ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల బిల్లు: పార్టీల వికృత రూపాలు బట్టబయలు


Photo: The Hindu

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి గురువారం మరో ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ బుద్ధులు దేశ ప్రజల ముందు నగ్నంగా ప్రదర్శించబడ్డాయి. కోల్ గేట్ కుంభకోణం సృష్టించిన పార్లమెంటరీ సంక్షోభం నుండి బైట పడడానికి అధికార పార్టీ ‘ఎస్.సి, ఎస్.టి ప్రమోషన్ల రిజర్వేషన్’ బిల్లుని అడ్డు పెట్టుకుంటే, బి.సి ఓట్ల కోసం ఒక పార్టీ, హిందూ ఓట్ల కోసం మరొక పార్టీ ఈ బిల్లును అడ్డుకోవడమే కాక, తమ కుల దురహంకారాలను కూడా నిస్సిగ్గుగా బైట పెట్టుకున్నాయి.

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వ రెడ్ టేపిస్టు అలసత్వం కింద పడి నలుగుతోంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండగా మాయావతి ఎస్.సి, ఎస్.టి ల కోసం తెచ్చిన ఈ సౌకర్యం కోర్టుల అచారిత్రిక దృక్పధం వల్ల రద్దుకు గురయింది. కోర్టుల హ్రస్వ దృష్టిని కొద్దిగానైనా సరిదిద్దేందుకు దోహదం చేసే ఈ బిల్లు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ‘కోల్-గేట్’ సంక్షోభానికి మోక్ష మార్గంగా కాంగ్రెస్ పార్టీకి కనిపించింది. అంతే! ఆగమేఘాల మీద సదరు బిల్లు రాజ్య సభలో చర్చ కోసం వడి వడి గా నడిచొచ్చింది.

బుధవారం బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టినపుడు ఎస్.పి సభ్యులు సభ జరగకుండా అడ్డుకున్నారు. ఓ పక్క నినాదాలతో గొడవ చేస్తూనే ఎస్.సి, ఎస్.టి లకు కోటాల ప్రకారం ప్రమోషన్లపై ప్రాధాన్యం కల్పించడం పట్ల విపరీత వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఎస్.సి, ఎస్.టి ప్రజల వెనుకబాటుతనం పట్ల ఈసడింపు స్వభావాన్ని ప్రదర్శించారు. జూనియర్లు సీనియర్లు అవుతారంటూ ములాయంగ్ సింగ్ లాంటి వారు వక్ర వ్యాఖ్యలు చేశారు. అగ్రకుల దురహంకారుల ప్రతిభా వాదాన్ని దొడ్డిదారిన వెళ్ళగక్కారు. పార్లమెంటు సభ్యులు ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకుని కలబడుతూ తమ పార్లమెంటరీ ప్రతిభా సంపత్తులు ఏ పాటివో నిరూపించుకున్నారు.

గురువారం ములాయం వికృత భాష్యాలకు అగ్రకుల దురహంకారాన్ని నిలువెల్లా ధరించిన శివ సేన పార్టీ తోడయింది. బ్రాహ్మణీయ భావజాలానికి మరోసారి నిబద్ధ విధేయత ప్రకటించుకునే అవకాశాన్ని శివసేన ఎందుకు వదులుకుంటుంది? బిల్లు ప్రవేశపెట్టడానికి మంత్రి నారాయణ స్వామి ఉద్యుక్తుడవగానే ఎస్.పి (సమాజ్ వాదీ పార్టీ), శివసేన సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి రగడ మొదలు పెట్టారు. బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. అప్పటికే రెండు సార్లు వాయిదాపడిన రాజ్యసభ ఆ రోజుకు కార్యకలాపాలు ముగించుకుని మరో రోజుటి వృధా సమావేశాల ఖర్చుని దేశ ప్రజలపై నిరభ్యంతరంగా మోపింది.

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన బిల్లు సమావేశాల చివరి రోజుల్లో ప్రవేశపెట్టడమే ఆ పార్టీ చిత్త శుద్ధిని తెలుపుతోంది. ప్రమోషన్ల బిల్లు ని ఈ సమావేశాల్లో ఆమోదం పొందడం కష్టమని మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించడమే దీనికి రుజువు. కోల్ గేటు కుంభకోణానికి సంబంధించి ప్రధాని రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ కి తలొగ్గితే ఎస్.సి, ఎస్.టి ప్రమోషన్ బిల్లు పై చర్చకు సిద్ధమని బి.జె.పి ప్రకటించడం బి.జె.పి మార్కు మోసం. ప్రమోషన్ల బిల్లు పై చర్చకు అనుమతీస్తే కోల్-గేట్ డిమాండ్ కి వచ్చే నష్టం ఏమిటిట? ప్రమోషన్ల బిల్లుపై చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ కోల్-గేట్ కుంభకోణం నుండి బైటపడుతుందా? కేవలం ఒక న్యాయమైన బిల్లు చట్టంగా మారే అవకాశం ఇచ్చినంత మాత్రాన బి.జె.పి పోరాట పటిమ మొద్దుబారుతుందా?

భారత దేశ బ్యూరోక్రటిక్ పరమపద సోపానంలో కనీస మాత్రంగానైనా ఒక మెట్టు ఎక్కడానికి అవకాశాన్నిచ్చే ఒక ముఖ్యమైన, న్యాయమైన బిల్లు, పాలక, ప్రతిపక్ష ముఠాల రాజకీయ వికృత క్రీడలో పావుగా మారడాన్ని బట్టి ఆ పార్టీల అభివృద్ధి మంత్రంలోని డొల్లతనం ఏమిటో అర్ధమవుతున్నది.

ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన లెక్కల ప్రకారమే 149 సెక్రటరీ స్ధాయి అధికారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎస్.సి వ్యక్తి లేడు. 108 మంది అదనపు కార్యదర్శుల్లో ఇద్దరు ఎస్.సి, ఇద్దరు ఎస్.టి అధికారులు మాత్రమే ఉన్నారు. జాయింట్ సెక్రటరీ స్ధాయి అధికారులు 477 మంది ఉంటే ఎస్.సి లు 31 మంది (6.5 శాతం) ఎస్.టి లు 15 మంది (3.1 శాతం) మాత్రమే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరిలోకి తీసుకుంటే 17 శాతం ఎస్.సి లు, 7.4 శాతం ఎస్.టి లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎస్.సి (15%), ఎస్.టి (7.5%) ల మొత్తం జనాభా తో పోలిస్తే ఇది ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే ఇది వాపే. పై పై పటాటోపమే. అత్యంత చివరాఖరి గ్రూపులోని సఫాయి ఉద్యోగుల్లో 40 శాతం ఉద్యోగులు ఎస్.సి లే ఉన్న ఫలితంగానే ఈ వాపు కనిపిస్తోంది.

సఫాయి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలంటే ఎస్.సి లకు పోటీ రాదు. వారి సంఖ్య కంటే ఎక్కువే ఉద్యోగాలిచ్చినా ప్రతిభావాదులకు అభ్యంతరం లేదు. కార్యదర్శి పదవి ఇవ్వమంటే దేశ భవిష్యత్తు గుర్తుకు వస్తుంది. ప్రతిభ, ప్రతిభ అంటూ మొరుగుడు మొదలవుతుంది. పాలక వర్గాలకు సాష్టాంగం మోకరిల్లినప్పటికీ బాబూ జగజ్జీవన్ రామ్ కి ప్రధాని పదవి ఇవ్వడానికి ససేమిరా నిరాకరిస్తూ కట్టగట్టుకుని ఒక్కటైన ఈ దేశ అగ్రకుల రాజకీయ అభిజాత్యుల చేతుల్లో భారత దేశ ప్రతిభ ఏనాడో కొడిగట్టింది. కాగా, ప్రతిభ, ప్రతిభ అంటూ ఇప్పటికీ నీలుగుతున్న ములాయంలు, శివసేనల ఏలికలో అగ్రకుల ప్రతిభ సైతం స్వదేశీ, విదేశీ ప్రవేటు స్వాముల నోట్ల పొత్తిళ్లలో కునుకు తీస్తుండడం ఒక నిష్టుర సత్యం.

పోనీ, ఈ ప్రతిభా సంపత్తుల అరవైయారేళ్ళ  ఏలుబడిలో ఈ దేశం ఊడబోడిచింది ఏమన్నా ఉన్నదా? 18 లక్షల కోట్ల విదేశీ అప్పు, 40 లక్షల కోట్ల స్వదేశీ అప్పు ఈ ప్రతిభా పాలనలో దేశానికి దక్కిన గొప్ప. ప్రపంచ బ్యాంకు అప్పిస్తే తప్ప సరైన రోడ్డు పడదు. మురుగు కాలవ తవ్వాలన్నా నార్వే, హాలండ్ లాంటి అతి చిన్న దేశాల ముందు జోలె  పట్టవలసిందే. 75 శాతం వ్యవసాయ భూములు నీటిపారుదల సౌకర్యం లేక వర్షపు చుక్క కోసం చాతక పక్షుల్లా ప్రతేడూ మోరఎత్తి ఎదురు చూడవలసిందే. వీరు ప్రవచించిన ఆధునిక దేవాలయాలు నేర్రెలిచ్చి కారుతోంటే పూడ్వడానికి మళ్ళీ ప్రపంచబ్యాంకు పధకాలు కావాల. ప్రపంచంలో సగం దరిద్రం భారతదేశంలోనే నివాసం. దారిద్ర్య రేఖని కిందకి… ఇంకా కిందకి… తోక్కేస్తే తప్ప దరిద్రాన్ని తగ్గించలేని దరిద్రం ఈ ప్రతిభా సంపన్నులది.

దేశ వనరులని తవ్వి తీసుకెళ్లే బహుళజాతి కంపెనీలు విదిల్చే విదేశీ పెట్టుబడులే ఈ దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు తప్ప వాణిజ్య మిగులు వల్ల మిగిలిన ఒక్క పైసా కూడా అందులో ఉండదు, ఇంకో వందేళ్లయినా.  మానవాభివృద్ధి సూచికలో నిలబెడితే 187 దేశాల్లో 134 వ దేశం ఇండియాది. అవినీతిలో మాత్రం 95 వ స్ధానానికి ఇండియాని చేర్చారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయని జబ్బలు చరుచుకోవడమే తప్ప దాన్ని బయటకి తీసి జనానికి ఉపయోగపెట్టడానికి ఎవరు అడ్డమో చెప్పి చావరు.   దేశంలోని కోట్ల మంది శ్రమ జీవుల చేతికి చిప్ప దక్కించిన ప్రతిభావాదుల చేతుల్లో దేశం ఎప్పటికీ దరి చేరేను? సిగ్గు లేకపోతే సరి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s