ఆఫ్ఘన్ దురాక్రమణ: 3 రోజుల్లో 8 మంది నాటో సైనికులు హతం


British Airfield Camp Bastion (Photo: wtop.com)

శుక్రవారం నుండి ఆదివారం వరకూ మూడు రోజుల పరిధిలో ఎనిమిది మంది నాటో సైనికులు హతమయ్యారు. ఆఫ్ఘన్ ప్రతిఘటనా దళాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే సైనిక స్ధావరాలపై దాడులు చేసి శుక్రవారం ఇద్దరు, శనివారం మరో ఇద్దరు, ఆదివారం నలుగురు విదేశీ దురాక్రమణ సైనికులను చంపేశారు. చనిపోయిన విదేశీ సైనికులు ఏ దేశానికి చెందినదీ తెలియలేదు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లోని బ్రిటిష్ స్ధావరంలో శుక్రవారం చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికులని, శనివారం చనిపోయిన ఇద్దరు బ్రిటిష్ సైనికులని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. ఆదివారం హతమైన సైనికులు ఏ దేశానికి చెందినదీ నాటో ప్రకటించలేదు.

కేంప్ లెదర్ నెక్

15 మంది తాలిబాన్ సైనికులు శుక్రవారం హెల్మండ్ రాష్ట్రంలోని అమెరికన్ స్ధావరంపై దాడి చేశారు. ఇది బ్రిటిష్ వైమానిక స్ధావరమైన ‘కేంప్ బేషన్’ కు పక్కనే ఉంది. అమెరికా సైనికుల యూనిఫారం ధరించిన తాలిబాన్ సైనికులు, అమెరికా స్ధావరం ‘కేంప్ లెదర్ నెక్’ పైన ఆటోమేటిక్ రైఫిళ్ళు, మోర్టార్లు, ఆత్మాహుతి బెల్టులు, ర్యాకేట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో దాడి చేసి క్యాంప్ చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని ఛేదించుకుని లోపలికి జొరబడ్డారు. జెట్ ఫైటర్లకూ, ఇతర సామాగ్రికీ తీవ్ర నష్టం కలిగించారు. ఆరు హేరియర్ జెట్ ఫైటర్లను నాశనం చేశారు. స్ధావరంలో ఉన్న మూడు రీ-ఫ్యూయెలింగ్ స్టేషన్లను ధ్వంసం చేశారు. సి.ఎన్.ఎన్ ప్రకారం ఆరు రీ-ఫ్యూయెలింగ్ స్టేషన్లు, ఆరు ఎయిర్ క్రాఫ్ట్ యేంగార్లతో పాటు ఎనిమీది జెట్ ఫైటర్లు ధ్వంసం అయ్యాయి.

ఇద్దరు అమెరికా సైనికులు ఈ దాడిలో హతం కాగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఒక సివిల్ కాంట్రాక్టర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. తాలిబాన్ సైనికుల్లో 14 మంది చనిపోగా ఒకరు పట్టుబడ్డాడని తెలుస్తోంది. అత్యంత సమన్వయంతో తాలిబాన్ సైనికులు దాడి చేశారని అమెరికా సైనికాధికారులు ప్రకటించారు. అమెరికా సైనికుల యూనిఫారం తాలిబాన్ కి ఎలా లభించిందీ చెప్పలేకపోతున్నారు. స్ధావరంలో నుండి సహకారం లేనిదే ఈ దాడి జరగదని సి.ఎన్.ఎన్ చెబుతోంది.

దాడి జరిగిన ‘కేంప్ లెదర్ నెక్’ సైనిక స్ధావరం బ్రిటిష్ వైమానిక స్ధావరం పక్కనే ఉంది. బ్రిటిష్ వైమానిక స్ధావరం ‘కేంప్ బేషన్’ లో బ్రిటిష్ రాజ కుటుంబం సభ్యుడు ప్రిన్స్ హ్యారీ డ్యూటీలో ఉన్నాడు. అమెరికాలో ఒక హోటల్ లో మరో స్త్రీతో కలిసి నగ్నంగా దొరికిపోయిన హ్యారీని, పత్రికల ప్రచారం నుండి తప్పించడానికి ఆఫ్ఘనిస్ధాన్ కి పంపినట్లు గత కొన్ని రోజులుగా పత్రికలు చెబుతున్నాయి. హ్యారీ హత్యకు తాలిబాన్ పిలుపిచ్చిన నేపధ్యంలో ఈ కోణంలో కూడా తాలిబాన్ దాడి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆఫ్ఘన్ పోలీసులే…

ఆదివారం ఉదయం తెల్లవారకముందే, దక్షిణ ఆఫ్ఘనిస్ధాన్ లో ఒక చెక్ పోస్టు వద్ద ఆఫ్గన్ పోలీసులు నాటో బలగాలపై తుపాకులు ఎక్కుపెట్టారు. నలుగురు నాటో సైనికులని చంపేశారు. ఒకే ఒక ఆఫ్ఘన్ పోలీసు ఈ సాహసానికి పాల్పడి అనంతరం తప్పించుకుపోయాడని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. అయితే దాడిలో పాల్గొన్నది ఒకరి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చని వారు తెలిపారు. తప్పించుకున్న ఆఫ్ఘన్ పోలీసు కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.

శనివారం ఇలాగే ఆఫ్ఘన్ పోలీసు ఒకరు బ్రిటిష్ సైనికులపై కాల్పులు జరిపి ఇద్దరు బ్రిటిష్ సైనికులను చంపేశారని పత్రికలు తెలిపాయి. కానీ శనివారం జరిగిన ఘటనలపై సరైన సమాచారాన్ని పత్రికలు ఇవ్వలేదు. హెల్మండ్ రాష్ట్రంలో పెట్రోలింగ్ జరిపి తిరిగి వస్తున్న బ్రిటిష్ సైనికులపై ఆఫ్ఘన్ పోలీసు అకస్మాత్తుగా వారిపై కాల్పులు జరిపాడని రాయిటర్స్ తెలిపింది. హెల్మాండ్ రాష్ట్రం తాలిబాన్ కు పట్టు ఉన్న రాష్ట్రంగా పత్రికలు చెబుతున్నాయి.

నాటో వద్ద శిక్షణ పొందుతున్న ఆఫ్ఘన్ పోలీసులే నాటో బలగాలపై తుపాకులు ఎక్కుపెట్టడం తరచుగా జరిగే వ్యవహారం. ఈ ఒక్క సంవత్సరం లోనే ఇప్పటివరకూ 37 దాడులు అలాంటివేనని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. 2014లో నాటో సైనికులను పాక్షికంగా ఉపసంహరించుకున్నాక భద్రతా బాధ్యతలను ఆఫ్ఘన్ సైనికులకు, పోలీసులకు అప్పగించేందుకు నిర్ణయించారు. సైనిక ఉపసంహరణ అని చెబుతున్నప్పటికీ పెద్ద సంక్ష్యలో అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్ధాన్ లోనే కొనసాగుతారు. అయితే వీరికి పోరాడే (అణచివేసే) పాత్రం ఉండదనీ, దానిని ఆఫ్ఘన్ సైనికులకు అప్పజెపుతారని చెబుతున్నారు.

అమెరికన్ యూదు ఒకరు నిర్మించిన ఇస్లాం వ్యతిరేక సినిమా ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లింస్’ సినిమా పేరు చెప్పి ప్రపంచవ్యాపితంగా అకస్మాత్తుగా అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు, దాడులు జరుగుతున్నాయి. సినిమా వల్లనే అని పశ్చిమ పత్రికలు చెబుతుండగా, సెప్టెంబరు 11 దాడుల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ముస్లిం మిలిటెంట్ సంస్ధలు ఈ దాడులు జరుపుతున్నారని స్వతంత్ర పరిశీలకులు చెబుతున్నారు. మధ్య ప్రాచ్యంలో మరిన్ని సైనిక బలగాలను పెంచడానికి కుట్ర చేసి సినిమాను సమయం చూసుకుని ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారనీ, అమెరికా ఎంబసీలపై దాడులకు సాకుగా చూపి అమెరికా ప్రజల్లో భయభ్రాంతులను, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి, విదేశీ ఆక్రమణలను సమర్ధించుకునే కుట్ర ఇందులో ఉన్నదని నిపుణులు చెబుతున్నట్లు ప్రెస్ టి.వి తెలిపింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s