మధ్య ప్రదేశ్ కోల్-గేట్: కాంగ్రెస్, బి.జె.పి ఇరువురూ పాత్రధారులే


బొగ్గు కుంభకోణం దరిమిలా ప్రధాని రాజీనామాకు బి.జె.పి పట్టుబడుతున్న నేపధ్యంలో బి.జె.పి ముఖ్యమంత్రుల ‘మినీ బొగ్గు కుంభకోణాలు’ బైటికి వస్తున్నాయి. 2011 లో రిలయన్స్, ఎస్సార్ కంపెనీలకు బొగ్గు గనులు తవ్వకానికి అనుమతి ఇవ్వడానికి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ నిర్వహించి సఫలమయిన విషయాన్ని ‘ది హిందూ’ పత్రిక వెల్లడి చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి జై రామ్ రమేష్ తీవ్ర అభ్యంతరాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బి.జె.పి ముఖ్యమంత్రి లాబీయింగ్ కి తలోగ్గింది. నీటి రిజర్వాయర్ కేచ్ మెంట్ ఏరియా అయినప్పటికీ, విస్తృత అటవీ వనరుల విధ్వంసం వలన పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగజేసే పరిస్ధితి ఉన్నప్పటికీ కేవలం 14 సంవత్సరాల వినియోగానికి అడవుల తవ్వకంలో బి.జె.పి, కాంగ్రెస్ లు కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతోంది.

పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రధాని, ముఖ్యమంత్రి కుమ్మక్కు

కాంగ్రెస్ ప్రభుత్వం, వేలం వేయకుండా ‘మొదట వచ్చినవారికి మొదట’ పద్ధతిలో కేటాయించిన బొగ్గు గనుల్లో మధ్య ప్రదేశ్ లోని మహాన్ బొగ్గు గని కూడా ఒకటి. ఎస్సార్ పవర్, హిందాల్కో కంపెనీల కోసం ఈ గనులు కేటాయించాలని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్ కు లేఖలు రాశాడు. మహాన్ ప్రాంతం పర్యావరణ పరిరక్షణ రీత్యా, అటవీ వనరులతో అత్యంత సంపద్వంతమైన ప్రాంతం కనుక ప్రవేటు కంపెనీల తవ్వకానికి అనుమతి ఇవ్వడానికి జైరాం రమేష్ అభ్యంతరం తెలిపాడు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేటు కంపెనీల కోసం రాష్ట్ర రాజధాని భోపాల్ లో 20 నిమిషాలు ధర్నా చేయడంతో ప్రధాని మన్మోహన్ ఆయన ఒత్తిడికి తలోగ్గాడు. బి.జె.పి ముఖ్యమంత్రి ఒత్తిడికి కాంగ్రెస్ ప్రధాని తలోగ్గినట్లు ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో ప్రధాని మన్మోహన్, ముఖ్యమంత్రి చౌహాన్ లు ఇద్దరూ, కంపెనీల అనుకూల శిబిరంలోని వారే. పర్యావరణ పరిరక్షణ కోసం జైరాం రమేష్ విధించిన అభ్యంతరాలను అధిగమించేందుకు ‘ఒకరు ధర్నా చేయడం, మరొకరు అంగీకరించడం’ అనే నాటకం జరిగిందని గ్రహించవచ్చు.

“ఈ ప్రాజెక్టు (మహాన్ బొగ్గు గనుల తవ్వకం) క్లియర్ చెయ్యడానికి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నాతో రెండు సార్లు మాట్లాడాడు. [చివరిసారిగా జూన్ 30, 2011 తేదీన మాట్లాడాడు.] ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని ఆయన తెలిపాడు” అని బొగ్గు గనులపై నియమించిన సాధికారిక మంత్రుల కమిటీ (Empowered Group of Ministers on Coal -EGoM) కి పర్యావరణ మంత్రి జైరాం రమేష్ రాసిన లేఖ లో తెలిపాడని ‘ది హిందూ’ వెల్లడించింది. మహాన్ అటవీ ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ శాఖ ‘నో-గో ఏరియా’ (No-Go Area) గా వర్గీకరించీంది. అయినప్పటికీ ప్రవేటు కంపెనీలకు కేటాయించాల్సిందేనని పట్టుబడుతూ ముఖ్యమంత్రి చౌహాన్ గత ఫిబ్రవరిలో ధర్నాకు దిగాడు. ధర్నాకి దిగిన 20 నిమిషాలకే ప్రధాని మన్మోహన్ నుండి ముఖ్యమంత్రి చౌహాన్ కి ఫోన్ వచ్చింది. త్వరలోనే ఎస్సార్, హిందాల్కో కంపెనీలకు బొగ్గు గనుల కేటాయింపులు జరుగుతాయని మన్మోహన్ హామీ ఇవ్వడంతో చౌహాన్ ధర్నా విరమించాడు.

కమిటీలు, చర్చలు అన్నీ కంపెనీల కోసమే

ప్రవేటు కంపెనీలకు బొగ్గు గనులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం చౌహాన్ కి ఇదే మొదటిసారి కాదని ‘ది హిందూ’ కధనం తెలియజేసింది. రిలయన్స్ కంపెనీ కోసం 2007 లో కూడా చౌహాన్ ఇదే రకమైన ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వంపై తెచ్చి సఫలం అయ్యాడు. సింగ్రౌలి జిల్లాలోని చిత్రాంగి తహసీల్ లో రిలయన్స్ కంపెనీ ‘ససాన్ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు’ ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకి కాప్టివ్ వినియోగం (కేటాయించబడిన కంపెనీ వినియోగానికి తప్ప మరో ఉపయోగానికి గనులను వినియోగించడం నిషిద్ధం) నిమిత్తం కేటాయించిన బొగ్గు గనులను ఇతర ఉపయోగాలకు వాడుకోవడానికి రిలయన్స్ కంపెనీకి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చౌహాన్ ప్రధానితో లాబీయింగ్ జరిపాడు. ప్రధాని కార్యాలయం ఈ సంగతి EGoM కి సిఫారసు చేసిన తర్వాత రిలయన్స్ కి అనుమతి లభించింది.

అంటే ప్రభుత్వాలు విధించే ‘కాప్టివ్ నిబంధన’ ప్రారంభ అనుమతిని న్యాయబద్ధం చేయడానికి మాత్రమే. ఏదో ఒక నిబంధన కింద బొగ్గు గనులను ఇష్టానుసారం తవ్వుకోవడానికి అనుమతి ఇచ్చాక ఇక ప్రారంభ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదు. నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలే -అది పి.ఎం.ఒ అయినా, ప్రధాని అయినా, EGoM అయినా- తేలికగా చెప్పేస్తాయి. మంత్రో, ప్రధాన మంత్రో EGoM కి సిఫారసు చెయ్యడం, EGoM లోని మంత్రులు దానిపై చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశం అవడం, అందులో ఏవో ప్రజా ప్రయోజనాలు ఉన్నట్లు గంభీర ప్రకటనలు చెయ్యడం, అంతిమంగా పవేటు కంపెనీలు ఇష్టారాజ్యంతో నిబంధనల ఉల్లంఘనకు అనుమతి ఇచ్చేయ్యడం… ఇదంతా ఒక ప్రసహనం. నియంత్రణ (regulation) పేరుతో జరిపే నాటకం.

ఈ చర్చల నాటకంలో అంతిమ ఫలితం ఎప్పుడూ ఒకటే. ప్రవేటు కంపెనీలు నిబంధనలు విస్మరించి ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసినా వారికి కావలసిన అనుమతులన్నీ ఇచ్చేయ్యడమే ఆ అంతిమ ఫలితం. ‘రోడ్లన్నీ రోమ్ నగరానికే దారి తీస్తాయి’ అన్నట్లుగా కమిటీలు, చర్చలు అన్నీ ప్రవేటు కంపెనీల ప్రయోజనాల కోసమే జరుగుతాయి. “ఈ నాటకం అంతా ఎందుకు? ఎలాగూ అనుమతులు ఇచ్చేస్తారు కదా! అదేదో చర్చలు, నిబంధనలు ఇత్యాది నాటకాలకు ముందే ఇచ్చేయ్యండి” అని స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలు ఒత్తిడి తెచ్చిన ఫలితమే అనియంత్రణ (Deregulation లేదా Liberalisation).

ప్రజల వనరులు కంపెనీల లాభాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగం అయ్యేలా వివిధ స్ధాయిల్లో ప్రభుత్వాలు విధించిన పాలనాపరమైన చెకింగ్ లే నియంత్రణ. దీనిని లైసెన్స్ రాజ్ గా ముద్ర వేసి ‘సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ’ (Liberalisation, Privatisation, Globalisation) విధానాల పేరుతో రద్దు చేసిన ఫలితంగానే కుంభకోణాలు వెల్లివిరుస్తున్నాయి. కాంగ్రెస్ బదులు బి.జె.పి అధికారంలో ఉన్నా జరిగేది ఇదే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్వదేశీ, విదేశీ కంపెనీలకు సేవ చేసుకోవడమే తప్ప ప్రజలకు సేవ చేసేది లేదు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్, ప్రధాని మన్మోహన్ లు బొగ్గు గనుల కేటాయింపుల్లో పాల్పడిన కుమ్మక్కు ఈ విషయమే తెలియజేస్తోంది.

నిబంధనలన్నీ గాలికి

మహాన్ బ్లాక్ బొగ్గు తవ్వడానికి జైరాం రమేష్ నేతృత్వంలోని పర్యావరణ శాఖ మొదటినుండీ తిరస్కరిస్తూ వచ్చింది. మహాన్ గనులు తవ్వడానికి అనుమతి ఇస్తే చిక్కటి అడవులతో నిండిన ప్రాంతం అంతా నాశనం అవుతుందనీ, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని పర్యావరణ శాఖ అభ్యంతరం చెప్పింది. ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్.ఎ.సి) మహాన్ అడవులను సందర్శించి ప్రవేటు కంపెనీలు తప్పుడు సమాచారం ఇచ్చాయని కనుగొంది. దానితో మరొకసారి పర్యావరణ ప్రభావాన్ని వివరంగా అంచనా వేయాలని ఎఫ్.ఎ.సి సిఫారసు చేసింది. ఎస్సార్, హిందాల్కో లు చెప్పినదానికంటే విస్తృతమైన అటవీ ప్రాంతం మహాన్ లో ఉన్నదని ఎఫ్.ఎ.సి కనుగొన్నది. “రిహాండ్ రిజర్వాయర్ కేచ్ మెంట్ ఏరియా లో మహాన్ బొగ్గు బ్లాకు ఉన్నది. అక్కడ బొగ్గు తవ్వి తీస్తే వాలు ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అన్నీ (బొగ్గు తవ్వకం, అటవీ వినాశనం ద్వారా సమకూరిన) అదనపు వృధా బురదతో నిండిపోతాయి” అని ఎఫ్.ఎ.సి నివేదిక తెలిపింది. ఇది పర్యావరణానికి తీవ్ర హాని చేస్తుందనీ, చిక్కనైన పచ్చని అటవీ ప్రాంతం కోల్పోతామనీ ఎఫ్.ఎ.సి అభిప్రాయపడింది.

కేంద్ర పర్యావరణం మరియు అటవీ శాఖ, బొగ్గు శాఖతో కలిపి మహాన్ ప్రాంతంలో విస్తృత సర్వే నిర్వహించింది. దాని ప్రాతిపదికన 2010 లోనే మహాన్ ప్రాంతాన్ని ‘no-go area’ గా పర్యావరణ శాఖ ప్రకటించింది.  అందువలన మహాన్ లో తవ్వకాలకి అనుమతి ఇవ్వొద్దని జైరాం రమేష్ వాదించాడు. “సంపన్నమైన జీవవైవిధ్యం (biodiversity) ఉన్న ప్రాంతం ఇది. మంచి సహజసిద్ధమైన అటవీ పొరలను (ప్రాజెక్టు) నాశనం చేస్తుంది. జంతువుల నివాసాల్లోకి చొరబడుతుంది” అని జైరాం రమేష్ EGoM కి రాసిన లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఎస్సార్, హిందాల్కో కంపెనీల 5 % నుండి 8% వరకూ తక్కువ కర్బన వాయువులు వెలువరించే సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంటులు కావని, కేవలం (వేడి కర్బన్ వాయువులు అధికంగా వెలువరించే) సబ్ క్రిటికల్ విద్యుత్ ప్లాంటులేననీ మంత్రి రమేష్ తన లేఖలో తెలిపాడు. ఎస్సార్ కంపెనీ స్వయంగా చెప్పినదాని ప్రకారం చూసినా మహాన్ బొగ్గు కేవలం  14 స్వంవత్సరాలు మాత్రమే కంపెనీలు తీరుస్తుందని చెబుతూ అలాంటి పాక్షిక అవసరాల కోసం సుగుణ సంపన్నమైన అడవులను నాశనం చెయ్యడం ఎందుకని రమేష్ ప్రశ్నించాడు. ప్రత్యామ్న్యాయ బొగ్గు గనులను కూడా ఎస్సార్, హిందాల్కో కంపెనీల కోసం రమేష్ ప్రతిపాదించాడు.

ఇవేవీ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రికి గానీ, ప్రధాన మంత్రి మన్మోహన్ కి గానీ, EGoM కి గానీ ఎక్కలేదు. కంపెనీల సేవకోసమే ప్రభుత్వాలు నడుపుతున్నవారికి ప్రజల ప్రయోజనాలతో పని లేదు. ప్రభుత్వ నిబంధనలతోనూ, పర్యావరణ చట్టాలతోనూ పని లేదు. ఫలితంగా మే నెలలో మహాన్ బొగ్గు గని తవ్వకానికి ప్రవేటు కంపెనీలకు అనుమతి మంజూరయింది. ఈ మంజూరులో అనేక నిబంధనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. అంతర్జాతీయ పర్యావరణ వేదికలపై కర్బన వాయువుల వెల్లడిని కట్టడి చేస్తామని అట్టహాసంగా ఇచ్చిన హామీని ప్రధాని తానే ఉల్లంఘించాడు. అటవీ వనరులను పరిరక్షించి తద్వారా విస్తృత జీవవైవిధ్యాన్ని కాపాడాలన్న సాధారణ సూత్రాన్ని సైతం విస్మరించాడు. మధ్య ప్రదేశ్ లో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకుంటాయన్న ఒకే ఒక కంపెనీల కారణం తప్ప మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి ప్రజా ప్రయోజనాన్ని చూపలేకపోయాడు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలోని బి.జె.పి ప్రభుత్వం ఉమ్మడిగా కంపెనీలకు సేవ చేస్తున్న నేపధ్యంలో మన్మోహన్ రాజీనామా కోసం బి.జె.పి సాగిస్తున్న ప్రహసనం ఎంతటి నాటకమో అర్ధం అవుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s