ఎన్నికల వ్యవస్ధల్లో వెనిజులా బెస్ట్, అమెరికా వరస్ట్ -జిమ్మీ కార్టర్


అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, అమెరికా రాజకీయ నాయకులకు నచ్చని వాస్తవం చెప్పాడు. వెనిజులాలో ఉన్న ప్రజాస్వామిక ఎన్నికల వ్యవస్ధ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ఆయన కీర్తించాడు. డబ్బే పరమావధిగా నడుస్తున్న అమెరికా ఎన్నికల వ్యవస్ధ ప్రపంచంలోని వరస్ట్ వ్యవస్ధల్లో ఒకటని కూడా ఆయన ప్రకటించాడు. 2002లో అమెరికా ప్రేరేపిత కుట్రను వెనిజులా ప్రజలు వీరోచితంగా తిప్పి కొట్టినప్పటినుండీ వెనిజులాను శత్రువుగా ప్రచారం చేస్తున్న అమెరికా రాజకీయ వ్యవస్ధకు జిమ్మీ కార్టర్ వెల్లడిచిన వాస్తవం ఒక షాక్ లాంటిదని చెప్పవచ్చు. అమెరికా కంపెనీలను తరిమికొట్టి, సార్వభౌమాధికారంతో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నందుకు వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ ని ‘నియంత’ గా చెప్పడానికి ఇష్టపడే పశ్చిమ కార్పొరేట్ మీడియా, కార్టర్ ప్రకటనను అసలు పట్టించుకోలేదు. అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్ధ అని అమెరికా గురించి వారు చెప్పుకునేది అబద్ధమని కార్టర్ ప్రకటన స్పష్టం చేస్తున్నది.

“నిజం చెప్పాలంటే, మేము పర్యవేక్షించిన 92 ఎన్నికల్లో వెనిజులా లోని ఎన్నికల ప్రక్రియను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని నేను చెబుతాను” అని జమ్మీ కార్టర్ చెప్పాడు. తాను స్ధాపించి నిర్వహిస్తున్న ‘కార్టర్ సెంటర్ ఫౌండేషన్’, అట్లాంటాలో జరిపిన సభలో మాట్లాడుతూ జిమ్మీ ఈ మాటలన్నాడు. వెనిజులాలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఎన్నికలను, ఫలితాలనూ అత్యంత పారదర్శకంగా మలిచారు. పూర్తిగా ఆటోమేటిక్ గా మార్చిన ‘టచ్ స్క్రీన్ వోటింగ్ సిస్టమ్’ ద్వారా అక్కడ ఎన్నికలు జరుగుతాయి. దానిని మరింత అభివృద్ధి చేసి వేలిముద్రలను గుర్తించేవిధంగా తయారు చేశారు. ఓటర్లు తాము వేసిన ఓటు సరిగా పడిందీ లేనిదీ చూసుకోవడానికి వేలిముద్ర ద్వారా రశీదు పొందే అవకాశాన్ని ఇపుడు కల్పించారు. దీని ద్వారా ఫలితాలను తారుమారు చేసే అవకాశం రిగ్గింగ్ వీరులకు ఇక ఉండదు.

జిమ్మీ కార్టర్ ఇంకా ఇలా చెప్పాడు.”ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ ఎన్నికల ప్రక్రియలను మనం (అమెరికా) కలిగి ఉన్నాము. విచ్చలవిడి డబ్బు ప్రవాహమే దానికి ప్రధాన కారణం” అని అన్నాడు. ప్రవేటు ప్రచారాలకు అందుతున్న డబ్బుపై అసలేమాత్రం నియంత్రణ లేకపోవడాన్ని కార్టర్ ఉద్దేశించాడు. అమెరికాలో రాజకీయ పార్టీలు ఎన్నికల నిధి పేరుతో ప్రవేటు పార్టీలనుండీ, బహుళజాతి కంపెనీల నుండీ డబ్బు వసూలు చేయడం బహిరంగంగానే జరుగుతుంది. రాజకీయ పార్టీలు పొందే భారీ డొనేషన్లు ఒక వంతైతే, ఆయా అభ్యర్ధుల తరపున జరిగే ప్రవేటు ప్రచారాలు మరొక వంతు. ప్రవేటు ప్రచారాలపై నియంత్రణ లేకపోవడం వలన అభ్యర్ధులకు అందే నిధులకు లెక్కా డొక్కా ఉండదు. కంపెనీల వద్ద భారీ డొనేషన్లు వసూలు చేశాక అభ్యర్ధులు కంపెనీలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు తప్ప ప్రజలకు ప్రతినిధులుగా కాదు. గెలిచిన అభ్యర్ధులు ఓట్ల ద్వారా కాక డొనేషన్ల ద్వారా గెలిచినట్లుగానే భావిస్తారు. ఫలితంగా ప్రజాస్వామ్యం కాస్తా కంపెనీల స్వామ్యంగా మారిపోవడం అమెరికన్లు ఎదుర్కొంటున్న అనుభవమే.

అక్టోబరు 7 తేదీన వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సోషలిస్టు పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు హ్యూగో చావేజ్ ఈ సారి కూడా ఎన్నికల్లో గెలుస్తాడనే అందరూ భావిస్తున్నారు. ఈ సందర్భంగా వెనిజులాకి సంబంధించి గతాన్ని కొద్దిగా మననం చెసుకోవడం ఉపయోగం. 1998లో మొదట అధికారంలోకి వచ్చిన చావెజ్ దేశ ఆయిల్ వనరులనుండి దేశ ప్రజలందరికీ ఫలితం అందేలా పునఃపంపిణీకి సిద్ధపడడం వేనిజులా పెట్టుబడుదారులకూ, వారికి మద్దతుగా ఉన్న అమెరికా కూ నచ్చలేదు. ఆయిల్ వనరులను ప్రజోపయోగంగా మార్చడానికీ, విదేశీ గుత్తసంస్ధల పెత్తనాన్ని అంతం చేయడానికి వీలుగా చావేజ్, నూతన రాజ్యాంగం రచించి దాని ఆధారంగా 2002 లో తిరిగి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

ప్రమాదం గ్రహించిన దళారి పెట్టుబదుదారులు, అమెరికా మద్దతుతో అధ్యక్షుడు చావేజ్ ని పదవీచ్యుతుడిని చేయడానికి మిలట్రీ కుట్ర జరిపారు. ప్రవేటు మీడియా, వ్యాపార వర్గాలు, మిలట్రీలోని కొన్ని సెక్షన్లు ఈ కుట్రకు సహకరించి చావేజ్ ను ఖైదు చేశారు. పెట్టుబడిదారుల గుంపు అయిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిని దేశాధ్యక్షుడిగా నియమించుకున్నారు. అమెరికా, స్పెయిన్ దేశాలు అత్యంత ఆత్రంగా కొత్త అధ్యక్షుడిని గుర్తిస్తున్నట్లు ప్రకటించి తర్వాత పరువు పోగొట్టుకున్నాయి. అయితే మిలట్రీలోని కొన్ని సెక్షన్లు కుట్రను వ్యతిరేకీంచాయి. దేశ ప్రజలు కూడా చావేజ్ కు మద్దతు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేసి వీధి పోరాటాలకు దిగడంతో రెండు రోజుల్లోనే కుట్ర విఫలం అయింది.

పెట్టుబడిదారీ ధనికవర్గానికి చెందిన ప్రవేటు మీడియా ఈ కుట్రలో పోషించిన వినాశకర పాత్ర ప్రపంచవ్యాపితంగా అప్రతిష్టను మూటకట్టుకుంది. చావేజ్ అనుకూల ప్రజా తిరుగుబాటును కవర్ చెయ్యకుండా, ధనికవర్గాల కుట్ర చుట్టూ లేని ప్రతిష్ట సృష్టించడానికి ప్రవేటు మీడియా పరమ ఛండాలమైన పాత్ర పోషించింది. (ఈక్వడార్ లో కూడా ఇలాంటి మీడియాయే రాజ్యమేలుతూ అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలకు అనుకూల పాత్రం పోషిస్తుండడం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు.) ప్రజల మద్దతుతో మళ్ళీ అధ్యక్షుడయాక చావేజ్ అనేక మార్పులు తెచ్చాడు.

ఆయిల్ రంగాన్ని జాతీయం చేశాడు. ఆయిల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో ప్రజలకు వాటా కల్పించాడు. ప్రభుత్వ ఆదాయాన్ని అనేక సరుకుల్లో సబ్సిడీలుగా మలిచి ప్రజల జీవన స్ధాయిని మెరుగుపరిచాడు. దానితో అమెరికా కంపెనీలకు నిలువ నీడ దక్కలేదు. అప్పటినుండీ చావేజ్ ను గద్దె దించడానికి అమెరికా చేయని కుట్ర లేదు. ప్రజా మద్దతు ఉండడంతో అమెరికా కుట్రలు విఫలం అవుతున్నాయి. తమ ఒత్తిళ్ళకు లొంగని చావేజ్ ని అమెరికా ‘నియంతగా’ గా చెప్పడం మొదలు పెట్టింది.  ‘నియంత’ అని ముద్రవేసి తమ కంపెనీలకు లొంగని పాలకులను చంపేసే కుట్రను చావేజ్ పైన అమలు చేసేందుకు అమెరికా పొంచి ఉంది. ఈ నేపధ్యంలోనే వెనిజులాను శతృదేశంగా అమెరికా పాలకులు ప్రకటించారు.

అమెరికా రాజకీయ నాయకులే వెనిజులా ను శతృదేశంగా భావిస్తున్న పరిస్ధితుల్లో హ్యూగో చావేజ్ ఏలికలోని ఎన్నికల వ్యవస్ధ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ఒక అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రకటించడం గమనించవలసిన విషయం.  దానితో పాటు అమెరికా ఎన్నికల వ్యవస్ధ పరమ దరిద్రమని కూడా కార్టర్ ప్రకటించడాన్ని బట్టి అమెరికా, యూరప్ రాజ్యాల ప్రచార దుర్మార్గాన్ని గ్రహించవచ్చు. అవకాశం వచ్చినపుడల్లా అమెరికా, యూరప్ దేశాల్లోని ప్రజాస్వామ్యాన్ని గొప్ప ప్రజాస్వామ్యంగా కీర్తించే కార్పొరేట్ మీడియా ప్రజాస్వామిక ఎన్నికల్లోనే అత్యున్నత ప్రమాణాలను అమలు చేస్తున్న వెనిజులా గురించి ఎన్నడూ రాసిన పాపాన పోలేదు. 

అక్టోబర్ 7 న జరిగే ఎన్నికల్లో చావేజ్ మళ్ళీ అధ్యక్షుడుగా ఎన్నిక అయ్యేది ఖాయమేనని దాదాపు అందరి అంచనా. ఈ విషయాన్ని గుర్తించే ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించేది లేదని చావేజ్ వ్యతిరేక, అమెరికా అనుకూల ప్రతిపక్షాలు ఇప్పుడు నుండే సణుగుడు మొదలు పెట్టాయని లాటిన్ దేశాల పత్రికలు చెబుతున్నాయి. వెనిజులా ఎన్నికల సందర్భంగా అమెరికా ఎన్నికల వ్యవస్ధ ఎంత దరిద్రమో తెలుసుకునే అవకాశం లభించింది.

One thought on “ఎన్నికల వ్యవస్ధల్లో వెనిజులా బెస్ట్, అమెరికా వరస్ట్ -జిమ్మీ కార్టర్

 1. వెనిజులాలో ఎన్నికలు వారి అంతర్గత వ్యవహారం. ప్రజలు నచ్చిన వారికి ఓటు వేస్తారు.
  ఒప్పుకోకపోవడానికి మధ్యలో పాశ్చాత్య మీడియాకు వచ్చిన కడుపునొప్పి ఏమిటి.?
  వ్యాపార వర్గాలు మీడియాను నిర్వహించడం, దొంగే పోలిస్‌స్టేషన్‌ నిర్వహించడంతో సమానం.
  అవి తమ ప్రయోజనాలనే దేశ ప్రయోజనాలుగా ప్రచారం చేస్తాయి.
  మనదేశంలోనూ ఈ తరహా పోకడలు చూడొచ్చు.
  కాకుంటే మనదేశానికి చావేజ్‌ లాంటి నేత లేడు.
  అసాంజే లాంటి వారి కృషితో అమెరికా దొంగముసుగు ఇప్పటికే దాదాపూ బట్టబయలైంది.
  మిగిలిన ఆ కాసింత ముసుగు కూడా బట్ట బయలై అసలు స్వరూపం వెల్లడి కావడం ఖాయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s