
ఇదింతకరై నిరాహార దీక్ష శిబిరం చేరుకున్న ఉదయ్ కుమార్ ను భావోద్వేగాలతో చుట్టుముట్టిన కూడంకుళం ప్రజలు (ఫొటో: ది హిందూ)
పర్యావరణంతో పాటు జీవనోపాధిని కూడా దెబ్బతీసే ‘కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు’ (కె.ఎన్.పి.పి) కి వ్యతిరేకంగా కూడంకుళం ప్రజల పోరాటం కీలక దశకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అణచివేత, దుష్ప్రచారం, పోలీసు నిర్బంధాలకు ఎదురోడ్డి సామాన్య ప్రజలు వీరోచిత పోరాటం సాగిస్తున్నారు. ఉద్యమ నాయకులు ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులను పోలీసులు పట్టుకెళ్లకుండా నిరంతరం కాపలా కాస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసుల్లో నిజాయితీ నిరూపించుకోవడానికి అరెస్టు అవుతానని ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులు ప్రకటించినప్పటికీ అందుకు ప్రజలు అంగీకరించడం లేదు. మాజీ అన్నా బృందం సభ్యులు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కేజ్రీవాల్ లు కూడంకుళం ప్రజలకు మద్దతు ప్రకటించడంతో ఉద్యమంలో కొత్త ఫ్రంట్ తెరుచుకున్నట్లయింది. ఈ కొత్త ఫ్రంట్ ఉద్యమాన్ని ఎటు తీసుకెళుతుందో చూడవలసి ఉంది.
జపాన్ లో ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా వినాశకర పరిణామాలు సంభవించడంతో కూడంకుళం ప్రజలకు తమ భవిష్యత్తు ద్యోతకమయింది. ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు ను ప్రారంభించడానికి వ్యతిరేకంగా సంవత్సరకాలంగా శాంతియుత ఉద్యమాన్ని చేపట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో శాంతియుత ఉద్యమాలకు అనుమతి ఉంటుందని చెప్పే ప్రభుత్వాలు కూడంకుళం శాంతియుత ఉద్యమంపై నీతిబాహ్యమైన దుష్ప్రచారం మొదలు పెట్టాయి. మరో పక్క ఆందోళనలో పాల్గొంటున్న కూడంకుళం, దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలపై తీవ్ర స్ధాయిలో అణచివేత చర్యలు అమలు చేస్తున్నాయి. నిర్భంధ చట్టాలు ప్రయోగించి, నిషేధాజ్ఞలు విధించాయి. పనులకు, స్కూళ్లకు, పక్క ఊళ్ళకు వెళ్ళే ప్రజలపైనా, విద్యార్ధులపైనా, మహిళలపైనా వేధింపు చర్యలకు దిగుతున్నాయి.
కె.ఎన్.పి.పి లో అణు ఇంధనాన్ని నింపడానికి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యుక్తులు కావడంతో సెప్టెంబరు 10, సోమవారం నుండి ప్రజల ఆందోళన తీవ్రమయింది. అణుకర్మాగారాన్ని చుట్టుముట్టి ఇంధనం నింపడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు సాగించారు. ఇదింతకారై లోని ప్లాంటుకు 500 మీటర్ల దూరంలో గ్రామాలకు చెందిన వేలాది ప్రజలు చేరి నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై ప్రభుత్వాలు ఉక్కు నిర్భంధం ప్రయోగిస్తున్నాయి. ఉద్యమంలోని ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాన్ని హింసాత్మకం చేసే ఎత్తుగడను ప్రభుత్వాలు చేపట్టాయి. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళన చేస్తున్న ప్రజలను సముద్రంలోకి తరుముకున్నారు. కాల్పులు జరిపి ఒక మత్స్యకారుడి ప్రాణాలను బలిగొన్నారు. ఒకరిని చంపింది కాక తిరిగి ప్రజలపైనే పోలీసులు ఎదురు కేసులు నమూదు చేశారు. పోలీసు నిర్బంధానికి నిరసనగా తమిళనాడులో పలు చోట్ల నిరసనలు చెలరేగాయి.
ఓ పక్క వేలాది పోలీసులు ఆందోళనకారులను చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆందోళనలో ఉన్న ప్రజలపైనా, నాయకులపైనా పోలీసులే దుష్ప్రచారానికి దుగుతున్నారు. ఐదుగురు పోలీసులను ఆందోళనకారులు కిడ్నాప్ చేసారంటూ కధ అల్లారు. కిడ్నాప్ అయిన పోలీసులను వెతికే పేరుతో ఇల్లిల్లూ సోదా చేయడం మొదలు పెట్టారు. సోదాలు చేసి గ్రామస్దులను భయభ్రాంతులకు గురి చేసే పన్నాగానికి దిగారు. ఈ పరిస్ధితిలో పోలీసుల ప్రచారం తప్పని నిరూపించడానికి నాయకుడు ఉదయ్ కుమార్ తాను స్వయంగా అరెస్టు అవుతానని ప్రకటించాడు. అయితే ప్రజలు ఆయన అరెస్టు కావడానికి అనుమతించలేదు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఆందోళనా స్ధలంనుండి ఆయనను ఎత్తుకుపోయి పోలీసులకు దొరకకుండా కాపాడుకున్నారు.
ఈలోపు మాజీ అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ కూడంకుళం సందర్శించాడు. అరెస్టు అవుతానని ప్రకటించిన ఉదయ్ కుమార్ కు అది సరికాదని నచ్చజెప్పాడు. ప్రజలు కూడా తీవ్రంగా ఒత్తిడి చేయడంతో వారి డిమాండ్ కు ఉదయ్ కుమార్ తలోగ్గాడని ‘ది హిందూ’ తెలిపింది. ఉద్యమ నాయకుడు ప్రజల్లో ఉండి నాయకత్వం వహించాలి తప్ప పోలీసుల వద్దకి వెళ్ళి ఉద్యమానికి దూరంగా ఉండడం సరికాదని అరవింద్ పత్రికలతో వ్యాఖ్యానించాడు. “ఉదయం ఉదయ్ కుమార్ ని కలిశాను. పోలీసులకు సరెండర్ కావద్దని విజ్ఞప్తి చేశాను. చట్టపరమైన అన్నీ అవకాశాలనూ ఆయన వినియోగించుకోవాలి… ఆయన (పోలీసు నిర్బంధం) బయట ఉండడం చాలా అవసరం. పోలీసులకు లొంగిపోకూడదు. ఆయన అందుకు అంగీకరించాడు” అని అరవింద్ కేజ్రీవాల్ పత్రికలకు తెలిపాడు.
ప్రజలపై వేధింపులు సాగిస్తున్నందుకు అరవింద్ యు.పి.ఏ ప్రభుత్వంపై దాడి ఎక్కుపెట్టాడు. పోలీసులతో దాడి చేయించిన తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శించాడు. ప్రజలను వేధించడం మానుకోవాలని ప్రభుత్వాలకు హితవు పలికాడు. రాష్ట్ర ప్రభుత్వం నిరసనకారులను చిత్రహింసలకు గురి చేస్తున్నదని, ఈ పరిస్ధితి కొనసాగితే 2014 లోక్ సభ ఎన్నికల్లో జయలలితకు తగిన గుణ పాఠం నేర్పుతారని హెచ్చరించాడు. విద్యుత్ కావలసిందేననీ కానీ ప్రజలను దరిద్రం నుండి దూరం చేయవలసిన అవసరం కూడా ఉందనీ అన్నాడు. సమ్మిళిత అభివృద్ధి అవసరమనీ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా కూడంకుళం ఆందోళనలో అరవింద్ కేజ్రీవాల్ చేరడంపై ఫస్ట్ పోస్ట్ లాంటి పత్రికలు విషం కక్కుతున్నాయి. కూడంకుళం ఆందోళనలో చేరి తన అవినీతి వ్యతిరేక ప్రతిష్టను మంట కలుపుకుంటున్నాడని విచిత్ర విశ్లేషణలు చేస్తున్నాయి.
ఆందోళన నిర్వహిస్తున్న ‘అణు విద్యుత్ వ్యతిరేక ప్రజా ఉద్యమం’ (Peoples Movement Against Nuclear Energy -PMANE) సంస్ధ నాయకుడు ఉదయ్ కుమార్ ప్రజలను కవచంగా ఉపయోగించుకుంటున్నాడని పోలీసు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇంతకంటే హాస్యాస్పదమైన ఆరోపణ ఉండబోదు. ప్రజలే ఉద్యమం నిర్వహిస్తుంటే ఆ ప్రజలని కవచంగా ఉపయోగించుకోవడం ఏమిటో పోలీసులకు మాత్రమే అర్ధం అయే విషయం. ప్రజలపై సాగిస్తున్న దుర్మార్గాలను ఏదో పేరుతో కప్పి పుచ్చుకోవాలన్న దుగ్ధతో పోలీసులు అసబంద్ధ ఆరోపణలకు దిగుతున్నారు.
పోలీసుల దృష్టి ఇపుడు ఉదయ్ కుమార్ ను అరెస్టు చేయ్యడంపైనే కేంద్రీకృతం అయింది. తామెలాగయినా ఉదయ్ కుమార్ ని అరెస్టు చేసి తీరతామని వారు ప్రకటిస్తున్నారు. పచ్చి అబద్ధాలు, కట్టుకధలు ఓవైపు ప్రచారం చేస్తూ మరో వైపు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఉద్యమ నాయకులపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఆరోపణలకు సమాధానం చెప్పడం మాని, ప్రజల పట్ల బాధ్యత మరిచి ప్రత్యారోపణలనే ప్రచారాయుధంగా ఎక్కుపెడుతున్నారు. సంవత్సరకాలంగా శాంతియుతంగా సాగుతున్న నిరసనను హింసాత్మకం కావడానికి ప్రేరేపించింది కాక నిరసనకారులను హింసను రెచ్చగొడుతున్నారని సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తున్నారు.
ఇదింతకరైలో రిలే నిరాహారదీక్ష కొనసాగుతుండగా, జిల్లా కేంద్రమైన తిరునల్వేలిలో నిరసన కారులు రాస్తారోకోలు నిర్వహించారు. కూడంకుళం ప్లాంటును మూసేయాలనీ డిమాండ్ చేశారు. పోలీసు కాల్పులను ఖండించారు. తిరునల్వేలి తో పాటు ఇతర జిల్లాలకు కూడా నిరసనలు వ్యాపించాయి. చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్, ట్యుటికోరిన్ తదితర జిల్లాల్లో నిరసనలు జరుగుతున్నాయి.
ఇది చాలా దురద్రుష్టకర పరిణామం. విద్యుత్ కు డిమాండ్ పెరుగుతున్న ఈ రోజుల్లో… ప్రత్యామ్నాయ వనరుల అన్వేషణ తప్పనిసరి. కానీ ఆ క్రమంలో సామాన్య ప్రజల సందేహాలకు ఓపిగ్గా జవాబు చెప్పి…వాళ్ళను ఒప్పించాల్సిన బాధ్యత పాలకుల పై ఉంటుంది.
ఎంపీలను కోట్లు ఇచ్చో…పదవులు ఆశ పెట్టో,కొనుక్కొని ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కానీ బలవంతంగా అణు ప్లాంట్లను తెరవలేమని గుర్తించాలి. ఎందుకంటే రాజకీయ నాయకుల్లాగా ప్రజలు
(అందరు) అమ్ముడుపోరు. అందునా తమ మనుగడను పణంగా పెట్టి.
అణుకర్మాగారాలు ఎంతమాత్రం భద్రమైనవి? అనేవిషయాన్నిగూర్చి 1-sep-2012 న ఈనాడులో ఒక వ్యాసం వచ్చింది. దాన్ని ఒకసారి గుర్తుచేసుకోవడం మంచిదేమో.