9/11 వార్షికోత్సవ దినాన లిబియాలో అమెరికా రాయబారి హత్య


ఫొటో: ది హిందూ

న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పై దాడులు జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన రోజునే లిబియాలో అమెరికా రాయబారి చావును రుచి చూశాడు. అమెరికా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారుల్లోని ముస్లిం మత ఛాందస సలాఫిస్టు గ్రూపు కార్యకర్తలు ప్రయోగించిన రాకెట్ ప్రొపెల్లర్ గ్రేనేడ్ దాడిలో రాయబారి స్టీవెన్స్ దుర్మరణం చెందాడు. పాములకి పాలు పోసి పెంచే అమెరికా దుష్ట నీతికి స్టీవెన్స్ మరణం ఒక ప్రబల సాక్ష్యం. ఒక అమెరికన్ ముస్లిం వ్యతిరేకి దురహంకార పూరితంగా రూపొందించిన లో బడ్జెట్ సినిమా అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి పురిగొల్పినట్లు పత్రికలు చెబుతున్నాయి. అది ఇస్లాం వ్యతిరేక సినిమా అయినా, ఖురాన్ దగ్ధం అయినా, అమెరికన్ల అంతం చూస్తున్న ఈ ఘటనలన్నింటిలోనూ ‘అమెరికా వ్యతిరేకత’ పచ్చిగా వ్యక్తమవుతున్న విషయం కాదనలేని సత్యం.

గడ్డాఫీ వ్యతిరేక కిరాయి తిరుగుబాటుకి వ్యూహాత్మకంగా, గూఢచారపరంగా, రాజకీయంగానే కాక క్రియాశీలకంగా కూడా మద్దతు ఇచ్చి గడ్డాఫీ అంతాన్ని లిఖించడంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్, తాను పెంచి పోషించిన ఛాందస సలాఫిస్టుల చేతుల్లోనే కుక్క చావు చావడం తప్పించుకోలేని పరిణామమే. సకల అంతర్జాతీయ న్యాయ సూత్రాలనూ, అతి సామాన్య అంతర్జాతీయ సంబంధాలనూ తుంగలో తొక్కి లిబియా దేశాధ్యక్షుడు గడ్డాఫీని వేటకుక్కల్లా వెంటాడి, యుద్ధ విమాన దాడుల్లో గాయపరిచి చంపేసిన అమెరికా, తమ రాయబారులకు అదే లిబియాలో అంతర్జాతీయ రక్షణ ఉండబోదని స్టీవెన్స్ చావు విప్పి చెబుతోంది.

తాను తవ్విన గొయ్యిలోనే…

స్టీవెన్స్ హత్యకు గురయిన రాయబార కార్యాలయం దుష్టకూటమి దేశాలకు అత్యంత ఇష్టమైన బెంఘాజీ నగరంలోనిదే. అంతర్జాతీయ కుట్రలో గడాఫీని అంతమొందించే కృషిలో భాగంగా గడాఫీ అధికార కేంద్రం ట్రిపోలికి పోటీగా బెంఘాజీ నగరాన్ని వ్యూహాత్మక కేంద్రంగా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు ఎంచుకున్నాయి. ముస్లిం టెర్రరిస్టు శక్తులను బెంఘాజీ నగరంలో దింపి సాధారణ పౌరుల ఆవాసాలను బెదిరించి బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు పురిగొల్పాయి. వినాశకర ఆయుధాలతో గిడ్డంగులు నింపి మిలిటెంట్ల చేతికి అప్పజెప్పాయి. లిబియాపై విధించిన ఆయుధ నిషేధాన్ని తానే ఉల్లంఘించి, అత్యాధునిక ఆయుధాలు, గూఢచార పరికరాలు సరఫరా చేసాయి.

అనంతరం బెంఘాజి నగరాన్నిఇస్లామిక్ మిలిటెంట్ల వశం చేసే కుట్రను ఒక్కో అడుగూ అమలు చేశాయి. నగరంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చెలరేగిందనీ, తిరుగుబాటుపై గడాఫీ బలగాలు దాడి చేసి సామూహిక హత్యాకాండ చెయ్యబోతున్నాయనీ ఉన్నట్లుండి తమ టైనాతీ వార్తా సంస్ధల చేత ప్రచారాన్ని లంకించుకున్నాయి. ఈజిప్టు, ట్యునీషియా ప్రజల తిరుగుబాట్లను పరవశంగా గమనిస్తున్న ప్రపంచం, లిబియాపై దుష్టత్రయ (అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్) దేశాల గోబెల్స్ ప్రచారాన్ని తేలికగా నమ్మేసింది. రష్యా, చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి చేత ‘నో ఫ్లై జోన్’ విధింప జేసి, ‘రక్షణ కల్పించే హక్కును’ తనకు తాను దఖలు పరుచుకుని సంవత్సరం తిరిగేసరికల్లా గడాఫీని హత్య చేశాయి దుష్టత్రయ దేశాలు. ఆ విధంగా బెంఘాజి కి చేరిన వినాశకర ఆయుధాలే నేడు అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ కుత్తుకను ఉత్తరించాయి. క్రిస్టఫర్ స్టీవెన్స్ తాను తవ్విన గొయ్యిలో తానే పడ్డాడని చెప్పడం చాలా చాలా చిన్నమాట.

లిబియా ముస్లిం ఛాందస మిలిటెంట్ల రాకెట్ దాడిలో స్టీవెన్స్ తో పాటు మరో ముగ్గురు అమెరికన్లు కూడా చనిపోయారు. స్టీవెన్స్ పేరుతో పాటు మరో మృతుడి పేరును మాత్రమే అమెరికా ప్రకటించింది. లిబియాలో విస్తృత, వికృత, అమానవీయ హత్యాకాండకు ఆజ్ఞలు జారీ చేసిన బారక్ ఒబామా ఇప్పుడు అమెరికా రాయబారి హత్యను ఖండిస్తున్నాడు. ‘అత్యాచార దౌర్జన్యం’ అనీ, ‘ఘోర దురన్యాయం’ అనీ ప్రకటిస్తున్నాడు.  తమ రాయబారి “ధైర్యవంతుడ”నీ, “అమెరికాకు అత్యంత విలక్ష ప్రతినిధి” అనీ కొనియాడాడు. అందులో ఎటువంటి అనుమానమూ లేదు. అందుకే తగిన ఫలితం ఆయనకు ఎదురయింది.

హృదయాలు బద్దలు!

గడాఫీ చేయని మానవతా నేరాలను (crimes against humanity) రోజువారీగా డ్యూటీ వేసుకుని మరీ కధలు కధలుగా వల్లించిన అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ తమ రాయబారి హత్య పట్ల దిగ్భ్రాంతి ప్రకటించింది. “లిబియా ప్రజలకు అంతగా సహాయం చేసినప్పటికీ అమెరికా అంటే లిబియన్లకు ఎందుకంత ద్వేషం?” అని అమెరికన్లు ఆశ్చర్యపోతున్నారని పరిహాసభాజనమైన హిపోక్రసీని ఒలకబోసింది. “ఈ హృదయ విదారమైన నష్టానికి మా హృదయాలు బద్దలయ్యాయి” అని కన్నీరు కార్చింది (బిబిసి). సంవత్సరకాలం పాటు లిబియాపై సాగించిన వికృత మానవహననంలో ఎన్ని వేలమంది లిబియన్ తల్లుల, తండ్రుల, అక్కల, చెల్లెళ్ళ, అన్నల, తమ్ముళ్ళ హృదయాలను అమెరికా బద్దలు చేసిందో క్లింటన్ ఇపుడు గుర్తుకు తెచ్చుకోవాలి. ఎంతమంది పసిపిల్లలను బలిచేసిందీ, మరెంతమంది పసివాళ్లను అనాధలు కావించిందీ గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేసిందీ, ఎందరి ఇళ్లను సర్వనాశనం చేసిందీ గుర్తుకు తెచ్చుకోవాలి. కానయితే అది జరగని పని.

గడాఫీ ఆత్మ పైనుండి చూస్తుంటే గనక క్రిస్టఫర్ స్టీవెన్స్ మరణం పట్ల వికటాట్టహాసం చేస్తుండాలి. గడాఫీ తన జీవిత పర్యంతం జైలు గోడల మధ్య బంధించిన ముస్లిం మత ఛాందసులను పనిగట్టుకుని విడుదల చేయడమే కాక తనపైకి ఉసిగొల్పిన అమెరికా టెర్రరిస్టు వ్యూహాం ఫలితాన్ని కనులారా వీక్షించి ఉండాలి. “వాళ్ళు తిరుగుబాటుదారులు కాదు. టెర్రరిస్టులు” అని తాను చెప్పినా తెలియనట్లు నటించిన అమెరికా పాలకుడి దుర్గతికి గడాఫీ ఆత్మ శాంతించి ఉండాలి.

9/11 వార్షికోత్సవం సందర్భంగా కైరోలో అమెరికా రాయబార కార్యాలయం ముందు ఈజిప్షియన్ల నిరసన (ఫొటో: ది హిందూ)

ఈజిప్టులో ఆల్-ఖైదా జెండా

సెప్టెంబరు 11 వార్షికోత్సవం రోజునే ఈజిప్టులో కూడా అమెరికా రాయబార కార్యాలయం ముందు మూకుమ్మడి నిరసన ప్రదర్శనలు జరిగాయి. అమెరికా రాయబార కార్యాలయాన్ని ఈజిప్టు ప్రజానీకం చుట్టుముట్టి నిరసన ప్రదర్శన చేశారు. రాయబార కార్యాలయంపై ఉన్న అమెరికా జెండాను చించేసి ఆల్-ఖైదా జెండాను ఎగరేశారు. ఇక్కడ కూడా ముస్లిం తీవ్రవాద సంస్ధ సలాఫిస్టులే ఈ పరదర్శనకు నాయకత్వం వహించి నడిపినట్లు తెలుస్తోంది. అమెరికా మద్దతుతో ఈజిప్టు ప్రభుత్వం నడుపుతున్న ముస్లిం బ్రదర్ హుడ్ కి సలాఫిస్టులు కూడా మద్దతు ఇస్తున్నారు. వారి మద్దతుతోనే బ్రదర్ హుడ్ నేత మోర్శి ఈజిప్టు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. మోర్సి అధ్యక్షరికంలోనే ఈజిప్టు నుండి అనేకమంది ముస్లిం కిరాయి తిరుగుబాటుదారులు సిరియాలో అమెరికా లక్ష్యం కోసం హత్యాకాండ సాగిస్తున్నారు.

ట్యునీషియాలో అమెరికా మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వంలో సలాఫిస్టులు కూడా ఉన్నారు.  ఆల్-ఖైదా ముస్లిం గ్రూపుల్లో ఒకరైన సలాఫిస్టులు ట్యునీషియాలో కూడా అమెరికా వ్యతిరేక ప్రదర్శనలకు పిలుపునిచ్చారు.

లిబియా, ఈనిప్టు, ట్యునీషియాలలో ఆల్-ఖైదా గ్రూపుల మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వాలను సాకుతున్న అమెరికా ఆదేతరహా వినాశనాన్ని సిరియాకి కూడా తేవాలని ప్రయత్నిస్తోంది. లిబియా, ఈజిప్టు, ట్యునీషియా, ఆఫ్ఘనిస్ధాన్ తదితర దేశాలనుండి సమకూర్చిన టెర్రరిస్టులను సిరియాకి పంపి టెర్రరిస్టు పేలుళ్లతో, హత్యాకాండలతో హోరెత్తిస్తోంది. లిబియా, ఈజిప్టులలోని తాజా ఘటనలతోనైనా అమెరికాకి తాను చేస్తున్నదేమిటో తెలిసి వస్తుందనడానికి చరిత్రలో ఆధారాలేవీ లేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s