కేంద్ర బొగ్గు మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ తానింకా ప్రాచీన యుగాల్లోనే మగ్గుతున్నానని చెప్పుకున్నాడు. వివాహ బంధాన్ని క్రికెట్ మ్యాచ్ తోనూ, భార్యలని కాలక్రమేణా మోజు తగ్గిపోయే విజయాలతోనూ పోల్చి తన ఫ్యూడల్ బుద్ధి చాటుకున్నాడు. వయసు పెరిగిన భార్యలపై మోజు కోల్పోయే పురుష పుంగవుల వక్రబుద్ధికి ఆమోద ముద్ర వేసేశాడు. భార్య అంటే మనసు, మెదడు, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ కాదనీ, కేవలం మగ శరీరాలకి సుఖాల్ని పంచే మాంసపు ముద్దలేననీ ‘మనసులో మాట’ బయట పెట్టాడు. ఆనక, తానలా అనలేదంటూనే, తన మాటలని సందర్భరహితంగా ఉల్లేఖించారనీ నాలుకను అష్ట వంకర్లు తిప్పాడు.
సొంత పట్టణం కాన్పూర్ లో జైస్వాల్ ఆదివారం ఒక కవి సమ్మేళనానికి హాజరయ్యాడు. ఆయన లేచి ప్రసంగిస్తుండగా టి20 ప్రపంచ కప్ లో పాకిస్ధాన్ పై ఇండియా విజయం సాధించిందన్న వార్త వచ్చింది. సభలో ఉన్న కొంతమంది సంతోషం ప్రకటిస్తున్న విషయాన్ని గమనించిన జైస్వాల్ విషయం తెలుసుకున్నాడు. సభికుల ఆనందంలో తానూ భాగం పంచుకోవాలని భావించిన జైస్వాల్ ఇలా వ్యాఖ్యానించాడు:
“నయీ నయీ జీత్ ఔర్ నయీ నయీ షాదీ, ఇస్కా అలగ్ మహాత్వ్ హోతా హై… జైసే జైసే సమయ్ బీతేగా… జీత్ కి యాదే పురానీ హోతీ జాయేగీ; జైసే జైసే సమయ్ బీత్ తా హై, పత్ని పురానీ హోతీ చలీ జాతీ హై, వో మజా నహీ రహ్తా హై.”
“కొత్త విజయం, కొత్త వివాహం, వీటి మహత్యం ప్రత్యేకమైనవి. కాలం గడిచేకొద్దీ, విజయానికి సంబంధించిన జ్ఞాపకాలు పాతబడిపోతాయి; కాలం గడిచేకొద్దీ భార్య కూడా పాతబడిపోయినట్లే. ఆ మజా ఇక ఉండదు.” (loose translation)
కాన్పూర్ లోని ఒక మహిళా కాలేజీలోనే కేంద్ర సచివుడు ఈ విధంగా బ్యార్యల వ్యక్తిత్వాలను కించపరిచేందుకు, భారతీయ సంస్కృతిలో శిఖర సమానమని చెప్పుకునే వివాహ బంధాన్ని తేలికపరిచేందుకూ సిద్ధపడ్డాడు. మంత్రి వ్యాఖ్యలపై వివిధ వ్యక్తులు, సంస్ధలు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని పదవినుండి తొలగించాలని బి.జె.పి డిమాండ్ చేసింది. మహిళా సంఘాలు కాన్పూర్ తో పాటు మరికొన్ని నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మంత్రి ఫోటోను చెప్పులతో కొడుతూ ఊరేగించారు.
“కాంగ్రెస్ ఎంతకి దిగజారగలదో జైస్వాల్ మాటలు చెబుతున్నాయి” అని బి.జె.పి నాయకురాలు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించింది. మహిళా వివక్ష కోణంలో మంత్రి వ్యాఖ్యలను చూడడానికి బదులు రాజకీయ కోణంలో చూడడానికే బి.జె.పి నాయకురాలికి ఆసక్తి ఉన్నట్లు ఆమె ప్రకటన చెబుతోంది.ఇదిలా ఉండగా తన వ్యాఖ్యానం పై వివరణ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ జైశ్వాల్ ను కోరినట్లు తెలుస్తోంది.
కాన్పూర్ లోని ‘లక్ష్య’ అనే స్వచ్ఛంద సంస్ధ మంత్రిపై స్ధానిక కోర్టుకు ఫిర్యాదు చేసింది. అశ్లీల వ్యాఖ్యలు చేసినందుకు, స్త్రీల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకూ సెక్షన్ 294, 500 ల కింద కేసులు పెట్టి విచారించాలని లక్ష్య నాయకురాలు అనిత దువా కోర్టును కోరింది. మంత్రి మాటలు రికార్డు చేసిన సి.డి ని కోర్టుకి సమర్పించింది. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వి.కె.పాండే అనిత ఫిర్యాదుని స్వీకరించాడు. సంబంధిత సాక్ష్యాలతో అక్టోబర్ 8 న కోర్టుకు హాజరు కావాలని పిటిషనర్ ను కోర్టు కోరింది.
మంత్రి జైస్వాల్ తనను తాను సమర్ధించుకోవడానికి విఫలయయత్నం చేశాడు. “మాటలను (రికార్డు నుండి) తొలగించడం చాలా తేలిక. ఉద్దేశ్యపూర్వకంగానే అలా చేశారు. దీనికి రాజకీయ రంగు పులుముతున్నవారిపై నేనేమీ వ్యాఖ్యానించను. అయితే, ఈ దేశ ప్రజలకి ఒక విషయం చెప్పదలిచాను. వారి సెంటిమెంట్స్ ని ఏ కొంచెమయినా గాయపరిచినా, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. మహిళల సెంటిమెంట్స్ ను నేనెప్పుడూ గాయపరచను.” అని జైస్వాల్ అన్నాడని ఎన్.డి.టి.వి తెలిపింది. మీరు చెప్పిన పోలికను సమర్దించుకుంటున్నారా అన్న ప్రశ్నకు జైస్వాల్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మహిళలను, తల్లులను, చెల్లెళ్లనూ గౌరవించే పార్టీ అనీ, తాను ఆ పార్టీలో సభ్యుడననీ డొంకతిరుగుడు సమాధానం ఇచ్చాడు.
డొంక తిరుగుడు సమాధానం చెప్పినప్పటికీ మంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ అసలు విషయమే చెప్పాడు. పూర్వాశ్రమంలోని ఫ్యూడల్ ప్రభువులకూ, దళారీ పెట్టుబడిదారులకూ, కొత్త మరియు పాత సామ్రాజ్యవాద ఏజంట్లకూ నిలయమైన కాంగ్రెస్ పార్టీకి జైస్వాల్ నాయకుడు. అలాంటి జైస్వాల్ మహిళలపట్ల, భార్యల పట్ల ఇంతకంటే గౌరవం ప్రదర్శించగలడని ఆశించడం వ్యర్ధమే. కేంద్ర మంత్రివర్గంలో కొలువుదీరిన ఫ్యూడల్ వ్యవస్ధ ప్రతినిధుల్లో జైస్వాల్ ఒకరు మాత్రమే. అధికార మార్పిడి ద్వారా బ్రిటిష్ వలస ప్రభుత్వం నుండి పార్లమెంటరీ అధికారం సంపాదించిన భారత దేశ ఫ్యూడల్, పెట్టుబడిదారీ వర్గాల మొట్టమొదటి ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ. ఈ వర్గాల మధ్య దోపిడీ దళారీ సొమ్ము పంపకంలో రాజీ లాంటి ఒప్పందం కుదరకపోవడం వల్లనే బి.జె.పి, టి.డి.పి, ఎస్.పి, బి.ఎస్.పి, జె.డి లాంటి పార్టీలు ఉద్భవించాయి.
ఈ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ఆధిపత్య వర్గాల ప్రయోజనాలన్నీ ఒక్కటే. ప్రజలను అనేక రకాల మత్తుల్లో, ప్రలోభాల్లో, అబద్ధ ప్రచారాల్లో ముంచితేనే ఈ ప్రయోజనాలు నెరవేరుతాయి. ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న స్త్రీ వివక్ష, కుల వివక్ష, మతవివక్ష మొదలయిన అనేక రకాల వైరుధ్యాలను పెంచి పోషించినట్లయితే, అవి ప్రజాందోళనల సమయాల్లో అక్కరకు వస్తాయని వీరికి బాగానే తెలుసు. అదీ కాక మహిళలపై వివక్షను పెంచి పోషించడం ద్వారా మహిళలకు తక్కువ వేతనం లేదా కూలి లేదా ప్రతిఫలం ముట్టజెప్పి వారి శ్రమ ఫలితాన్ని ఎక్కువ మొత్తంలో మిగుల్చుకోగల అవకాశాలు ఆధిపత్య వర్గాలకు ఉంటాయి.
ఈ విధమైన వర్గ కారణాల వలన కొనసాగించబడుతున్న వివక్షలను ఆధిపత్య వర్గాలు కూడా నమ్మి అమలు చేయడం సామాజిక వ్యవస్ధల్లోని అనివార్య లక్షణం. అభివృద్ధి చెందిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆస్తులను ఒక పక్క పెంచుకుంటూనే, మరో పక్క అభివృద్ధితో పాటు వచ్చే సాంస్కృతిక భావాలను ప్రతిఘటించడం కూడా ఆధిపత్య వర్గాల లక్షణం. అలా ప్రతిఘటిస్తేనే వారి దోపిడీ లక్ష్యాలు మరింతకాలం కొనసాగుతాయి. సాంస్కృతిక రంగంలో ఆధునిక భావాలను అనుమతించినట్లయితే అది అనివార్యంగా పునాదిలోని ఆర్ధిక సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అంటే ఆధిపత్య వర్గాల ఆర్ధిక దోపిడీకి ప్రమాదం వచ్చిపడుతుంది. శ్రీ ప్రకాష్ జైస్వాల్ చేసిన వివక్షాపూరిత వ్యాఖ్యలను ఈ విశ్లేషణ వెలుగులో పరిశీలించడం ఇప్పటి అవసరం.
ఈ లింక్ చదవండి: http://streevimukti.mlmedia.net.in/77440439
కేంద్ర మంత్రి ఆయన ఒక వాస్తవాన్ని చెప్పాడు ఇందులొ ఆయన్ను తప్పుపట్టడానికేముంది.? అలాగే జరగాలని ఆయన అనడం లేదు. ఇండియాలొ పెళ్ళిల్లు యలాజరుగుతాయొ అందరికీ తెలిసిన విషయమే. కులాలను బట్టి ఆర్దిక స్తితిగతులనుబట్టి జరుగుతాయి. అందులొ ప్రేమ, మొహం, ఆకర్షణ లాంటిఎవీవుండవు. పెళ్ళైన కొత్తలొ కొన్నిరొజులు మొజువుంటుంది. వాళ్ళ ఇద్దరిమద్య అసమానతలవల్ల కొన్నిరొజులకు అదికుడా పొతుంది. గతంలొ అయితె ఒకరు యజమాని ఒకరు బానిస. ఇప్పుడు పరిస్తితి మారింది. నవీన స్త్రీ తనకాళ్ళమీద తను నిలబడుతుంది. అందుకే ఇప్పుడు ఇష్టం లేకపొతె విడిపొతున్నారు గతంలొ ఆ ఎసులుబాటు లేదు. విడాకుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడుకుడా ప్రెమించి పెళ్ళి చేసుకునేవాళ్ళలొ తప్ప మిగతవరిలొ ప్రెమ , మొహం లాంటివి వుండవు. నవీన నాగరీక పెళ్ళిళ్ళు కుడా ఆర్దికం మీదే ఆదారపడి వున్నాయి కాబట్టి మొజుతగ్గటం సహజమే కదా? బరతీయ వివాహ వ్యవస్తను ఆకాశానికిఎత్తారు అందులొ విసిష్టత నాకేమీ కనిపించలేదు మీకేమైనా కనపడితే చెప్పండి విశెకర్ గారూ.
రామమోహన్ గారూ! కేంద్రమంత్ర్రి వ్యాఖ్యల్లో స్త్రీల పట్ల లోకువ, చులకనభావం మీకేమీ కనపడలేదా? ఇలాంటివారు తెలివిగా మాట్లాడుతున్నామనుకుంటూ నోటికొచ్చిన కామెంట్లు చేస్తుంటారు. ఇలా ఎకసెక్కాలు చేసి, జోకులు వేయటానికి ఆడవాళ్ళు ముఖ్యంగా భార్యలు మహా తేలిగ్గా వీరికి కనపడుతుంటారు.
>> నవీన నాగరీక పెళ్ళిళ్ళు కుడా ఆర్దికం మీదే ఆదారపడి వున్నాయి కాబట్టి మొజు తగ్గటం సహజమే కదా? >> ఈ సందర్భంలో చూడాల్సింది కేంద్రమంత్రి వాచాలతనూ, దానికి కారణాలనూ కానీ వివాహవ్యవస్థ లొసుగులను కాదు.
మోజు తగ్గటం సహజమైతే- అది భార్యలమీదే కాదు; భర్తల మీద కూడా జరుగుతుంది. భర్తలకు యౌవనంలోనే వయసు ఆగిపోయి, భార్యలకు మాత్రమే వయసు పెరగదు కదా?
వెణు గారూ మంత్రి స్త్రీ ల పట్ల తేలిక బావనను నేను కుడా వ్యతిరేకిస్తున్నాను. మొజుతగ్గడం అనేది నేను చెప్పింది స్త్రీ, పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది.
రామ్మోహన్ గారు
“భారతీయ సంస్కృతిలో శిఖర సమానమని (తాము) చెప్పుకునే వివాహ బంధాన్ని తేలికపరిచేందుకూ సిద్ధపడ్డాడు.”
పైన బ్రాకెట్లలో ఉన్న పదం రాసుంటే మీకు అనుమానం వచ్చి ఉండేది కాదేమో. భారతీయ వివాహ వ్యవస్ధకు పశ్చిమ దేశాల్లో గొప్ప పేరుందని తరచుగా చెబుతుంటారు. అలా చెప్పుకునే వ్యవస్ధను కూడా మంత్రి గౌరవించలేకపోయాడని నా అర్ధం. వివాహ వ్యవస్ధను గౌరవించే నటన కూడా చేయలేనంతగా భార్యల పట్ల అగౌరవం ప్రకటించాడని నా అర్ధం.
మంత్రి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశాడో ఆర్టికల్ చివరి మూడు పేరాల్లో విశ్లేషించాను. ఆ విశ్లేషణని మీరు గమనించలేదేమో. గమనించినట్లయితే పై అనుమానం వచ్చి ఉండేది కాదనుకుంటా. భారత వివాహ వ్యవస్ధ శిఖర సమానమని నేనూ భావిస్తే ఇటువంటి విశ్లేషణ నేను చేయలేను గదా?
మంత్రి ఏ వర్గం వాడైనా మీరు చెప్పిన మారుతున్న పరిస్ధితుల్లో ఉన్నాడు గనక బహిరంగ ప్రదేశాల్లో ఆ మార్పులను గ్రహిస్తున్నట్లు కనపడాలి. దానిక్కూడా మంత్రి సిద్ధంగా లేకపోవడం ఒక విపరీతం. అలాంటి విపరీత పరిస్ధితిని తప్పులేదని మీరు చెబుతున్నారు.
ఇండియాలో పెళ్ళిళ్లు ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు కాబట్టీ, కులాల బట్టీ, ఆర్ధిక స్ధితిగతులను బట్టీ జరుగుతాయి కాబట్టీ, అందులో ప్రేమ, మోహం, ఆకర్షణ ఏవీ ఉండవు కాబట్టీ, వాళ్ళ మధ్య ఉన్న అసమానతల వల్ల కొన్ని రోజులకి అది కూడా పోతుంది కాబట్టీ… వయసు మళ్ళిన భార్యలపై మోజు పోవడం ఆమోదనీయమే అన్నట్లుంది మీ వ్యాఖ్య. (బహుశా మీ అభిప్రాయం అది కాకపోవచ్చు.)
ఆర్ధిక పునాది ఉన్నది ఉన్నట్లు కొనసాగుతుండగానే, ఉపరితలంలో కొన్ని పరిణామాత్మక మార్పులు వస్తుంటాయి. వీటికి వ్యవస్ధను సమూలంగా మార్చగలిగే శక్తి ఉండదు. కానీ వ్యవస్ధ మారింది అన్న భ్రమను కలిగిస్తుంటాయి. అందువల్లనే మీరు ఇప్పటి భారత స్త్రీని ‘నవీన స్త్రీ’ గా చెప్పగలిగారు.
లేనట్లయితే, ఆర్ధిక వ్యవస్ధలో మార్పులు లేకుండా భారత స్త్రీ ‘నవీన స్త్రీ’ ఎలా కాగలిగిందని మీ ఉద్దేశ్యం!?
“ఇప్పుడు పరిస్తితి మారింది. నవీన స్త్రీ తనకాళ్ళమీద తను నిలబడుతుంది. అందుకే ఇప్పుడు ఇష్టం లేకపొతె విడిపొతున్నారు గతంలొ ఆ ఎసులుబాటు లేదు. విడాకుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడుకుడా ప్రెమించి పెళ్ళి చేసుకునేవాళ్ళలొ తప్ప మిగతవరిలొ ప్రెమ , మొహం లాంటివి వుండవు.”
‘నవీన స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడుతుంది’ అనడం తప్ప మిగిలినవన్నీ పరిణామాత్మక మార్పులు. అవి కూడా చాలా ప్రాధమిక స్ధాయి మార్పులు. మెట్రోల్లో తప్ప విడాకులు పరిగణించదగిన దామాషాలో పెరగలేదు. భారత దేశం గ్రామాల్లో ప్రధానంగా ఉన్నది నిజమయితే ఈ పరిణామాత్మక మార్పులు చాలా చాలా పరిమితం. మరో విషయం ఏమిటంటే ప్రేమలకి ప్రాతిపదిక కూడా వ్యక్తిత్వ విలువలు కాకుండా ఆర్ధిక కారణాలే అవడం వలన వాటి పరిమితి వాటికి ఉంది.
ఈ పరిస్ధితుల్లో స్త్రీలకి తన కాళ్లమీద తాను నిలబడే పరిస్ధితే ఉంటే వరకట్న హత్యలు, గర్భస్ధ శిశు హత్యలు, ఖాఫ్ పంచాయితీలు ఎందుకు జరుగుతున్నట్లు? ప్రేమల పేరుతో ఆడపిల్లలు ఎందుకు మోసపోతున్నట్లు? లింగ వివక్ష కొనసాగుతోందని ఎందుకు చెప్పుకుంటున్నట్లు? బహుశా ఈ అంశాలకీ నవీన స్త్రీకీ మధ్య ఉన్న సంబంధం మీరు చూడడం లేదేమో!
మారుతున్నాయి అని మీరు చెప్పే పరిస్ధితులను ఎలా చూడాలో మీతో ఒకసారి చర్చించినట్లు గుర్తు. మీరు చెప్పిన మార్పు ప్రాతిపదిక అంతిమంగా సి.పి.ఎం అవగాహనకి దారి తీస్తుందని కూడా చెప్పాను. ఆ విశ్లేషణ ఇక్కడ కూడా వర్తిస్తుందని గమనించగలరు.
రామ్మోహన్ గారూ మరో విషయం మరిచాను.
డైఎలక్టిక్స్ లో ఒక సూత్రం ఉంది. వైరుధ్యం యొక్క సాధారణ మరియు నిర్ధిష్ట నియమాలకి సంబంధించిన సూత్రం అది. (Generality of Contradiction and Particularity of Contradiction) ఈ నియమాన్ని మీరు విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఒక అంశంలోని నిర్దిష్ట వైరుధ్యాలు అందలి సాధారణ వైరుధ్య నియమానికి లోబడి ఉంటాయి. కాని నిర్దిష్ట వైరుధ్యాన్ని పరిశీలించేటపుడు సాధారణ వైరుధ్య లక్షణం నుండి దూరంగా వెళ్తున్నట్లు భ్రమ కలుగుతుంది. నిర్దిష్ట వైరుధ్యాలను పరిశీలించేటపుడు ఈ సంగతిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పాటించాలి.
ఉదాహరణకి స్త్రీ-పురుష వైరుధ్యం వర్గ వైరుధ్యానికి లోబడి ఉంటుంది. కాని స్త్రీ-పురుష వైరుధ్యాన్ని నిర్దిష్టంగా పరిశీలించేటపుడు వర్గ వైరుధ్యాన్ని విస్మరించిన భ్రమ కలుగుతుంది. స్త్రీ-పురుష వైరుధ్యాన్ని లోతుగా పరిశీలించే క్రమంలో అలాంటి భ్రమ కలుగుతుంది. స్త్రీ-పురుష వైరుధ్య లక్షణాన్ని లోతుగా పరిశీలించే కొద్దీ అది వర్గ వైరుధ్య లక్షణానికి భిన్నంగా ఉందేమోఅని పిస్తుంది.
పరిశీలించేవారికి కలిగే భ్రమ ఒకటైతే, ఒకరి పరిశీలనను బైటినుండి చూసేవారికి కలిగే భ్రమ మరొకటి. ఉదాహరణకి స్త్రీ పురుష వైరుధ్యాన్ని లోతుగా పరిశీలించేవారికి లోతులకి వెళ్లేకొద్దీ అది శత్రువైరుధ్యంగా భ్రమ కలుగుతుంది. బైటినుండి ఆ పరిశీలనను చూసేవారికి స్త్రీ-పురుష వైరుధ్యాన్ని వర్గ వైరుధ్యంలో భాగంగా కాకుండా అతీతంగా చూస్తున్న భ్రమ కలుగుతుంది. వైరుధ్యాలను పరిశీలించేటపుడు ఈ రెండు భ్రమలను గమనంలో ఉంచుకోవాలి.
నిర్దిష్టం వైరుధ్యం లోతుల్లోకి వెళ్లేకొద్దీ సాధారణ వైరుధ్యం నుండి దూరం జరుగుతున్న భ్రమ కలుగుతుంది కనుక లోతుల్లోకి వెళ్లకూడదు అని కొందరు చెబుతారు. అది కరెక్ట్ కాదు. ఎంత చిన్న వైరుధ్యం అయినా లోతుల్లోకి విచికిత్స జరిపితేనే దాని పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆ పరిష్కారం ఖచ్చితంగా సాధారణ వైరుధ్య పరిష్కారానికి లోబడే ఉంటుంది. లేనట్లయితే అటువంటి పరిశీలనలో ఎక్కడో పొరబాటు దొర్లినట్లు భావించవచ్చు. ఈ సూత్రానికి అరుదుగా మినహాయింపులు ఉంటే ఉండవచ్చు (నాకు తెలిసి లేవు.)
కులం, మతం, దేవుడు ఇత్యాది అంశాలకి కూడా ఈ నియమం ఇలాగే వర్తిస్తుంది.
విశెఖర్ గారూ నా అభిప్రాయం వయసుమళ్ళిన బార్యలపైన మొజు పొవాలని లేదా నేను ఆమొదిస్తున్నానని కాదు. కులాలపైన , ఆర్దికస్తితిగతులపైన ఆదారపడే పెళ్ళిళ్ళు వయసు మళ్ళిన బార్యలపైనే కాదు వయసులొవున్న స్త్రీ, పురుసులకు కుడా ఒకరిపై ఒకరికి ఆపేక్ష వుండదు. దానికి దొపిడీ వర్గ సమాజాలే కారణం.
నేను పునాదిలొ మార్పులు జరిగాయని బ్రమపడం లేదు. నా అభిప్రాయం గతంతొ పొల్చుకున్నడే కొంతజనాబాలొనైనా మార్పులు జరిగాయంటున్నాను ఆ విషయాన్ని దౄష్టిలొ పెట్టుకుని నవీన స్త్రీ అంటున్నాను. మీరనట్టు గతంలొ ఈ విషయం పైన మనిద్దరిమద్య చర్చజరిగింది.
విడాకుల సంఖ్య అంతబారీగా ఎమీ పెరగలేదు. ఇష్టం లేకుండానే ఒక చూరుకింద వున్న వాళ్ళే ఎక్కువ. పరువు , ప్రతిష్టలకొసం. దొపిడీ వర్గ సమాజంలొ ప్రెమకు కుడా పరిమితులు వున్నాయి అయినప్పటికీ గుడ్డికన్నా మెల్ల మేలు.
నేను సమాజం మొత్తానికి వర్తింప చేయలేదు. గతంతొ పొల్చుకున్నప్పుడు మాత్రమే కొంతమందైనా వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడుతున్నారు. నవీన స్త్రీ కుడా తన కాళ్ళమీద తను నిలబడ్డాకుడా మీరు చెప్పిన సమస్యలు ఎదుర్కొవలసి వుంటుంది. స్యేచ్చ పరిమిత అర్తంలొనే . ప్యుడల్ సమాజం కన్నా పెట్టుబడిదారీ సమాజం స్యేచ్చ ఇచ్చినట్టు. సంపూర్నంగా కాదు.
మా తాతయ్య గారి తమ్ముడికి నలుగురు భార్యలు. ముగ్గురిని వదిలేశాడు, నాలుగో దాని దగ్గర ఉంటున్నాడు. ముసలోడికి నాలుగో పెళ్ళాం ఏమిటి అని గ్రామస్తులు అందరూ నవ్వినా అతను నాలుగో దాని దగ్గరే ఉంటున్నాడు. భర్తకి బట్టతల వచ్చిందని భార్య తన భర్తని వదిలేసి తన కంటే ఇరవై ఏళ్ళు చిన్నవాడైన యువకుణ్ణి పెళ్ళి చేసుకోగలదా? పది మంది నవ్వుతారా లేదా అనేది ఇక్కడ అనవసరం. కానీ ఆడది ఆ ధైర్యం చేస్తుందా అనేదే ఇక్కడ ప్రశ్న. ఎన్ని కబుర్లు చెప్పుకున్నా స్త్రీ-పురుష సంబంధాలలో మార్పు రాలేదని ఒప్పుకోవాలి.
ప్రవీణ్ గారూ, మీ తాతయ్య గారి నాలుగో భార్య మీకు రెండు తరాలు పెద్దావిడ. మీ తాతగారంత పెద్దావిడ కాకపోయినా తాతయ్య గారి భార్య గనుక గౌరవంగా సంబోధించాలి. ఆవిడను మీరు ‘నాలుగోదాని దగ్గర’ అని అగౌరవంగా చెప్పడం బాగాలేదు. ‘ఆడది’ అన్న సంబోధన కూడా కరెక్టు కాదు. మనకి ఉన్న భావాలు ప్రతి వ్యక్తీకరణలోనూ ప్రతిఫలిస్తేనే ఆ భావాలకి సార్ధకత ఉంటుంది కదా. కావాలని మీరలా అన్నారని కాదు గానీ, ఎలా అన్నా అగౌరవం అగౌరవమే.
నాలుగో ఆవిడ లీగల్ భార్య కూడా కాదు, ఉంపుడుగత్తె అనే టాక్ ఉంది. నేను ఆ పెళ్ళిని దగ్గర ఉండి చూడలేదు కాబట్టి నాకు తెలియదు. ఆవిడ నా కంటే కేవలం పదేళ్ళు పెద్దావిడే. ఆవిడ కొడుకు పదో తరగతి చదువుతున్నాడు. ఆవిడ ఆర్థిక కారణాల వల్ల నాలుగో పెళ్ళి అతనికి భార్యగా వెళ్ళి ఉండొచ్చు. మనిషిని ఆర్థిక పరిస్థితులే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని నాకు తెలుసు. కానీ నాలుగో పెళ్ళిళ్ళూ, అక్రమ సంబంధాలూ ఏర్పాటు చేసుకునేవాళ్ళని చూస్తే గౌరవం కలగదు కదా. జీవితంలో సమస్యలు ఉన్న స్త్రీ ‘తనకి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి కదా, వేరే రకంగా సుఖపడదాం’ అని అనుకుని అనైతికం నవలలోలాగ భర్త ఉండగా బావగారితో సంబంధం పెట్టుకుంటే ‘పోనీలే జీవితంలో ఓడిపోయిన స్త్రీయే కదా’ అని అనుకుని ఆమె గురించి పాజిటివ్‌గా తీసుకుంటామా? ముగ్గురు భార్యలని వదిలేసిన పురుషుని దగ్గరకి వెళ్ళిన స్త్రీని చూసినా అలాగే అనిపిస్తుంది.
అసమాజికమైన పనులపై ఆర్థిక ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి. అది concubinage (ఉంపుడుగత్తెలుగా వెళ్ళడం) కావచ్చు లేదా వ్యభిచారం కావచ్చు లేదా దొంగతనాలు కావచ్చు లేదా సారా వ్యాపారం కావచ్చు. సారా కాచేవాడు పేదరికం వల్లే సారా కాచి అమ్ముతున్నాడని తెలిసినా సారా వ్యాపారం అనేది అసమాజికమైన పని కాబట్టి ఆ పని చేసేవాని మీద గౌరవం కలగదు. బహుభార్యత్వం, కాంక్యుబినేజ్ లాంటి వాటి విషయం కూడా అంతే. అవి ఆర్థిక ప్రభావాల వల్ల జరిగేవని తెలిసినా వాటిలోకి దిగేవాళ్ళ మీద గౌరవం కలగదు.
లీగల్ భార్య కాని ఉంపుడు గత్తె కనుక ఒక స్త్రీని అదీ, ఇదీ అని అగౌరవంగా సంబోధించవచ్చన్నమాట! నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న మీ తాతయ్యని గారు అనొచ్చుగానీ నాలుగో భార్యగా ఆయన జీవితంలోకి అడుగు పెట్టినావిడని మాత్రం గౌరవించనవసరం లేదన్నమాట. ఇది వివక్షే కదా ప్రవీణ్ గారూ. ‘ఉంపుడుగత్తె’ అనడం కూడా వివక్షే కాదా?
నేను మా తాతయ్య గారి తమ్ముణ్ణి ‘గారు’ అనలేదే. కనీసం చిన్నతాత అని కూడా అనలేదు. పై వ్యాఖ్య మళ్ళీ చదవండి.
ఉంపుడుగత్తె అనే పదం విషయానికొస్తే తెలుగులో ఉంపుడుగత్తె అని వ్రాసినా, ఇంగ్లిష్‌లో concubine అని వ్రాసినా తేడా ఏమీ రాదు. సొంత భాషని గ్రామ్య భాషగా చూడడం వల్లే వచ్చింది ఈ సమస్య అంతా.
అవున్నిజమే. మీ తాతయ్యని గారు అన్నారు గానీ, ఆయన తమ్ముడిని గారు అన్లేదు. అయినా సరే. మీ చిన్నతాతగారి నాలుగోభార్యని ‘అది’ అనడం, ‘ఉంపుడుకత్తె’ అనడం సరికాదనే నా అభిప్రాయం. ఎందుకు కాదో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని నా నమ్మకం. కాదూ కూడదంటే, ఇక మీ యిష్టం.
‘ఉంపుడుగత్తె’ అన్నా కాంక్యుబైన్ అన్నా ఒకటే. రెండు ఒక స్త్రీ సామాజిక హోదాని తెలిపేవే. భాష వేరైనంత మాత్రాన హోదాలో తేడాలేదు. ఆ హోదాయే వివక్షతో కూడి ఉన్నదనే మనం గుర్తించాల్సిన విషయం.
కాంక్యుబినేజ్, ఇన్సెస్ట్ లాంటి పదాలు పలకకూడదు అని అనుకుంటే “యూదుల బైబిల్‌లో దావీదు అనే రాజుకి మూడు వందల మంది concubines ఉండేవాళ్ళు” అని చరిత్ర పుస్తకాలలో వ్రాసేటప్పుడు ఏమని వ్రాస్తాము? “బైబిల్ పాత నిబంధనల ప్రవక్త అయిన లోతు తన కూతుర్లతో కలిసి చెయ్యకూడని పని చేశాడు” అని వ్రాసేటప్పుడు ఏమని వ్రాస్తాము? కనుక కేవలం పదాలని నిషేధించడం వల్ల ప్రయోజనం ఉండదు.
అక్రమ సంబంధాలపై సుప్రీం కోర్ట్ తీర్పు గురించి చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి అభ్యంతరాలే వచ్చాయి. కాంక్యుబిన్ లాంటి పదాలు పలకకూడదు అని అంటూ కొందరు నన్ను విమర్శించారు. ఎవరు పలికినా, పలకకపోయినా ఆర్థిక పరిస్థితుల వల్ల కాంక్యుబిన్స్‌గా వెళ్ళేవాళ్ళు ఉంటారు.
నిన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ వెనుకాల ఒకామె ఛాతి కనిపించే విధంగా చీర కట్టుకుని నిలబడి, నన్ను పిలిచి తన రేట్ 90 రూపాయలేననీ, తన దగ్గరకి రమ్మనీ అడిగింది. అలాంటి వాళ్ళ దగ్గరకి వెళ్ళే అలవాటు నాకు లేదు కనుక నేను వెళ్ళలేదు. సాధారణంగా సంఘ సంస్కర్తనని చెప్పుకునేవాడు “వేశ్య” అనే పదం పలకకూడదు అని అంటాడు కానీ వేశ్యావృత్తి యొక్క ఆర్థిక మూలాల గురించి పట్టించుకోడు. ఆర్థిక మూలాలు చెదరనంత కాలం 90 రూపాయల కోసం రైల్వే స్టేషన్ వెనుకాల నిలబడి ఒంటరిగా నడుస్తోన్న మగవాళ్ళని పిలిచేవాళ్ళు ఉండనే ఉంటారు.
పద ప్రయోగంలో మార్పులు రావడం కంటే భావజాలంలో మార్పులు రావడం ముఖ్యం. నలుగురు చూస్తుండగా “వేశ్య” అనే పదం ఉపయోగించడానికి సిగ్గు పడేవాడు కూడా రైల్వే స్టేషన్ వెనుకాల ఒంటరిగా నడుస్తున్నప్పుడు అమ్మాయి పిలిచింది కదా అని ఆమె దగ్గరకి వెళ్ళగలడు. ఎవరూ చూడకపోతే ఏమైనా చెయ్యొచ్చు అని అనుకుంటున్నప్పుడు నలుగురి సమక్షంలో ఉపయోగించే పదాల ప్రయోగంలో మార్పు వస్తే ఎంత, రాకపోతే ఏంత?
ప్రవీణ్, ఉంపుడుకత్తె, కాంక్యుబైన్ అన్న పదాల్ని మీరు అసలే వాడకూడదు అని కాదు నేనన్నది. స్త్రీ, పురుషులు ఇద్దరూ ఇష్టపడి సంబంధం పెట్టుకున్నపుడు (ఏ పరిస్ధితిలోనైనా సరే) అది అనైతిక సంబంధం అయితే ఆ అగౌరవం ఆ ఇద్దరికీ వర్తించాలి. కాని ఈ పదాలు స్త్రీని మాత్రమే అగౌరవంగా ఎత్తి చూపుతాయి.
సమాజం ఆమెను ఉంపుడుకత్తె అంటోంది అని చెప్పడమూ, మనం కూడా ఆమెను
ఉంపుడుకత్తె అనడమూ రెండూ ఒకటి కాదు కదా.
అవును. భావజాలంలో మార్పు రావాలి. కాని ఆ పదాల్ని తిరస్కరించడానికి ఆ మార్పు వచ్చేవరకూ ఆగనవసరం లేదు.
నాకు అక్రమ సంబంధాలు పెట్టుకునే మగవాళ్ళ మీద గౌరవం లేదు కాబట్టే మా తాతయ్య గారి తమ్ముడి గురించి వ్రాసేటప్పుడు నేను ‘చిన్నతాత’ అనే పదం ఉపయోగించలేదు. మగవాని గురించి వ్రాసేటప్పుడు నేను ‘ఉంచుకున్నవాడు’ అనే రిఫరెన్స్ ఉపయోగించలేదు. అంతమాత్రాన నాకు ఆ మగవాళ్ళ మీద గౌరవం ఉన్నట్టు కాదు.
అక్రమ సంబంధాల వల్ల కుటుంబ వాతావరణం చెడిపోతుందనే నా బాధ. ఒక సివిల్ కేస్‌లో మా చిన్నతాతే మాకు అనుకూలమైన సాక్షి. వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా నేను వెళ్తుంటాను. కానీ ఆ ఎనభై ఏళ్ళ ముసలతని పక్కన నలభై ఏళ్ళ ఆవిడని చూసినప్పుడు నాకు అదోలా అనిపిస్తుంది. అతని మొదటి భార్య పిల్లలు టిట్లాగఢ్‌లో ఉంటున్నారని తెలిసింది. లీగల్‌గా అతని మొదటి భార్య పిల్లలే మాకు బంధువులు అవుతారు కానీ అతని మొదటి భార్య పిల్లలని మేము ఇప్పటి వరకు చూడలేదు. అక్రమ సంబంధాలు పెట్టుకునే మగవాళ్ళకి వంద మంది సంతానం ఉంటారు. ఆ వంద మందిని గుర్తు పెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ బంధువులు ఎవరూ వాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళని తమ కన్నతండ్రే గుర్తు పెట్టుకుంటాడా, లేదా అనేది కూడా సందేహమే. ఒకవేళ గుర్తు పెట్టుకున్నా అతను తనకి అందరికంటే ప్రియమైన తన చివరి భార్య లేదా ఉంపుడుగత్తె పిల్లలనే గుర్తు పెట్టుకుంటాడు. అక్రమ సంబంధాల వల్ల కుటుంబ సంబంధాలు ఇలా తగలాడుతాయి.
నాకు మగవాళ్ళ మీద ఎలాంటి సానుభూతి లేదు. రెండో భార్య కొడుక్కి ఆస్తిని కట్టబెట్టడానికి మొదటి భార్య కొడుకుపై హత్యా ప్రయత్నం చేసిన తండ్రులని చూశాను. ఆ పరిస్థితిలో ఆ తండ్రిపై ఎలాంటి అసహ్యం కలుగుతుందో, ఆ హత్యా ప్రయత్నాన్ని సమర్థించిన అతని రెండో భార్యపై కూడా అలాంటి అసహ్యమే కలుగుతుంది. ఒక స్త్రీకి భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసినప్పుడు ఆమె తనకి మొదటి భర్త వల్ల పుట్టిన బిడ్డనీ, రెండో భర్త వల్ల పుట్టిన బిడ్డనీ ఒకేలా చూస్తుంది. కానీ పల్లెటూర్లలో చాలా మంది భర్త చనిపోయిన స్త్రీలకి రెండో పెళ్ళి చెయ్యరు కాబట్టి ఈ విషయం పైకి తెలియదు.
ఒక పురుషుడు ఒకే స్త్రీ ద్వారా ఇద్దరు కొడుకులని కన్నప్పుడు ‘ఎక్కువ మార్కులు తెచ్చుకుని డాక్టర్ లేదా ఇంజినీర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న కొడుకుని’ బాగా చూసుకుని ‘తక్కువ మార్కులు తెచ్చుకుని ఆ అవకాశాలు తక్కువగా ఉన్న కొడుకుని’ బెల్ట్‌తో కొట్టే తండ్రులని ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి వాళ్ళు రెండో పెళ్ళి చేసుకుంటే తమకి ప్రియమైన రెండో భార్య కొడుకు కోసం మొదటి భార్య కొడుకుని చంపరని గ్యారంటీ లేదు.
భర్త దుర్మార్గుడైనప్పుడు అతన్ని వదిలేసి ఇంకో వ్యక్తితో వెళ్ళిపోయేవాళ్ళ గురించి నేను ఎన్నడూ నెగటివ్‌గా వ్రాయలేదు. కానీ ముగ్గురు భార్యలని వదిలేసి స్త్రీలకి అన్యాయం చేసిన వ్యక్తి దగ్గరకి వెళ్ళిన స్త్రీని చూసినప్పుడే అదోలా అనిపిస్తుంది. ఈ లింక్ చదవండి, విషయం అర్థమవుతుంది: http://forproletarianrevolution.mlmedia.net.in/feminism/561255