కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాలి? ఏం చేస్తున్నాయి?


బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంపై నందిగ్రాం ప్రజల పోరాటం

బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు భారత దేశంలోని దోపిడి వర్గాలైన భూస్వాములు, పెట్టుబడుదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు. ఇవి పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రభుత్వాధికారం చేతికి వచ్చాక దోపిడీవర్గాల ప్రయోజనాలే నెరవేరుస్తాయి. శ్రామిక ప్రజల ప్రయోజనాలను అవి పట్టించుకోవు. పట్టించుకోకపోగా హక్కుల కోసం, మెరుగైన జీవనం కోసం ప్రయత్నించే ప్రజలపైన అణచివేతను అమలు చేస్తాయి. అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు వీరి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు కట్టుబడి ఉంటాయి.

సామ్రాజ్యవాదులకు లొంగిపోయి, వారి ప్రయోజనాలు నెరవేరుస్తూ దేశ ప్రజలను దోచుకు తింటున్న వర్గాలు ముఠాలుగా విడిపోయి కాంగ్రెస్, బి.జె.పి, టి.డి.పి, ఎస్.పి, బి.ఎస్.పి తదితర పార్టీలను రాజకీయ రంగంలో ఏర్పరుచుకున్నాయి. రాజకీయ పార్టీల ద్వారా అధికారం సంపాదించి తమ ఆర్ధిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడం ఈ పార్టీల వెనుక ఉన్న వర్గాల లక్ష్యం. ఆర్ధిక ప్రయోజనాలు పునాదిలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఉపరితలంలో ఉండే రాజకీయాలు ప్రజాస్వామిక భ్రమలను కలిగిస్తాయి. అలాంటి భ్రమలకు ప్రధాన ప్రతినిధులు పార్లమెంటు, అసెంబ్లీలు. కనుక పార్లమెంటు, అసెంబ్లీలు కూడా భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను ‘ప్రజాస్వామ్యం’ ముసుగులో నెరవేర్చే సాధనాలే తప్ప అది ప్రజల అధికారానికి ప్రతినిధి కాదు.

అయితే బానిస, భూస్వామ్య సమాజాలతో పోలిస్తే అర్ధ భూస్వామ్య, పెట్టుబడిదారీ సమాజాల్లో శ్రామిక ప్రజలు సాపేక్షికంగా స్వతంత్రతను కలిగి ఉంటారు. ఈ స్వతంత్రత సారాంశంలో శ్రమను తమకు ఇష్టం వచ్చినవారికి అమ్ముకోగలిగే స్వతంత్రత మాత్రమే. శ్రమని అమ్ముకోవడంలో ఉండే స్వతంత్రత, తమ ‘శ్రమకి తగిన ధర పొందడంలో స్వతంత్రత’ గా మార్పు చెందదు. అలా మార్పు చెందకుండా పోలీసులు, పారామిలటరీ బలగాలు, కోర్టులు, పార్లమెంటు, అసెంబ్లీలతో కూడిన రాజ్యాంగ యంత్రం ఆధిపత్య వర్గాల కోసం కాపలా కాస్తుంది. ఇలాంటి రాజ్యాంగ యంత్రంలో భాగమైన పార్లమెంటుకి జరిగే ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే వచ్చే అధికారం తిరిగి సామ్రాజ్యవాదుల-పెట్టుబడుదారుల-భూస్వాముల సేవలకే వినియోగించగలరు తప్ప శ్రామిక ప్రజలకోసం వినియోగించడం సాధ్యం కాదు.

అంటే ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్ధలో సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు (దోపిడి త్రయ వర్గాలు) ఈ దేశంలోని ఆస్తులను, వనరులను సొంతం చేసుకుని చిత్తం వచ్చిన రీతిలో వినియోగించే స్వేచ్ఛ ఉండగా, శ్రామిక ప్రజలకు వారికి సేవలు చేసుకుని బతికే స్వేఛ్ఛ మాత్రమే ఉంటుంది. రాజ్యాధికారాన్ని చేతిలో ఉంచుకున్నందున దోపిడి త్రయ వర్గాలు తమ దోపిడిని యధేచ్ఛగా చేయగలుగుతున్నాయి. కనుక శ్రామిక ప్రజలకు దేశ వనరులను స్వేఛ్ఛగా వినియోగించుకోగల పరిస్ధితి రావాలంటే రాజ్యాధికారాన్ని వారు ఆధిపత్య వర్గాలనుండి స్వాధీనం చేసుకోవాలి. అలా స్వాధీనం చేసుకోవడానికి కార్మికవర్గ విప్లవాలు మాత్రమే తగిన, ఏకైక సాధనాలు. కమ్యూనిస్టు పార్టీలు ఈ కార్మికవర్గ విప్లవాన్ని తెచ్చే బాధ్యతను నెత్తిన వేసుకున్నాయి. (వేసుకోవాలి.)

కనుక కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కర్తవ్యం, కార్మిక వర్గ విప్లవం. కార్మికవర్గ విప్లవం ద్వారా శ్రామిక వర్గాల చేతికి రాజ్యాధికారం తెచ్చేందుకు కమ్యూనిస్టు పార్టీలు కృషి చేయాలి. దోపిడి వర్గాల ప్రయోజనాల కోసం ఏర్పరిచిన పార్లమెంటు ద్వారా కార్మిక వర్గ విప్లవం అసాధ్యం. కాకపోతే పార్లమెంటరీ అధికారం కోసం ప్రజాస్వామ్యం పేరుతొ జరిగే ఎన్నికల చుట్టూ ప్రజలకి భ్రమలు పేరుకున్నందున పార్లమెంటరీ ఎన్నికలను కమ్యూనిస్టు పార్టీలు ఒక ఎత్తుగడగా స్వీకరిస్తాయి. కార్మికవర్గ విప్లవాల సాధనలో ఈ ఎత్తుగడను ఉపయోగపెట్టాలని సిద్ధాంతం చెబుతాయి. కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఉన్న ఈ స్వల్ప అవకాశం ప్రపంచంలోని అనేక దొంగ కమ్యూనిస్టు పార్టీలకు వరంగా మారింది. ఎత్తుగడగా స్వీకరించవలసిన పార్లమెంటరీ ఎన్నికలను వ్యూహం స్ధానానికి ప్రమోట్ చేసి ఎన్నికల ద్వారా సమకూరే లభాలను అనుభవించడం అవి ప్రారంభించాయి.

ఓ పక్క కమ్యూనిస్టు సిద్ధాంతం చెబుతూ మరోపక్క సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధమైన పార్లమెంటరీ అధికారం కోసం నానా గడ్డీ కరిచేవిగా దిగజారిపోయాయి. కార్మికవర్గం పేరు చెప్పుకుంటూ ప్రజా వ్యతిరేక పార్లమెంటరీ ఎన్నికల్లో పీకలదాకా కూరుకుపోయాయి. వర్గ పోరాటాల్లోకి శ్రామిక ప్రజలను సమీకరించి కార్మికవర్గ నాయకత్వంలో అశేష రైతాంగం, కూలీలు, మధ్య తరగతి, మేధావి వర్గాల మద్దతుతో విప్లవ కర్తవ్యాన్ని నెరవేర్చడం మాని ఎన్నికల చుట్టూ సమస్త ఎత్తుగడలను తిప్పడం ఒక కార్యక్రమంగా చేసుకున్నాయి. అలా పార్లమెంటరీ బురదలో కూరుకుపోయినవే భారత దేశంలోని సి.పి.ఐ, సి.పిఎం, లిబరేషన్ ఇత్యాది పార్టీలు. ఈ పార్టీలకు కమ్యూనిస్టు సిద్ధాంతం తెచ్చే ప్రతిష్ట కావాలి. అదే సమయంలో పార్లమెంటరీ ఎన్నికలు సమకూర్చే సుఖాలు కావాలి. కాకపోతే తమ మారిన స్వభావానికి అనేక సిద్ధాంతాలు జత చేసి తిమ్మిని బమ్మిని చేయడం ఒక కళగా అభివృద్ధి చేశాయి.

ఈ కళలోని అప్రకటిత సూత్రాల ప్రకారం సెక్యులరిజం పేరు చెప్పి కాంగ్రెస్ లాంటి బడా బూర్జువా, బడా భూస్వామ్య పార్టీలతో ప్రభుత్వాలు ఏర్పరచవచ్చు. మతతత్వాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకోవడంలో కాంగ్రెస్, బి.జె.పి పార్టీలకు ఉన్న సారూప్యతను కన్వీనియెంట్ గా విస్మరించవచ్చు. పెద్ద శత్రువుకి వ్యతిరేకంగా చిన్న శత్రువుతో పొత్తు అంటూ టి.డి.పి లాంటి బడా దోపిడీదారీ పార్టీలతో దశాబ్దాల తరబడి ఎన్నికల పొత్తులు పెట్టుకుని ఆ పార్టీలకు వ్యతిరేకంగా చేయవలసిన పోరాటాన్ని గంగలో కలిపేయవచ్చు. టి.డి.పి లాంటి పార్టీలు సామ్రాజ్యవాదుల సేవలో ఆరితేరి సోకాల్డ్ కమ్యూనిస్టు పార్టీలను తన్ని తగలేస్తే, దానికి వ్యతిరేకంగా పెద్ద శత్రువు అయిన కాంగ్రెస్ తో కూడా జత కట్టవచ్చు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సో కాల్డ్ లెఫ్ట్ ని పక్కకి నెట్టేస్తే మళ్ళీ టి.డి.పి లాంటి పార్టీల పంచన చేరవచ్చు.

ఈ విధానాలని ప్రశ్నిస్తే కమ్యూనిస్టు సిద్ధాంతాలను వల్లించి ఏదో విధంగా సమస్యలను దాటవేయవచ్చు. కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారం సాయుధ విప్లవానికి కృషి చేస్తున్న విప్లవ పార్టీలపై బడా బూర్జువా, బడా భూస్వామ్య పార్టీలతో సమానంగా అత్యంత క్రూర దమనకాండను అమలు చేసి టెర్రరిస్టులని, ఉగ్రవాదులనీ ముద్ర వేయవచ్చు. భూ సంస్కరణలను చాప చుట్టి ఆధిపత్య వర్గాలకు కానుకగా ఇవ్వవచ్చు. సాయుధ పోరాటం అవసరమని చెబుతూనే ఎంచక్కా పుస్తకాలకు పరిమితం చేయవచ్చు. పారిశ్రామిక విధానం పేరుతో స్వదేశీ, విదేశీ పెట్టుబడుదారుల కోసం భూములు లాక్కోవచ్చు. అదేమని అడిగితే తమ పార్టీ కార్యకర్తలను కూడా దింపి జనాన్ని పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపొచ్చు. ఆ విధంగా సిద్ధాంతం ముసుగులోనే కార్మికవర్గ ప్రజల మధ్య చిచ్చు పెట్టవచ్చు.

ఈ అప్రకటిత సూత్రాలను సి.పి.ఐ, సి.పి.ఎం తదితర పార్టీలు అమలు చేస్తున్నాయి. ఇపుడీ పార్టీల కార్యక్రమం అంతా కార్మికవర్గ రాజకీయాలను ఆధిపత్య వర్గాల రాజకీయాల చుట్టూ తిప్పడమే. ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను నెరవేర్చే పార్లమెంటులో కాసిన్ని సీట్ల కోసం వారి వెంటా, వీరి వెంటా వెళ్లడమే. కార్మిక వర్గ విప్లవం వీరి కార్యక్రమంలో నుండి మాయమైపోయి చాలా కాలం గడిచిపోయింది.

15 thoughts on “కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాలి? ఏం చేస్తున్నాయి?

 1. పరమ్‌జిత్ సింగ్ గారు వ్రాసిన “Insurrection to Agitation – The Naxalite Movement in Punjab” పుస్తకం చదివాను. 1970ల టైమ్‌లో కూడా CPI, CPMలు ధనిక వర్గంతో వర్గ సహకారం చెయ్యడానికే ప్రాధాన్యత ఇచ్చాయి. గ్రామాలలో కొంత మంది డబ్బున్న రైతులతో ఈ పార్టీలు సంబంధాలు పెట్టుకునేవి. గ్రామాలలో ధనిక రైతులు ఏ పార్టీకి వోట్ వెయ్యమని చెపితే చదువురాని గ్రామస్తులు ఆ పార్టీకే వోట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది. వోటర్లని ఆకర్షించడానికి డబ్బులు పంచడం లేదా క్రికెట్ కిట్స్ పంచడం లాంటివి జరుగుతున్నాయి. కేవలం గ్రామ పెద్దల చేత చెప్పించి వోట్లు వెయ్యించడం జరగడం లేదు. 1970ల టైమ్‌లో గ్రామ పెద్దల చేత చెప్పించి వోట్లు వెయ్యించుకునే విధానాన్ని స్వయంప్రకటిత కమ్యూనిస్ట్ పార్టీలైన CPI, CPMలు కూడా నమ్ముకున్నాయి. CPI, CPMలు పాలకవర్గంలో పాలు-నీళ్ళలా అంత చక్కగా కలిసిపోయాయి.

 2. “The Naxalite Movement in Punjab” పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నాను. కానీ పుస్తకంలో రచయిత అడ్రెస్ కాకుండా పబ్లిషర్ అడ్రెస్ మాత్రమే ఉంది. రచయిత అనుమతి కూడా తీసుకోవాలి కదా. అది లేకుండా పని అవ్వదు కనుక CPI, CPMల రివిజనిజం గురించి వేరే పుస్తకం వ్రాసి “The Naxalite Movement in Punjab” పుస్తకం నుంచి రిఫరెన్సెస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

 3. “ఈ పార్టీలకు కమ్యూనిస్టు సిద్ధాంతం తెచ్చే ప్రతిష్ట కావాలి. అదే సమయంలో పార్లమెంటరీ ఎన్నికలు సమకూర్చే సుఖాలు కావాలి. కాకపోతే తమ మారిన స్వభావానికి అనేక సిద్ధాంతాలు జత చేసి తిమ్మిని బమ్మిని చేయడం ఒక కళగా అభివృద్ధి చేశాయి.

  ఈ కళలోని అప్రకటిత సూత్రాల ప్రకారం సెక్యులరిజం పేరు చెప్పి కాంగ్రెస్ లాంటి బడా బూర్జువా, బడా భూస్వామ్య పార్టీలతో ప్రభుత్వాలు ఏర్పరచవచ్చు. మతతత్వాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకోవడంలో కాంగ్రెస్, బి.జె.పి పార్టీలకు ఉన్న సారూప్యతను కన్వీనియెంట్ గా విస్మరించవచ్చు. పెద్ద శత్రువుకి వ్యతిరేకంగా చిన్న శత్రువుతో పొత్తు అంటూ టి.డి.పి లాంటి బడా దోపిడీదారీ పార్టీలతో దశాబ్దాల తరబడి ఎన్నికల పొత్తులు పెట్టుకుని ఆ పార్టీలకు వ్యతిరేకంగా చేయవలసిన పోరాటాన్ని గంగలో కలిపేయవచ్చు. టి.డి.పి లాంటి పార్టీలు సామ్రాజ్యవాదుల సేవలో ఆరితేరి సోకాల్డ్ కమ్యూనిస్టు పార్టీలను తన్ని తగలేస్తే, దానికి వ్యతిరేకంగా పెద్ద శత్రువు అయిన కాంగ్రెస్ తో కూడా జత కట్టవచ్చు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సో కాల్డ్ లెఫ్ట్ ని పక్కకి నెట్టేస్తే మళ్ళీ టి.డి.పి లాంటి పార్టీల పంచన చేరవచ్చు.”

  Who can answer this lighting sentences? Espicially,

  టి.డి.పి లాంటి పార్టీలు సామ్రాజ్యవాదుల సేవలో ఆరితేరి సోకాల్డ్ కమ్యూనిస్టు పార్టీలను తన్ని తగలేస్తే, దానికి వ్యతిరేకంగా పెద్ద శత్రువు అయిన కాంగ్రెస్ తో కూడా జత కట్టవచ్చు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సో కాల్డ్ లెఫ్ట్ ని పక్కకి నెట్టేస్తే మళ్ళీ టి.డి.పి లాంటి పార్టీల పంచన చేరవచ్చు.

  I want to remember one of Sri Sri’s poem..

  మనదీ ఒక బ్రతుకేనా
  కుక్కల వలె నక్కల వలె..
  కలుగులలో ఎలుకల వలె….

  I like the third stanja more and more….

  vsekhar garu…

  Sorry for not typing in Telugu as i am not having my own system and unicode font at present..

  Even our big Jacal Mulayam too told that he didn’t accept communal criminals to come to power. So he too wishes to support the UPA government.

  Are mulayam and parliamentary communists are the same sect?

  What is difference in Congress and BJP as per their political essence?

  (రాజు గారూ, శ్రీ శ్రీ కవితను నేను తెలుగులోకి మార్చాను -విశేఖర్)

 4. దేశంలో స్వాతంత్ర్య సంగ్రామం బలపడినప్పుడు హింస పెరిగిపోతోందని చెప్పి గాంధీ స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఆపివెయ్యించడానికే ప్రయత్నించాడు కానీ తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు. నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైన కొత్తలో CPM కూడా అలాంటి పనే చేసింది. మావో జెడాంగ్ థియరీ పట్ల కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలని పార్టీ నుంచి బహిష్కరించడం లేదా ఆ కార్యకర్తలు పార్టీ వదిలి వెళ్ళేలా చెయ్యడం చేశారు. చరిత్రంగా “The Naxalite Movement in Punjab” పుస్తకంలో చదివాను.

  హోషియార్‌పుర్ జిల్లాలో CPMకి ఆరువేల మంది కార్యకర్తలు ఉండేవాళ్ళు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జీలింగ్ జిల్లా నక్సల్బాడీ గ్రామం దగ్గర టీ తోటల కార్మికులు తోటలని ఆక్రమించుకున్నారనే వార్త బీజింగ్ రేడియోలో వచ్చిన తరువాత పంజాబ్ CPM నాయకులు తమ పార్టీకి చెందిన హోషియార్‌పుర్ జిల్లా కమిటీ సభ్యునితో సహా అదే జిల్లాకి చెందిన మరో వంద మంది కార్యకర్తలని పార్టీ నుంచి బహిష్కరించడం లేదా పార్టీ వదిలి వెళ్ళిపోయేలా చెయ్యడం చేశారు. అంతే కాకుండా నక్సల్బాడీ ఉద్యమానికి వ్యతిరేకంగా తమ పార్టీ కార్యకర్తలకి క్లాసులు కూడా పెట్టారు. “తుపాకీ గొట్టం నుంచి పొగ వస్తుందే కానీ విప్లవం రాదు, పాలక వర్గ పార్టీలతో వర్గ సహకారం చేసి మనం అనుకున్నది సాధించుకుందాం” అని తమ పార్టీ కార్యకర్తలకి బోధించారు. గతంలో గాంధీ మహాత్ముడు “హింస వల్ల దోచుకునేవాడే బలపడతాడు కానీ పోరాడేవానికి ఏమీ రాదు” అని ప్రవచించినప్పుడు గాంధీ మహాత్ముణ్ణి తీవ్రంగా విమర్శించిన సుందరయ్య లాంటి కమ్యూనిస్ట్ యోధులు నక్సల్బాడీ ఉద్యమం విషయానికొచ్చేసరికి అచ్చం గాంధీ మహాత్ముని శైలిలో ప్రకటనలు చేశారు. “The Naxalite Movement in Punjab” పుస్తకంలోని “Beginning and Growth” వ్యాసం(పేజ్ 72 నుంచి 94 వరకు)లో దీని గురించి వివరంగా వ్రాసి ఉంది.

 5. సిపిఎం వ్యూహం ఏమిటనేది పార్టీ కార్యక్రమం చదివితే తెలుస్తుంది కదా. దానిని అనుసరిస్తున్నదీ లేనిదీ పరిశీలించిన తరువాతే నేను ఆ పార్టీ కార్యక్రమం ప్రకారం నడుచుకుంటోంది అన్నాను. మీకు అలా కనిపించకపోతే నా తప్పు కాదు. మీరు సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నారనుకుంటాను. వీలైతే తప్పకుండా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. హోషియార్పూర్ లో ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఇప్పుడు వాటి వివరాల జోలికి వెళ్లనవసరం లేదు. మీరే చెబుతున్నారు గదా. బహిష్కరించారని. ఇక ఇంకేం కావాలి. సిపిఐ(ఎం) అంచనా వేరు. సిపిఐ(ఎం ఎల్) అవగాహన వేరు. తమ పార్టీ కార్యకర్తలకి పార్టీ కార్యక్రమం బొధించకుండా ఎలా ఉంటారు. ఏ పార్టీవారఐనా ఇతర పార్టీలతో ఏ విషయంలో ఎందుకు విభేదిస్తున్నారనేది క్లాసులు పెట్టి వివరించకుండా ఎలా వుంటారు.
  నా అవగాహన మేరకు ఒక ఉదాహరణ ద్వారా సిపిఎం విధానాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను.
  సిపిఎం కు టిడిపి అయినా, కాంగ్రెస్ అయినా ఒకటే. ఆ పార్టీలను వ్యతిరేకించి మనం అధికారం లోకి వచ్చే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో 2004లో టిడిపిని గద్దె దింపడానికి, కాంగ్రెస్తో చేతులు కలపడమే సరిఅయినది. లేనట్లయితే టిడిపి గద్దె దిగేదా? ఒకసారి గణాంకాలని పరిశీలించండి. కేవలం 2శాతం ఓట్లు కోల్పోవడంతో టిడిపి అధికారానికి దూరం అయింది. ఒకవేళ 2004లో టిడిపి అధికారంలోకి వచ్చేట్లయితే ఇక బాబుకి ఎదురెవరు ఉండక పోయేవారు. తదుపరి అధికారం లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డికంటే తీవ్రంగా మావోయిస్టులను రూపుమాపేవాడు. తన అనుసరించిన విధానాలే సరిఅయినవని అనేవాడు. కాదంటారా?
  ఇక 2009లో టిడిపితో జత చేయడం కూడా సరిఅయినదే. లేదంటే బాబు విధానాలనే మరో రూపంలో అమలుచేసిన రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేసాడు. రాజశేఖర్ రెడ్డి చేసిన కొన్ని మంచిపనులు (ఉదా. ఆరోగ్య శ్రీ, ఫీజు రిఎంబర్స్ మెంటు, వితంతు పించనులు మొదలైనవి) కూడా ఉండబట్టే 2009లో నెగ్గాడు. అయినా అతను బ్రతికి ఉన్నా అ పథకాలను అమలుచేయడం సాధ్యంకాక పోయేది అనేది వేరు విషయం.
  ఇప్పుడు పరిస్థితి ఏమిటి? టిడిపిగాని, కాంగ్రెస్ కాని దేనికీ అధికారంలోకి వచ్చే అవకాశం ఇప్పటికయితే 2014లో ఉంటుందని అనుకోను. ఈ విధంగా మనం గెలిచే అవకాశం లేనపుడు శత్రువులను బలహీనం చేయడం కూడా ఒక రకమైన పోరాటమే అవుతుంది. అదే సందర్భంలో కార్మిక వర్గ రాజకీయాలను వదిలిపెట్టి ఇదే పనిమీద నిమగ్నమైతే అదికూడా తప్పే. కాని నేను గమనిస్తున్న ఈ కాలంలో అలా కూడా చేయడం లేదని నేననుకుంటున్నాను. గత పది సంవత్సరాలుగా నేను గమనించింది సిపిఎం క్యాడరు రోజురోజుకి విస్తరిస్తుంది తప్ప కుచించుకు పోవడంలేదు. అసెంబ్లీలో సీట్లు తగ్గాయి కదా అనకండి. అది పోరాటానికి ఒక వేదిక మాత్రమే. ప్రజలకొరకు పనిచేస్తున్న పార్టీకి చట్టసభలలో సీట్లకై వెంపర్లాడాల్సిన అవసరంలేదు. ఏవంటారు?

 6. కేవలం హోషియార్‌పుర్ ఉదాహరణ చెప్పి చేతులు దులుపుకోవడం లేదు. CPM నాయకులకి ఉన్న రాజకీయ చైతన్యం యొక్క స్థాయి సాధారణ ప్రజలకి ఉన్న రాజకీయ చైతన్యం యొక్క స్థాయితో సమానంగా ఉందనడానికి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. భగత్ సింగ్‌ని హీరోగా భావించిన CPI, CPM నాయకులు నక్సలైట్ ఉద్యమం విషయానికొచ్చేసరికి ఆ ఉద్యమకారులని విలన్‌లుగా పరిగణించి వాళ్ళ విషయంలో hostileగానే ఉన్నారు. “The Naxalite Movement in Punjab” పుస్తక రచయిత పరమ్‌జిత్ సింగ్ అభిప్రాయం ప్రకారం ఇందుకు కారణం గాంధీ మహాత్ముణ్ణి mass leaderగా పరిగణించే పాప్యులర్ సంస్కృతి కావచ్చు లేదా 1952లో CPI సాయుధ పోరాటం ఆపేసి పార్లమెంటరీ రాజకీయాలలోకి రావడం కావచ్చు లేదా 1957లో CPI నాయకత్వం కృష్చేవ్ ప్రతిపాదించిన “peaceful transition to socialism” విధానాన్ని బలపరచడం కావచ్చు. గాంధీని mass leader (ప్రజా నాయకుడు)గా భావిస్తే అలా భావించేవాళ్ళ రాజకీయ చైతన్యం సాధారణ ప్రజల చైతన్యంతో సమానంగా ఉన్నట్టే అవుతుంది. ఇటువంటి సాధారణ స్థాయి చైతన్యం ఉన్నప్పుడు విప్లవం ఎలా తీసుకొస్తారు? కృష్చేవ్ ప్రతిపాదించిన “peaceful transition to socialism” విధానం పూర్తిగా తప్పు కనుకనే 1991లో సోవియట్ సమాఖ్య కుప్పకూలిపోయింది. ఇక పార్లమెంటరీ పంథా విషయానికొస్తే ఆ పంథా వల్ల జన సంఘ్, బిజెపి లాంటి మతతత్వ పార్టీలు అధికారంలోకి రాకుండా చెయ్యడం తప్ప సాధించినది వేరేదేమీ లేదు.

 7. తాము మతతత్వ పార్టీలని ఓడించడానికే పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేస్తున్నామని CPI, CPMలు చెపుతున్న కారణం నమ్మశక్యంగా లేదు. జన సంఘ్ స్థాపించినది 1951. CPI సాయుధ పోరాటం ఆపేసినది 1952లో. కేవలం ఏడాదిలోనే మతతత్వం విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటారనేది నమ్మశక్యం కాని విషయం. మతం అనేది ఒక నీడ మాత్రమే. అది పోయినంతమాత్రాన పెట్టుబడిదారీ వ్యవస్థకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. పెట్టుబడిదారుడు తాను శ్రమ లేకుండా బతకడం కోసం దోచుకుంటాడు కానీ కులం కోసమో, మతం కోసమో దోచుకోడు కదా.

 8. అశోక్ గారూ, సి.పి.ఎం పార్టీ తన వ్యూహాన్ని వదిలి, ఎత్తుగడల సమస్య అయిన ఎన్నికలను వ్యూహం స్ధానంలోకి ప్రమోట్ చేసిందన్నది నా విమర్శల్లో ఒకటి.

  కాదు, నేనే ఎత్తుగడలని వ్యూహాలుగా చూపిస్తున్నానని మీరు చెప్పారు. నా విమర్శనే మీరు సమాధానంగా ఇవ్వడం ఏమిటో నాకు అర్ధం కాలేదు.

  సరే, కొంత నిర్దిష్టంగా చెబుతాను.

  వ్యూహం అయిన కార్మిక వర్గ విప్లవం/జనతా ప్రజాతంత్ర విప్లవం వదిలిపెట్టి ఎత్తుగడల సమస్య మాత్రమే అయిన ఎన్నికల చుట్టూ సి.పి.ఎం తన కార్యక్రమాన్ని తిప్పుతోందని నా విమర్శ. ఆ విమర్శ నిజమేనని మీరు చెప్పిన సమాధానమే (చివరి రెండు పేరాలు) సూచిస్తోంది.

  మీరు రాసిన ఈ వాక్యం చూడండి:

  “సిపిఎం కు టిడిపి అయినా, కాంగ్రెస్ అయినా ఒకటే. ఆ పార్టీలను వ్యతిరేకించి మనం అధికారం లోకి వచ్చే అవకాశం లేదు.”

  అంటే, ఎన్నికల ద్వారా అధికారంలోకి రావడమే సి.పి.ఎం లక్ష్యం. అందుకోసం రాష్ట్రంలో కాంగ్రెస్, టి.డి.పిలతో మార్చి మార్చి పొత్తులు పెట్టుకోవడానికి ఆ పార్టీ సిద్ధం. అసెంబ్లీలో అధికారానికి వచ్చే లక్ష్యంలో ‘జనతా ప్రజాతంత్ర విప్లవం’ అనే వ్యూహం ఎలా అమలు జరిగినట్లు?

  జనతా ప్రజాతంత్ర విప్లవం అనే సి.పి.ఎం వ్యూహానికి ఎన్నికలు ఒక ఎత్తుగడ మాత్రమే అని సి.పి.ఎం చెబుతుంది. కాని వాస్తవం ఏమిటంటే ఎన్నికల ఎత్తుగడ తప్ప సదరు వ్యూహంలోని ఏ ఇతర ఎత్తుగడనూ సి.పి.ఎం పార్టీ ఎప్పుడూ చెప్పలేదు. అందుకనే ఎన్నికలు అనే ఎత్తుగడ సి.పి.ఎం వ్యూహంగా మారిపోయింది. ఎన్నికల వ్యూహం ప్రకారం అధికారమే లక్ష్యం కనుక ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా తప్పులేదని మీ పై వివరణ చెబుతోంది.

  నా విమర్శను మీ సమాధానం ధృవపరిచింది.

 9. విశేఖర్ గారు
  చివరి పేరాలో ఇంకొక విషయం కూడా చెప్పాను. ’అదే సందర్భంలో కార్మిక వర్గ రాజకీయాలను వదిలిపెట్టి ఇదే పనిమీద నిమగ్నమైతే అదికూడా తప్పే.‘ అని. సిపిఎం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఆయా పార్టీలతో కొంత సాన్నిహిత్యాన్ని చూపించి ఎన్నికల అనంతరం తన మామూలు కార్యక్రమాలపైనే ద్రుష్టి కేంద్రీకరిస్తున్నపుడు ఇక వ్యూహాన్ని ఎత్తుగడగా ప్రమోట్ చేసినట్లు ఎలా అవుతుంది?

 10. అశోక్ గారూ,

  నా పై సమాధానంలోనే మీ తాజా ప్రశ్నకు సమాధానం ఉంది. అది ఇది:

  “కాని వాస్తవం ఏమిటంటే ఎన్నికల ఎత్తుగడ తప్ప సదరు వ్యూహంలోని ఏ ఇతర ఎత్తుగడనూ సి.పి.ఎం పార్టీ ఎప్పుడూ చెప్పలేదు. అందుకనే ఎన్నికలు అనే ఎత్తుగడ సి.పి.ఎం వ్యూహంగా మారిపోయింది.”

  సాయుధ పోరాటం (బల ప్రయోగం) తప్ప విప్లవాలకు మరో దారి లేదన్నది మార్క్సిస్టు సూత్రం కాగా ‘అవసరమైతే సాయుధ పోరాటం’ అని సి.పి.ఎం కార్యక్రమం చెబుతుంది. ఈ రెంటికీ ఉన్న తేడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అవసరమైతే’ అన్నదానిలోనే సాయుధపోరాటాన్ని దూరం నెట్టేసే సులువుని సి.పి.ఎం అట్టిపెట్టుకుంది. ప్రజలు విప్లవానికి సిద్ధంగా లేరని చెప్పడం ద్వారా ఇలా దూరం నెట్టేసే పనిని సి.పి.ఎం చెయ్యగలుగుతోంది. ప్రజలని విప్లవానికి సిద్ధం చేసే బాధ్యతను త్యజించి ఆ తప్పుని ప్రజల పైకే నెట్టడం రివిజినిస్టులు ప్రతిచోటా చేస్తున్నపనే.

  ఇప్పటికిప్పుడు ఆయుధాలు పట్టుకుని యుద్ధం చెయ్యాలా అన్న ప్రశ్న వద్దు. సాయుధ పోరాటమె లక్ష్యం అయినప్పుడు, అందుకోసం కృషి ఇప్పటినుండే మొదలవుతుంది. దానికి సంబంధించిన ఆచరణ ఇప్పుడే కనపడుతుంది. (సాయుధ పోరాటం అనగానే మావోయిస్టులు చేస్తున్నదేనని భావించనవసరం లేదు.) సాయుధ పోరాటం లక్ష్యం కానపుడు, ప్రజల సంసిద్ధతాలేమి, సిద్ధాంత సంక్లిష్టత ల్లాంటి వెనుక దాక్కునే అవకాశం కమ్యూనిస్టు పార్టీలకు ఎప్పుడూ ఉంటుంది.

  గత నలభైయేళ్ల సి.పి.ఎం ఆచరణ రుజువు చేసిందేమిటంటే మీరు చెప్పిన మామూలు కార్యక్రమాలు కూడా ఎన్నికల కోసమేనని. కాదు విప్లవం కోసం అని సి.పి.ఎం అన్నా దానికి తగిన ఆచరణ ఏ కోశానా లేకపోవడమే అసలు విషయం.

 11. Eternally Continued Process (నిరంతరంగా కొనసాగే ప్రక్రియ) అంటే ఇదే. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా తెలుగు దేశంతో వర్గ సహకారం చేస్తారు. కాంగ్రెస్ ఓడిపోయి తెలుగు దేశం అధికారంలోకి వస్తుంది. అప్పుడు తెలుగు దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో వర్గ సహకారం చేస్తారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా తెలుగు దేశంతో వర్గ సహకారం చేస్తారు. ఈ వర్గ సహకారం వల్ల రెండు పాలక వర్గ పార్టీలు దోబూచలాడుకుంటూ ఉంటాయి. కర్ర విరగదు, పాము చావదు. కాంగ్రెస్, తెలుగు దేశంలని విరిచే బలం మాకు లేదని CPI, CPMల నాయకులు చెప్పుకుంటారు. ‘దేశంలో విప్లవం వస్తే మనం కూడా ప్రైవేట్ ఆస్తిని వదులుకోవాల్సి వస్తుంది కనుక మన పార్టీలు చచ్చినా బలపడకూడదు, మనం పాలక వర్గ పార్టీల నీడలోనే ఉంటూ వాళ్ళ సహకారంతోనే వోట్లు సంపాదించాలి‌’ అని ఈ ఉభయచర వామపక్ష పార్టీల నాయకులు అనుకుంటూనే ఉంటారు. దేశంలో విప్లవం వస్తుందని ఆశ పడే వాళ్ళకి మాత్రం పంగనామమే మిగులుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s