వేలం పద్ధతే గీటురాయి కాదు, సహజ వనరుల దోపిడీకి సుప్రీం కోర్టు బాసట!


2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల రద్దు సందర్భంగా తానిచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పునర్నిర్వచించింది. 2జి తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకు మాత్రమే వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ పై తీర్పు చెబుతూ సుప్రీం కోర్టు గురువారం ఈ వివరణ ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తన తీర్పు ప్రకటిస్తూ ‘సహజ వనరులను వేలం వేయాలన్న’ తన 2జి తీర్పు ఇతర సహజ వనరులకు వర్తించదని స్పష్టం చేసింది. దేశంలోని బడా భూస్వామ్య, పెట్టుబదుదారులకూ వారి మాస్టర్లయిన సామ్రాజ్యవాద కంపెనీలకు సుప్రీం కోర్టు  తాజా తీర్పు ద్వారా తన విధేయతను ప్రకటించుకుంది.

తాజా సుప్రీం తీర్పుతో, బొగ్గు గనులను వేలం వేయకపోవడం వలన ఖజానాకి 1.86 లక్షల కోట్ల (రిలయన్స్ పవర్ కి ఇచ్చిన బొగ్గు గనులతో కలిపితే 2.15 లక్షల కోట్లు)  నష్టం వచ్చిందన్న కాగ్ నివేదిక విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త ఊపిరి వచ్చి చేరింది. రిలయన్స్ కంపెనీకి చేసిన బొగ్గు గనుల కేటాయింపులో దాదాపు 29,033 కోట్ల నష్టం వచ్చిందని కాగ్ తేల్చిన నేపధ్యంలో అంబానీ మీడియా (ఐ.బి.ఎన్, ఫస్ట్ పోస్ట్, టి.వి 18 మొ.వి) ఈ అవకాశాన్ని అప్పుడే అందిపుచ్చుకునాయి. కుంభకోణాల్లో తమ యాజమానుల తప్పేమీ లేదనీ రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించామనీ (దోచుకున్నామనీ) చెప్పుకోవడానికి నడుం కట్టాయి.

సహజ వనరులన్నింటినీ వేలం వేయడం సాధ్యం కాదనీ, విధానాల రూపకల్పన కేవలం ప్రభుత్వాల పనే తప్ప కోర్టులకు అందులో పాత్రలేదనీ ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీం కోర్టు ధ్రువపరించిందనీ ఫస్ట్ పోస్ట్ సంతోషం ప్రకటించింది. 2జి స్పెక్ట్రమ్ తో పాటు బొగ్గు కుంభకోణంలో కూడా ‘జీరో లాస్’ వాదన వినిపించిన కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన సంతోషాన్ని ప్రకటించాడు. అయితే ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు 2జి తీర్పును ఏమాత్రం ముట్టుకోని సంగతిని వీరు విస్మరించడం గమనార్హం. 2జి తీర్పుని ప్రస్తావించనప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు ప్రధానంగా ప్రవేటు కంపెనీల నిలువు దోపిడీకి పరోక్ష ఆమోదం ప్రకటించిందన్నది స్పష్టమే.

‘ది హిందూ’ ప్రకారాం, ఏ ప్రభుత్వ విధానానికైనా ఉమ్మడి ప్రయోజనం (common good) మాత్రమే గీటురాయి అని సుప్రీం తీర్పు పేర్కొంది. ఈ సూత్రాన్ని పాటించినట్లయితే ప్రభుత్వం అనుసరించే ఏ సాధనమైనా రాజ్యాంగ సూత్రాల పరిధిలో ఉన్నట్లేనని సుప్రీం అభిప్రాయపడింది. సహజవనరుల కేటాయింపులో వేలం విధానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నప్పటికీ,   దానికి రాజ్యాంగబద్ధ నియమమేమీ లేదని ఊరడించింది. చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా, డి.కె.జైన్, జె.ఎస్.ఖేహార్, దీపక్ మిశ్రా, రంజన్ గొగోయ్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పు ప్రకటించింది.

“మా అభిప్రాయంలో, సహజ వనరుల బేదఖలు/కేటాయింపు లో వేలం విధానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, అన్ని సహజ వనరుల కేటాయింపులకూ అదే రాజ్యాంగ ఆవశ్యమో లేదా పరిమితో కాదు. వేలం విధానం కాని ఇతర పద్ధతులను రాజ్యాంగ విహితం (constitutional mandate) కాదని కొట్టిపారేయలేము” అని బెంచి పేర్కొంది. రెవిన్యూ ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి వేలం పద్ధతి మెరుగైన పద్ధతే గానీ ప్రభుత్వ విధానాలకు రెవిన్యూ గరిష్టీకరణే అంతిమ లక్ష్యం కాకపోవచ్చని పేర్కొంది.

వేలం లేకుండానే సహజవనరులను కేటాయించిన ప్రభుత్వ నిర్ణయాలను గతంలో అనేకసార్లు తాను ఎలా సమర్ధించుకొచ్చిందీ సుప్రీం కోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. “ఆర్టికల్ 14 కింద వేలం విధానానికి అనుకూలంగా రాజ్యాంగబద్ధ ఆదేశమేమీ లేదన్నది స్పష్టమే. వేలం విధానం నుండి ప్రభుత్వం పదే పదే దూరంగా వెళ్లింది. ఈ కోర్టు కూడా అటువంటి చర్యలను పదే పదే ఆమోదించింది… రెవిన్యూ ఆదాయం గరిష్టీకరణ లక్ష్యం కానప్పుడల్లా వేలం యేతర పద్ధతులనే కార్యనిర్వాహకవర్గం (ఎక్జిక్యూటివ్) అనుసరిస్తూ వచ్చింది” అని కోర్టు తెలిపింది. రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించిన తీర్పుతో అంగీకరిస్తూనే, జస్టిస్ ఖేహార్ ప్రత్యేక తీర్పు రాశాడు. “సహజ వనరులను ప్రవేటు కంపెనీలకు కానుక గానో, దాన ధర్మంగానో, విరాళంగానో ఇవ్వడానికి వీలులేదు. ఖర్చయిన సహజవనరులోని ప్రతి ముక్కా కూడా వెనక్కి తిరిగి రావాలి. అది రెవిన్యూ ఆదాయంగా కావచ్చు లేదా ఉమ్మడి ప్రయోజనంగా కావచ్చు. లేదా రెండింటి మిళితంగానూ కావచ్చు” అని జస్టిస్ ఖేహార్ తన తీర్పులో పేర్కొన్నాడు.

అయితే ఈ నీతి సూత్రాలేవీ ఆచరణలో అమలవుతున్నవి కావు. ఆ అవకాశం కూడా లేదు. కృష్ణా-గోదావరి బేసిన్ లో సహజవాయువును తవ్వి తీస్తూ భవిష్యత్తులో పెరగబోయే రేట్ల ద్వారా లబ్ది పొందడం కోసం ఉత్పత్తిని అమాంతంగా తగ్గించిన రిలయన్స్ కంపెనీని అడిగినవాడేవ్వడూ ఈ దేశంలో లేడు. రిలయన్స్ కంపెనీ గ్యాస్ ఉత్పత్తిని తగ్గించిన ఫలితంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ ద్వారా విద్యుత్ తీసే కంపెనీలు ఉత్పత్తి ఆపేయడంతో జిల్లా కేంద్రాలు సైతం తీవ్ర విద్యుత్ కోతను ఎదుర్కోవడం మనముందున్న సత్యం. అయినప్పటికీ రిలయన్స్ కంపెనీ హామీ ఇచ్చిన గరిష్ట గ్యాస్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని నిలదీసే దమ్ము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పిన ఉమ్మడి ప్రయోజనం అంతిమంగా ధనిక దోపిడీదారులవైపే మొగ్గు చూపడం కఠోర వాస్తవం.

ఒక్క కే.జి గ్యాసే కాదు. ఖమ్మం జిల్లా ఇనుప గనులను అల్లుడికి, ఓబుళాపురం గనులను ‘గాలి’ రాకాసికీ రాసిచ్చిన రాజశేఖరరెడ్డిని తీసుకున్నా, గాలితో కుమ్మక్కయిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పను తీసుకున్నా, 70,000 కోట్ల ఇరిగేషన్ కాంట్రాక్టుల కుంభకోణాన్ని రచించి రాజీనామా నాటకం ఆడుతున్న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ని తీసుకున్నా కోర్టు చెప్పిన ‘ఉమ్మడి ప్రయోజనానికి’ అంతిమ లబ్దిదారులేవరో, అంతిమ బాధితులెవరో స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.

పోస్కో కంపెనీ కోసం వేలాది గ్రామస్ధుల తమలపాకు తోటలని లాక్కుంటున్న ఒరిస్సా ప్రభుత్వం, సింగూరు, నందిగ్రామ్ లలో రైతుల భూములు లాక్కున్న బెంగాల్ వామ పక్ష ప్రభుత్వం, కోస్తా కారిడార్ ను కాలుష్య కాసారంగా మార్చే వాన్ పిక్ కంపెనీ కోసం పదుల వేల ఎకరాలు లాక్కున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చిక్కనైన జీవవైవిధ్యంతో అలరారే పశ్చిమ కనుమలను కంపెనీల కాలుష్య కోరలకు బలిచేస్తూ, భూగర్భ జలవనరులను తవ్వి తీసి సాగు, తాగు నీటిని కబళిస్తున్న పెప్సీ కంపెనీకి అండగా నిలబడిన కేరళ ప్రభుత్వం, మా బతుకులకి గ్యారంటీ ఏదని ప్రశ్నిస్తున్న కూడంకుళం మత్స్యకారులను దేశద్రోహులుగా ముద్రవేసి రష్యన్ అణు కంపెనీలను సంతృప్తి పరిచిన తమిళనాడు ప్రభుత్వం… ఇలా ఈ దేశంలోని ప్రతి ప్రభుత్వమూ అమలు చేస్తున్న ప్రజాకంటక విధానాలు ఎవరి ఉమ్మడి ప్రయోజనం కోసమో సుప్రీం కోర్టు పెద్దలకు తెలియనిదేమీ కాదు.

ప్రజలకు మంచి చేయడం కోసం ప్రవేటు కంపెనీలకు ఇతర పద్ధతుల్లో కూడా సహజ వనరులను కేటాయించవచ్చని ప్రకటించిన సుప్రీం కోర్టు రిలయన్స్ లాంటి బడా దళారీ పెట్టుబడిదారులకు పూర్తి మద్దతునూ, సంతృప్తినీ సమకూర్చింది. 2జి కేసులో ‘జ్యుడీషియల్ యాక్టివిజం’ ప్రదర్శించి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఫోజు పెట్టిన సుప్రీం కోర్టు వాస్తవంలో ఆ పేరుతో సహజ వనరులపై ప్రవేటు కంపెనీల గుత్తస్వామ్యాన్ని ఆమోదించడానికే తన మొగ్గు అని తాజా తీర్పులో స్పష్టం చేసింది. సల్వా జూడుం లాంటి ప్రభుత్వ కిరాయి సైన్యాలతోనూ, రణవీర్ సేన లాంటి పచ్చినెత్తురు తాగే ప్రవేటు సైన్యాలతోనూ, అడవులనుండి గిరిజనులను మూకుమ్మడిగా తరిమి కొట్టి మరీ అటవీ వనరులను కొల్లగొడుతున్న స్వదేశీ, విదేశీ ప్రవేటు పెట్టుబడిదారీ కంపెనీలకు సుప్రీం కోర్టు తీర్పు తపస్సు లేకుండానే ప్రత్యక్షమైన దేవుడి వరమే.

నిజానికి సుప్రీం కోర్టు తీర్పు మరొకలా ఉన్నా స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీల విచ్చలవిడి దోపిడీకి అది పెద్ద ఆటంకమేమీ కాబోదు. కోర్టు తీర్పులను ఉల్లంఘించే అనేక మార్గాలు ప్రభుత్వాలకూ, కంపెనీలకు అందుబాటులో ఉన్నాయి. ‘అయితే కోర్టు తీర్పులను ఉల్లంఘించారు’ అని చెప్పే అవకాశం కూడా ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకూ ఇపుడు లేకుండా పోయింది. ఇక సామ్రాజ్యవాద, భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలకు సహజవనరులను చట్టబద్ధంగా కొల్లగొట్టే స్వేచ్ఛ లభించినట్లే.

7 thoughts on “వేలం పద్ధతే గీటురాయి కాదు, సహజ వనరుల దోపిడీకి సుప్రీం కోర్టు బాసట!

  1. సుప్రీం తీర్పును పెట్టుబడిదారులు తమకు అనుగునంగా తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నట్లుంది. తీర్పులో ఏ ప్రభుత్వ విధానానికైనా ఉమ్మడి ప్రయోజనం (common good) మాత్రమే గీటురాయి అని సుప్రీం తీర్పు పేర్కొంది. అంటే ప్రజల ప్రయోజనాలను విస్మరించమని కాదు.
    వేలం వేయడం ద్వాదా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నపుడు వేలం విధానమే ముఖ్యం. అలా కాకుండా వేలం వేయాల్సిన అవసరం లేదన్నపుడు మాత్రమే ఆవిధానాన్ని ప్రక్కన పెట్టండని సుప్రీం చెప్పినట్టు మనం భావించాలి. అయితే మన అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తాయని అనుకోవలసిన పనిలేదు. ఈరోజు హిందూ, ప్రజాశక్తి లాంటి పత్రికలు చదివితే సుప్రీం కోర్టు తీర్పు అంత భయపడవలసినది కాదు అని అర్థం అవుతుంది. కాని పైన తెలిపిన మీడియా మాత్రం సుప్రీంతీర్పును పెట్టుబడిదారులకు అనుగుణంగా ఉందని ప్రచారం చేయడం సరిఅయినది కాదు. అందుకే మనం ప్రత్యామ్నాయ మీడియాపై ఆధారపడడం లేదా తీర్పుని చదివి మన స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం మంచిది.

  2. అసలు వేలం విధానం అంటే ఏమిటి? ట్రైన్‌లో ప్యాంట్రీ కార్ నుంచి సప్లై చేసే బిర్యానీ ధర ఎక్కువగా ఉంటుంది, దాని పరిమాణం తక్కువగా ఉంటుంది. వేలం పాటలో ప్యాంట్రీ కార్ కాంట్రాక్ట్ కొన్నవాడు ఆ ఖర్చుని రికవర్ చేసుకోవడానికి బిర్యానీయే కాదు, బ్రేక్‌ఫాస్ట్ కూడా ఎక్కువ ధరకే అమ్ముతాడు. అలాగే వేలం పాటలో బొగ్గు గనులు కొన్నవాడు కూడా ఆ ఖర్చుని రికవర్ చేసుకోవడానికి బొగ్గుని ఎక్కువ ధరకి అమ్ముతాడు లేదా ఎక్కువ ధర వచ్చే విదేశాలకి ఎగుమతి చేస్తాడు.

  3. వేలం పాటలో బొగ్గు గనిని కోట్ల ధరకి కొన్నవాడు ఆ డబ్బుని ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాడు? శ్రామికులని దోచుకోగా మిగిలిన అదనపు విలువ నుంచే కదా. ఆ రకంగా పాలకవర్గంవాళ్ళు ఆదాయం పెంచుకునేది శ్రామికుల శ్రమ నుంచే.

  4. ఈ యింగిత జ్ఞానం ఆ BJP వాళ్ళకెందుకుండదు? ఈ లైసెన్సుల నిర్వహణలో ఏవిధమైన అవినీతి జరగకుడా వుండేలా ఒక వ్యవస్థ వుండాలి. అది నిరంతరం వీటి మీద కంగాణింపు చేస్తూవుండాలి. ఏదైనా దొరికితే తత్కాలికంగా దాన్ని నిలిపివేసి విచారణ జరిపించాలి విచారణలో అవకతవకలు కనబడితే ఆ వ్యక్తి సంస్థ మరింక వ్యాపారం చెయ్యలేకుండా చెయ్యాలి. వాళ్ళకు కఠినాతికఠిన మైన శిక్ష వెయ్యాలి. ఇది జరగవలసినది. ఇంత పని చెయ్యడానికి మన సమాజనికే ఏకాభిప్రాయం వుందా? మన పార్టీలు ప్రభుత్వాలకు ఆ నిబద్దత వుందా? అవిలేనన్నాళ్లు మన మాట్లాడుకుంటున్నదంతా సొదే!

  5. వేలం పాట ద్వారా బొగ్గుగనిని కొన్నవాడు ఆ ధరని తరువాత మళ్ళీ రాబట్టుకొంటాడు. ఇక్కడ మనం చూడవలసింది ప్రభుత్వ రంగంలో ఉన్న బొగ్గు గనుల పరిశ్రమకు కేటాయింపులు చేయకుండా ప్రైవేటు వారికి కేటాయించే సమయంలో అనుసరించాల్సిన పద్దతి గురించి మాట్లాడుకుంటున్నాం. బెంగాళ్ ప్రభుత్వం కూడా బొగ్గుగనుల కేటాయింపులకు సిఫారస్ చేసింది. కాని అది ప్రభుత్వరంగ పరిశ్రమలకు. ప్రభుత్వరంగంలోని పరిశ్రమలకు కావలసినంత కేటాయింపులు చేసిన తరువాతనే ప్రైవేటు రంగానికి కేటాయింపులు చేయాలి. అదీ ప్రభుత్వరంగానికి ఏ విధంగా కేటాయిస్తున్నారో అంతకన్న తక్కువ ధరకు కేటాయించకూడదు. 2జి కేటాయింపులు ఎలా జరిగాయి? ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ ఎన్ ఎల్ కు కేటాయింపులను ప్రక్కన పెట్టి, ప్రైవేటు వారికి అక్రమంగా కట్టబెట్టలేదా? అదే విధానం కోల్గ్ గేట్ లో కూడా జరిగిందనేది వాస్తవం. ఆకోణం లోంచి చర్చంచాల్సిందే తప్ప సోది అనుకోవడం సరికాదు.

  6. కోట్లు ఖర్చు పెట్టి బొగ్గు గనిని వేలం పాటలలో కొన్నవాడు బొగ్గుని ఎక్కువ ధరకి అమ్మే ఖర్చుని రాబట్టుకుంటాడు. వేలం పాట వల్ల వ్యాపారికి నష్టం లేదు. ధరలు పెరిగితే నష్టపోయేది ప్రజలు. ఆ విషయం నేను ప్యాంట్రీ కార్ – బిర్యానీ ఉదాహరణతో సహా చెప్పాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s