ఆర్ధిక మాంద్యం కోరల్లో 17 దేశాల యూరోజోన్ -ఒఇసిడి


ఋణ సంక్షోభం ఫలితంగా, 17 యూరప్ దేశాల ద్రవ్య యూనియన్ అయిన ‘యూరో జోన్’ లో ఆర్ధిక మాంద్యం (recession) బలపడుతోందని ఒఇసిడి (Organisation for Economic Coperation and Development) నిర్ధారించింది. తాను మాంద్యంలో కూరుకుపోతూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను కూడా అందులోకి ఈడుస్తోందని ప్యారిస్ లో విడుదల చేసిన మధ్యంతర నివేదికలో పేర్కొందని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్ధ తెలిపింది. యూరప్ నాయకురాలు జర్మనీ సైతం ఈ సంవత్సరాంతానికి మాంద్యంలోకి జారుతుందని ఒఇసిడి నివేదిక తేల్చింది.

యూరో జోన్ దేశాల ఉమ్మడి స్ధూల జాతీయోత్పత్తి (జిడిపి) ఈ సంవత్సరం 2 శాతం కుచించుకుపోవచ్చని (contraction instead of growth) గత మే నెలలో ఒఇసిడి అంచనా వేసింది. ఈసారి అంచనాలో మాత్రం అటువంటి అంచనా ఏదీ ఇవ్వనప్పటికీ యూరో జోన్ లో మాంద్యం వేళ్లూనుకుంటున్నదని నిర్ధారించింది. యూరోజోన్ లోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలయిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లలో జిడిపి వృద్ధి 0.2 శాతం తగ్గుతుందని నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. యూరో జోన్ లో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన జర్మనీ మూడో క్వార్టర్ (జులై, ఆగస్టు, సెప్టెంబరు) లో -0.5 వార్షిక వృద్ధి శాతం, చివరి క్వార్టర్ (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) లో -0.8 శాతం వార్షిక వృద్ధి శాతం నమోదవుతుందని సంస్ధ అంచనా వేసింది.

యూరో స్టాట్ (యూరోపియన్ గణాంకాల సంస్ధ) ప్రకారం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ లో యూరో జోన్ ఆర్ధిక వ్యవస్ధ 0 శాతం అభివృద్ధి చెందింది. రెండో క్వార్టర్ లో -0.2 శాతం తిరోభివృద్ధిని నమోదు చేసింది. మూడో క్వార్టర్ లో కూడా నెగిటివ్ వృద్ధి నమోదయితే యూరో జోన్ అధికారికంగా మాంద్యంలోకి జారినట్లే. మాంద్యం నిర్వచనం ప్రకారం రెండు క్వార్టర్లు వరుసగా నెగిటివ్ జిడిపి వృద్ధి నమోదయితే సదరు ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలో ఉన్నట్లు అర్ధం.

అమెరికా ఆర్ధిక వృద్ధి అంచనాను కూడా ఒఇసిడి స్వల్పంగా తగ్గించుకుంది. ఈ సంవత్సరం అమెరికా 2.4 శాతం వృద్ధి చెందుతుందని గత మే నెలలో చెప్పిన ఒఇసిడి, దానిని ఇప్పుడు 2.3 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ఉన్న అస్ధీరత వల్ల ఈ అంచనాల్లో తీవ్రమైన తేడాలు ఉండవచ్చని ఒఇసిడి నివేదిక హెచ్చరించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ అనేక ప్రమాదాలను ఎదుర్కొంటున్నదనీ కనుక వృద్ధి అంచనాలు మరింత తగ్గవచ్చనీ తెలిపింది. యూరో జోన్ లో అమలవుతున్న పొదుపు ఆర్ధిక విధానాలు ఒక ప్రమాదం కాగా, అమెరికాలో ఏర్పడనున్న ఫిస్కల్ క్లిఫ్ మరొక ప్రమాదం అని తెలిపింది. (వచ్చే సంవత్సరం నుండి అమెరికా ప్రజలపై ఓవైపు పన్నులు పెరగనుండగా, మరోవైపు యూరో జోన్ తరహా పొదుపు చర్యలు మొదలు కానున్నాయి. దీనిని ఫిస్కల్ క్లిఫ్ అని వ్యాఖ్యానిస్తున్నారు.)

యూరో ను ఉమ్మడి కరెన్సీ గా కలిగిన యూరప్ దేశాల కూటమే యూరో జోన్. 27 దేశాల యూరోపియన్ యూనియన్ లో 17 దేశాలు తమ జాతీయ కరెన్సీ ని రద్దు చేసుకుని యూరోను ఉమ్మడి కరెన్సీగా అమలు చేస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్సుల నాయకత్వంలోని యూరో జోన్ లో బ్రిటన్ సభ్యురాలు కాదు. డాలర్ పెత్తనాన్ని ఎదుర్కోవడం యూరో అప్రకటిత లక్ష్యాలలో ఒకటి. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా యూరప్ లో ‘ఋణ సంక్షోభం’ (అవగాహన కోసం: ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కొనసాగింపే యూరప్ ఋణ సంక్షోభం) తలెత్తాక యూరో జోన్ అస్తిత్వం ప్రమాదంలో పడింది. గ్రీసు, పోర్చుగల్, ఐర్లండ్, స్పెయిన్, ఇటలీ ఋణ భారంతో తీసుకుంటూ యూరో భవిష్యత్తును ప్రమాదంలో పడవేశాయి. ఈ జాబితాలోకి ఫ్రాన్సు, జర్మనీ లు కూడా చేరవచ్చన్న భయాలు కూడా ఉన్నాయి.

యూరో ప్రమాదంలో పడడం అంటే యూరో జోన్ లోని ఒకటి గాని అంతకంటే ఎక్కువ గానీ దేశాలు యూరోను ఉమ్మడి కరెన్సీగా రద్దు చేసుకుని జాతీయ కరెన్సీలను పునరుద్ధరించుకోవడం. కనీసం ఒక్క దేశం అలా చేసినా ఒకదానికొకటి ప్రభావితమై యూరో ని వదిలి వెళ్లడానికి దేశాలు వరుస కడతాయని విశ్లేషకుల ఏకాభిప్రాయం. అదే జరిగితే డాలర్ ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగింపుకు మరో ముఖ్యమైన అడుగు పడినట్లే. డాలర్ ఆర్ధిక పెత్తనాన్ని యూరో, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్ తదితర కరెన్సీలు ప్రతిఘటిస్తున్నాయని ఒక అవగాహన. యూరో జోన్ విచ్ఛిన్నం అయితే ‘బహుళ ధృవ ప్రపంచం’ అనే అవగాహనకు, ఆర్ధిక పరంగా, ఒకింత నష్టం చేకూరుతుంది. ఆర్ధికంగా బలహీనపడుతూ ఏకైక అగ్రరాజ్య హోదాలో బీటలు చవి చూస్తున్న అమెరికాకు కొత్త ఊపిరులు ఊదినా ఊదవచ్చు.

అభివృద్ధి చెందిన దేశాలుగా తమను తాము భావించుకుంటున్న 34 దేశాలు 1961లో ఏర్పరుచుకున్న ఆర్ధిక సంస్ధ ఒఇసిడి. ఆర్ధిక ప్రగతికి, ప్రపంచ వ్యాపారాభివృద్ధికీ దోహదం చేసే సంస్ధ అని చెప్పినప్పటికీ ఇది చేసే వాస్తవ పని బడుగు దేశాలపై పెత్తనమే. ఈ దేశాల్లో విస్తరించిన బహుళజాతి కంపెనీలు తమ ఆర్ధిక పెత్తనం కాపాడుకోవడానికి ఒఇసిడి వేదికగా విధానాలు రూపొందించి అభివృద్ధి చెందుతున్న దేశాలపై రుద్దుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత త్రీవ్రంగా దెబ్బతిన్న యూరోపియన్ దేశాల పునర్నిర్మాణం కోసం అమెరికా రూపొందించిన మార్షల్ ప్లాన్ అమలుకోసం ఏర్పడిన ఒఇఇసి (Organisation for European Economic Co-operation – OEEC) అనంతరం ఒఇసిడి గా రూపు మార్చుకుంది. వివిధ యూరోపియన్ రాచరిక వ్యవస్ధల సభ్యత్వంతో ప్రారంభమయిన ఒఇసిడి దేశాలు నామ మాత్రంగా ఎన్నికలు జరుపుతూ ప్రజాస్వామ్యం ఫోజు పెడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు అంటూ తరచుగా పత్రికలు చెప్పే దేశాలు ఒఇసిడి దేశాలే, ఒకటి రెండు మినహాయింపులు తప్ప.

ఈ సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాల్లోని ఒక గుంపు (యూరోజోన్) ఋణ భారంతో సతమతమవుతూ ప్రపంచ ఆర్ధిక భవిష్యత్తుని డోలాయమానంలో పడేశాయి. ఆర్ధిక సంక్షోభం నుండి బహుళజాతి కంపెనీలను ఒడ్డున పడేయడానికి ఇష్టానుసారంగా అప్పులు తెచ్చి పడేసి, వాటిని తీర్చడానికి కార్మికులు, ఉద్యోగుల వేతనాలపై దాడులకు ప్రభుత్వాలు దిగుతున్నాయి. పొదుపు ఆర్ధిక విధానాలు అమలు చేస్తూ ప్రజల ఆదాయాలను బహుళజాతి కంపెనీలకు తరలిస్తున్నారు. దానితో కంపెనీల ఉత్పత్తులు కొనేనాధుడు లేక అధిక ఉత్పత్తి సంక్షోభం ఏర్పడింది. వినియోగ సరుకులు కొనడానికి తలకు మించి అప్పులు చేసిన జనం కోతలకు గురయిన ఆదాయాల్లో అధిక భాగాన్ని కంపెనీలకు సమర్పించుకుని బికారులుగా మిగులుతున్నారు. యూరో జోన్ ఋణ సంక్షోభానికీ, ఆర్ధిక మాంద్యానికి కారణం ఇదే. బహుళజాతి కంపెనీలు, వాటికి మద్దతుగా ఉన్న ప్రభుత్వాలే యూరో జోన్ ఆర్ధిక మాంద్యానికి కారణం.

కార్మికులు, ఉద్యోగులు, ఇతర శ్రామికుల వేతనాలు పెంచకుండా, రద్దు చేసిన ఉద్యోగాలు పునరుద్ధరించకుండా యూరో జోన్ ఆర్ధిక సంక్షోభం పరిష్కారం కావడం అసాధ్యం. ప్రభుత్వాలు ఆ పని చెయ్యవు. కంపెనీలు మరిన్ని ఉద్యోగాల రద్దు ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్ధితుల్లో కార్మికులే ఉమ్మడిగా కార్యాచరణకు సిద్ధపడి శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కోవాలి. అప్పటివరకూ సంక్షోభాల పర్వం కొనసాగడం తధ్యం.

7 thoughts on “ఆర్ధిక మాంద్యం కోరల్లో 17 దేశాల యూరోజోన్ -ఒఇసిడి

  1. ప్రపంచం లో ఎమీ ఆర్ధిక సంక్షోభం లేదు. అది ఉండేది యూరోప్ లో మాత్రమే. చైనా, భారతదేశాలలో ఎమైనా ఆర్ధిక సంక్షోబం ఉందా? తెల్ల వాళ్ల సొల్లు వాగుడును మీరు మరీ ఎక్కువగా నమ్ముతున్నారు. మీకు ఎకనామిక్స్ తెలియక పోయినా, ఎదో అంతర్జాతీయ పేపర్ లో రాసిన చెత్తను తర్జుమా చేస్తూ, అనవసరంగా తెల్లవారికి ప్రాముఖ్యతను ఇస్తారు.

    మీరు తెలుసుకోవలసిందేమిటంటే యూరోప్ ఒక ముగిసిన చరిత్ర. రానున్న రోజులలో 20-25 సం|| ఆదేశాల ఆనవాళ్లు కూడ మిగలవు. ఒక దానిలో ఒకటి కలసి పోతాయి. మీరు రోజు భారతదేశాన్ని వెనుకబడిన దేశంగా అభివర్ణిస్తూ/తిడుతూ ఆదేశాలు భలే అభివృద్ది చెందినట్లు రాస్తూంటే ఎన్నోసార్లు చెప్పలని పిస్తుంది. ఈ రోజు చెపుతున్నాను. మీకు అంతర్జాతీయ వ్యవహారాల మీద చాలా నాలేడ్జ్ ఉంది కదా,యురోప్ అలా దిగజారి పోవటానికి ప్రధాన కారణం ఎమిటో చెప్పండి?

    మన కళ్ల ముందే అంతమౌతున్న సివిలైసేషన్ యురోప్ సివిలైసేషన్.

  2. *అభివృద్ధి చెందిన దేశాలుగా తమను తాము భావించుకుంటున్న 34 దేశాలు 1961లో ఏర్పరుచుకున్న ఆర్ధిక సంస్ధ ఒఇసిడి*

    తెల్లవాళ్లు ఎప్పుడూ అంతే వాళ్లని వాళ్లు గొప్పవాళ్లు గా భావించుకొంట్టూంటారు. ఇన్ని రోజులు ప్రపంచంలో అన్ని దేశాల మీద పడి బ్రతికారు. ఇప్పుడా ఆ అవకాశం లేదు. ఉన్న నాడు విందు లేని నాడు గోవిందా అనే రకాలు .
    టైటాన్ సినేమాలో ఆఖరి సీన్లో చూపినట్లుగా, ఎవరి పాటికి వాళ్లు షిప్ లో నుంచి బయటపడాలనే ప్రయత్నాలు చేసినట్టుగా యురోప్ వాళ్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయినా బతికి బట్టకట్టటం కష్టం. కాకపోతే ఈ సమయం లో మనదేశం గట్టిగా ఉండాలి లెకపోతే ఎదో ఒక రూపం లో మనదేశంలో జొరబడటానికి ప్రయత్నించవచ్చు, లేక మనదేశ సంపదను కొల్ల గొట్టటానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు

  3. You did not pubish my first comment. I did not say any thing wrong. Whatever I said ture or false you would know by watching below BBC videos in Youtube

    1. Ireland lost and leaving

    2. BBC Panorama- Life and Debt: A Greek Tragedy

    యూరో కరెన్సి ఎలా వాడకం లోకితెచ్చారో, 20సం|| డబ్బులు లేక, దేశం లో జనాభా లేక మైంటైన్ చేసే ఖర్చులు అధిక మై కొన్నిదేశాలు ఒక దానితో ఒకటి కలసి పోతాయి. ఇంకా చెప్పాలి అంటే మనదేశం వాళ్లన్ని వచ్చి, అక్కడ స్థిరపడమని, వాళ్లని పాలించమని ఆహ్వానించినా ఆశ్చర్యపోనవసరంలేదు.

  4. Sri గారూ, మొదటి కామెంట్ కనపడకుండా రెండో కామెంట్ కనపడేసరికి బ్లాక్ చేసినట్లు మీకు అనిపించింది. పవర్ కట్ వల్ల ఇలా జరిగింది. రెండు గంటల పవర్ కట్ లో చివరిదాకా మా ఇన్వర్టర్ రావడం లేదు. నాకు మొదట కనపడిన కామెంట్ అంగీకరించాక ఇన్వర్టర్ కుయ్ మని గోల పెట్టింది. అప్పటికి మొదటి కామెంట్ కనపడలేదు. మొదటిది కనపడకుండా రెండో కామెంట్ కనపడ్డం ఎమిటో అర్ధం కాలేదు. లేక నేను గమనించలేదేమో. వెంటనే కంప్యూటర్ షట్ డౌన్ చేసి పవర్ వచ్చాక పబ్లిష్ చేస్తున్నాను.

  5. తెల్లవాళ్లది సొల్లువాగుడైతే కావచ్చు గానీ ఆ వాగుడు తప్ప పరిస్ధితి తెలుసుకోవడానికి మరో ప్రత్యామ్న్యాయం లేదు. మీరు గమనిస్తే…, నేను రిపోర్టింగ్ మాత్రమే తీసుకుంటాను తప్ప వారి విశ్లేషణలని కాదు. వారి విశ్లేషణలని పూర్తిగా తిరస్కరించడం కూడా సరికాదు.

    నా అభిప్రాయంలో భారత ప్రజలు వెనుకబడ్డారు తప్ప దేశం కాదు. దేశానికి బోలెడన్ని సహజ వనరులు, మానవ వనరులు ఉన్నాయి. వనరులు జనం చేతుల్లో లేకుండా విదేశీ కంపెనీలకి అప్పజెప్పడం వల్ల జనం సంపన్నులు కాలేదు. ఆ మాటకొస్తే అమెరికా, యూరప్ ల జనం కూడా వారి పెట్టుబడిదారులతో పోలిస్తే సంపన్నులు కాదు.

    భారత దేశాన్ని తిడుతూ నేను రాశాననడం అసత్యం. ఒక దేశంలో రాజ్యం, ప్రజలు వేరు వేరనీ, రాజ్యాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలు సంపన్నులైనంత మాత్రాన ప్రజలు సంపన్నులు కాదనీ అనేక సందర్భాల్లో రాసాను. దేశాన్ని వాస్తవంగా ఎవరు నిర్మిస్తే వారే దేశం. దేశం అంటే శ్రమ చేసే ప్రజలు తప్ప శ్రమని దోచుకుని సంపన్నులైన వర్గాలు కాదని రాసాను. కనుక రాజ్యాన్ని తిట్టినపుడు ప్రజలని తిట్టినట్లు కాదని ఎప్పటికప్పుడు రాస్తున్నాను. రాజ్యం (state), దేశం (nation) వేరు వేరని కూడా రాసాను. అయినా మీరు మీకు కావలసిన అర్ధం తీసుకుని నాపైన ఆరోపణలు చేస్తున్నారు.

    ఇలా జనరలైజ్ చేసే బదులు ఆయా సందర్భాల్లో నిర్దిష్టంగా ఎత్తి చూపితే మీ ఆరోపణకు అర్ధం ఉంటుంది. ఈ సారి అలా చూపడానికి ప్రయత్నించండి.

    అంతర్జాతీయ వ్యవహారాల్లో నాకున్న నాలెడ్జ్ మేరకు రాస్తున్నాను. నాకు తెలిసింది చాలా తక్కువ. అయితే వివిధ పరిణామాలను విశ్లేషించడానికి ఒక దృక్పధం నాకుంది. విషయాలు తెలుసుకునే కొద్దీ ఆ దృక్పధం మార్పులు చేర్పులకు లోనవుతుంది. చాలా నాలెడ్జ్ ఉన్నట్లు నేను చెప్పినట్లు నాకు గుర్తులేదు. నిజానికి ఈ బ్లాగ్ కూడా ఇంకా తెలుసుకునే ప్రయత్నమే.

    పశ్చిమ దేశాల లెక్కల్లో, లేదా పశ్చిమ పెట్టుబడిదారీ ప్రభుత్వాల లెక్కలో, ఒక దేశం అభివృద్ధి చెందడం అంటే వారి పెట్టుబడిదారులకు అన్ని అవకాశాలూ ఇచ్చెయ్యడం. వివిధ దేశాల్లో ప్రజల ప్రయోజనాలని పక్కనపెట్టి వనరులని విచ్చలవిడిగా వారి కంపెనీలకి అప్పజెపితే ఆ దేశం గొప్ప అభివృద్ధి పధంలో ఉన్నట్లు ప్రచారం చేస్తాయి. వారి కంపెనీలు తీసే ఉత్పత్తి వల్ల జిడిపి పెరిగితే గొప్ప అభివృద్ధి. నియంత్రణ చట్టాలన్నీ రద్దు చేసి, పన్నులు తగ్గించి (అసలు లేకుండా చేస్తే ఇంకా మంచిది), లక్షల కోట్ల రాయితీలు ఇచ్చి కంపెనీలు ఎంత దోచినా నోరు మూసుకుని ఉంటే అదే ప్రజాస్వామ్యం. అలాంటి చోట్ల మానవహక్కులు వెల్లివిరుస్తున్నట్లు. కంపెనీల ఉత్పత్తి, లాభాలు పెరగడం వల్ల పెరిగే జిడిపి ప్రజలకి చేరకపోయినా ఫర్వాలేదు. కంపెనీలుకి ఎంత సంపద పెరిగితే జనానికి కూడా అంతమంచిది అని ‘ట్రికిల్ డౌన్ ధియరీ’ లు చెబుతారు. మీరు చెప్పినట్లు ఇవన్నీ సొల్లు వాగుడే. ఆ సంగతి వివిధ సందర్భాల్లో చెబుతూనే ఉన్నాను.

    యూరప్ దేశాల ఆనవాళ్లు కూడా మిగలవని మీకు ఎలా అనిపించింది? తెల్లవాళ్ళ సొల్లువాగుడు కాకుండా మీకున్న ఆధారాలు ఏమిటి? ప్రపంచంలో తెల్లవాళ్ల కార్పొరేట్ పత్రికలదే ఆధిపత్యం. అవి కాకుండా మీకు ప్రత్యామ్న్యాయ వార్తా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? బిబిసి కూడా తెల్లవాడిదే కదా, మళ్ళీ వారినే రిఫరెన్స్ గా ఇచ్చారేమి? ఇది మిమ్మల్ని క్రాస్ చెయ్యడానికి కాదు. నిజంగా మీకు అదనపు వనరులు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు తలెత్తింది.

    యూరోపియన్ సివిలైజెషన్ అక్కడి ప్రజలది తప్ప అది వారి ప్రభువుల గుత్త సొత్తు కాదు. ప్రజల సివిలైజేషన్ ఎప్పుడూ అంతరించదు, రూపం మార్చుకోవచ్చు గాని. ప్రజలు ఆదరించి భాగస్వాములైన సివిలైజేషన్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

  6. నా మొదటి కామేంట్ లేక పోవటం చూసి అలా రాయవలసి వచ్చింది. సారి,ఎమీ అనుకోకండి.
    జర్మని దగ్గర , లండన్ వాడి దగ్గర కొంత డబ్బులు మిగిలి ఉన్నాయి. ఆ డబ్బులు సంపన్నుల చేతిలో ఉన్నాయి. మిగతా దేశాలు రోజు వారి లెక్కలు వేసుకొని ఖర్చు పెట్టుకొనె దుస్థితి లో ఉన్నారు. వీళ్ల భయం ఎమిటంటె మిగతాదేశాల వారు మినిమం చెలింపులు చెల్లించకపోతే (క్రెడిట్ కార్డ్ లో మిమ్నిమం డ్యూ లాగా ), వారి పరిస్థితి కూడా తలక్రిందులు అవుతుందని, చేతులెత్తే దేశాలకి ఆర్ధిక సహాయం వారు చేయటమో, ఐ.యం.యఫ్. చేత చేయించటమో చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఆదేశలు ఆర్ధిక మాంద్యం నుంచి బయటపడటం అసాధ్యం. అయ్యే పని కాదు. ఉత్త మాటలు. అసలికి జనభా ఉంటే కదా! ముసలి వారు ఎక్కువ రోజులు బ్రతుకుతున్నారు. కుర్ర వారు ఎక్కువగా లేరు, ఉన్న వారికి ఎమి చేయాలో తెలియదు. చాలా పనులను ఆటొ మేషన్ చేసేశారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s