ఒకే వేదికపై బి.జె.పి, లెఫ్ట్ పార్టీలు


బి.జె.పి, లెఫ్ట్ పార్టీల నాయకులు ఢిల్లీలో కలకలం సృష్టించారు. చిల్లర వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినందుకు నిరసనగా ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ సందర్భంగా ఉప్పు, నిప్పుగా ఉండవలసినవారు ఒకే వేదికపైకి చేరారు. వ్యాపారులు నిర్వహించిన నిరసన సభలో బి.జె.పి, లెఫ్ట్ పార్టీల అగ్రనాయకులు ఆసీనులై పత్రికల, విశ్లేషకుల ఊహాగానాలకు పని పెట్టారు. ఇది దేశ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చే పరిణామం కాకపోయినప్పటికీ వామపక్ష పార్టీల ప్రకటిత విధానాలు తెలిసినవారు భృకుటి ముడివేసే పరిణామమే.

గురువారం ‘భారత్ బంద్’ సందర్భంగా, ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్’ వారు ఢిల్లీలో సభ నిర్వహించారు. ఈ వేదికపై సి.పి.ఐ, సి.పి.ఎం, బి.జె.పి, జె.డి(యు) నాయకులు ఆసీనులై, ఒకరికొకరు కాంగ్రెస్ వ్యతిరేక సంఘీభావం కూడా తెలుపుకున్నారు. సి.పి.ఐ నాయకులు ఎ.బి.బర్ధన్, అమర్జీత్ కౌర్ లు, సి.పి.ఎం నాయకుడు సీతారాం ఏచూరి, బి.జె.పి నాయకులు నితిన్ గడ్కారీ, మురళీ మనోహర్ జోషి లు వేదికపై ఆసీనులై పత్రికల దృష్టిని ఆకర్షించారు. ఈ వేదికను ఎక్కడానికి ఢిల్లీలోనే అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న టి.డి.పి నాయకుడు చంద్రబాబు నాయుడు, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ లు నిరాకరించడం గమనించదగిన విషయం. 

సభలో బర్ధన్, యేచూరి, జోషి, గడ్కారీ, శరద్ యాదవ్ లు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై దాడి చేశారని ‘ది హిందూ’ తెలిపింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు “ప్రజా వ్యతిరేకమైనవి, జాతీయ వ్యతిరేకమైనవి” అని వారంతా తిట్టిపోసారని తెలిపింది. తన మిత్రుడు ఒబామాని మెప్పించడానికి మన్మోహన్ వ్యవహరిస్తున్నాడని ఆక్షేపించారని తెలిపింది.

వేదికపై బర్ధన్ చెప్పిన మాటలు ప్రస్తావనార్హం. బి.జె.పి, లెఫ్ట్ పార్టీల సిద్ధాంతాలు భిన్నమైనవి కావచ్చు గానీ, ప్రజల కోసం పోరాడేటప్పుడు తామిద్దరమూ ఒకటేనని ఆయన వ్యాఖ్యానించాడు. యూనియన్ కేబినెట్ నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాజీనామా చేయడంపైన ప్రశంసలు కురిపించాడని పత్రికలు చెబుతున్నాయి. బి.జె.పి నాయకుడు జోషి అయితే లెఫ్ట్ పార్టీల కంటే ఒకడుగు ముందేసి ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను, వ్యాపారులనూ’ అమెరికా తదితర పశ్చిమ దేశాలకు బానిసలుగా మార్చుతోందని ఆరోపించాడు.

పార్లమెంటరీ ఊబి మహిమ

బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు భారత దేశంలోని దోపిడి వర్గాలైన భూస్వాములు, పెట్టుబడుదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు. ఇవి పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రభుత్వాధికారం చేతికీ వచ్చాక దోపిడీవర్గాల ప్రయోజనాలే నెరవేరుస్తాయని అరవై అయిదేళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్పష్టంగా రుజువు చేసింది. శ్రామిక ప్రజల ప్రయోజనాలను ఆ పార్టీలు పట్టించుకోవని కూడా రుజువైంది. పట్టించుకోకపోగా హక్కుల కోసం, మెరుగైన జీవనం కోసం ప్రయత్నించే ప్రజలపైన అణచివేతను అమలు చేస్తాయని తేలింది. అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు వీరి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు కట్టుబడి ఉంటాయని కూడా రుజువయింది.

సామ్రాజ్యవాదులకు లొంగిపోయి, వారి ప్రయోజనాలు నెరవేరుస్తూ దేశ ప్రజలను దోచుకు తింటున్న వర్గాలు ముఠాలుగా విడిపోయి కాంగ్రెస్, బి.జె.పి, టి.డి.పి, ఎస్.పి, బి.ఎస్.పి తదితర పార్టీలను రాజకీయ రంగంలో ఏర్పరుచుకున్నాయి. రాజకీయ పార్టీల ద్వారా అధికారం సంపాదించి తమ ఆర్ధిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడం ఈ పార్టీల వెనుక ఉన్న వర్గాల లక్ష్యం. ఆర్ధిక ప్రయోజనాలు పునాదిలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఉపరితలంలో ఉండే రాజకీయాలు ప్రజాస్వామిక భ్రమలను కలిగిస్తాయి. అలాంటి భ్రమలకు ప్రధాన ప్రతినిధులు పార్లమెంటు, అసెంబ్లీలు. కనుక పార్లమెంటు కూడా భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను ‘ప్రజాస్వామ్యం’ ముసుగులో నెరవేర్చే సాధనమే తప్ప అది ప్రజల అధికారానికి ప్రతినిధి కాదు.

అలాంటి పార్లమెంటరీ అధికారం కోసం పెట్టుకునే పొత్తులలో కూడా పాలక వర్గాల రాజకీయాలు ఉంటాయి తప్ప ప్రజల రాజకీయాలు ఉండబోవు. ఎత్తుగడగా వాడుకోవలసిన ఎన్నికలను ప్రధాన వ్యూహంగా మార్చుకున్నాక కమ్యూనిస్టు పార్టీల ఆచరణ ఎన్నికల పంధాలో పరుగులు పెడుతూ పోతున్నది. ఆ పరుగులో మిత్రులెవరు, శత్రువులెవరు అన్న విచక్షణ నశించిపోయింది. విచక్షణ నశించిపోవడానికి ‘సెక్యులరిజం’ గానూ, ‘మతతత్వ వ్యతిరేకత’ గానూ పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు ముసుగులు వేస్తున్నాయి. ఆ పేరుతో దోపిడి వర్గాల ప్రతినిధులయిన కాంగ్రెస్, టి.డి.పి, ఎస్.పి లాంటి పచ్చి దోపిడి పార్టీలతో మార్చి మార్చి పొత్తులు పెట్టుకోవడానికి సైతం వెనుకాడడం లేదు.

మొన్న కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టి.డి.పి తో పొత్తు పెట్టుకున్నవారు నిన్నటి.డి.పి కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడానికి సిద్ధపడిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రేపు టి.డి.పి తో పొత్తు పెట్టుకోవడానికి వీరికి అభ్యంతరం లేదు. మొన్న కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బి.జె.పి తో కలిసి ప్రభుత్వాన్ని నడిపినవారు నిన్న బి.జె.పి కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని నడడపడానికి సిద్ధపడిపోయారు. ఈ రోజు ఆందోళన పేరుతో, ప్రజల ప్రయోజనాల పేరుతో బి.జె.పి నాయకులతో కలిసి వేదిక పంచుకోవడానికి సిద్ధపడిపోవడం ఇందులో భాగమే. కనీసం ములాయం, చంద్రబాబు పాటించిన బెట్టుకూడా సి.పి.ఐ, సి.పి.ఎం నాయకులు పాటించకపోవడం ఆశ్చర్యకరం. ఇదంతా పార్లమెంటరీ ఊబి మహిమ.

ఈ ప్రహసనాలన్నింటిలో ప్రజల ప్రయోజనాలు అపహాస్యానికి గురై, మతతత్వ వ్యతిరేక ఎత్తుగడలుగా, సెక్యులరిజం కోసం పడే తపనగా కుదించుకు పోయాయి. అంతిమంగా ప్రజల ప్రయోజనాలు అనాధగా మారి కమ్యూనిస్టు పార్టీల పత్రికల వ్యాసాల్లో, సిద్ధాంత రాద్ధాంతాల్లో, స్టేజీలపైన ఉపన్యాసాల్లో, మహాసభల కొట్లాటల్లో నలిగి నీరసిస్తున్నాయి.

7 thoughts on “ఒకే వేదికపై బి.జె.పి, లెఫ్ట్ పార్టీలు

 1. ఒక పాలకవర్గ పార్టీ మత రాజకీయాలు నడపకపోతే ఆ పార్టీతో వర్గ సహకారం చెయ్యొచ్చా? ప్రత్యేక తెలంగాణా కోసం ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభకి న్యూ డెమోక్రసీ నాయకులు బిజెపి నాయకులని తీసుకొస్తే ఆశ్చర్యం కలగలేదు కానీ ఢిల్లీలో బిజెపి నాయకుల పక్కన కూర్చున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. అయినా దోచుకోవడానికి మతం పేరు చెప్పుకుంటే ఎంత, చెప్పుకోకపోతే ఎంత?

  కాంగ్రెస్ కూడా virulent anti-communist party. చలసాని ప్రసాదరావు గారు వ్రాసిన “చివరికి ఇలా మిగిలేం” పుస్తకం, కావూరి కుటుంబరావు గారు వ్రాసిన “చల్లపల్లి ఎస్టేట్ రైతాంగ పోరాటం” పుస్తకం చదివాను. అది చదివితే తన వర్గ ప్రయోజనాలని కాపాడుకోవడంలో కాంగ్రెస్‌కీ, బిజెపికీ మధ్య తేడా లేదనే అర్థమవుతుంది. 1953లో కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని ఎన్నికలలో ఓడించడానికి తమ శతృవైన జస్టిస్ పార్టీతో ఎకమయ్యారు. జస్టిస్ పార్టీ నాయకుడు చల్లపల్లి రాజా అధికారికంగా తన పార్టీ మారకముందే కాంగ్రెస్ పార్టీ అతన్ని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ చరిత్ర గురించి CPM అధికారిక ప్రతినిధి తెలకపల్లి రవి వ్రాసిన నిజాలు కూడా ఉన్నాయి. కొరియా యుద్ధ సమయంలో జవహార్ లాల్ నెహ్రూ అమెరికా సామ్రాజ్యవాదులకి బహిరంగంగానే సపోర్ట్ ఇచ్చాడు. కానీ ఆ తరువాత మన దేశంలో సుగర్ ఫాక్టరీలు పెట్టడానికి సాంకేతిక సహకారం అడిగితే అమెరికావాళ్ళు ఇవ్వలేదు. దాంతో నెహ్రూ కృష్చేవ్ కాళ్ళు పట్టుకుని రష్యన్ సాంకేతిక సహకారంతో సుగర్ ఫాక్టరీలు కట్టించాడు. ఇంత తెలిసిన CPMవాళ్ళే కమ్యూనిజం పేరు చెపితే భయపడిపోయే వర్గంతో వర్గ సహకారం చేస్తున్నారు.

  బిజెపి స్థాపించపడినప్పుడు ఆ పార్టీలో చేరిన నాయకులలో ఎక్కువ మంది రెండు మూతపడిన పార్టీల నుంచి వచ్చినవాళ్ళు. అవి జన సంఘ్ (మతతత్వ పార్టీ) & స్వతంత్ర పార్టీ (అమెరికా సామ్రాజ్యవాదాన్ని బహిరంగంగా సమర్థించిన పార్టీ). ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉండబట్టే బిజెపి తమ పార్టీ అధికారంలో ఉన్న ఆరేళ్ళ కాలంలో సామ్రాజ్యవాదులకి అనుకూలమైన విధానాలనే అనుసరించింది. మరి కాంగ్రెస్ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? రాజా రామకృష్ణ రంగారావు, మేకా రంగయ్య అప్పారావు, చల్లపల్లి రాజా లాంటి పక్కా భూస్వామ్యవాదులని వెనకేసుకొచ్చిన పార్టీ అది. జన సంఘ్, స్వతంత్ర పార్టీల చరిత్రని బ్యాక్‌గ్రౌండ్‌గా కలిగి ఉన్న బిజెపి కంటె కాంగ్రెస్ ఎంత గొప్పది?

  మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేస్తానని పార్టీని బెదిరించి మరీ అణు ఒప్పందం అమలు చేశాడంటే సామ్రాజ్యవాదులపై భక్తిలో చక్రవర్తి రాజగోపాలాచారి (స్వతంత్ర పార్టీ నాయకుడు)కీ, మన్మోహన్ సింగ్‌కీ మధ్య తేడా ఏమీ లేదని అర్థమైపోతుంది. వీళ్ళ విధానాలు ఎలాంటివి అనేదే ఇక్కడి సమస్య. వీళ్ళు మతం పేరుతో దోచుకుంటున్నారా లేదా సెక్యులరిజం పేరుతో దోచుకుంటున్నారా అనేది సమస్య కాదు.

 2. “ఇలా మిగిలేం” పుస్తకం కినిగెలో అందుబాటులో ఉంది: http://kinige.com/kbook.php?id=922 కాంగ్రెస్‌తో వర్గ సహకారం చెయ్యడం వల్ల CPI, CPMలకి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఈ రెండు పార్టీల నాయకులు వర్గ సహకారం చెయ్యడం తప్పు అని అంగీకరించలేదు. పైగా “కాంగ్రెస్‌తో వర్గ సహకారం సరిగా చెయ్యకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని” రావి నారాయణరెడ్డి బహిరంగంగానే వాదించాడు. ప్రజల దగ్గర వర్గ పోరాటం కబుర్లు చెపుతూ పాలకవర్గంతో వర్గ సహకారం చేస్తూ ఉంటే ప్రజలు వీళ్ళని అర్థం చేసుకుని వోట్లు వేస్తారని అనుకున్నారు. అలా వోట్లు వెయ్యడం ఇప్పటి వరకు జరగలేదు.

 3. కమ్యూనిస్టులకు చారిత్రక తప్పిదం చేయడం అలవాటుగా మారినట్లుంది.
  పెట్టుబడి దారులను కూల్చడానికని..మరో దోపిడీ పార్టీకి మద్దతు ఇవ్వడం,
  మరో ఎన్నికలలో మొదటి పెట్టుబడి దారి పార్టీకే మద్దతు ఇవ్వడం…ఇదంతా ఒక చక్రంలాగ మారింది. పాపం మరో ప్రత్యామ్నాయం లేదు మరి.

  నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే…

  కమ్యూనిస్టు నాయకులు ఎంతసేపటికీ ఎవరికి మద్దతు ఇవ్వాలా అనే…ఆలోచిస్తారేకానీ తామే సొంతంగా పోటీ చేయాలని ఎందుకు ఆలోచించరు..?

  సొంతంగా పోటీ చేస్తే ఈ సారి కాకుంటే వచ్చేసారైనా ఓట్ బ్యాంక్ పెరుగుతుందిగా?

  ఒక వ్యక్తిపై( టీడీపీ, ఎస్పీ ) , లేదా ఒక కుటుంబంపై ఆధార పడిన పార్టీల అండతో తాము ఏం సాధించగలరు…ఇక ప్రజలకోసం ఏం సాధిస్తారు….?

  మరీ ఘోరం ఏంటంటే చిరంజీవి పార్టీతో,,,జగన్‌ పార్టీతో కూడా పొత్తుకు సిద్ధపడడాన్ని( అప్పట్లో చర్చలు జరిగాయి) ఎలా అర్థం చేసుకోవాలి. .?

  పోనీ పొత్తుల ద్వారానైనా ఈ పార్టీలు లాభపడ్డాయా అంటే అదీ లేదు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో
  ( తెలుగుదేశం రావడానికి ముందు ) కాంగ్రెస్‌కు దీటైన పోటీదారుగా ఉన్న కమ్యూనిస్టులు, గత ఎన్నికల్లో ఒక్క సీటుకే ( సీపీఎం) మొహం వాచే పరిస్థితి తెచ్చుకున్నారు.

  మొత్తంగా తమకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయని….దీర్ఘకాల లక్ష్యం ఉందన్న సంగతే మర్చిపోయి…పొత్తుల సుడిగుండంలో చిక్కుకుని, తమను నమ్మిన వారికి రోజురోజుకూ మరింత దూరమవుతున్నారు.

  తమ అగ్రనాయకులు అలా ఉంటే….. తాము ఏం చేయాలో తెలీక, పార్టీ సిద్ధాంతాలు వదులు కోలేక, ఇంకో పార్టీలోకి పోలేక కార్యకర్తలు బాధపడుతున్నారు.

  ఎప్పటికైనా ఈ దేశంలో ఒకే ఓక కమ్యూనిస్ట్ పార్టీని చూడగలమా..?
  ఎప్పటికీ ఎర్రకోటపై ఎర్రజండా ఎగరాలనుకునే నా లాంటి వాళ్ళ ఆశ ఫలిస్తుందా?

 4. CPM విధానాలని చూసి విరక్తికి లోనైనవాళ్ళలో నేను ఒకణ్ణి. ఒక CPM మేతావి (పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో సులభంగానే తెలిసిపోతుంది) కార్మిక వర్గంతో ఏమాత్రం సంబంధం లేని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సమర్థించడం, మార్క్సిజం గురించి ఒక్క ముక్క కూడా వ్రాయకుండా కాంగ్రెస్ మీద & జగన్ పార్టీ మీద అంచనాలు వేస్తూ కాలక్షేపం చెయ్యడం లాంటివి చేస్తుంటాడు. CPMకి కార్మిక వర్గ విప్లవం మీద ఎంత వరకు కమిట్మెంట్ ఉందో వాళ్ళ అధికార ప్రతినిధి వ్రాసే బ్లాగ్ చదివినా తెలిసిపోతుంది.

  నక్సలైట్ ఉద్యమ చరిత్ర చదివినప్పుడు CPI, CPMలపై విమర్శలు చదివాను. ఎదురీత అనే మార్క్సిస్ట్-లెనినిస్ట్ పత్రికలో కూడా CPI, CPMలపై విమర్శలు చదివాను. బ్లాగుల్లోకి వచ్చిన తరువాత ఒకరిద్దరు CPM మేతావుల విచిత్ర వాదనలు ప్రత్యక్షంగా చూశాను. బ్లాగులు లేని & పత్రికా ప్రకటనలలో కనిపించే CPI, CPM మేతావుల వ్యవహార శైలి కూడా ఇంత కంటే భిన్నంగా ఉంటుందని అనుకోను.

  CPI, CPM మేతావులు మార్క్సిజం వైపు రీఓరియంట్ అవుతారనే భ్రమలు నాకు లేవు. నాకు CPI(మావోయిస్ట్) మీద మాత్రమే ఆశలు ఉన్నాయి. తమ పార్టీకి చెందిన వేలాది మంది కార్యకర్తలు పోలీసుల చేతిలో చనిపోయినా ఆ పార్టీ ఇంకా వర్గ పోరాటాన్ని కొనసాగించడం వల్లే నాకు ఆ పార్టీ మీద విశ్వాసం కలిగింది. మాస్‌లైన్ నిర్మాణం విషయంలో మావోయిస్ట్ పార్టీతో నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి కానీ CPI, CPMల కంటే మావోయిస్ట్ పార్టీ ఎన్నో రెట్లు మెరుగు. అందుకే ఆ పార్టీ మీదే నాకు విశ్వాసం ఉంది.

 5. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన బంధ్ బిజెపి, వామపక్షాలు కలిసి చేయలేదు. వేరువేరుగానే చేసారు. ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్’ వారు ఢిల్లీలో నిర్వహించిన సభలో బిజెపితో కలిసి కూర్చోవడంలో తప్పులేదు. ఎందుకంటే అది నిర్వాహకుల ఆహ్వానం మేరకే కదా? బిజెపి నాయకులున్నారు కదా అని సభకు వెల్లకపోటేనే తప్పు అవుతుంది అని నా అభిప్రాయం.

 6. బిజెపితో కలిసి కూర్చోవడం తప్పా, కాదా అనేది నా అభ్యంతరం కాదు. ఒక పాలకవర్గ పార్టీ మత రాజకీయాలు నడపకపోతే ఆ పార్టీ నాయకులతో కలిసి కూర్చోవచ్చా? జన సంఘ్ రోజులలో కూడా మతతత్వ పార్టీలు అధికారంలోకి రాకుండా చెయ్యడమే ముఖ్యం అని అంటూ కాంగ్రెస్‌తో వర్గ సహకారం చేశారు కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s