూడా అర్హతలేని వార్త అని చెబుతూ దురదృష్టవశాత్తూ వ్యాఖ్యానించవలసి వచ్చిందని తెలిపింది. అందరికీ అందుబాటులో ఉన్న పత్రాలనుండి సంగ్రహించి రహస్య పత్రాలంటూ లేని సంచలనం సృష్టిస్తున్నారని పేర్కొంది. “ఈ నాన్సెన్స్ పైన వ్యాఖ్యానించడం కూడా హాస్యాస్పదమే. దురదృష్టవశాత్తూ, వ్యాఖ్యానించవలసి వచ్చింది” అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. “ఈ ప్రమాదకర స్వైర కల్పనలను బహిరంగంగా అందుబాటులో ఉన్న వనరులనుండే ఆల్-అరేబియా సేకరించింది. ఆర్.ఐ.ఎ నోవోస్తి న్యూస్ ఏజన్సీకి చెందిన అధికారిక వెబ్ సైట్ నుండి సేకరించిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి” అని రష్యా ప్రకటన తెలిపింది. “ఈ పత్రాలనుండి సంబంధిత (ఆర్.ఐ.ఎ) లోగోను తొలగించాలని కూడా ఈ ఫోర్జరీ రచయితలు భావించలేదు” అని సదరు ప్రకటన తెలిపింది.

సిరియా పరిస్ధితిపై అరబ్ మీడియాలోని ఒక సెక్షన్ “జంకు గొంకు లేకుండా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయ”ని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి అలెగ్జాండర్ లూకాషెవిచ్ ఆరోపించాడని ‘ది హిందూ’ తెలిపింది. “ఈ మీడియా యొక్క ఎడిటోరియల్ పాలసీని ప్రభావితం చేయాలన్న ఆలోచనేదీ మాకు లేదు. కానీ ఇలాంటి రష్యా వ్యతిరేక స్వైర కల్పనల (ఫాంటసీ) రచయితలకు ఒక సలహా ఇవ్వదలిచాం. నైతిక సూత్రాల పట్ల మాత్రమే కాకుండా వారి వృత్తిగత విశ్వసనీయత గురించి కూడా వీళ్ళు కొంత ఎక్కువ ఆలోచన చేయాలి” అని అలెగ్జాండర్ ప్రకటన పేర్కొంది.

రష్యా ఆరోపణ సత్యదూరం కాదు. అమెరికా ప్రోద్బలంతో సౌదీ అరేబియా, కతార్ దేశాలు సిరియా కిరాయి తిరుగుబాటులో ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం ప్రాంతంలోని ముస్లిం, అరబ్ దేశాలనుండి సేకరించిన ఆల్-ఖైదా తదితర సంస్ధల టెర్రరిస్టులను సిరియాలో ప్రవేశపెట్టిన ఈ దేశాలు, వారికి నెలవారీ వేతనాలు కూడా చెల్లిస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ‘జీహాద్’ నడుపుతున్నామంటూ ముస్లిం యువకులను చేరదీసి సిరియాలో ప్రవేశపెట్టిన విషయాన్ని స్వతంత్ర వార్తా సంస్ధలు వెల్లడించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. తమ వ్యాపార ప్రయోజనాలకు కోసం పశ్చిమ దేశాలతో కుమ్మక్కయిన సౌదీ, కతార్ దేశాలు, సెక్యులరిస్టు సిరియా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తూ తమ చానెళ్ల ద్వారా పచ్చి అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నాయి.

‘ఆల్-అరేబియా’ ను సౌదీ రాజవంశం నిర్వహిస్తుండగా, ‘ఆల్-జజీరా’ చానెల్ ను కుతార్ ఫ్యూడల్ రాజవంశం నిర్వహిస్తోంది. పశ్చిమ దేశాల కార్పొరేట్ వార్తా సంస్ధలు ప్రపంచవ్యాపితంగా నిర్వహించే ‘గోబెల్స్’ పాత్రను ఈ రెండు చానెళ్ళూ అరబ్, ముస్లిం దేశాల్లో నిర్వహిస్తున్నాయి. సౌదీ, కతార్ ఫ్యూడల్ ప్రభుత్వాల ప్రయోజనాలను నెరవేర్చడమే ఈ చానెళ్ల లక్ష్యం. ఆల్-అరేబియా సృష్టించిన తాజా వార్త కూడా ఈ లక్ష్యంలో భాగంగానే చూడవచ్చు.

ఆల్-అరేబియా ప్రారంభించిన ప్రచారం నేపధ్యంలో రష్యా, భవిష్యత్తు పరిస్ధితి విశ్లేషణ కోసం సమాలోచనలు ప్రారంభించినట్లు వివిధ వార్తల ద్వారా తెలుస్తోంది. ఆల్-అరేబియా చానెల్ వార్తను అడ్డుపెట్టుకుని సిరియాలో నేరుగా జోక్యం చేసుకునేందుకు అమెరికా పధక రచన చేస్తున్నదన్న అనుమానాలు రష్యాలో ఊపందుకున్నాయి. సిరియాలో నేరుగా ఆపరేషన్లు చేపట్టకుండా సంయనం పాటించాలనీ, దాడులకు సాకులు వెతకడం మానేయాలనీ రష్యా ఒక ప్రత్యేక ప్రకటనలో కోరినట్లు తెలుస్తున్నది. “నాటో భాగస్వాములతో ఒకటి కోరుతున్నాం…. మిలిటరీ పరిస్ధితిని తేవడానికో లేదా మానవతా కారిడార్లు, బఫర్ జోన్లు లాంటివి సృష్టించడానికో వారు సాకులు వెతకడం మానాలి” అని రష్యా డిప్యూటీ విదేశీ మంత్రి గెన్నడీ గటిలోవ్ ఒక ప్రకటనలో కోరాడు.

న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా సిరియాకి సంబధించిన ఉద్రిక్తతలు ప్రతిబింబించాయి. సిరియా విదేశాంగ మంత్రి వాలిద్ ముఅల్లెం ఆదివారం జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ తమ దేశంలోని పరిస్ధితికి కారకులెవరో ప్రపంచానికి తేటతెల్లం చేశాడు. సౌదీ అరేబియా, కతార్, టర్కీ, ఫ్రాన్స్, లిబియా, అమెరికా దేశాలు విదేశీ టెర్రరిస్టులను సిరియాలో ప్రవేశపెడుతున్నాయని ఆయన కుండబద్దలు కొట్టాడు. “తమ దేశాల సరిహద్దులు దాటి వస్తున్న టెర్రరిస్టులను చూడనట్లుగా ఈ రాజ్యాలు నటిస్తున్నాయి. లేదా సాయుధ టెర్రరిస్టు గ్రూపులకు తమ భూభాగంనుండి సరఫరాలను చురుకుగా అందజేస్తున్నాయి” అని వాలిద్ ఐక్యరాజ్య సమితికి తెలిపాడు.

నవంబర్ లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుతున్న దృష్ట్యా సిరియాకు సంబంధించి దురంహకార ప్రకటనలు చేయకుండా అమెరికా ప్రభుత్వం సంయమనం పాటిస్తున్నది. ఒకటిన్నర దశాబ్దాలు ఇరాక్ ను సర్వవిధాలుగా నాశనం చేసి కూడా తమకు అనుకూల ప్రభుత్వాన్ని అమెరికా నియమించుకోలేకపోవడం, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో వేలాది సైనికులను కోల్పోయినా తాలిబాన్ ను ఏమీ చేయలేకపోగా, ట్రిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చై దేశ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలోకి జారిపోవడం, నీతిమాలిన కుట్రలతో గడాఫీని హత్య చేసి లిబియాని వశం చేసుకున్నప్పటికీ తమ లిబియా రాయబారిని హత్యకు గురికాకుండా కాపాడుకోలేకపోవడం…. వీటన్నింటి దృష్ట్యా ఎన్నికలముందు సిరియాలో ప్రత్యక్ష జోక్యానికి అమెరికా తెగించలేని పరిస్ధితిలో ఉంది.

అయితే ఈ పరిస్ధితి ఎన్నికల వరకు మాత్రమే. ఎన్నికలు ముగిసిన వెంటనే సిరియాలో ప్రత్యక్ష జోక్యానికి అమెరికా అన్నీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ ఏర్పాట్లలో భాగంగానే ఆల్-అరేబియా ద్వారా రష్యాపై అబద్ధపు ఆరోపణలకు అమెరికా తెరలేపింది. నాటో సైనిక కూటమిలో సభ్య దేశమైన టర్కీ విమానాన్ని కూల్చడంలో రష్యాకు పాత్ర ఉందని ప్రచారం చేయడం ద్వారా సిరియాలో ప్రత్యక్ష జోక్యానికి అమెరికా ఒక కారాణాన్ని నిర్మించుకుంటోంది. 9/11 దాడుల సాకు చూపి ఆఫ్ఘన్ దురాక్రణకి దిగినట్లే, సద్దాం వద్ద లేని సామూహిక విధ్వంసక మారణాయుధాలు సాకు చూపి ఇరాక్ పై దాడి చేసినట్లే, లిబియాలో అసలే జరగని హత్యాకాండ ను సాకుగా చూపి విధ్వంసం సృష్టించినట్లే…. టర్కీ విమానం కూల్చివేతలో రష్యా హస్తాన్ని సాకుగా చూపి సిరియాను కబళించడానికి అమెరికా ఏర్పాట్లు చేసుకుంటోంది. రానున్న రోజుల్లో పశ్చిమ దేశాల దుష్ప్రచారాన్ని భారత దేశంలోని ప్రాంతీయ, జాతీయ పత్రికలు కూడా నిస్సిగ్గుగా నెత్తినవేసుకునే ప్రక్రియ జోరందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s