12 మృగాలు దళిత బాలికపై అత్యాచారం చేసి, వీడియో తీసి…


మృగాలు సైతం చీదరించుకునే మానవ మృగాల అకృత్యం హర్యానాలో వెలుగు చూసింది. కోరిక తీర్చమన్న మృగ సమానుడి వికృత తృష్ణను నిరాకరించినందుకు 11 మంది సో కాల్డ్ అగ్రకుల మృగాలబారిన పడి సామూహిక అత్యాచారానికి గురయింది. వేంపైర్ రక్తం అవసరం లేని తోడేళ్ళు తమ నీచ కృత్యాన్ని వీడియో తీసాయి. అత్యాచారం విషయం బైటికి చెబితే వీడియో అందరికీ పంచుతామని, చంపేస్తామనీ బెదిరించాయి. ఫలితంగా 16 సంవత్సరాల దళిత బాలిక అత్యాచారం గురించి కుటుంబానికి కూడా చెప్పుకోలేక పది రోజుల పాటు కుమిలిపోయింది. తీరా చెప్పుకున్నాక తండ్రి ఆత్మహత్యను కళ్ళజూడవలసి వచ్చింది.

భారత దేశానికి హరిత విప్లవాన్ని చవి చూపిన హర్యానా రాష్ట్రం, హిసార్ వద్ద దబ్రా గ్రామంలో ఈ దుర్మార్గం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 9 తేదీన జరిగినప్పటికీ వీడియో భయంతో అత్యాచారం గురించి 12వ తరగతి చదువుతున్న బాలిక పైకి చెప్పుకోలేకపోయింది. పది రోజుల పాటు మానసిక హింసను అనుభవించిన బాలిక చివరికి సెప్టెంబర్ 19 తేదీన  కూలి అయిన తండ్రికి చెప్పింది. పోలీసు స్టేషన్ లో చెప్పినప్పటికీ ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారని ‘ఇండియా టుడే’ పత్రిక తెలిపింది.

ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రకారం బాలిక తండ్రి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చెయ్యడంతో ఆ విషయం నిందితుల కుటుంబాల వరకూ చేరింది. అయితే వారు న్యాయం చేసే బదులు బాలిక కుటుంబాన్ని బెదిరించారు. పోలీసులకి చెబితే వీడియోలు అందరికీ చూపుతామని బెదిరించారు. దానితో భవిష్యత్తుని తలచుకుని భయభ్రాంతుడైన బాలిక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురికి తోడు నిలిచే కర్తవ్యాన్ని విస్మరించి పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవడం అతను ఎదుర్కొన్న సామాజిక ఏకాకితనం తీవ్రతను తెలియజేస్తున్నది. కారణం ఏదైనా ఆత్మహత్యతో తన కుటుంబానికి రెట్టింపు దుఃఖాన్ని మిగిల్చాడు.

తండ్రి ఆత్మహత్య తర్వాత మాత్రమే దళిత బాలిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది. అసలు ఫిర్యాదు స్వీకరించడానికే నిరాకరించడం ద్వారా, పోలీసులు తమ అగ్రకుల పక్షపాతాన్ని నిస్సిగ్గుగా చాటుకున్నారు. తండ్రి శవంపై పోస్టుమార్టం చేయడానికి గ్రామ దళితులు నిరాకరించారు. దోషుల్ని పట్టుకుని అరెస్టు చేసేదాకా శవాన్ని ఇవ్వబోమని చెప్పి శవంతో ఆందోళన ప్రారంభించారు. ఇతర దోషుల్ని పట్టుకుని తీరతామని డిప్యూటీ కమిషనర్ అమిత్ కుమార్, జిల్లా ఎస్.పి బాలన్ లు హామీ ఇవ్వడంతో చివరికి పోస్టుమార్టానికి ఒప్పుకున్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. పోస్టుమార్టం తర్వాత ఆదివారం అంతిమక్రియలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసిన ఒక నిందితుడు జాట్ కులానికి చెందిన భూస్వామి పుత్రరత్నం అని పత్రికలు తెలిపాయి. పోలీసులు నేర్చుకున్న చట్టాలు కాకుండా, బాధితురాలి తండ్రి ఆత్మహత్య మాత్రమే పోలీసులని కదిలించడాన్ని బట్టి అధికార వ్యవస్ధ ఎవరి పక్షమో తెలుస్తోంది.

“వాళ్ళు మా అమ్మాయిపైన గ్యాంగ్ రేప్ చేశారు. నేరాన్ని వీడియోలో చిత్రీకరించారు. అత్యాచారాన్ని బైటపెడితే చంపేస్తామని బెదిరించారు. వాళ్ళంతా హంతకులు. అమ్మాయి తండ్రి బలవంతంగా తనను చంపుకోక తప్పని పరిస్ధితిని కల్పించారు” అని బాలిక బాబాయి చెప్పాడని ఐ.బి.ఎన్ లైవ్ తెలిపింది. “తన కూతురు గ్యాంగ్ రేప్ కి గురి కావడంతో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అత్యాచారం పై ఫిర్యాదు అందలేదు” అని ఎస్.పి బాలన్ చెప్పాడని సదరు చానెల్ తెలిపింది. ఫిర్యాదు ఇచ్చినపుడు తీసుకోకుండా, ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పడానికి సైతం జిల్లా పోలీసు ఉన్నతాధికారి తెగించాడు. పోలీసుల నిష్క్రియాపరత్వాన్ని దాచిపెట్టుకోవడానికీ, అగ్రకుల పక్షపాతాన్ని కప్పిపుచ్చుకోవడానికీ ఎస్.పి ప్రకటన బాగా ఉపయోగపడుతుంది.

బాలల హక్కుల జాతీయ కమిషన్ ఘటనపై స్పందించింది. “ఎన్.సి.పి.సి.ఆర్ ఈ కేసును పరిశోధించడానికి బృందాన్ని పంపుతుంది. పాలనావ్యవస్ధ నుండీ, పౌర సమాజం నుండీ మద్దతు దొరక్కపోవడంతో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకోక తప్పలేదు. డి.జి.పి తో మాట్లాడాను. వేగంగా ఎంక్వైరీ చేయాలని చెప్పాను. రేపు మా బృందాన్ని కూడా పంపిస్తాము” అని కమిషన్ ఛైర్మన్ నీనా నాయక్ చెప్పిందని ఐ.బి.ఎన్ తెలిపింది.

రిజర్వేషన్లు అనగానే ప్రతిభ కోసం గగ్గోలు పెట్టే ప్రతిభావాదులు హర్యానా బాలిక ఎదుర్కొన్న వ్యవస్ధాగత అణచివేతకు కారణాలు వెతకాలి. వెతికి ఊరుకోవడమే కాకుండా ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, విద్య… ఇలా సమస్త రంగాల్లో దళితులు ఎదుర్కొంటున్న వివక్షకు పరిష్కారం చెప్పాలి. కాలేజీ సీటుకి రిజర్వేషన్ కోరినపుడో, ఉద్యోగంలోనూ, ప్రమోషన్ లోనూ రిజర్వేషన్ కోరినపుడో ప్రతిభ నాశనం అయిపోతోందంటూ గగ్గోలు పెట్టడం చాలా చాలా తేలిక. మతసిద్ధాంతాలు, సూత్రాలూ చెప్పి సామాజిక జీవనం మెరుగుదలకి ఏమాత్రం ఉపయోగపడని డొల్లుపుచ్చకాయ కబుర్లు చెప్పడం కూడా తేలికే. దళితుల దుస్ధితిని పూర్వజన్మ పాపంగా తేల్చిన గీత, బైబిల్,  ఖురాన్ ల బోధలు వల్లించడమూ తేలికే. తరతరాలుగా ఒక హక్కుగా సంక్రమించిన అగ్రకుల అభిజాత్యాన్ని వదులుకుని కులాతీతంగా (de-castify) మారి సామాజిక విశ్లేషణ చేయడమే కాక అందుకు కట్టుబడి ఉండడమే కష్టమైన పని.

సహస్రాబ్దాల దాస్యరికం అనుభవించిన దళితులకి ఈ దేశంలో సెంటు భూమి లేదు. భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలకు సేవలు చేసి పైకి చేరిన వేళ్ళతో లెక్కించగల కొద్ది మంది దళిత ధనికులు దళితులకి ప్రతినిధులు కాజాలరు. భూసంస్కరణల చట్టాలు పిల్లికీ, కుక్కకూ భూముల్ని రాసివడానికి ఉపయోగపడ్డాయే తప్ప పేదలకు, దళితులకి భూమి పంచిన పాపాన పోలేదు. కూలి దాస్యంనుండి విముక్తి ఇవ్వలేదు. భూములు లేని దళితులు కనేది కూలీలనే తప్ప భూస్వామ్యులనూ, పెట్టుబడుదారులనీ కాదు. చదువు’కొనగల’ గుమాస్తాలనీ, డాక్టర్లనీ, ఇంజనీర్లను కూడా దళితులు కనలేరు. అలాంటి దళితులకి పలుకుబడులు, రికమండేషన్లు ఉండవు. డొనేషన్ల గురించి ఆలోచించే తాహతు కూడా ఉండదు. ఇక వారికి ప్రతిభ ఎక్కడినుండి రావాలి? ప్రతిభను సంపాదించగల అన్నీ అవకాశాలు మూసేసి ప్రతిభ సంపాదించాలని చెప్పడం దళితుల చరిత్రని అపహాస్యం చెయ్యడమే.

దళితుడు ప్రతిభని సంపాదించే వీలులేని కుల దురహంకార వ్యవస్ధే హర్యానా బాలికపై వికృత కార్యానికి పురికొల్పింది. దళితురాలు గనక ఏ అత్యాచారం చేసినా అడిగేనాధుడు ఉండడన్న నమ్మకాన్ని దబ్రా గ్రామ మృగాలకి మన పాలనా వ్యవస్ధ కల్పించింది. ఫిర్యాదు తీసుకోవడానికి కూడా నిరాకరించిన పోలీసు ఠాణా దానికి చక్కటి రుజువు. గ్రామస్ధుల గొడవతో, నిరసన ప్రదర్శనతో పోలీసు యంత్రాంగం కొద్దిగా కదిలినప్పటికీ, బాలికకి న్యాయం దక్కేవరకూ పని చేస్తుందన్న నమ్మకం లేదు. కోరిక తీర్చడానికి నిరాకరించినందుకు మరో 11 మందితో కలిసి అత్యాచారానికి పాల్పడగల తెంపు ఈ దేశంలో అగ్రకుల దురహంకారికి మాత్రమే సొంతం. 

బాలిక అయినందున శీలంతో ముడిపడి ఉన్న వివాహం ఆమె దరిచేరదు. ఇపుడా బాలిక పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతూ, మరో కొన్ని సంవత్సరాల పాటు న్యాయాన్ని అడుక్కుంటూ బతకాలి. అత్యాచారం విషయం తండ్రికి ఎందుకు చెప్పానా అని కుములుతూ బతకాలి.

కుల దురహంకారం, పురుష దురహంకారం, రెండూ జమిలిగా చేసిన దాడిలో హర్యానా బాలిక బతుకు ఛిద్రమైంది.

18 thoughts on “12 మృగాలు దళిత బాలికపై అత్యాచారం చేసి, వీడియో తీసి…

 1. మృగాలకు కులాలేమిటి ? అన్ని కులాలోనూ ఈ పిచ్చికుక్కలున్నాయి. కాల్చిచంపటమే ఇలాంటి విషాధాలకు,విబేధాలకు కారణమయ్యే జంతువులకు అర్ధమయ్యే భాష

 2. దుర్గేశ్వర గారు,

  “మృగాలకు కులాలేమిటి?”

  ఇది నిజమైతే బాగు. కాని ప్రతిభకి కులాలున్నపుడు మానవ మృగాలకి మాత్రం ఎందుకుండవు? కాగా, సామూహిక అత్యాచారం ఒక మృగ లక్షణం అయితే, కుల దురహంకారం కూడా అలాంటి లక్షణమే. కాదంటారా?

  కుల దురహంకారం జోలికి పోకుండా, సామాజిక అనివార్య పరిస్ధితుల వలన, సాంస్కృతిక సంబంధాల వలన కులాల రొంపిలోకి అమాయకంగా కొట్టుకుపోయే వారికి నా వ్యాఖ్యలు వర్తించవని విన్నవించుకుంటున్నాను. అగ్రకులాల్లో పుట్టినవారందరికీ నా వ్యాఖ్యలు వర్తించవని కూడా నా విన్నపం. కుల దురహంకారులకు మాత్రమే, కేవలం కుల దురహంకారులకు మాత్రమే నా వ్యాఖ్యలు వర్తిస్తాయి.

  మీరు చెప్పిన పరిష్కారం అవసరం రాకూడదని నా కోరిక. మనుషులం కనుక మనల్ని మనం సంస్కరించుకునే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి.

 3. పిచ్చికుక్కలని ఏం చేస్తారో, వీళ్ళని కూడా అదే చెయ్యాలి.
  మనిషి కూడా జంతువే , ఒక జంతువూ మృగంగా మారి జనాల మీద పడితే ఏం చేస్తారు, కాల్చి చంపుతారు.
  ఇక్కడ కూడా అదే చెయ్యాలి. ఈ మనవ హక్కులు అని అరిచే వాళ్ళంతా అమాయకులకి మద్దతివ్వాలి కాని ఇలాంటి వాళ్లకి కాదు.
  వీళ్ళ మర్మంగాలని కొస్తే, ఇలా ఆలోచించడానికి కూడా ఇంకొకలు భయపడతారు.
  మనదేశం లో ఉన్న అత్యంత దరిద్రం ఇదే, మన న్యాయ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం. నలుగు , అయిదు దేశాల నుండి కాపి కొట్టుకుని వచ్చి రాసుకున్నాం తప్పితే మనకి ఎలా ఉండాలో రాసుకోలేదు.
  ఇలాంటి వాటిలో, కులం , మతం అంటూ ఉండకూడదు.

 4. ఆడవాళ్ళ పైన అత్యాచారం చేసే వాళ్ళ ను ఏమి చేసినా పాపం లేదు..అలాంటి వాళ్ళను సౌది లో లా నడి రోడ్డు లో నిలపెట్టి అంగాన్ని నరికి పారెయ్యాలి..
  ఇటువంటి జంతువులు అన్ని కులాల్లో అన్ని మతాల్లో వున్నాయి.. మీవాదనే నిజమైన పక్షంలో భారత దేశం లో అత్యాచార భాదితులు దళితులే.. అంతేనా..?
  కానీ మీ బాధ ఆ అమ్మాయి గురించా,రిజర్వేషన్ల గురించా అర్ధం కావడం లేదు..
  ఎన్ని రిజర్వేషన్లు ఇస్తే ఆడవాళ్ళ పైన అత్యాచారాలు ఆగుతాయి..రిజర్వేషన్లు అమలు మొదలయ్యి యాభై ఏళ్ళు గడిచాయి..ఇంకో ఐదు వందల ఏళ్ళు గడిచినా ఎవరూ మేము అభివౄద్ది చెందాము మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పరు. sc లల్లో అడుగున వున్న మాదిగలు మాకు వర్గీకరణ కావాలి అని అడుగుతుంటే బాగా అభివ్రుద్ది చెందిన మాలలు మాత్రం సమైక్యంగా వుంచాలని పోరాడుతున్నారు.
  కులప్రాతిపదికన దాడుల్లాంటివి జరిగితే ఎదుర్కోవడానికి SC ST attrocity చట్టాలున్నాయి కదా.. ఎక్కదో కొన్ని పల్లెల్లో వివక్ష చూపుతున్నరని బూచిని చూపి ఉద్యోగలన్నీ తమకే దోచి పెట్టాలనే తమ వాదన ఎంత దరిద్రంగా వుందో ఒక్కసారి ఆలోచించుకోండి…

 5. Correcte kada visekhara garu..nenu chela kaalamga chustunnanu..,meeru maree ekkuvaga kulam gurimche post chestunnaru..,Economic backwordness anedi importent alaa ani SC Ayite chalu M.P. Ayina M.L.A. Ayina venukabadina vare amte ..,imta prapamcha gnam telsi…meeru chestunnademiti..?So..Economic backwordness consider cheyyalani naa Request..@Kiran DSP KKD

 6. Do you really think that forward caste people really consider the problem of economical backwardness?

  దళితులతో పోలిస్తే అగ్రకులాలవాళ్ళలో చదువుకున్నవాళ్ళు ఎక్కువ. రిజర్వేషన్‌ల వల్ల అగ్రకులాలవాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి కనుక రిజర్వేషన్‌ల విధానం అగ్రకులాలవాళ్ళకి నచ్చదు.

  కులంతో సంబంధం లేకుండా అన్ని కులాలలోనూ పేదవాళ్ళతో పోలిస్తే డబ్బున్నవాళ్ళలో చదువుకున్నవాళ్ళు ఎక్కువ. కుల రిజర్వేషన్‌లని రద్దు చేసి ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్‌లని ఏర్పాటు చేసి, దొంగ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు కూడా లేకుండా strict rules పెడితే అన్ని కులాలలోని డబ్బున్నవాళ్ళకీ అవకాశాలు తగ్గిపోతాయి. ఈ రకం రిజర్వేషన్‌లకి అగ్రకులాలలోని డబ్బున్నవాళ్ళూ ఒప్పుకోరు, దళితులలోని డబ్బున్నవాళ్ళు కూడా ఒప్పుకోరు. డబ్బున్న దళితులు reverse direction చేపట్టి వెనుకబాటుతనం అనేది కులం వల్ల పుట్టింది అని వాదిస్తారు కానీ వెనుకబాటుతనం వల్లే కులం పుట్టిందనే నిజాన్ని మర్చిపోతారు. అగ్రకులాలవాళ్ళైతే అసలు కుల అసమానతలే లేవంటారు, అన్ని కులాలూ సమానమేనంటారు. ఎవరు ఎలా మాట్లాడినా వాళ్ళు డబ్బుని దృష్టిలో పెట్టుకునే అలా మాట్లాడుతారు.

  ఎక్కడైనా మనిషిని ఎక్కువగా ప్రభావితం చేసేది డబ్బే కదా కిరణ్ గారూ. సామాజిక ప్రభావాలు అనేవి అగ్రకులాలవాళ్ళ మీద ఒకలాగ, దళితుల మీద ఇంకొకలాగ ఉండవు.

 7. ఇందాకే ఫేస్‌బుక్‌లో ఒక చర్చ జరిగింది. అగ్రకుల హిందువులు ఎందుకు ఏకమవ్వడం లేదు అని అంటూ ఒకాయన పోస్ట్ వ్రాసాడు. ఆ పోస్ట్‌కి నేను ఇలా సమాధానం వ్రాసాను:

  “హిందువులలో రెండు కులాలు ఎన్నడూ ఏకంగా లేవు. హిందువులకి వ్యతిరేకంగా ముస్లింలలో సున్నీలూ, షియాలూ ఏకమైన సందర్భాలు ఉన్నాయి కానీ హిందువులలో రెండు కులాలు ఏకం కావడం అనేది ఎన్నడూ జరగదు. వ్యక్తివాదానికి మతం కంటే కులమే బాగా సూట్ అవుతుంది. రెండు కులాల మధ్య ఐక్యత అనేది ఎన్నడూ లేనప్పుడు రెండు అగ్రకులాల మధ్య ఐక్యత అనే ప్రశ్న కూడా రాదు.”

  అప్పుడు ఆయన ఈ ప్రశ్న అడిగాడు:
  “ఎస్సీలంతా ఏకమైనప్పుడు, బీసీలంతా ఏకమైనప్పుడు ఎఫ్.సీలంతా ఎందుకు కాలేరు ? ఇప్పటి దాకా కాలేదు కాబట్టి ఇలా అనగలుగుతున్నావు ప్రవీణ్ ! కానీ ఏదో ఒకరోజున మేము మారుస్తాం అగ్రకులాల మనస్సుని ! కాస్త ఆలస్యం అంతే !”

  దానికి నేను ఇలా సమాధానం చెప్పాను:
  “SC, ST, BCలు ఏకమయ్యింది ఆర్థిక ప్రయోజనం కోసం (రిజర్వేషన్‌ల కోసం). మావోయిస్ట్ అనే అనుమానంతో ఒక గిరిజన స్త్రీని రేప్ చేసిన పోలీస్ అధికారికి వీర చక్ర బహుమతి ఇస్తే ఏ కుల సంఘంవాళ్ళూ గొడవ చెయ్యరు కానీ ఒక దళిత IAS అధికారిని ఒక రాజకీయ నాయకుడు కులం పేరుతో తిడితే రాష్ట్రం లో ఉన్న కుల సంఘాలన్నీ ఏకమవుతాయి. కేవలం రిజర్వేషన్‌ల కోసం ఏర్పడిన సాంకేతిక ఐక్యతని సామాజిక ఐక్యత అని అనుకోలేము.”

 8. @ వెంకట్

  హర్యానా బాలిక ఘటనలో కులం పాత్ర కూడా ఉంది. నిజానికి కులానిదే ప్రధాన పాత్ర అని కూడా చెప్పాలి. (అరెస్టయిన వ్యక్తి జాట్ కులానికి చెందిన భూస్వామి కొడుకు.) అందువల్లనే కులం గురించి చెప్పవలసి వచ్చింది.

 9. అక్బర్ గారూ,

  నేను గతంలో కూడా స్త్రీలపై అత్యాచారాల గురించి టపాలు రాశాను. అలా రాసినపుడు కులం ప్రస్తావన నేను తేలేదు. ఎందుకంటే అక్కడ కులం పాత్ర లేదు గనక. కానీ హర్యానా బాలిక విషయం అలా కాదు.

  “కానీ మీ బాధ ఆ అమ్మాయి గురించా,రిజర్వేషన్ల గురించా అర్ధం కావడం లేదు.. ఎన్ని రిజర్వేషన్లు ఇస్తే ఆడవాళ్ళ పైన అత్యాచారాలు ఆగుతాయి.”

  నా బాధ రెండింటి గురించీను. అయితే ఈ రెండూ ఒకే చెట్టు కొమ్మలన్నది నా ఉద్దేశ్యం. “ఒక దళిత బాలికపై అగ్రకుల భూస్వాముల అత్యాచారం చేసిన వార్త మన దృష్టికి వచ్చిన సందర్భంగా, దళితుల పరిస్ధితిని గుర్తుకు తెచ్చి, ఇటువంటి అణచివేత పరిస్ధితులు ఉన్నందునే, ఆ పరిస్ధితులను అధిగమించడానికి తగిన ఆర్ధిక, సామాజిక స్ధైర్యాన్ని పొందడానికి దళితులకు రిజర్వేషన్లు అవసరం అయ్యాయి.” అని నేను చెప్పదలిచాను. కానీ రిజర్వేషన్లు స్వాంతనే తప్ప సమస్యకు పరిష్కారం కాదు. దళిత మహిళలపై అత్యాచారాలకు కూడా రిజర్వేషన్లు పరిష్కారం కాదు. రిజర్వేషన్ల బదులు భూములు, పరిశ్రమలు దళితులకు ఇస్తే అత్యాచారాలకు అవకాశం ఉండదు. అదెలా జరుగుతుందో ఒకసారి ఆలోచించగలరా?

  “రిజర్వేషన్లు అమలు మొదలయ్యి యాభై ఏళ్ళు గడిచాయి..ఇంకో ఐదు వందల ఏళ్ళు గడిచినా ఎవరూ మేము అభివౄద్ది చెందాము మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పరు.”

  ఇదే వాక్యాన్ని నేను మరో విధంగా చెబుతాను. “స్వాతంత్ర్యం వచ్చి 65 యేళ్ళు గడిచింది. ఇంకో వెయ్యేళ్ళు గడిచినా (దళితుల చేతికి భూములు రావు. ఫ్యాక్టరీలు అసలే రావు) మాకిక భూములు, పరిశ్రమలు ఇక అవసరం లేదని అగ్రకులస్ధులు చెప్పరు.”

  భూములు, పరిశ్రమల ద్వారా వచ్చిన సంపదలను అట్టే పెట్టుకుని భూముల్ని, పరిశ్రమలని మాత్రం దళితులకి అప్పజెపితే వారు రిజర్వేషన్లు ఇక అడగకపోవచ్చు.

  “sc లల్లో అడుగున వున్న మాదిగలు మాకు వర్గీకరణ కావాలి అని అడుగుతుంటే బాగా అభివ్రుద్ది చెందిన మాలలు మాత్రం సమైక్యంగా వుంచాలని పోరాడుతున్నారు.”

  కదా! కుల వ్యవస్ధకి ఉన్న బలం అది. రిజర్వేషన్లు రద్దు చేయాలని అగ్రకులస్ధులు ఎందుకు కోరుతున్నారో సరిగ్గా అదే కారణం వల్ల మాలలు సమైక్యత గురించి కబుర్లు చెబుతున్నారు.

  “కులప్రాతిపదికన దాడుల్లాంటివి జరిగితే ఎదుర్కోవడానికి SC ST attrocity చట్టాలున్నాయి కదా.”

  ఎంత అమాయకంగా అడిగారండీ? మరి కారంచేడు, చుండూరు, బఠానీ టోలా లు ఎందుకు జరిగాయి? వందలమంది దళితులని చంపి, స్త్రీలపై అత్యాచారాలు జరిపి, పిల్లలని కూడా ఊచకోత కోసిన రణవీర్ సేన వ్యవస్ధాపకుడు బ్రహ్మేశ్వర్ ముఖియా కొద్ది నెలల క్రితమే నిర్దోషిగా ఎలా విడుదలయ్యాడు?

  “ఎక్కదో కొన్ని పల్లెల్లో వివక్ష చూపుతున్నరని బూచిని చూపి ఉద్యోగలన్నీ తమకే దోచి పెట్టాలనే తమ వాదన ఎంత దరిద్రంగా వుందో ఒక్కసారి ఆలోచించుకోండి…”

  పల్లెల్లో వివక్ష మీకు బూచి మాత్రమే అయితే దళితులకు జీవితం. మీరు పల్లెల్లో మాత్రమే వివక్ష ఉందంటున్నారు. కానీ వాస్తవం అది కాదు. ఈ దేశాన్ని నడుపుతున్న సర్వ వ్యవస్ధల్లోనూ వివక్ష ఉంది. బ్యూరోక్రసీ ని నడుపుతున్నది అగ్రకులస్ధులే. కోర్టులు, ఆర్మీ లాంటి భద్రతా వ్యవస్ధలూ వారివే. రాజకీయ వ్యవస్ధ వారిదే. ఇక అగ్రకులాలకు లేనిది ఏమిటండీ? దళితులకి మాత్రం ఇవేవీ లేవు కదా. కాసిన్ని ఉద్యోగాలకి రిజవేషన్లు కోరితేనే ఇంతపెద్ద ఆరోపణ చేస్తున్నారే, దళితులకి భూములు, పరిశ్రమలు ఎందుకు లేవో ఒక్కసారి ఆలోచించండి.

  పోతే ఉద్యోగాలన్నీ తమకే దోచిపెట్టాలని దళితులు వాదిస్తున్నట్లు మీరు చెప్పడం పూర్తిగా అవాస్తవం. ఈ ఆరోపణ కూడా మీరు చూపుతున్న వివక్షలోనుండి వచ్చినదేనని చెపితే అన్యధా భావించవలదు. వాస్తవం ఏమిటో ఒక ఆర్టికల్ గతంలో రాశాను. అది ఒకసారి చూడగలరు.

  66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే

  పై ఆర్టికల్ చదివితే ఏయే ఉద్యోగాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలుస్తుంది.

  ఇంకో విషయం ఏమిటంటే, రిజర్వేషన్లు బిక్ష కాదు. అవి హక్కు మాత్రమే. ఎందుకంటే ఏ వ్యవస్ధలోనైనా శ్రమ చేస్తేనే సంపద. సేవ చేయాలన్నా శ్రమ ద్వారానే సాధ్యం. దళితుల్లో అత్యధికులు సహస్రాబ్దాలుగా శ్రమ చేస్తూనే ఉన్నారు తప్ప సంపద అనుభవించింది లేదు. దానర్ధం దళితులు తమ శ్రమని తాము అనుభవించలేదని. (ఇప్పుడు వారు చేస్తున్న శ్రమ ఫలితం కూడా వారికి పూర్తిగా దక్కడం లేదు.) సహస్రాబ్దాలుగా వారి చెంతకు చేరని వారి సొంత శ్రమ ఫలితంలో చాలా కొద్ది భాగం మాత్రమే రిజర్వేషన్ల ద్వారా వారికి ఇపుడు అందుతోంది. అది కూడా కేవలం నాలుగైదు దశాబ్దాలుగా మాత్రమే. ఆ విధంగా చూస్తే మరో వెయ్యేళ్లు రిజర్వేషన్లు అనుభవించినా వారి శ్రమ వారికి దక్కినట్లు కాదు.

  రిజర్వేషన్లని సమస్యగా చూడడం వలన ఈ అపోహలన్నీ కలుగుతున్నాయి. కుల అణచివేత వలన వేలయేళ్లుగా దాస్యరికంలో మగ్గిన దళితులకు అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లు కల్పించారు తప్ప వేరొకరిని శ్రమని దోచుకోవడానికి కాదు. ఒక ఆర్ధిక, సామాజిక సమస్యకు పరిష్కారం కావడానికి ముందు ఒక వెసులుబాటుగా వచ్చిన రిజర్వేషన్లని సమస్యగా చూడడం దురవగాహన. అసలు సమస్య రిజర్వేషన్లు కాదు.

  పల్లెల్లో, పట్నాల్లో పొలాల్లో, పరిశ్రమల్లో సాగుతున్న శ్రమ దోపిడీయే అసలు సమస్య. దళితులతో పాటు అగ్రకులాల్లో కూడా ఉన్న శ్రమ జీవులు వేలయేళ్లుగా చేసిన శ్రమ ఫలితం కొద్ది మంది అగ్రకుల భూస్వాముల చేతుల్లోనూ, పెట్టుబడుదారుల చేతుల్లోనూ, పశ్చిమ దేశాల్లోనూ పేరుకు పోయింది. ఈ సంపదలని శ్రమజీవుల చేతికి వచ్చేది ఎలాగో ఆలోచించాలి తప్ప కొద్ది పాటి చదువులను, ఉద్యోగాలను కేవలం కొద్ది కాలంగా మాత్రమే అనుభవిస్తున్న దళితులపై ద్వేషం పెంచుకోవడం కరెక్టు కాదు. శ్రమ దోపిడీ పెద్ద సమస్య కనుక, కులంతో పాటు అనేక రకాల దోపిడీలు ఉన్న వ్యవస్ధను మార్చడం ఇప్పట్లో సాధ్యం కాదు గనక కంటికి కనిపిస్తున్న రిజర్వేషన్లపై ద్వేషం పెంచుకోవడం సరైన ఆలోచనా విధానం కాదు.

 10. విశేఖర్ గారు, వీళ్ళు దళిత బాలికలనే టార్గెట్ చెయ్యడానికి ఇంకో కారణం ఉంది. డబ్బున్నవాళ్ళ అమ్మాయిని ఏదో చేస్తే సీరియస్ కేస్ అవుతుందనీ, అదే దళిత బాలికని ఏదో చేస్తే ఆమె దళితురాలే కదా అని పోలీసులు పట్టించుకోరనీ అలా సేఫ్టీ కోణంలో కూడా వీళ్ళు ఆలోచించి ఉండొచ్చు.

 11. కిరణ్ గారూ,

  కుల వ్యవస్ధ దేశంలో ఇంకా బలంగా ఉంది. కుల వివక్ష వలన దళితులు అనేక అవకాశాలు కోల్పోతున్నారు. నేను కులం గురించి రాయడానికి అదే కారణం. కులం గురించి చెప్పుకుంటున్నపుడు కుల అణచివేతనే ప్రధానంగా చెప్పుకుంటాము. కుల అణచివేతను ఎదుర్కొంటునది దళితులే గనక దళిత సమస్య చర్చకు వస్తుంది. అంతే కాకుండా ఆర్ధిక దోపిడీకి కులం కూడా ఒక సాధనం.

  ఎం.పి, ఎమ్మేల్యేలు అయినా ఎస్. సి అయితే చాలు వెనుకబడినట్లే అన్న అభిప్రాయం నాకు లేదు. ప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్ధలో దళితుల ఓట్లు కూడా దోపిడీ వర్గ పార్టీలకి కావాలి. అందుకోసం వారు దళితుల్లో ప్రతినిధులను తయారు చేసుకున్నారు. అలా దోపిడీ వర్గ పార్టీల అవసరాల కోసం కొద్ది మంది దళితులు ఎం.పి లు ఎమ్మేల్యేలు అయినంతమాత్రాన దళితుల పరిస్ధితుల్లో మార్పు వచ్చినట్లు కాదు. కొన్ని ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన కూడా దళితులు అభివృద్ధి చెందినట్లు కాదు.

  మీరు చెప్పినట్లు ఆర్ధిక వెనుకబాటుతనమే ఈ దేశంలో ముఖ్యమైన సమస్య. ఈ సమస్య దళితులు అత్యధికంగా ఎదుర్కొంటున్నారు. ఆర్ధిక దోపిడీ ప్రధాన సమస్య అయితే కుల సమస్య దానికి అనుబంధ సమస్య. దళితులతో పాటు అన్నీ కులాల్లోని పేదలు ఆర్ధిక దోపిడీ సమస్యను ఎదుర్కొంటున్నారు. కులాలకు అతీతంగా పేదలు లేదా శ్రమ జీవులు ఏకం కావాలన్నదే నా అభిప్రాయం. రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు, దేశీయ పెట్టుబడిదారులు, మేధావులు అందరూ కులాలకు అతీతంగా ఏకమైతే దోపిడీ వ్యవస్ధను నిర్మూలించి కులాతీతమైన, దోపిడీ రహిత వ్యవస్ధను ఏర్పరుచుకోవడం సాధ్యం అవుతుందని నా అభిప్రాయం.

 12. “డబ్బున్నవాళ్ళ అమ్మాయిని ఏదో చేస్తే సీరియస్ కేస్ అవుతుందనీ, అదే దళిత బాలికని ఏదో చేస్తే ఆమె దళితురాలే కదా అని పోలీసులు పట్టించుకోరనీ అలా సేఫ్టీ కోణంలో కూడా వీళ్ళు ఆలోచించి ఉండొచ్చు.”

  ప్రవీణ్, నిజానికి మీరు చెప్పిన కోణం కూడా కులం కోణమే తప్ప సేఫ్టీ కోణం కాదు. దళిత కులం అవడం వల్లనే కదా సీరియస్ కేసు నుండి సేఫ్టీ!

 13. నేను ఇంతకుముందే ఒక విషయం స్పష్టంగా వ్రాసాను. రిజర్వేషన్‌ల వల్ల నూటికి ఒకరిద్దరికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఓపెన్ కోటాలో పోటీ పడేవాళ్ళలో కూడా నూటికి ఒకరిద్దరికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు కూడా దళితులతో పోలిస్తే అగ్రకులాలలోనే చదువుకున్నవాళ్ళు ఎక్కువ కనుక రిజర్వేషన్‌ల వల్ల అగ్రకులాలవాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే అగ్రకులాలవాళ్ళు రిజర్వేషన్‌లపై అభ్యంతరం చెపుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏళ్ళైనా రిజర్వేషన్‌ల వల్ల దళితులు ఎందుకు అభివృద్ధి చెందలేదు అని అంటూ అగ్రకులాలవాళ్ళు రిజర్వేషన్‌లపై విమర్శలు చేస్తున్నారు. నూటికి ఒకరిద్దరికి మాత్రమే అవకాశాలు ఇచ్చే రిజర్వేషన్‌లు అరవై ఏళ్ళు కాదు, ఆరు వేల సంవత్సరాలు కొనసాగినా దళితుల పరిస్థితి మారదు.

 14. విశేఖర్ గారు, పైన చెప్పిన సేఫ్టీ కులం ఇచ్చినా, కులం పేరు తెలియని పరిస్థితిలో ఆర్థిక హోదా ఇచ్చినా అది రేపిస్ట్‌లకి లాభమే కదా.

 15. @(విశేఖర్ ) కుల వ్యవస్ధకి ఉన్న బలం అది. రిజర్వేషన్లు రద్దు చేయాలని అగ్రకులస్ధులు ఎందుకు కోరుతున్నారో సరిగ్గా అదే కారణం వల్ల మాలలు సమైక్యత గురించి కబుర్లు చెబుతున్నారు…

  మొత్తం ఇందులోనే ఉంది…వేల కారణాలూ…వేల ఆర్గ్యుమెంట్లూ అక్కర్లేదు..చక్కగా చెప్పారు..

 16. దళితులతో పాటు అన్నీ కులాల్లోని పేదలు ఆర్ధిక దోపిడీ సమస్యను ఎదుర్కొంటున్నారు. కులాలకు అతీతంగా పేదలు లేదా శ్రమ జీవులు ఏకం కావాలన్నదే నా అభిప్రాయం. రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు, దేశీయ పెట్టుబడిదారులు, మేధావులు అందరూ కులాలకు అతీతంగా ఏకమైతే దోపిడీ వ్యవస్ధను నిర్మూలించి కులాతీతమైన, దోపిడీ రహిత వ్యవస్ధను ఏర్పరుచుకోవడం సాధ్యం అవుతుందని నా అభిప్రాయం.

  పేదలు ఐక్యంగా ఉంచకుండా దోపిడీ దారులు కుల వ్యవస్థను నిర్మించారేమో..అనిపిస్తూంది…కులాలకతీతంగా పేదలంతా ఐక్యమైతే…ఈ దేశంలో ఊహించలేం…

 17. అరవై ఏళ్ళైనా రిజర్వేషన్‌ల వల్ల దళితులు ఎందుకు అభివృద్ధి చెందలేదు అని అంటూ అగ్రకులాలవాళ్ళు రిజర్వేషన్‌లపై విమర్శలు చేస్తున్నారు. ..
  నేను సన్నిహితంగా మెలిగిన గుంపులో, నేను చూసినది ఏమిటంటే…రిజర్వేషన్ల మీద కంటే దళితుల మీద ద్వేషంతో రిజర్వేషన్లు అన్న అంశాన్ని అడ్దుపెట్టుకుని వాళ్లపై దాడి చేసి సంతృప్తి పడుతూ ఉంటారు…అగ్రవర్ణాల కుర్రవాళ్ళు…(రిజర్వేషన్ల పై ఉద్యమాలు వచ్చినప్పుడు రాత్రికి రాత్రి సివాలెత్తిపోయి టెంట్లు ఎందుకు వేస్తారో అంతవరకూ సైలెంట్గా ఉన్న వీళ్ళు అని ఆశ్చర్యపడే వాళ్ళం…తర్వాత్తర్వాత అర్ధమయ్యేది..రిజర్వేషన్ల అంశం పై వాళ్ళకు ఆశక్తి లేకపోయినా…దాన్ని అడ్డుపెట్టుకుని…రోడ్లపై ఆందోళనలు చేసి..దళిత యువకులు అడ్దదారుల్లో అవకాశాలు దోచుకుంటునట్లు చిత్రీకరించి వాళ్ళలో మానసికంగా ఆత్మ నూన్యతా భావాన్ని పెంచేలా ఆందోళనలు ఎగదోస్తారనీ అర్ధమయ్యేది…)

 18. కేవలం కులం కోణం నుంచి చూస్తూ వర్గాన్ని మర్చిపోతే ఇలాగే ఉంటుంది. దళితుడైన సాకే శైలజానాథ్ దళిత ప్రయోజనాలతో సంబంధం లేని & గ్లోబలైజేషన్ అనుకూల వర్గంవాళ్ళ ప్రయోజనాలతో మాత్రమే సంబంధం ఉన్న సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించడం లేదా? ఊరి చివర గుడిసెలలో ఉండే దళితుల దగ్గరకి వెళ్ళి “మనం గ్లోబలైజేషన్ కోసం హైదరాబాద్‌ని ఇంత అభివృద్ధి చేశాము, తెలబాన్ రాష్ట్రం కోసం మనం హైదరాబాద్‌ని వదులుకోకూడదు, కనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పోరాడుదాము” అని అంటే ఒక్క దళితుడు కూడా ముందుకి రాడు. అదే యూనివర్సిటీలోని దళిత విద్యార్థి సంఘంవాళ్ళ దగ్గరకి వెళ్ళి హైదరాబాద్ పేరు చెప్పి రెచ్చగొడితే ఆ విద్యార్థులు సమైక్యతారాగం పేరుతో వీధిలో పడి పోరాటాలు చేస్తారు. డబ్బున్న దళితులకి ఉండే priorities వేరు, పేద దళితులకి ఉండే priorities వేరు అయినప్పుడు ఎమ్మెల్యే అయిన దళితుణ్ణి & సాధారణ దళితుణ్ణి ఒకేలాగ ఎలా చూస్తాం?

  ఎమ్మెల్యే అయిన దళితుడు తన కొడుకుని తన స్టేటస్‌కి తగిన అగ్రకులం అమ్మాయితో కులాంతర వివాహం చెయ్యిస్తాడే కానీ తన కులానికే చెందిన అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చెయ్యడు. ముంబై నగరంలో కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్ళ సంఖ్య కేవలం 5%. కానీ ఆ 5% మందిలో ఎక్కువ మంది డబ్బున్న వెనుకబడిన కులాలకి చెందినవాళ్ళు. ఆర్థిక స్థితి మారినవాళ్ళు ఎవరూ తమ పూర్వ ఆర్థిక స్థితితో సమాన స్థితిలో ఉన్న తమ కులంవాళ్ళని పెళ్ళి చేసుకోవాలని అనుకోరు. దళితవాదులైనా, దళితవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళైనా దళిత ఎమ్మెల్యేని & పేద దళితుణ్ణి ఒకేలాగ చూడడం జరగదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s