మమత బెనర్జీ చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతి, డీజెల్ రేట్ల పెంపుదల, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలో భారీ కోత… నిర్ణయాలను ఉపసంహరించుకోవాలంటూ మమత విధించిన 72 గంటల గడువు ముగిశాక మద్దతు ఉపసంహరిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ప్రకటించింది. కోల్ గేట్ కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ఒక్కుమ్మడిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందన్న అద్వానీ ఆరోపణలను మమత ఉద్ఘాటించింది. ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకున్నట్లయితే ‘మద్దతు ఉపసంహరణ’ నిర్ణయాన్ని సమీక్షిస్తానని హామీ కూడా కాంగ్రెస్ కి ఇచ్చింది.
19 ఎం.పిలున్న తృణమూల్ యు.పి.ఎ లో రెండో పెద్ద పార్టీ. తృణమూల్ మద్దతు ఉపసంహరణతో యు.పి.ఎ బలం 254 కి పడిపోయిందనీ, పూర్తి మెజారిటీకి కావలసిన ఎం.పిల మద్దతును యు.పి.ఎ కోల్పోయి మైనారిటీలో పడిపోయిందనీ ఫస్ట్ పోస్ట్ తెలిపింది. ఎస్.పి (22 మంది ఎం.పిలు), బి.ఎస్.పి (21 మంది ఎం.పిలు) లు బైటినుండి ఇస్తున్న మద్దతే యు.పి.ఎ ప్రభుత్వ మనుగడకు ఇప్పుడు ఆధారంగా నిలిచింది. జనతాదళ్ (సెక్యులర్) పార్టీ మద్దతు కూడా కలిపితే యు.పి.ఎకి 301 ఎం.పిల బలం ఉందని ‘ది హిందూ’ తెలిపింది.
తృణమూల్ కి చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేస్తారని మమత ప్రకటించింది. ఢిల్లీలో జుమా ప్రార్ధనలు ముగిశాక రాజీనామా చేస్తారని ప్రకటించి మమత, బెంగాల్ లో 25 శాతం ఓట్లున్న ముస్లింలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. శుక్రవారం లోపు ప్రభుత్వం కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఏమి బేరసారాలు చేస్తుందో చూడాల్సి ఉంది. అయితే, మమత ప్రకటన తీవ్రత చూస్తే అందుకుగల అవకాశాలపై అనుమానాలు లేవనిపిస్తుంది. మద్దతు ఉపసంహరణ ప్రకటిస్తూ మమత కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసింది. “కాంగ్రెస్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను నేను చూశాను… కాంగ్రెస్ గేమ్ ఏమిటో నాకు తెలుసు. మమతతో తేడా వస్తే వారు ములాయంతో వెళ్తారు; ములాయంతో తేడాలొస్తే, మాయావతివైపు తిరుగుతారు. నితీశ్ నుండి లాలూ వైపు మరలుతారు. డి.ఎం.కె సమస్యలు వస్తే, ఎ.ఐ.డి.ఎం.కె తో వెళ్తారు” అని మమత వ్యాఖ్యానించింది. ఒకప్పుడు ఎన్.డి.ఎ భాగస్వామి అయిన మమత మాత్రం ఏం తక్కువ తిన్నదని?
“కోల్ గేట్ నుండి తప్పించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్.డి.ఐ గేట్లు తెరిచింది” అని మమత ఆరోపించింది. చిల్లర వర్తకాన్ని విదేశీ కంపెనీల చేతుల్లోకి పెట్టడం వెనుక గల బృహత్కారణాలను ఈ ఆరోపణ చిన్నబుచ్చుతోంది. ఆర్ధిక సంస్కరణలకు మరోసారి కట్టు తెంచడంలో భాగంగా, సంవత్సరం పైగా పశ్చిమ దేశాలు, కంపెనీలు, పత్రికల నుండి వస్తున్న ఒత్తిడికి లొంగుతూ మన్మోహన్ ప్రభుత్వం, ఎఫ్.డి.ఐ నిర్ణయం తీసుకున్న సంగతిని మమత ఆరోపణ మరుగుపరుస్తోంది. ఓవైపు ఈ నిర్ణయాలు ప్రజావ్యతిరేకం అంటూనే మరోవైపు ప్రజావ్యతిరేక నిర్ణయాల వెనుక గల విదేశీ కంపెనీల ప్రయోజనాలను చూడడానికి మమత నిరాకరిస్తున్నది. ఆమె స్వయంగా అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ నుండి వాల్ మార్ట్ కంపెనీ తరపున లాబీయింగ్ ఎదుర్కొన్న ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవలసిన విషయం.
మన్మోహన్ గత కొద్ది రోజుల్లో ప్రకటించిన సంస్కరణల నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు ఎస్.పి, బి.ఎస్.పి లతో పాటు యు.పి.ఎ భాగస్వామి డి.ఏం.కె కూడా చెబుతోంది. సెప్టెంబరు 20 తేదీన ప్రతిపక్ష పార్టీలు ప్రకటించిన సమ్మెకు ప్రభుత్వంలో ఉన్న డి.ఏం.కె కూడా మద్దతు ప్రకటించింది. అందరూ ప్రజలకోసం పరితపించేవారే అయినా ప్రజా వ్యతిరేక నిర్ణయాల అమలు కొనసాగడమే ప్రజలు పట్టించుకోవలసిన అసలు వాస్తవం.
అమెరికాతో అణు ఒప్పందం దరిమిలా యు.పి.ఎ-1 కి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించినప్పటి సంక్షోభ పరిస్ధితుల ఛాయలు దేశంలో ఏర్పడినట్లు కనిపిస్తోంది. దేశం కోసం తాము మద్దతు ఉపసంహరించుకున్నపుడు మమత ఎందుకు ఆపని చేయదు అని సి.పి.ఎం కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రశ్నించిన నేపధ్యం మమత నిర్ణయం వెనుక ఉన్నదా అన్నది పరిశీలనాంశం. బెంగాల్ లో వైరి శిబిరాలయిన తృణమూల్, సి.పి.ఎం ల వైరుధ్యం కేంద్రం వరకూ పాకిందన్నది ఒక వాస్తవమే అయినా అది మద్దతు ఉపసంహరించుకునేంతవరకూ వెళ్లగలదా అన్నది కూడా ఒక పరిశీలనాంశం. ఈ అంశాల గ్రావిటీ ఏ పాటిదో మునుముందు తెలియగలదు.
ఎవరెన్ని నాటకాలు ఆడినా మమత నిర్ణయంలోగానీ, సెప్టెంబరు 20 తేదీన పార్లమెంటరీ ప్రతిపక్ష పార్టీలు ప్రకటించిన బంద్ లోగానీ ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ పార్టీల స్వార్ధ ప్రయోజనాలే ప్రధాన పోత్ర పోషిస్తున్నాయన్నది నిజం. ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించనంత బలహీనంగా ఉండడం వలన ఈ పార్టీల నాటకాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి.
ఇప్పటికిప్పుడే ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది కానీ బిజెపి అధికారంలోకి రాకపోవచ్చు. 1992లో పివి నరసింహారావు అమలు చేసిన సరళీకృత ఆర్థిక విధానాలని బిజెపి బహిరంగంగానే సమర్థించింది. బిజెపి ఇప్పుడు కూడా అదే స్టాండ్‌పై ఉంది.
మూడో ఫ్రంట్ పెడతామని ఉభయచర వామపక్ష పార్టీలు వట్టి కబుర్లు చెప్పి గాలికి వదిలేశాయి. తృణమూల్ తదితర పార్టీలైనా మూడో ఫ్రంట్ పెట్టడానికి ప్రయత్నించాలి, వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే.
ఐతే కాంగ్రెస్, లేదంటే భాజపా. ఇంత పెద్ద దేశంలో…ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడో ప్రత్యామ్నాయం లేకపోవడం శోచనీయం. ప్రజల ప్రయోజనాలే పరమార్ధంగా భావించే రాజకీయ పార్టీలు ఉండి ఉంటే…ఇటువంటి రాజకీయ బాగోతాలు సాగేవికావు. ప్రజాప్రయోజనాల పట్ల పక్షపాతం, చిత్తశుద్ధి ఉన్న రాజకీయనాయకులు ఎవరైనా ప్రస్తుతం ఆలోచించాల్సింది..ప్రత్యామ్నాయం గురించే.
అమెరికా సామ్రాజ్యవాదాన్ని బహిరంగంగా సమర్థించినా స్వతంత్ర పార్టీ మూతపడి ఆ పార్టీ నాయకులు జన సంఘ్‌లో చేరిపోయారు. జన సంఘ్ కూడా మూతపడి ఆ పార్టీ నాయకులు బిజెపిలో చేరిపోయారు. చాలా పాలక వర్గ పార్టీలు పుట్టాయి & మూతపడ్డాయి కాంగ్రెస్, బిజెపిలని బలపరుస్తూ.
పివి నరసింహారావు JMM ఎం.పి.లని కొని అధికారాన్ని కాపాడుకున్నట్టు మన్మోహన్ సింగ్ ఇంకో పార్టీ ఎం.పి.లని కొంటాడులే.
ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తే మంత్రి పదవులు వస్తాయనీ, ఉత్తర్ ప్రదేశ్‌కి కేంద్ర నిధులు ఎక్కువ విడుదల అవుతాయని సమాజ్‌వాది పార్టీ కంఫర్మ్ చేసేసింది కనుక యు.పి.ఎ. ప్రభుత్వం కూలే అవకాశం లేనట్టే.