చిల్లర వర్తకంలో 51% విదేశీ పెట్టుబడులకు కేబినెట్ అనుమతి


అమెరికన్ కంపెనీలకు ఇచ్చిన హామీని భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది. దేశంలో ఇరవై కోట్లమందికి ఉపాధి నిస్తున్న చిల్లర వర్తకాన్ని తీసుకెళ్లి వాల్ మార్ట్ చేతుల్లో పెట్టింది. చిల్లర కొట్లు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకున్న ఐదు కోట్ల కుటుంబాలను వీధి పాలు చేస్తూ రిటైల్ వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుందని ‘ది హిందూ’ తెలిపింది.

ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా పత్రికలకు చెప్పలేదు. పేరు చెప్పవద్దని కోరుతూ ఒక కేంద్ర మంత్రి ఈ విషయాన్ని చెప్పాడని పి.టి.ఐ వార్తా సంస్ధ తెలిపింది. ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశమై గత సంవత్సరం నవంబరులో తీసుకున్న నిర్ణయాన్ని క్రియాశీలకం చేయడానికి పచ్చ జెండా ఊపిందని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది.

రిటైల్ వర్తకంలో అమ్మే సరుకుల్లో 30 శాతం స్ధానిక వనరులనుండే సమీకరించాలని షరతు పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. అంటే 70 శాతం సరుకులు విదేశీ వనరుల నుండి సమీకరించడానికి అనుమతి ఇచ్చినట్లే కదా. దానర్ధం దేశంలో పండే తిండి గింజలు, పప్పు దినుసులు, నూనెలు తదితరాలన్నీ మార్కెట్ కోల్పోతాయి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ఉండదు. దేశీయ పంటలను కొనే నాధుడు ఉండడు. విదేశీ కంపెనీల సరుకులు దేశాన్ని మరింతగా ముంచెత్తుతాయి.

అపారమైన పెట్టుబడుల వనరులతో బలిసి ఉన్న వాల్ మార్ట్ లాంటి కంపెనీలు మార్కెట్ ను ఆక్రమించుకోవడానికి ప్రారంభంలో కొద్ది సంవత్సరాల వరకూ చౌక ధరలకు సరుకులు ఇచ్చేస్తాయి. ఆర్ధిక వనరులు మిగుల్చుకునే ఊదేశ్యంతో దేశ ప్రజానీకం ఆబగా ఆ సరుకుల వెంటబడి కొనేస్తుంది. ఈ లోపు దేశీయ సరుకులు అమ్మకాలు లేక ఉత్పత్తి పడిపోతుంది. దివాళా తీసి ఉత్పత్తి కార్యకలాపాలు ముగించుకుంటాయి.

ఆ తర్వాత మొదలవుతుంది అసలు జాతర. దేశంలో నిలదొక్కుకున్న విదేశీ కంపెనీలు విశ్వరూపం చూపుతాయి. దేశీయ రిటైల్ కంపెనీలను ఒక్కొక్కటిగా కొనేస్తాయి. అందులో కూడా విదేశీ సరుకుల్ని నింపేస్తాయి. దేశీయ ఉత్పత్తిదారులకు ఉన్న మార్కెట్ ను వశం చేసుకున్నాక తమ సరుకుల ధరలను క్రమంగా పెంచుకుంటూ పోతాయి. లాభాల పంటలు పండించుకుంటాయి.

భారత దేశంలో విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదంటూ ఒబామా చేసిన బెదిరింపు ప్రసంగం భారత దేశ రైతు మెడకు ఉరిగా మారనున్నది. నాలుగు కోట్ల దేశీయ చిల్లవర వర్తకులకు ప్రాణ సంకటంగా మారనుంది. ఐదు కోట్ల స్వయం ఉపాధిదారులు ఆకర్షణీయమైన యూనిఫారం లు ధరించే కొద్ది లక్షల కాంట్రాక్ట్ నెల జీతగాళ్లుగా కుదించుకుపోనున్నారు. నిరుద్యోగ సైన్యానికి నూతన రిక్రూట్‌మెంట్ ఫ్రంట్ తెరుచుకోనున్నది. భారత దేశ సామాజిక జీవనం మరింత ఛిద్రం కానున్నది.

13 thoughts on “చిల్లర వర్తకంలో 51% విదేశీ పెట్టుబడులకు కేబినెట్ అనుమతి

 1. “ఐదు కోట్ల స్వయం ఉపాధి ఆకర్షణీయమైన యూనిఫారం లు ధరించే కొద్ది లక్షల కాంట్రాక్ట్ నెల జీతగాళ్లుగా కుదించుకుపోనున్నారు. నిరుద్యోగ సైన్యానికి నూతన రిక్రూట్ మెంట్ ఫ్రంట్ తెరుచుకోనున్నది. భారత దేశ సామాజిక జీవనం మరింత ఛిద్రం కానున్నది.”

 2. కార్పొరేట్ మాల్స్‌లో ధరలు మనం అనుకున్నంత తక్కువ కాదు. సెక్యూరిటీ గార్డ్‌లకి జీతాలు ఇవ్వడానికి & సిసి కెమెరాల ఏర్పాటుకీ వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటాయి. గ్లోబలైజేషన్ అనుకూల పత్రికలు చెపుతున్నంత తక్కువ ధరకి ఈ కార్పొరేట్ మాల్స్ నిర్వాహకులు సరుకులు అమ్మితే వాళ్ళకి మిగులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?

 3. Sarat Chandra Routhu said on Facebook:

  ఇకనుండి రైతుల ఆత్మహత్యలుండవు, ప్రభుత్వ హత్యలూ ఉండవు!

  ఇకనుండి కార్మికుల సమ్మెలు ఉండవు, ప్రజల ఆర్తనాదాలూ ఉండవు!

  మీ టీవీల్లోకి వేడి వేడిగా అమెరికా వార్తలు.. (అర్ద?)నగ్న దృశ్యాలు, కడుపులోకి చల్ల చల్లగా ప్యాకేజ్డ్ ఫుడ్, వంటి మీదకి, ఇంటిలోనికి రంగు రంగుల చైనా వస్తువులు మాత్రం ఉంటాయి!

  అరువు తెచ్చుకోడానికి వీది చివర కిరాణా కొట్టు ఉండకపోయినా, వాల్‌మార్ట్ లో గీకడానికి బ్యాంకులు క్రెడిట్ కార్డులిస్తాయి!

  పండించే పంటకి మద్దతు ధర రాకున్నా అందులో సగం ధరకే మెగాస్టోర్లో సరుకులు దొరుకుతాయి!

  పంచెకట్లు, చిరిగిన బనియన్లు పోయి ప్యాంటు చొక్కాలతో మన రైతులు, కిరాణా వ్యాపారులు వాల్‌మార్ట్ ఎ.సి లో సుఖంగా ‘స్వేచ్చగా’ ఉద్యోగాలు చేస్తుంటారు!

  భారతదేశపు ద్రవ్యోల్బణం సున్నా అవుతుంది, ప్రగతి మాత్రం పరుగులెడుతుంది!!

  Hail America! Hail Manmohan! Hail Sonia!!!

 4. చరిత్ర పునరావృతమవుతుంది…అంటే ఏమిటో అనుకున్నా….అప్పుడెప్పుడో…పదిహేడో శతాబ్దంలో ఈస్టిండియా…తదితర పాశ్చాత్య వ్యాపార వర్గాలు మొదట వ్యాపారం చేసి…క్రమంగా పాలకులపై ఒత్తిడి తెచ్చి పాలనావిధానాలను తమకనుకూలంగా మార్చుకున్నారు. తర్వాత తామే ఆయుధాలు సమకూర్చుకుని యుద్ధాలు చేసి దేశాన్ని ఆక్రమించుకున్నారు. పేరుకు పాలన ఐనా తమ వ్యాపారాలతో ఈ దేశాన్ని ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. సంపద కొల్లగొట్టారు. చివరకు ఈ దేశవనరులు అన్నీ దాదాపూ దోచుకున్న తర్వాత ( పేరుకు ) స్వంతంత్రం దక్కింది.

  ఇది చరిత్ర

  మన పాలకులు చరిత్రనుంచి గుణపాఠం నేర్చుకోలేదన్న మాట. మరోసారి ఈ దేశాన్ని పాశ్చాత్య వ్యాపార వర్గాలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారన్న మాట.

 5. మమత ఇప్పుడే గర్జించినట్లుంది. రిటైల్ వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిని ఉపసంహరించుకోడానికి కేంద్ర ప్రభుత్వానికి 72 గంటల గడువు ఇస్తున్నట్లు హెచ్చరించింది. అటు ములాయం నోరు మూతపడిపోయింది. రేపు ఉదయానికి గాని దీనిపై ఎవరు ఏమంటున్నారో, ఎవరు ఏవైపు దూకుతారో స్పష్టం కాదు.

  20 కోట్లమంది జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్న పెను ఉత్పాతానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలిసింది, పాలక వర్గాల రెండు నాలికల ధోరణిపై తిరగబడవలసిందీ ప్రజలే. ఆ 20 కోట్ల మంది రేపటినుంచి కూడా తమ వీధిబేరాలకు పరిమితమై వ్యాపారం చేసుకుంటూంటే మాత్రం వాళ్లు ఆ వ్యాపారాలకే త్వరలో దూరం కాక తప్పదు.

  కాగితం పులులు గర్జిస్తే, తుస్సుమంటే పరిష్కారమయ్యే సమస్య కాదిది. 1947కి ముందూ, తర్వాతా కొనసాగుతున్న దోపిడి చరిత్రనుంచి పాలకులు గుణపాఠం తీసుకోవడానికి ఆస్కారం లేదు. గుణపాఠం తీసుకోవలసిందల్లా ప్రజలే.

 6. “Sharma also reiterated that foreign retailers planning to enter the multi-brand segment would have to invest a minimum of USD 100 million with 50 percent of it in rural areas”

  వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ ఈ ఒక్క ప్రకటనతో తన సీనియర్ ఆషాఢభూతులు చిదంబరం, కపిల్ సిబాల్, మన్మోహన్‌ సింగ్‌లనే అధిగమించేశాడు. కనిష్టంగా 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని మాత్రమే విదేశీ వర్తకులు ఈ విభాగంలో పెట్టనున్నారని హామీ కూడా ఇచ్చేశాడు.

  ‘బొగ్గుగనులు అమ్మినంత మాత్రాన దేశం నష్టపోయినట్లేనా, అసలు ఒక్కటంటే ఒక్క గనిని కూడా ప్రయివేటోళ్లు తవ్వనిదే… అంటూ చిదంబర్ మన్మోహన్‌లు ఎంత అసహ్య ప్రకటన చేశారో..’ ఆనంద్ శర్మ నాలుగాకులు ఎక్కువే చదివినట్లుంది.

  వాల్‌మార్ట్ లేదా మరొక గీల్‌మార్ట్ మన దేశంలో ఎంత పెట్టుబడిని వాస్తవంగా గుమ్మరించనున్నాయో తేల్చగలిగే, తనిఖీ చేయగలిగి ధైర్యం, వెన్నెముక ఈ ఆనంద శర్మలకు ఉన్నాయా? జనతా ప్రభుత్వ హయాంలో కోకాకోలా కంపెనీని దేశం నుంచి సాగనంపిన ఏకైక ఘటనను తప్పిస్తే భారత పాలక వర్గాలు విదేశీ కంపెనీలను ప్రశ్నించిన, అడ్డుకున్న చరిత్ర లేనే లేదు మరి.

  ప్రజలు అన్నింటినీ సహించి ఊరుకుంటున్నంత మాత్రాన…

  ఎంతకు తెగించారు వీళ్లు….

 7. సోనియా గాంధీ మన్మోహన్‌ని ప్రధానిగా పెట్టినదే సామ్రాజ్యవాద అనుకూల విధానాలని అమలు చెయ్యించడానికి. మన్మోహన్‌కి పివి నరసింహారావు దగ్గర పని చేసిన అనుభవం ఉంది కదా. పివి నరసింహారావు విధానాలనే మన్మోహన్ అమలు చేస్తాడని సోనియాకి బాగా తెలుసు.

 8. రాజశేఖర్ గారు, మన్మోహన్ & చిదంబరం ప్రజలని పంగనామాలు పెట్టుకునేవాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. గనిని పదేళ్ళు లీజ్‌కి తీసుకున్నవాడు ఐదేళ్ళ తరువాతైనా గని తవ్వుకోగలడు. ప్రజలు ఈమాత్రం తెలియని అమాయకులా? తిరునామం పెట్టుకోవడానికి శ్రీవైష్ణవ మతం పుచ్చుకోనక్కరలేదు, పాలకవర్గం చేసే ప్రకటనలు నమ్మితే చాలు.

 9. “తిరునామం పెట్టుకోవడానికి శ్రీవైష్ణవ మతం పుచ్చుకోనక్కరలేదు, పాలకవర్గం చేసే ప్రకటనలు నమ్మితే చాలు.”
  అద్భుతమైన వ్యాఖ్య ప్రవీణ్ గారూ.. ధన్యవాదాలు.

 10. కిరాణా దుకాణాలకు వెళ్ళినప్పుడైనా కాస్తా మనుషుల్లా ఉన్నాం అనిపించేది..ఇక ఆ వాతావరణం కూడా కనబడదా??

 11. Visekhar garu,

  I forgottn my comment. Your article really giving the real picture of future.

  And also most valuable comment given by Sri Chandu Tulasi.

  And also this

  “కాగితం పులులు గర్జిస్తే, తుస్సుమంటే పరిష్కారమయ్యే సమస్య కాదిది. 1947కి ముందూ, తర్వాతా కొనసాగుతున్న దోపిడి చరిత్రనుంచి పాలకులు గుణపాఠం తీసుకోవడానికి ఆస్కారం లేదు. గుణపాఠం తీసుకోవలసిందల్లా ప్రజలే.” by Sri Rajasekha Raju

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s