రిజర్వేషన్లు కాదు, వ్యవస్ధాగత అణచివేతే అసలు సమస్య


Photo: provisionslibrary.com

(ఈ ఆర్టికల్ నిజానికి ‘గౌతమ్ మేకా’ గారి వ్యాఖ్య. “66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే” అన్న టైటిల్ తో నేను రాసిన టపా కింద ఆయన రాసిన వ్యాఖ్య. విషయ ప్రాధాన్యత దృష్ట్యా, ఆంగ్లంలో రాసిన ఆయన వ్యాఖ్యను మరింతమంది పాఠకుల దృష్టికి తెచ్చే ఉద్దేశ్యంతో అనువదించి టపా గా మార్చుతున్నాను.

ఇప్పటి వ్యవస్ధ పరిధిలోనే పరిష్కారం వెతికే ధోరణి ఉన్నప్పటికీ వ్యాఖ్యకు ఉన్న పరిమితి దృష్ట్యా, ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. కులంతో సంబంధం లేకుండా, ప్రతి గ్రామీణ పేద పిల్లవాడికీ మెరుగైన జీవితం గడిపే అర్హత ఉన్నదన్న ఆయన అభిప్రాయం శిరోధార్యం. ఈ దృష్ట్యానే,  పేద అగ్ర కుల విద్యార్ధులకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ ఉండాలని PDSU లాంటి విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పేదరికానికి ఓట్లు రాల్చే ఆకర్షణ లేనందున రాజకీయ నాయకులు ఈ డిమాండ్ జోలికి పోకపోవడం నేటి వాస్తవం. -విశేఖర్)

మౌలికంగానే పరిష్కారానికి నోచుకోవలసిన అతి పెద్ద సమస్య ఒకటుందని నా భావన. దురదృష్టవశాత్తూ, రాజకీయ నాయకులు గానీ, సాధారణ ప్రజానీకం గానీ దాని గురించి పట్టించుకోవడం లేదు. అది, వెనుకబడిన మరియు క్రింది కులాలపై వ్యవస్ధాగతంగా సాగుతున్న వివక్ష. కొద్దిమంది ప్రభుత్వోద్యోగులు సుదీర్ఘకాలంగా పొందవలసిన సముచిత ప్రమోషన్ పొందడానికి ఈ బిల్లు (ప్రమోషన్ల రిజర్వేషన్ల బిల్లు) సహాయపడవచ్చు. కానీ దానివల్ల వివక్ష ఆగబోదు. కాల దోషం పట్టిన కుల వ్యవస్ధను అనుసరించడం వలన ఎంతటి వినాశకర ఫలితాలు సంభవిస్తాయన్న విషయమై ప్రజలకు బోధించడంలో ‘భారీ గెంతు’ సాధిస్తే తప్ప ఈ వివక్ష ఆగదు.

అగ్ర కులాల్లోని అనేకమంది విద్యావంతుల్లో కింది కులాల ప్రజల గురించి న్యూనతపరుస్తూ మాట్లాడే వారిని నేను అనేకమందిని చూశాను. సామాన్య వాస్తవం ఏమిటంటే అగ్ర కులాల్లో పుట్టిన అనేకమంది తమకు ఉన్న అనేక అవకాశాలను తమ హక్కు భుక్తంగా భావిస్తారు. కింది కులాల పట్ల మొత్తం వ్యవస్ధే ఎంత వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో వారు అర్ధం చేసుకున్నట్లు కనిపించదు.

(నిరాకరణ: వర్గీకరణలో ఉన్నవిధంగానే నేను కింది మరియు అగ్ర కులాలని ప్రస్తావిస్తున్నాను. ఒకరికంటే మరొకరు మెరుగని నా అభిప్రాయం కాదు. -గౌతం మేకా)

రిజర్వేషన్ వ్యవస్ధ ప్రతిభ గలవారి అవకాశాలను హరించివేస్తున్నదని కొందరు వాదిస్తున్నారు. వారికి నేను చెప్పేదేమిటంటే, సరిపోయినన్ని ప్రభుత్వ విద్యా సంస్ధలు లేని పరిస్ధితుల్లో, ప్రవేటు విద్యా సంస్ధలూ, వారి దోపిడీ వల్లనే ఏ రిజర్వేషన్ వ్యవస్ధ కంటే ఎక్కువగా దేశానికీ, ప్రజలకూ నష్టం జరిగింది.

(రిజర్వేషన్ వ్యవస్ధ వల్ల కూడా ఎంతో కొంత నష్టం జరిగిందన్నట్లు ఇక్కడ అర్ధం వస్తున్నప్పటికీ గౌతమ్ గారికి ఆ అభిప్రాయం లేదని నా అవగాహన. దేశంలో అణగారిన వర్గాలు రిజర్వేషన్ వల్ల లబ్ది పొంది అభివృద్ధి సాధిస్తే అది దేశం మొత్తం సాధించే అభివృద్ధిలో భాగమే అవుతుంది. -విశేఖర్)

మరొక విషయం ఏమిటంటే, రిజర్వేషన్ వ్యవస్ధలో సమగ్రత లేకపోవడం. కేవలం రిజర్వేషన్ ఫలాలు పొందడానికి, అనేకమంది తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించడం నా కాలేజీ రోజుల్లో చూశాను. సరైన సమగ్రత లేకపోవడం వల్ల ఈ ఫలాలు ఎప్పుడూ చేరకూడని వారిని చేరుతాయి. ప్రస్తుత సమాజంలో వారి వారి ‘వెనుకబాటుతనాన్ని’ నిర్ధారించడానికి మెరుగైన వ్యవస్ధ మనకు కావాలి. ఒక్క కులాన్నే కాకుండా వారి ఆర్ధిక, ప్రాంతీయ అంశాలను కూడా పరిగణించేదిగా అది ఉండాలి. ఏ కులానికి చెందినప్పటికీ పేద గ్రామీణ పిల్లలు మెరుగైన జీవితం పొందే అర్హత ఉన్నదని నా అభిప్రాయం.

అసలు సమస్య మరింత సంక్లిష్టమూ, లోతైన మూలాలు కలిగినట్టిదీ అయిన నేపధ్యంలో, రిజర్వేషన్ కోటా పెంచడం తాత్కాలిక చర్యగా మాత్రమే ఉపయోగపడుతుంది. దీనిని సరిచేయడానికి ఆసక్తి గానీ, ధైర్యం గానీ, ప్రోత్సాహం గానీ ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉన్నట్లు కనిపించదు. ఓట్లు పొందడానికీ, ప్రజల్ని ఆకర్షించడానికీ మాత్రమే రిజర్వేషన్ మరియు కులం కార్డులతో ఆడుకోవడానికి వారు ఇష్టపడుతున్నారు.

7 thoughts on “రిజర్వేషన్లు కాదు, వ్యవస్ధాగత అణచివేతే అసలు సమస్య

  1. రాజకీయ నాయకులకి పేదరికం గురించి మాట్లాడడం ఇష్టం లేదు అని అనొచ్చు కానీ పేదరికానికి వోట్లు రాల్చే ఆకర్షణ లేదనుకోలేము. మా పిన్ని గారు ప్రజారాజ్యం పార్టీలో పని చేసే రోజులలో ఆ పార్టీ నాయకుడే వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పేవాడు “ఆర్థిక సమస్యల గురించి మనం మాట్లాడక్కరలేదు, నియోజకవర్గంలో మెజారిటీగా ఉన్న రెండు మూడు కులాలవాళ్ళకి ఇది చేస్తాం, అది చేస్తాం అని చెపితే చాలు, వోట్లు పడతాయి” అని. ప్రజారాజ్యం మూతపడిన తరువాత ఆవిడ జగన్ పార్టీలో చేరారు. జగన్ పార్టీ విధానం కూడా అదే కదా. మన దేశంలో ఏ పాలక వర్గ పార్టీ అయినా కులం పేరు చెప్పి ఆర్థిక అంశాలు గురించి మాట్లాడకుండా దాటవెయ్యడానికి ప్రయత్నిస్తుంది.

  2. “రాజకీయ నాయకులకి పేదరికం గురించి మాట్లాడడం ఇష్టం లేదు అని అనొచ్చు కానీ పేదరికానికి వోట్లు రాల్చే ఆకర్షణ లేదనుకోలేము.”

    నిజమే ప్రవీణ్, మీరన్నదానిలో వాస్తవం ఉంది.

  3. మీ కులంవాళ్ళకి ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి వోట్లు వెయ్యించుకునేవాళ్ళు ఎక్కువగా రిజర్వేషన్‌ల గురించో, SC కార్పొరేషన్ ఋణాల గురించో మాట్లాడుతారు, అసలు విషయాలు చెప్పకుండా. రిజర్వేషన్‌లు అనేవి ఆర్థికంగా ముందు ఉండి చదువుకున్న కుటుంబాలకి చెందినవాళ్ళకి మాత్రమే అందుతాయి. బ్యాంక్ ఋణాలైనా, కార్పొరేషన్ ఋణాలైనా ఇద్దరు గ్యారంటర్లు ఉన్నవాళ్ళకి మాత్రమే అందుతాయి (ఎవరైనా తమ బంధువులకి మాత్రమే గ్యారంటర్ సంతకం పెడతారు. కనుక SC కార్పొరేషన్ ఋణాలు అందేవి ఆస్తులు ఉన్న దళితుల బంధువులకి మాత్రమే). ఈ నిజాలు చెపితే రాజకీయ నాయకులకి దళితుల వోట్లు పడవు కనుక రాజకీయ నాయకులు ఈ నిజాలు పొరపాటున కూడా మాట్లాడరు.

  4. విశేఖర్ గారు, మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. రాజకీయ నాయకులు “మా పార్టీకి వోట్లు వేస్తే మీ కులంవాళ్ళకి రిజర్వేషన్‌లు పెంచుతామనో, SC కార్పొరేషన్ ఋణాలు ఇప్పిస్తామనో” చెపుతారు కానీ “మీ కులంవాళ్ళకి బ్రాహ్మణులతో సమానమైన గౌరవం ఇస్తామని” మాత్రం అనరు. రిజర్వేషన్‌లు, ఋణాలు అనేవి ఆర్థిక ప్రయోజనాలకి సంబంధించినవి (అవి కూడా కొంత మంది ఆర్థికంగా ముందున్నవాళ్ళకి మాత్రమే ప్రయోజనం కలిగించేవి). వీటి వల్ల ఎంత పరిమితమైన ప్రయోజనం ఉన్నా వీటి మీద ప్రజలకి కొంత ఆశ అయినా ఉంటుంది. వీటి మీద ఆశతో వేసే వోట్లని కేవలం కులం వోట్లుగా చూడలేము. ఆర్థికంగా ఏమీ లేనివానికి బ్రాహ్మణునితో సమానమైన గౌరవం వస్తే ఎంత, రాకపోతే ఎంత? కనుక సమాన గౌరవం గురించి ఆర్థికంగా లేనివాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి అందే అవకాశం లేని రిజర్వేషన్‌లు & కార్పొరేషన్ ఋణాలపై వాళ్ళకి భ్రమలు కలిగించడం మాత్రం సాధ్యమే (అవి డబ్బున్నవాళ్ళకే అందుతాయనే అసలు విషయం మాట్లాడకుండా ఉన్నప్పుడు).

  5. “ఆర్థిక వెనుకబాటుతనం అనేది కేవలం కులాన్ని బట్టి ఉండదు. దాని పైన భౌగోళిక పరిస్థితుల ప్రభావం & mode of production ప్రభావం కూడా ఉంటాయి” అని నేను ఫేస్‌బుక్‌లో వ్రాస్తే కొంత మంది నన్ను కమ్మవాడని అనుకున్నారు. ఒరిస్సాలో గుడిసెలలో ఉండే కమ్మవాళ్ళనీ, వెలమదొరలనీ చూశానని చెపితే నేను అగ్రకులాలలోని పేదల గురించి మాత్రమే బాధపడుతున్నానని నా మీద విమర్శలు చేశారు. పేదరికం ఎవరికైనా దుర్భరంగానే ఉంటుంది. అది అగ్రకులాలవాళ్ళకైనా, పేదవాళ్ళకైనా ఒకే రకం సమస్యగా ఉంటుంది. ఈ విషయం చెపితే అర్థం చేసుకునే స్థితిలో కుల సంఘాల నాయకులు లేరు. మార్క్సిజం కొద్దికొద్దిగా తెలిసినవాడు ఎవడైనా కులం కంటే వర్గం గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. “మా అమ్మానాన్నలకి రిజర్వేషన్‌ల వల్లే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి కనుక మాకు మార్క్సిజం అవసరం లేదు” అని అనుకునే దళితవాదులకి మనం చెప్పగలిగేది ఏమీ ఉండదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s