ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం: రెండు వేలు దాటిన అమెరికన్ల చావులు


ఫొటో: ప్రెస్ టి.వి

అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి సాగిస్తున్న ‘ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధం’ లో అమెరికా సైనికుల చావులు 2,000 దాటిందని బి.బి.సి తెలిపింది. అయితే, స్వతంత్ర సంస్ధల లెక్కకూ, అమెరికా నాటో ల లెక్కకూ అమెరికా చావుల్లో ఎప్పుడూ తేడా ఉంటుంది. స్వతంత్ర సంస్ధ ‘ఐ కేజువాలిటీస్’ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2,125 కి పైనే. తాలిబాన్ మిలిటెంట్ల చేతుల్లో అమెరికా సైనికులు మరణించారని వార్తా సంస్ధలు చెప్పినపుడు కొన్ని సార్లు ఆ వార్తలను అమెరికా ప్రభుత్వం గానీ, నాటో గానీ తిరస్కరింస్తుంటాయి. అలా తిరస్కరించిన చావులని ఈ తేడాలో కలిపేయవచ్చేమో సమాచారం లభ్యం కాలేదు. రెండు వేల అమెరికా దురాక్రమణదారుల మరణాలను లెక్కించే పశ్చిమ పత్రికలు, లక్షకు పైగా మరణిచిన ఆఫ్ఘన్ పౌరుల విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం.

ఇరాక్ దురాక్రమణ యుద్ధంలో 4,409 మంది సైనికుల్ని పోగుట్టుకున్న అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ లో 2,000 చావులే ఎదుర్కొంది. అధికారిక సమాచారం ప్రకారం సెప్టెంబర్ 27 నాటికి 1,996 మంది అమెరికా సైనికులు చనియారని బి.బి.సి తెలిపింది. ఆదివారం నాటికల్లా మరో 4గురు సైనికులు చనిపోవడంతో ఈ సంఖ్య 2,000కి చేరిందని అమెరికా ప్రభుత్వ సమాచారం. శనివారం వార్డక్ రాష్ట్రంలో ఆఫ్ఘన్ సైనికుడి చేతిలో ఇద్దరు అమెరికా సైనికులు చనిపోగా ఆదివారం ఖోస్ట్ రాష్ట్రంలో మరో ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. ఖోస్ట్ లో చనిపోయింది ముగ్గురు నాటో సైనికులని ప్రెస్ టి.వి తెలిపింది.

‘బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్’ ప్రకారం 40.2 శాతం అమెరికా చావులు మిలిటెంట్లు ప్రయోగించిన ఐ.ఇ.డి బాంబుల వల్ల సంభవించాయి. 30.3 శాతం మరణాలు తుపాకి కాల్పుల ద్వారా సంభవించాయి. మరణించింది రెండువేలే అయినా గాయపడ్డ వారి సంఖ్య పదుల వేలల్లో ఉంటుందని వివిధ వార్తా సంస్ధలు చెబుతుంటాయి. అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం తీసుకున్నా 17,644 మంది అమెరికా సైనికులు ఆఫ్ఘన్ యుద్ధంలో గాయపడ్డారు.

ఐకేజువాలిటీస్ ప్రకారం 1066 అమెరికాయేతర దేశాల సైనికులు ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో చనిపోయారు. వీరిలో 433 మంది బ్రిటిష్ సైనికులే. ఎ.పి వార్తా సంస్ధ ప్రకారం ఆఫ్ఘన్ యుద్ధంలో 20,000 మంది ఆఫ్ఘన్ పౌరులు మాత్రమే చనిపోయారు. వికీలీక్స్ వెల్లడించిన అమెరికా డిప్లొమేటిక్ కేబుల్స్ ప్రకారం ఆఫ్ఘన్ పౌరుల మరణాలు లక్షల్లోనే ఉన్నాయి. అమెరికాతో కలిసి తాలిబాన్ పై పోరాడిన ఆఫ్ఘన్ సైనికుల సంఖ్య 10,000 పై చిలుకేనని ఐకేజువాలిటీస్ తెలిపింది. అంటే ఆఫ్ఘనిస్ధాన్ ని దురాక్రమించిన నాటో ఆఫ్ఘన్ల మధ్య చిచ్చు పెట్టి అటు సైనికులనూ, ఇటు పౌరులనూ బలి తీసుకుందన్నమాట. ఆఫ్ఘన్ల వేలితో ఆఫ్ఘన్ల కంటినే పొడిచి 10,000 మంది ఆఫ్ఘన్ సైనికులనీ, లక్షలమంది ఆఫ్ఘన్ పౌరులనీ చంపేసిందన్నమాట. ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఎవరి తరపున పని చేస్తున్నాడో ఈ ఒక్క లెక్కే చెబుతోంది.

2014 చివరికల్లా అమెరికా సైనికులంతా ఆఫ్ఘనిస్ధాన్ వదిలిపోతారని అమెరికా చెబుతోంది. పశ్చిమ కార్పొరేట్ పత్రికలు కూడా ఆ సంగతిని అలుపు లేకుండా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇది వాస్తవ విరుద్ధం. ఆఫ్ఘన్ యుద్ధాన్ని ముగిస్తానంటూ 2009 లో అధ్యక్ష పదవి చేపట్టిన ఒబామా వచ్చీ రావడంతోనే 30,000 అదనపు సైన్యాన్ని ఆఫ్ఘనిస్ధాన్ కి పంపాడు. అలా అదనంగా పంపిన సైన్యాన్ని మాత్రమే ఒబామా ఇపుడు ఉపసంహరించుకున్నాడు. తానే అదనపు సైనికుల్ని పంపి వారిని ఉపసంహరించుకుని మొత్తం యుద్ధాన్ని ముగిస్తున్నానని తాజా ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటున్నాడు. 2014లో ఇతర సైనికులని వెనక్కి పిలిపిస్తానని చెబుతూనే ఆఫ్ఘన్ సైనికులకి శిక్షణ ఇవ్వడానికి కొంతమందిని అక్కడే ఉంచుతానని కూడా చెబుతున్నాడు. ఒబామా చెబుతున్న ‘కొంతమంది’ 70,000 పై చిలుకేనని కొన్ని పత్రికలు చెబుతుండగా 50,000 అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్ధాన్ లో ఉండిపోతారని మరికొన్ని పత్రికలు చెబుతున్నాయి.

ఆఫ్ఘన్ ఉపసంహరణ అనేది ఒక పచ్చి అబద్ధం. అమెరికా సైనికులు వచ్చింది వెనక్కి వెళ్లిపోవడానికి కాదు. అక్కడే ఉండి చైనా ఎదుగుదలపై కాపలా కాసే లక్ష్యం అమెరికాకి మిగిలే ఉంది. ఆఫ్హన్ లో ఉంటూ ఇరాన్ పై జరపబోయే దాడి కోసం సైనిక శక్తిని పెంపొందించుకునే లక్ష్యం కూడా అమెరికా దృష్టినుండి పోలేదు. చైనా, ఇరాన్, రష్యా తదితర లక్ష్యాలపై అమెరికా చేస్తున్న కేంద్రీకరణలో ఇండియాను వ్యూహాత్మక మిత్రుడిగా అమెరికా స్వీకరించింది. దానికి భారత పాలకులు కూడా సిద్ధంగా ఉన్నారు. అమెరికా తన మిత్రుడుగా ఉండాలని కోరాక ఆ కోరికను తిరస్కరించి తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దమ్ము, ధైర్యం భారత పాలకులకి లేదన్నది ఒక ముఖ్యమైన విషయం.

2 thoughts on “ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం: రెండు వేలు దాటిన అమెరికన్ల చావులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s