ఈ అధ్లెట్లని వికలాంగులని సంబోధించడానికి నిజానికి సిగ్గుపడాలి. కానీ అవధుల్లేని వీరి ఆత్మవిశ్వాసం యొక్క గ్రావిటీని అర్ధం చేసుకోవాలంటే వారి అంగవైకల్యాన్ని రిఫరెన్స్ గా తీసుకోక తప్పదు. కాసిన్ని కష్టాలు చుట్టుముడితేనో, ఆశించిన కాలేజీ సీటో, ఉద్యోగమో దక్కకపోతేనో, నచ్చిన వ్యక్తి భాగస్వామిగా దక్కకపోతేనో, మరింకేదో కష్టం ఎదురైతేనో… జీవితాల చివరి ఘడియల్ని వాటేసుకోవడానికి ఆతృత పడే బలహీన మనస్కులకు ఈ పారా-ఒలింపియన్ల జీవోన్మాదం కనువిప్పు కలిగిస్తుంది.
14 వ పారాలింపిక్స్ లండన్ లో ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 9 వరకు జరిగాయి. ఆగస్టు 12 తో ముగిసిన ఒలింపిక్స్ ఆటల పోటీలు జరిగిన వేదికల్లోనే పారాలింపిక్స్ జరిగాయి. 164 దేశాలనుండి వచ్చిన 4294 మంది అధ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. పారాలింపిక్స్ లో ఎవరికి ఎన్ని మెడల్స్ వచ్చాయన్నది అసంగతం. చేతులు, కాళ్ళు, కళ్ళూ మొదలయిన అత్యవసరమైన అవయవాలను పోగొట్టుకుని కూడా అంతర్జాతీయ వేదికలపై తలపడడానికి వీరు సాగించిన కృషి, ఆ కృషి వెనుక ఉన్న ఆత్మ స్థైర్యం మాత్రమే ఇందులో చూడవలసింది.
లండన్ వరకూ వచ్చిన పారా-ఒలింపియన్ల కు సమకూరిన వనరులు, అవకాశాలు పేద, గొప్ప తారతమ్యం లేకుండా ప్రపంచంలోని ప్రతిఒక్క వికలాంగుడికీ దక్కుతున్నాయా లేదా అన్నది ఒక ముఖ్యమైన తర్కాంశంమే. అయినప్పటికీ, పాలకులు-పాలితుల వ్యవస్ధ పరిధిలోనైనా శరీర వైకల్యాలను అధిగమించేలా తోటి మానవులకు ఈపాటి స్ఫూర్తిమంతమైన జీవనాన్ని ప్రసాదించే ఆటల పోటీలు అభినందనీయం. వ్యాపార కంపెనీల చొరబాటుని నిరోధించగలిగితే పుట్టుకతోనో, అనుకోకుండానో వైకల్యం పొందినవారికి కొత్త ఆశలని ఇలాంటి ఆటల పోటీలు ప్రోది చేయగలవు.
వికలాంగుల్లో కొత్త ఆశలను ప్రోది చేయడానికి ఆటలపోటీలు ఒక్కటే ఏకైక మార్గం కాదు. సామాజిక జీవనంలో అందరితో సమానంగా జీవించడానికి అవసరమైన అవకాశాలు వికలాంగులకు ఏ రూపంలో దక్కినా అవి వారు ఆత్మ స్ధైర్యంతో జీవించడానికి బాటలు పరుస్తాయి. ఆర్ధిక సమానతలు సిద్ధించి వ్యక్తిత్వానికి, ఆశయ పరిపుష్టతకి మాత్రమే ఉన్నత గౌరవం దక్కే సమాజాల్లో ఇలాంటి ఆటల పోటీల అవసరం పెద్దగా లేకపోయినా, ఆటల పోటీలు కూడా ఒక మార్గమన్నది అంగీకరించవచ్చు.
ఈ ఫోటోలను జేపీజీ డే అనే వెబ్ సైట్ అందించింది.
–
వైకల్యం శరీరానికే కానీ వారి మనసుకు కాదు. అన్నీ వుండి కూడా తమకు, సమజానికి ఎందుకూ ఉపయోగ పడని వారే అసలైన వికలాంగులు