లిబియా ఎంబసీపై దాడులు అమెరికాకి ముందే తెలుసు -ది ఇండిపెండెంట్


దాడి అనంతరం అమెరికన్ ఎంబసీ (బెంఘాజి) లోపలి గది (ఫొటో: టైమ్ నుండి)

లిబియాలో అమెరికా రాయబారి హత్యకు దారి తీసిన ‘ఆల్-ఖైదా’ దాడుల గురించి అమెరికాకి ముందే తెలిసినా ఏమీ చేయలేదని బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ వెల్లడి చేసింది. సెప్టెంబరు 11, 2012 తేదీన లిబియా నగరం బెంఘాజీ లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్, మరో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందిన సంగతి విదితమే. అమెరికా మద్దతుతో లిబియాను పాలిస్తున్న ఆల్-ఖైదా గ్రూపుల్లోని ఒక గ్రూపు అమెరికా రాయబారి హత్యకు బాధ్యురాలు. ఈ దాడి ముందస్తు పధకం ప్రకారం జరిగిందని తాజాగా అమెరికా భావిస్తోంది. ఇస్లాంను అవమానిస్తూ ఒక అమెరికన్ యూదు నిర్మించిన సినిమాయే ఈ దాడికి కారణమని అమెరికా పైకి చెప్పినప్పటికీ వాస్తవానికి అది అమెరికా అభిప్రాయం కాదని ‘ది ఇండిపెండెంట్’ కధనం స్పష్టం చేస్తున్నది.

సీనియర్ రాయబార వర్గాల ప్రకారం దాడికి 48 గంటల ముందే ‘దాడి జరగవచ్చన్న సమాచారం’ అమెరికా వద్ద ఉన్నది. అమెరికా విదేశాంగ శాఖకి ఈ మేరకు విశ్వసనీయమైన సమాచారం అందింది. లిబియాలోని బెంఘాజి, ఈజిప్టు రాజధాని కైరో నగరాల్లో అమెరికా ఎంబసీలపై దాడులు జరగవచ్చని ఈ సమాచారం సారాంశం. అయినప్పటికీ తమ ఎంబసీ సిబ్బంది రక్షణకు తగిన భద్రతా చర్యలను అమెరికా తీసుకోలేదు. ఇలాంటి సమాచారం అందినపుడు ఎంబసీ సిబ్బంది ‘హై అలర్ట్’ పాటించవలసి ఉంటుంది. ‘లాక్ డౌన్’ స్ధితిలోకి వెళ్లవలసి ఉంటుంది. ఈ స్ధితిలో ఎంబసీ సిబ్బంది కదలికలపై గట్టి నిబంధనలు అమలులో ఉంటాయి. కానీ దాడి సమాచారమే సిబ్బందికి చేరకపోవడంతో వారు జాగ్రత్తలు తీసుకునే అవకాశమే లేకపోయింది.

సేఫ్ హౌస్ కి సేఫ్ కరువు

లిబియా నగరంలో అమెరికన్ ఎంబసీపై దాడి జరిగిన వెంటనే ఎంబసీ సిబ్బంది అందరూ నగరంలోని ‘సేఫ్ హౌస్’ కి తరలించబడ్డారు. సేఫ్ హౌస్ నుండి ఎంబసీ సిబ్బందిని తప్పించడానికి రాజధాని ట్రిపోలి నుండి ఎనిమిది మంది అమెరికా రెస్క్యూ టీమ్ అక్కడికి వచ్చింది. వారితో పాటు ‘ఫిబ్రవరి 17 బ్రిగేడ్’ (గడాఫీని కూల్చడానికి అమెరికా తరపున పని చేసిన సంస్ధల్లో ఒకటి) కి చెందిన సైనిక బృందం కూడా కెప్టెన్ ‘ఫతి అల్-ఓబీది’ నేతృత్వంలో సేఫ్ హౌస్ కి చేరుకుంది. ఈ సేఫ్ హౌస్, అత్యంత రహస్యంగా ఉండే చోటు. అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా, ఈ సేఫ్ హౌస్ కూడా తీవ్ర స్ధాయిలో దాడికి గురయింది. 40 మంది వరకూ ఉన్న అమెరికా ఎంబసీ సిబ్బందిని తప్పిస్తుండగా మోర్టార్లతో ఖచ్చితమైన లక్ష్యంతో సేఫ్ హౌస్ పై దాడి చేశారు.

“దాడి చేయడానికి ఈ చోటుని వారు ఎలా కనిపెట్టారో తెలియడం లేదు. దాడి పధకం ప్రకారమే జరిగింది. చాలా ఖచ్చితత్వంతో మాపై దాడి చేశారు. సాధారణ విప్లవకారులేవరికీ అది సాధ్యం కాదు” అని కెప్టెన్ ఓబీదీ చెప్పినట్లు ‘ది ఇండిపెండెంట్’ తెలిపింది. “మా పైన మోర్టార్ల వర్షం కురిసింది. ఆరు మోర్టార్లు నేరుగా విల్లా దారిలోనే పడ్డాయి” అని ఓబీదీ తెలిపాడు. ఈ లోపు లిబియా ప్రభుత్వ బలగాలు రావడంతో దాడి అంతటితో ముగిసింది. ఈ లోపు స్పెయిన్ లోని అమెరికా సైనిక స్ధావరం నుండి లిబియాకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాపితంగా అమెరికా వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తిన నేపధ్యంలో ఇతర దేశాలకు కూడా సైన్యాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్, ఆర్మీనియా, బురుండి, జాంబియా తదితర దేశాల్లోని అమెరికా ఎంబసీలను ‘స్పెషల్ అలర్ట్’ లో ఉంచారని కూడా తెలుస్తోంది.

హత్యకు గురయిన క్రిస్ స్టీవెన్స్ వాస్తవానికి ఆ రోజు బెంఘాజీ లో ఉన్న సంగతి రహస్యం. ఆయన అప్పటిదాకా జర్మనీ, ఆస్ట్రియా, స్వీడన్ దేశాల పర్యటనలో ఉన్నాడు. లిబియాకి అంతక్రితమే వచ్చాడు. భద్రంగానే లిబియా రావచ్చని ఎంబసీ సిబ్బంది చెప్పడంతో బెంఘాజీ వచ్చి దాడిలో చనిపోయాడు. మొత్తం ఎనిమిది మంది అమెరికన్లు దాడిలో గాయపడ్డారు. స్టీవెన్స్ తో పాటు కమ్యూనికేషన్స్ అధికారి సీన్ స్మిత్, మరో ఇద్దరు మెరైన్ సైనికులు చనిపోయినవారిలో ఉన్నారు. సేఫ్ హౌస్ నుండి ఎంబసీ సిబ్బందిని ట్రిపోలికి తరలించారు. అత్యవసరమైన సిబ్బందిని అక్కడే ఉంచి మిగిలినవారిని అందరినీ అమెరికాకి తరలించినట్లు ఇతర పత్రికలు తెలిపాయి.

డాక్యుమెంట్లు మాయం

పత్రిక కధనం ప్రకారం అమెరికా ప్రభుత్వం ఇపుడు లిబియాలో ఒక విషమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. బెంఘాజీ ఎంబసీ నుండి అనేక సెన్సిటివ్ డాక్యుమెంట్లు మాయం అయ్యాయి. సేఫ్ హౌస్ గా భావించిన స్ధావరంపై దాడి జరగడం ఈ సంక్షోభం తీవ్రతను తెలియజేస్తోంది. లిబియా వ్యాపితంగా ఉన్న అమెరికా సేఫ్ హౌస్ లకు గల రక్షణపై అనుమానాలు తలెత్తాయి. గడాఫీని హత్య చేసి తన తొత్తులకు, ఆల్-ఖైదా గ్రూపులకు లిబియాను అప్పగించాక ఆ దేశాన్ని మిలిటెంట్ల కార్ఖానాగా మార్చివేశారు. మత ఛాందస టెర్రరిస్టులను ఉత్పత్తి చేసి అరబ్, ముస్లిం దేశాల్లో కాస్తో, కూస్తో సెక్యులరిస్టు పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలను కూలగొట్టే కుట్రలో భాగస్వాములను చేస్తున్నారు. సిరియాలో జరుగుతున్న కిరాయి తిరుగుబాటులో లిబియానుండి వచ్చిన ఆల్-ఖైదా టెర్రరిస్టులు కూడా ఉన్న విషయం ఈ సందర్భంగా గుర్తు తెచ్కుకోవచ్చు. ఈ నేపధ్యంలో అమెరికా బలగాలకూ, సిబ్బందికీ రక్షణ లేకపోవడం అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారుతుంది.

మాయమైన పత్రాల్లో అమెరికా రహస్యాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అమెరికాతో కలిసి పని చేస్తున్న లిబియన్ల వివరాల జాబితాలు అందులో ఉన్నాయని, ఇవి బైటికి వస్తే అమెరికా మద్దతుదారుల భద్రతకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని భావిస్తున్నారు. మరి కొన్ని పత్రాలు ఆయిల్ కాంట్రాక్టులకు సంబంధించినవిగా తెలుస్తున్నది. ప్రభుత్వం వద్ద ఉండవలసిన ఆయిల్ కాంట్రాక్టు పత్రాలు అమెరికా ఎంబసీ వద్ద ఉండడాన్ని బట్టి ప్రపంచ వ్యాపితంగా అమెరికా ఎంబసీలు చేసే పనేమిటో అర్ధం అవుతున్నది.

ఆల్-ఖైదా ప్రతీకారం

‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ పేరుతో ఒక అమెరికన్ యూదు నిర్మించిన సినిమా బెంఘాజీ దాడికి కారణమని అమెరికా సాధారణ ప్రకటన చేసింది. అయితే అంతర్గతంగా అమెరికా అభిప్రాయం అది కాదు. బెంఘాజీ దాడి యొక్క విస్తృతి, ఆయుధాల వినియోగం తదితర అంశాలను బట్టి అది పధకం ప్రకారమే జరిగినట్లు స్పష్టం అవుతోందని అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ పాట్రిక్ కెన్నడీ భావిస్తున్నాడని ‘ది ఇండిపెండెంట్’ తెలిపింది. పాకిస్ధాన్ లో అమెరికా డ్రోన్ దాడిలో ఆల్-ఖైదా నాయకుడు మహమ్మద్ హాసన్ ఖేద్ ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆయన హత్యకు ప్రతీకారంగానే సెప్టెంబరు 11 దాడుల వార్షిక దినాన్ని పురస్కరించుకుని బెంఘాజీ దాడి జరిగిందని అమెరికా అధికారులు ఒక నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దాడి జరిగినపుడు బెంఘాజీ లోని అమెరికా ఎంబసీకి 30 మందికిపైగా లిబియన్ భద్రతా సిబ్బంది కాపలాగా ఉన్నారు. వీరెవరూ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించకపోగా ఎంబసీ రక్షణను గాలికొదిలేస్తూ అక్కడినుండి వెళ్ళిపోయారు. కోపోద్రిక్తులైన ప్రజలు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎంబసీపై దాడి చేసిన 15 నిమిషాలకే ఎంబసీ రక్షణ వ్యవస్ధ ఛేదించబడింది. “దాడి జరగడానికి అనుమతించినవారిలో భద్రతా బలగాలు కూడా ఉన్నారు. ఎందుకంటే సినిమా పట్ల వారు స్వయంగా గాయపడి ఉన్నారు. ఎంబసీ కంటే ప్రవక్తకే వారు ఎక్కువ విధేయతతో ఉంటారు. ప్రవక్తకు జరిగిన అవమానంతో పోలిస్తే చావులేవీ పెద్ద లెక్కలోనిని కావు” అని బెంఘాజీ లోని పోలీసు బలగాల అధికారి ఒకరు చెప్పాడు.

తమ ఎంబసీల రక్షణ కోసం అమెరికా పంపుతున్న సైనిక బృందాలను కొన్ని అరబ్, ముస్లిం ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ వంకతో అమెరికా తన సైనికులను వివిధ దేశాలకు పంపే కుట్ర  చేస్తున్నదని కొందరు పరిశీలకులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు కూడా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s