మిమ్మల్నీ, దేశాన్నీ దేవుడే కాపాడాలి, కేంద్రంతో సుప్రీం కోర్టు


కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. జడ్జిలకు ఇంటి సౌకర్యం కల్పించాలన్న రూల్ ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహించింది.  వాటర్ ట్రిబ్యునల్ లో సభ్యులైన జడ్జిలకు ఢిల్లీలో ఇంటి సౌకర్యం కల్పించడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వాన్ని దేవుడే కాపాడాలని ఆకాంక్షించింది. ఇలాంటి ప్రభుత్వ పాలనలో ఉన్నందుకు దేశాన్ని కూడా దేవుడే కాపాడాలని ప్రార్ధించింది. ఇళ్ళు ఇవ్వడం ఇష్టం లేకపోతే వాటర్ ట్రిబ్యూనళ్ళకు జడ్జిలను సభ్యులుగా నియమించే చట్టాన్ని రద్దు చేయాలని కోరింది.

“రూల్స్ ప్రకారం ఇంటి సౌకర్యానికి వారు అర్హులు. ఖాళీలు ఉన్నపుడు వారికి ఇళ్ళు ఇవ్వడానికి మీరు నిరాకరించలేరు. రిటైర్డ్ జడ్జిలు ఢిల్లీ వీధుల్లో తిరుగుతుండాలని మీరు భావిస్తున్నారా? ట్రిబ్యునళ్ళు పని చేయకూడదని మీరు భావిస్తున్నట్లయితే ట్రిబ్యునల్స్ కు జడ్జిలను సభ్యులుగా నియమించే చట్టాలను రద్దు చెయ్యండి” అని సుప్రీం కోర్టు ఆగ్రహంగా వ్యాఖ్యానించింది.

కర్ణాటక, గోవా ల మధ్య నలుగుతున్న నీటి వివాదం పరిష్కారం కోసం కేంద్రం  ‘మాహాదాయి నీటి వివాదాల ట్రిబ్యునల్’ (మహాదాయి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్) ను ఏర్పాటు చేసింది. నవంబర్ 2010 లో ఏర్పాటు చేసిన ఈ ట్రిబ్యునల్ ఛైర్మన్ కూ, సభ్యులకూ ఢిల్లీల్లో ఇల్లు కేటాయించాలని కోర్టు కోరినప్పటికీ అది అమలు కాలేదు. ట్రిబ్యునల్ సభ్యులకు ఇళ్ళ సౌకర్యం కల్పించే అవకాశం చట్టపరంగా లేదని ప్రభుత్వం వాదిస్తోంది. కావాలంటే ఇళ్ళు అద్దెకు తీసుకోవచ్చనీ, అద్దె తాము చెల్లిస్తామనీ చెబుతోంది. ఈ వాదనను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది.

“మీరు నిద్ర మత్తులో జోగుతుంటే కోర్టు మిమ్మల్ని తట్టి లేపాలని కోరుకుంటున్నారా? మేము ఏదైతే చేయకూడదని భావిస్తూ సంయమనం పాటిస్తున్నామో అదే చేయక తప్పని పరిస్ధితిని మాకెందుకు కల్పిస్తున్నారు? దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఈ దేశాన్ని కూడా దేవుడే కాపాడాలి” అని సుప్రీం కోర్టు ఆగ్రహంతో ప్రశ్నించిందని ఎన్.డి.టి.వి తెలిపింది.

వాటర్ ట్రిబ్యునల్ జడ్జిలకు ఇళ్ళు లేవని ఆగ్రహిస్తున్న సుప్రీం కోర్టుకి దేశంలో ఇల్లులేని కోట్లాది జనం సంగతి పట్టిందో లేదో తెలియదు. దాదాపు 8 కోట్లమంది భారతీయులు ఫుట్ పాత్ లపైనా, రైల్వే బస్సు స్టేషన్లలోనా, గుళ్ళు గోపురాల్లోనా బతుకుతుంటే మరో 9 కోట్లమంది మురికివాడల్లోని అగ్గిపెట్టెల చీకటి కొట్టాల్లో బతుకుతున్నారు. జనాభా సేకరణలో భాగంగా ఇల్లులేనివారిని లెక్కిస్తున్నపుడు సరిగ్గా లెక్కించలేదనీ, పదుల సంఖ్యలో ఉన్నవారిని ఒకే కుటుంబంగా లెక్కించి ఇళ్లులేనివారి సంఖ్యని తగ్గించారనీ ప్రభుత్వంతో కలిసి జనాభా సేకరణలో పాల్గొన్న ఎన్.జి.ఓ సంస్ధలు ఆ మధ్య ఆరోపించాయి. ఈ వాస్తవాన్ని పరిగణిస్తే ఇల్లులేని పేదల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ప్రభుత్వ క్వార్టర్లు ఖాళీగా ఉన్నా జడ్జిలకి ఇవ్వకపోవడం ఘోరమే. కానీ అసలు ప్రభుత్వ క్వార్టర్లు అడిగే అవకాశమేలేని కోట్లాది శ్రామికుల సంగతి ఎవరు అడగాలి?

ప్రభుత్వాలు నిద్రలో జోగుతున్నాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇంకా చెప్పాలంటే నిద్రలో జోగడమే ప్రభుత్వాలకి ప్రీతిపాత్రం. వాషింగ్టన్ నుండి అధ్యక్షుడు ఒబామా చెర్ణకోల ఝళిపించినప్పుడో, పశ్చిమ దేశాల కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఎస్&పి లాంటి రేటింగ్ సంస్ధలు మీ రేటింగ్ తగ్గించామని వెక్కిరించినపుడో, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటి కంపెనీల పత్రికలు అసమర్ధులనీ, చేతగాని దద్దమ్మలనీ నిందించినపుడో మాత్రం ఈ ప్రభుత్వాలకి ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చిందే తడవుగా దేశ ప్రజలని ధరలతో బాదేసి, ప్రజల ఉపాధిని విదేశీ కంపెనీలకి అమ్మేసి ‘మేము మెలకువగానే ఉన్నాం’ అని చెప్పుకుంటాయి.

భారత దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రలో జోగుతుంటే దేశ ప్రజలకు ఎలాగూ నష్టమే. అవి నిద్రలేచి పాలన మొదలు పెడితే మాత్రం ఇంకా ఇంకా నష్టం. ప్రభుత్వాలు నిద్రపోతుండగా తమపని తాము చేసుకుంటూ తమ ఉపాధి తాము చూసుకుంటూ జనం ఎలాగోలా బతికేస్తారు. అమ్మలాంటి ప్రభుత్వం పెట్టకపోయినా రెక్కలు ముక్కలు చేసుకునయినా నాలుగు మెతుకులు సంపాపాదించుకుంటారు. కానీ ప్రభుత్వాలు నిద్ర లేచాయా, అంతే సంగతులు.

‘మీరు చిల్లర కొట్లు పెట్టుకుంటే ఎలా’ అని చిల్లర వర్తకులని కోప్పడి ‘ఇలాగయితే రైతులకి గిట్టుబాటుధర ఇవ్వలేము’ అని బాధపడి, ‘వాల్ మార్ట్ వస్తే అందరికీ మంచిది’ అని గీతోపదేశం కావించి చిల్లర వర్తకాన్ని అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ఇత్యాది దేశాల కంపెనీలకి అమ్మేస్తారు. ‘మరి మా ఉపాధి?’ అని అడిగితే ‘వాల్ మార్ట్ ఇస్తుందిలెమ్మని’ కసిరేస్తారు. గట్టిగా అడిగితే ‘డబ్బులేమన్నా చెట్లకి కాస్తున్నాయా?’ అని తెలివి కూడా ప్రదర్శిస్తారు. 4.5 కోట్ల కుటుంబాల ఉపాధి లాక్కుని పది లక్షల ఉద్యోగాలొస్తున్నాయి చూడమంటూ మబ్బుల్లో నీళ్ళు చూపిస్తారు.

రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది తామేనన్న సంగతి వదిలేసి ఆ బాధ్యత విదేశీ కంపెనీలకి అప్పజెప్పడానికి మన ప్రభుత్వాలు ఏమాత్రం సిగ్గుపడవు. ప్రభుత్వ రంగం అమ్మేసి ఉద్యోగాలు రద్దు చేసింది చాలక స్వయం ఉపాధి పైనా దాడి చేసి దాన్ని కూడా విదేశీ కంపెనీలకి అమ్మేయ్యడానికి వెనకాడరు. గిట్టుబాటు రేటిమ్మని రైతులు అడుగుతుంటే మీకు వాల్ మార్ట్ కోల్డ్ స్టోరేజ్ తెస్తుంది గనక గమ్మున ఉండమంటారు. గ్యాస్ సబ్సిడీ రద్దు చేసి ‘దేశాభివృద్ధి కోసం’ అని చెబుతారు. లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడి అడగడానికి కోర్టులకి అధికారం లేదంటారు.

ఇలాంటి ప్రభుత్వాలని నిలదీయడం మాని దేవుడే కాపాలంటూ సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టే నిస్సహాయంగా మిగిలిపోయింది. వ్యవస్ధ కుళ్లిపోయింది, ప్రజలే దాన్ని మార్చుకోవాలి అని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఏంకావాలి? 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s