గ్రీసు ప్రజలు మరోసారి రోడ్డెక్కారు. పాత ప్రభుత్వం విధానాలనే కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించడం పట్ల ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. త్రయం (troika) గా పిలిచే యూరోపియన్ యూనియన్ (ఇ.యు), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇ.సి.బి), ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా విధించిన నూతన షరతులను ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడడం పట్ల దేశవ్యాపిత నిరసనలకు పూనుకున్నారు. త్రయం ఆదేశాల మేరకు కొత్త ప్రభుత్వం విధించ తలపెట్టిన 11.5 బిలియన్ యూరోల (15 బిలియన్ డాలర్లు) కోతలను మూకుమ్మడి నిరసన పోరాటాల ద్వారా తిరస్కరించారు. అయితే, జూన్ లో అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వం ప్రజల నిరసనలను అణచివేయడానికే మొగ్గు చూపింది.
గ్రీసులోని రెండు అతి పెద్ద ట్రేడ్ యూనియన్లు బుధవారం సమ్మెకు పిలుపిచ్చినట్లు ‘ది హిందూ’ తెలిపింది. దేశంలోని మొత్తం కార్మికుల్లో సగం మందికి ఈ యూనియన్లు ప్రతినిధ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్కూళ్ళు, కాలేజీలు, ఎయిర్ ట్రాఫిక్, పోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు సమ్మె దెబ్బను ఎద్ర్కోన్నాయి. మ్యూజియంలు, ప్రధాన ప్రాచీన సందర్శనా స్ధలాలను టూరిస్టులు సందర్శించలేకపోయారు. షాపులు మూతబడ్డాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మూడు గంటల సమ్మె ప్రకటించడంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దవడమో రీషెడ్యూల్ కావడమో జరిగింది. పెట్రోల్ స్టేషన్లు రోజులో అత్యధిక కాలం పాటు మూతపడ్డాయి. డాక్టర్లు కూడా సమ్మెలో చేరడంతో ఎమర్జెన్సీ సేవలు తప్ప ఇతర విభాగాలు మూతపడ్డాయి. రాజధాని ఏధెన్స్ లోనూ, పోర్టు నగరం ధెస్సలోనికి లోనూ వేలాది డాక్టర్లు, ఇతర సిబ్బంది రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.
యూరోపియన్ ఋణ సంక్షోభంలో గ్రీసు మొట్టమొదటి బాధితురాలు. గ్రీసు ఆర్ధిక వ్యవస్ధ బాగోలేదనే సాకుతో అంతర్జాతీయ ప్రవేటు బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలు ఆదేశానికి ఋణం ఇవ్వడం మానేశాయి. గ్రీసు ప్రభుత్వం జారీ చేసే సావరిన్ ఋణ బాండ్లను కొనుగోలు చేయడం ఆపేశాయి. గ్రీసు మోస్తున్న ఋణ భారంలో అత్యధిక భాగం ఆ దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు, ప్రవేటు బ్యాంకులకు, యూరోపియన్ ద్రవ్య సంస్ధలకు దోచిపెట్టినవే తప్ప ప్రజలకు ఏమాత్రం పాత్రలేదు. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించే పేరుతో అందినకాడికి అప్పులు తెచ్చి సంక్షోభానికి కారకులైన బడా ద్రవ్య సంస్ధలకు, కార్పొరేట్ కంపెనీలకు బిలియన్ల కొద్దీ యూరోలను బెయిలౌట్లుగా పంచిపెట్టారు. అలా కంపెనీలకు పంచి పెట్టిన బెయిలౌట్లు తీర్చడానికి గ్రీసు కొత్త అప్పులు చేయవలసి వచ్చింది. అప్పులు పుట్టకపోవడంతో ఇ.యు, ఇ.సి.బి, ఐ.ఎం.ఎఫ్ ల త్రయం అంతర్జాతీయ బెయిలౌట్లు ప్రకటించి ఆ పేరుతో గ్రీసు ప్రజల నడ్డివిరిచే విషమ షరతులను విధించాయి.
గత రెండేళ్లుగా గ్రీసుకు త్రయం అందజేసిన బెయిలౌట్ లో అత్యధిక భాగం తిరిగి యూరోపియన్ దేశాలకే చేరింది తప్ప గ్రీసు ప్రజలకు చేరలేదు. అంతర్జాతీయ బెయిలౌట్ పేరుతో గ్రీసు ప్రభుత్వానికి అప్పులిచ్చిన ఇ.యు, ఇ.సి.బి, ఐ.ఎం.ఎఫ్ లు ఆ మొత్తాన్ని పాత అప్పులకింద జమ చేసుకున్నాయి. కానీ అప్పులతోపాటు రుద్దబడిన పొదుపు విధానాల షరతులు మాత్రం గ్రీసు ప్రజల ఆదాయాలను, వేతనాలను, సదుపాయాలనూ పెద్ద మొత్తంలో హరించివేస్తున్నాయి. రెండేళ్ళుగా అమలవుతున్న పొదుపు విధానాల ఫలితంగా గీసు జి.డి.పి 25 శాతానికి పైగా పడిపోయింది. అంటే తమ పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు ఇచ్చిన యూరోపియన్, అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు, ద్రవ్య సంస్ధలు అప్పుల మాటున తీవ్రమైన మాంద్యాన్ని గ్రీసుపై రుద్దాయన్నమాట!
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఫలితంగా గ్రీసులో రాజకీయ సంక్షోభం సంభవించి గత జూన్ లో ఎన్నికలకు దారి తీసింది. గ్రీసు పరిస్ధితి దిగజారడానికి ఆ దేశం సొంత కరెన్సీ రద్దు చేసుకుని యూరో ను ఉమ్మడి కరెన్సీ గా స్వీకరించడం ఒక కారణం. అయితే యూరో జోన్ లో కొనసాగడం వల్లనే గ్రీసు తన సంక్షోభాన్ని అధిగమించగలదని కార్పొరేట్ పత్రికలు ఊదరగొట్టడంతో యూరో జోన్ నుండి బైటికి రావాలన్న పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించలేకపోయాయి. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడికి దాసులైన రాజకీయ పార్టీలకు గ్రీసు ప్రజలు మరొకసారి ఓట్లు వేసి గెలిపించడంతో గ్రీసు జనం మరో విడత పొదుపు విధానాలను పీకలమీదికి తెచ్చుకున్నారు. ఇప్పటికే 25 శాతం నుండి 50 శాతం వరకూ వేతనాల్లో, పెన్షన్లలో కోతలు ఎదుర్కొంటున్న గ్రీసు కార్మికులు, ఉద్యోగులు తమ ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త బెయిలౌట్ వలన మరో విడత కోతలను, రద్దులను ఎదుర్కోబోతున్నారు. దాని ఫలితంగానే గ్రీసు ప్రజలు మళ్ళీ వీధి పోరాటాలకు తెగబడ్డారు.
అంతర్జాతీయ ద్రవ్య సంస్ధలు, వాల్ స్ట్రీట్ కంపెనీలు, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్, తదితర దేశాల కార్పొరేట్ ప్రభుత్వాలు దశాబ్దాలుగా సాగిస్తున్న నిలువు దోపిడీని భరించలేక వీధులకెక్కిన గ్రీసు ప్రజలను బి.బి.సి లాంటి పత్రికలు అరాచకవాదులుగా అభివర్ణిస్తున్నాయి. పార్లమెంటుకు సాగిన ప్రదర్శనలో ప్రజలు హింసాత్మక చర్యలకు దిగారని, పెట్రోల్ బాంబులు విసిరారని చెబుతూ వీటిని అరాచక చర్యలుగా బి.బి.సి అభివర్ణించింది. ప్రభుత్వాలు, కంపెనీలు సాగిస్తున్న నిలువు దోపిడీని మాత్రం దేశ ప్రజలకు అత్యవసరంగా ఈ పత్రికలు చెబుతున్నాయి.
బి.బి.సి ఇచ్చిన సమాచారం ప్రకారం గ్రీసుకి మరో 31 బిలియన్ యూరోల బెయిలౌట్ వాయిదా ఇవ్వనున్నారు. అయితే ఈ మొత్తం తిరిగి ఋణ దాతలకు మాత్రమే చేరుతుంది. దానితో పాటు వచ్చే మరో విడత కోతలు మాత్రం గ్రీసు ప్రజల నెత్తిపై రుద్దుతారు. ఈ నెల మొదటివారంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం గ్రీసు నిరుద్యోగం 24.4 శాతంగా నమోదయింది. పొదుపు విధానాలు మూడువంతుల మంది గ్రీసు ప్రజలు దారిద్ర్య రేఖ దిగువకు నెట్టాయి. కొత్త ప్రధాని ఆంటోనిస్ సమరాస్ పెన్షన్లలో మరిన్ని కోతలు పెట్టడానికి పదవీవిరమణ వయసును 67 సంవత్సరాలకు పెంచడానికి సిద్ధపడుతున్నాడు. ‘త్రయం’ విధించిన షరతుల అమలుకు రెండేళ్లు గడువుని ప్రధాని కోరుతున్నప్పటికీ దానివల్ల మరో 15 బిలియన్ యూరోల భారం ప్రజలపై మోపడమే తప్ప ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వం తలపెట్టిన కొత్త కోతలు అన్యాయమనీ, పేదలపై మరింత భారం మోపడమేననీ 90 శాతం మంది ప్రజలు భావిస్తున్నట్లు ఒక సర్వేలో (బి.బి.సి) తేలడాన్ని బట్టి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత అర్ధం చేసుకోవచ్చు.
యూరో జోన్ నుండి గ్రీసు బయటికి వచ్చినట్లయితే దేశ ఆర్ధిక వ్యవస్ధను పునర్నిర్మించుకోవడానికి అవకాశం వస్తుందని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. అయితే గ్రీసు దేశం యూరోను ఉమ్మడి కరెన్సీ గా రద్దు చేసుకున్నట్లయితే ఆ ప్రభావం ఇతర దేశాలపై కూడా పడడం ఖాయం. ఆ ప్రభావం ప్రజలపై పడేదేమీ కాదు. యూరో జోన్ విచ్ఛిన్నం అయినట్లయితే సభ్య దేశాలు తమ ఆర్ధిక సార్వభౌమత్వాన్ని కొద్దిమేరకయినా తిరిగి పొందగలవన్నది నిజం. ఆర్ధిక యూనియన్ వలన యూరోపియన్ దేశాల బహుళజాతి కంపెనీలు తప్ప లాభపడినవారెవ్వరూ లేరు. వీసాల రద్దు రూపంలో, ప్రయాణాల ఆంక్షల రద్దు రూపంలో కొద్ది పాటి విద్యా, సాంస్కృతిక ఫలితాలు ప్రజలకు లభించినప్పటికీ అది రాజకీయ యూనియన్ అయిన యూరోపియన్ యూనియన్ వల్ల వచ్చిన ఫలితం తప్ప యూరో వల్ల వచ్చినది కాదు. బ్రిటన్ దేశం యూరోజోన్ లో సభ్య దేశం కాదని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. బహుళజాతి కంపెనీలు, వారి సేవకులైన ప్రభుత్వాలు రుద్దే మానిటరీ యూనియన్లు కంపెనీలకే లాభం తప్ప ప్రజలకు కాదని యూరోజోన్ చరిత్ర చాటి చెబుతున్న సత్యం.
విశెఖర్ గారూ. ఈ మద్యకాలంలొ నేను మీ బ్లాగును అణుసరిస్తున్నాను.
యక్కడైనా సందేహాలు వచ్చినప్పుడు మిమ్మలను అడగాలనుకుంటున్నాను. మీరేమీ
అనుకొకండి.
బెయిలౌట్ అంటె ఎమిటొ చెప్పమని కొరుచున్నాను.
షణ్ముగ గారూ,
ఆర్ధిక రంగంలో ‘బెయిలౌట్’ అనే పదం ఆర్ధిక సంక్షోభ కాలంలో ఎక్కువగా వినపడుతుంది.
ఈ ఆర్టికల్ పరిధిలో తీసుకుంటే: యూరప్ లో గ్రీసు, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ తదితర దేశాల అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు ఎక్కువై, తీర్చలేని పరిస్ధితి వచ్చినపుడు కొత్త అప్పులు ఇచ్చేవారు వెనకాడడం తెలిసిన విషయమే. ఆ కారణంతోనే ఈ దేశాలకి అప్పులు పుట్టని పరిస్ధితి వచ్చింది. అంటే ఈ దేశాల ప్రభుత్వాలు జారీ చేసే అప్పు బాండ్లను కొనడానికి మదుపుదారులు (ప్రవేటు బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫండ్స్, ఇతర దేశాల ప్రభుత్వాలు మొ.) ఎక్కువ వడ్డీ డిమాండ్ చేస్తారు. ఎక్కువ వడ్డీ పెట్టి అప్పులు తీసుకుంటే అది దేశ ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతింటుంది.
అటువంటి పరిస్ధితి నివారించడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, ఐ.ఎం.ఎఫ్ (ఈ మూడింటిని ట్రొయికా అంటున్నారు) లు రుణ పీడిత యూరప్ దేశాల కోసం ఒక నిధిని ఏర్పరిచి దాన్నుండి సరసమైన వడ్డీకి అప్పులు ఇస్తున్నాయి. ఆ విధంగా రుణ పీడిత దేశాలను ఆదుకోవడం కోసం ట్రొయికా ఇచ్చే అప్పులని బెయిలౌట్ అంటున్నారు.
ఒక ఆర్ధిక ప్రమాదం నుండి బయటపడేయడానికి ఉద్దేశించింది గనక ఈ నిధిని ‘బెయిలౌట్ నిధి’ అంటున్నారు. ఈ విధమైన సాయాన్ని (అప్పును) క్లుప్తంగా ‘బెయిలౌట్’ అంటున్నారు. పేరుకి సాయమే అయినా, ఆర్టికల్ లో చెప్పినట్లు, ఈ అప్పులు తీసుకున్న దేశాలు మరింత సంక్షోభంలో కూరుకుపోవడానికే దారి తీస్తోంది. బెయిలౌట్ ఇచ్చేటపుడు ప్రవేటీకరణ, వేతనాల కోత, పెన్షన్ల కోత, సంక్షేమ సదుపాయాలు తగ్గింపు లాంటి విషమ షరతులు విధించడమే సంక్షోభం ఇంకా ముదరడానికి కారణం.
sekhar gaaru thanks