మోడి ప్రతీకార సిద్ధాంతానికి చెంపపెట్టు, నరోడ-పాటియా తీర్పు


గుజరాత్ నరమేధం లో భాగంగా జరిగిన నరోడ-పాటియా హత్యాకాండ కేసులో ప్రత్యేక సెషన్స్ కోర్టు తరతరాలకు నిలిచిపోయే విధంగా అత్యద్భుతమైన తీర్పు ప్రకటించింది. గోధ్రా రైలు దహనానికి హిందువులు ఐచ్ఛికంగా తీసుకున్న ప్రతీకార చర్య ఫలితమే ‘ముస్లింలపై సాగిన నరమేధం’ అని ప్రవచించిన నరేంద్ర మోడి ‘ప్రతీకార సిద్ధాంతానికి’ చెంప పెట్టులాంటి తీర్పు ప్రకటించింది. గుజరాత్ మాజీ మంత్రి మాయా కొడ్నాని, భజరంగ్ దళ్ నాయకుడు బాబూ భజరంగి తదితరులు పన్నిన కుట్ర ఫలితంగానే ‘నరోడ-పాటియా నరమేధం’ జరిగిందని ధృవీకరించింది. మత కల్లోలాల చరిత్రలోనే మొదటిసారిగా ఒక ‘మతోన్మాద హింస’ లో రాజకీయ నాయకుల కుట్ర ను నిర్ధారించింది. దోషులందరికీ సుదీర్ఘకాలాల పాటు జైలు శిక్ష విధించింది. ‘మరణ శిక్ష’ విధించడానికి తగిన కారణాలున్నప్పటికీ ప్రపంచవ్యాపితంగా మరణ శిక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు స్పందిస్తున్న నేపధ్యంలో వరుస జైలు శిక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుత ఎం.ఎల్.ఏ, మోడీ మంత్రివర్గంలో 2007-09 మధ్య స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన బి.జె.పి నాయకురాలు మాయాబెన్ కొడ్నానికి 28 సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది. నాగరికత సిగ్గుపడేలా స్త్రీలు, పసి పిల్లలని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా నరికి చంపిన బాబూ భజరంగి, చనిపోయేవరకూ శేష జీవితమంతా జైలులోనే గడపాలని తీర్పు నిర్దేశించింది. మొత్తం 61 మందిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు జడ్జి జ్యోత్స్నా యాజ్ఞిక్, సాక్ష్యాలు లేనందున 29 మందిని నిర్దోషులుగా బుధవారం తీర్పులో పేర్కొంది. దోషులుగా నిర్ధారించిన 31 మందికి శుక్రవారం శిక్షలు ప్రకటించీంది. పరారీలో ఉన్న ఒక దోషికి కోర్టు శిక్ష ప్రకటించలేదు. వివిధ నేరాల కింద విధించే జైలు శిక్షలను ఏక కాలంలో అనుభవించాలని కోర్టులు తీర్పు చెప్పడం పరిపాటి. బహుశా మొదటిసారిగా, నరోడ-పాటియా కేసులో జైలు శిక్షలను ఒకదాని తర్వాత మరొకటి అనుభవించాలని కోర్టు నిర్దేశించింది.

కోర్టు తీర్పు ప్రకారం మారణాయుధాలతో దాడి చేసినందుకు ఐ.పి.సి సెక్షన్ 326 కింద దోషులందరూ (31) 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాలి. అనంతరం వివిధ నేరాల కింద వివిధ కాలాలపాటు యాజజ్జీవ శిక్ష అనుభవించాలి. గైనకాలజిస్టుగా ఒక ఆసుపత్రి కూడా నిర్వహిస్తున్న మాయాబెన్ కొడ్నాని పదేళ్ళ శిక్ష అనంతరం, 18 సంవత్సరాల యావజ్జీవ శిక్ష అనుభవించాలి. అంటే మొత్తం 28 యేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాలి. ముస్లిం యువతిని పెళ్లాడిన సురేష్ ఛార తో పాటు ఏడుగురు దోషులు, 21 సంవత్సరాల యావజ్జీవ శిక్ష (మొత్తం 31 సంవత్సరాలు) అనుభవించాలి. మిగిలిన 22 మంది దోషులు 14 సంవత్సరాల యాజజ్జీవ శిక్ష (మొత్తం 24 సంవత్సరాలు) అనుభవించాలి.

కొడ్నాని నాయకత్వం

నరోడ-పాటియా నరమేధంలో డాక్టర్ మాయా బెన్ కొడ్నాని పాత్రను కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒక ఎం.ఎల్.ఏ గా తన విధినిర్వహణలో ఆమె విఫలమయిందని పేర్కొంది. “ఒక ప్రజాప్రతినిధిగా డాక్టర్ కొడ్నాని ప్రజలకు సేవ చేయాలి. అల్లర్లను అడ్డుకోవాలి. అందుకు బదులుగా నరోడ-పాటియాలో ముస్లింలపై దాడి చేయడానికి బాబు భజరంగితో కలిసి కుట్ర చేసి అమలు చేయడంలో ఆమె భాగస్వామ్యం వహించినట్లు కనుగొనబడింది” అని జస్టిస్ యాజ్ఞిక్ పేర్కొంది. నరోడా నుండి మూడుసార్లు ఎం.ఎల్.ఏ గా కొడ్నాని ఎన్నికయింది. 2002 లో నరమేధం జరిగినపుడు ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.ఎల్.ఏ గా గెలుపొందాక ఆమెను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమించి నరోడ-పాటియా హత్యాకాండ బాధితులను నరేంద్ర మోడి అవహేళన చేశాడని ‘ది హిందూ’ ఆగస్టు 30 ఎడిటోరియల్ అభిశంసించింది. “నరేంద్రమోడీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో  (indulgent gaze of the Gujarat government)” గుజరాత్ నరమేధం సాగిందని కూడా ‘ది హిందూ’ ఎడిటోరియల్ పేర్కొనడం గమనార్హం.

“నరోడా-పాటియా ప్రాంతంలో జరిగిన మొత్తం అల్లర్లకు కీలక వ్యక్తి” గా మాయా కొడ్నాని ని కోర్టు అభివర్ణించింది. “ఆమె స్వయంగా మూకకు నాయకత్వం వహించి హింసకు రెచ్చగొట్టింది. హింసాత్మక మూకను ప్రేరేపించి మద్దతు ఇచ్చింది” అని కోర్టు తీర్పు పేర్కొంది. ముఖ్యమంత్రి నరేంద్ర మోడి కి సన్నిహితురాలుగా పేరొందిన మాయా కొడ్నాని తీర్పు విన్నాక ఒక్కసారిగా విలపించిందని పత్రికలు తెలిపాయి. 2002 మతోన్మాద హత్యాకాండలో దోషిగా నిర్ధారించబడిన మొట్టమొదటి పాలక పార్టీ ఎమ్మెల్యే మాయా కొడ్నాని. ఆమె పట్ల సౌమ్యంగా ఉండడానికి కోర్టు నిరాకరించిందని ‘ది హిందూ’ తెలిపింది. బుధవారం ఆమెను దోషిగా ప్రకటించాక తాను ‘రాజకీయాలకు బాధితురాలినని’ కొడ్నాని చెప్పుకున్నా కోర్టు కరుణించలేదు. ట్రయల్స్ జరిగేటప్పుడుగానీ, తన స్టేట్ మెంట్లలో గానీ ఎన్నడూ రాజకీయాలకు బాధితురాలిగా చెప్పకుండా చివరన తీర్పు ప్రకటించాక చెప్పడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది.

నరోడ-పాటియాలో ఫిబ్రవరి 28, 2002 తేదీన నరమేధం సాగిన సందర్భంగా నిస్సహాయ మహిళలపై నిందితులు మానభంగం, సామూహిక మానభంగాలకు పాల్పడ్డారనేందుకు తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అయితే ఈ నేరాల్లో దొషులేవరన్నదీ గుర్తించడం ఇన్నేళ్ల తర్వాత సాధ్యం కాదు గనక శిక్షలు విధించలేకపోతున్నామని తెలిపింది. సామూహిక మానభంగానికి గురయిన ఒక బాధితురాలిని కోర్టు గుర్తించింది. గుజరాత్ ప్రభుత్వం ఆమెకు 5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ‘మతోన్మాద హింస’ సమాజానికి కేన్సర్ లాంటిదని కోర్టు పేర్కొంటూ అలాంటి నేరాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తీవ్రస్ధాయి శిక్షలు విధించాలని కోర్టు అభిప్రాయపడింది.

గోధ్రా రైలు దహనానికి ప్రతీకారంగానే నరోడ-పాటియా హత్యాకాండ జరిగిందన్న డిఫెన్స్ వాదనను కోర్టు తిరస్కరించింది. 2002 గుజరాత్ నరమేధం “భారత ప్రజాస్వామిక వ్యవస్ధపై నల్ల మచ్చ” అని కోర్టు ప్రకటించింది. “ముందస్తుగా పధకం వేసుకుని అమలు జరిపిన కుట్ర ఇది. గోధ్రా రైలు దహనానికి ప్రతీకారం అని మాత్రమే చెప్పి దీనిని విస్మరించలేము.” అని పేర్కొంది. “చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించలేము. ఎందుకంటే భారత దేశం చట్టబద్ధ పాలనను సమున్నతంగా నిలిపే దేశం” అని కోర్టు పేర్కొంది.

నరోడ-పాటియా నరమేధంపై వ్యాఖ్యానిస్తూ మతహింసను జోత్స్నా యాజ్ఞిక్ తీవ్ర పదజాలంతో నిరసించింది. “మతహింస చర్యలు క్రూరమైనవి, అమానవీయం, సిగ్గుపడవలసినవి. ఒకే రోజులో 97 మందిని క్రూరంగా చంపేసిన నరోడ-పాటియా ఘటన మానవ హక్కుల ఉల్లంఘనకు స్పష్టమైన సాక్ష్యం. ఇందులో నిస్సహాయులైన మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. ఈ క్రూరమైన, అమానవీయమైన హింసకు పరాకాష్ట ఏమిటంటే, 20 రోజులు కూడా నిండని పసిగుడ్డుని సైతం హత్య చేయడం” అని జస్టిస్ జ్యోత్స్న యాజ్ఞిక్ పేర్కొంది.

నేర తీవ్రత ఎలా ఉన్నప్పటికీ నిందితుల్లో ఎవరికీ మరణ శిక్ష విధించడానికి జడ్జి నిరాకరించింది. ‘మానవ ప్రతిష్ట’ (human dignity) కు భంగకరంగా మరణ శిక్ష ను జడ్జి పేర్కొంది. అనేక దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయనీ, అత్యంత తీవ్రమైన కేసుల్లో మాత్రమే మరణ శిక్ష విధించాలని ప్రపంచవ్యాపితంగా ప్రచారం జరుగుతున్నదనీ జడ్జి ప్రస్తావిస్తూ “మరణ శిక్ష, బాధితులకు న్యాయాన్ని సమకూరుస్తుంది. సమాజంలో నేరాన్ని తగ్గించడం వాంఛనీయమే. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచవ్యాపితామగా నెలకొన్న ధోరణులను కోర్టు విస్మరింపజాలదు” అని జస్టిస్ జ్యోత్స్న యాజ్ఞిక్ పేర్కొంది.

బాధితుల ఆనందం

కోర్టు తీర్పు పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. 29 మందిని నిర్దోషులుగా వదిలివేయడంపై హై కోర్టుకి వెళ్తామని బాధితుల లాయర్ షంషద్ పఠాన్ చెప్పినప్పటికీ సుదీర్హ జైలు శిక్షలు బాధితుల సంతోషానికి కారణమయ్యాయి. తీర్పు ప్రకటించిన రోజే తమకు నిజమైన ఈద్ పండగని కొందరు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. “పది సంవత్సరాల పాటు ఎదురు చూశాం. చనిపోయిన మావాళ్లు చివరికి ఈ రోజయినా శాంతిస్తారు” అని ఒక బాధితురాలు ఫాతిమా బానో తెలిపింది. ఫాతిమా తో సహా అనేక ఇతర బాధితులు, సాక్ష్యులు పూర్తి ప్రతికూల పరిస్ధితుల్లో బిక్కు బిక్కు మంటూ బతికారు. సాక్ష్యం చెప్పకుండా ఉండడానికి నిత్యం బెదిరింపులు ఎదుర్కొన్నారు. అనేక ప్రలోభాలకు ఎదురొడ్డి నిలిచారు. యుగాలుగా రోజులు వెళ్లదీశారు.

“దోషులుగా నిర్ధారితమైన వారి కుటుంబాలు ఇప్పుడు తెలుసుకుంటారు. దగ్గరి వారిని పోగొట్టుకుని బతకడం అంటే ఏమిటో” అని బాధితులు వ్యాఖ్యానించడాన్ని బట్టి వారు అనుభవించిందేమిటో అర్ధం కాగలదు. అయితే దోషుల కుటుంబాల వారు మోడి పై ఆగ్రహం వెళ్ళగక్కారు. కష్టం సమయంలో తమను ఆదుకోకుండా ప్రభుత్వం వదిలేసిందని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడి కి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. మోడి ప్రభుత్వ అండదండలు లేకుండా నరమేధానికి తాము తెగించేవారం కాదని వారు ఆ విధంగా పరోక్షంగా తెలియజేశారన్నమాట.

బాధితులకు తీస్తా సెతల్వాద్ ప్రశంసలు

గుజరాత్ నరమేధంలో కొంతమందికైనా శిక్షలు పడుతున్నాయంటే దానికి కారణం తీస్తా సేతల్వాద్. ఆమె లేకుండా గుజరాత్ ముస్లిం లకు న్యాయం దక్కేదంటే నమ్మలేని విషయం. హత్యాకాండ జరిగిన పది సంవత్సరాల తర్వాత కూడా కోర్టు భయంతో నరేంద్ర మోడి వణికి పోతున్నాడంటే  కారణం తీస్తా సేతల్వాద్. ముంబై లో ప్రతిష్టాకరమైన జర్నలిస్టు జీవితం వదులుకుని గుజరాత్ మారణకాండ బాధితుల కోసం పదేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకు ప్రతీకారంగా నరేంద్ర మోడి నుండి అనేక తప్పుడు కేసులు ఎదుర్కొంది. అనేక ఒత్తిడులకు, బెదిరింపులకు, ప్రలోభాలకు కూడా లొంగకుండా రాత్రింబవళ్ళు పరిశ్రమించింది. ‘సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్’ అనే ప్రభుత్వేతర సంస్ధను స్ధాపించి గుజరాత్ మారణకాండ బాధితుల కోసం కృషి చేసింది.

“కోర్టు తీర్పును మేము ఆహ్వానిస్తున్నాం. నిందితులు ఎంత శక్తివంతులైనప్పటికీ, రాజకీయంగా ప్రభావశీలురైనప్పటికీ వారు కూడా దోషులేనని ఈ తీర్పు నిర్ధారించింది.” అని తీస్తా సేతల్వాద్ నరోడ-పాటియా తీర్పుపై వ్యాఖ్యానించిందని ‘ది హిందూ’ తెలిపింది. “బాధితులు-సాక్షులు అయిన వారి ముడి సాహసం (raw courage) అనుపమానం. ముఖ్యంగా మహిళలు నిర్భయంగా సాక్ష్యం చెప్పారంటే దానికి కారణం కోర్టు విచారణ వారిలో ధైర్యం నింపడమే. చంపండంటూ మూకలను మాయా కొడ్నాని రెచ్చగొట్టిన తీరు పై 11 మంది ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యం చెప్పారు. బాబూ భజరంగి కి వ్యతిరేకంగా 15 మంది సాక్ష్యం చెప్పారు. మానభంగం లో దోషి అయిన సురేష్ అలియాస్ లంగ్డా ఛార కి వ్యతిరేకంగా 48 మంది సాక్ష్యం చెప్పారు” అని తీస్తా శిక్షలు ప్రకటించక ముందు పత్రికలకు తెలిపింది.

2 thoughts on “మోడి ప్రతీకార సిద్ధాంతానికి చెంపపెట్టు, నరోడ-పాటియా తీర్పు

  1. సామూహికంగా రెచ్చగొట్టిన విద్వేషం మానవత్వాన్ని ఎలా బలితీసుకుంటుందో ఈ దారుణకాండే ఉదాహరణ. ఏళ్ళు గడిచాకయినా దోషులకు శిక్షలు పడటం గొప్ప విషయమే.

    ఇలాంటి కేసులో రాజ్య హింసనూ, దూషణ భూషణ తిరస్కారాలనూ తట్టుకుని బాధితుల పక్షాన నిలవటం సాధారణ విషయం కాదు. తీస్తా సెతల్వాద్ తెగువా, దీక్షా అనుపమానం!

  2. కసబ్ శత్రు దేశం నుండి మన దేశంలోకి వచ్చి, తన మతం పరమతం అనే తేడాల్లేకుండా కనబడిన వారినందరినీ కాల్చిచంపాడు(ముంబై రైల్వే స్టేషన్ లో వీరి కాల్పులకు గురై చనిపోయిన వారిలో అనేకమంది ముస్లింలు కూడా ఉన్నారు). కానీ ఈ మాయా కొందానీ, భజరంగీ లాంటి మతోన్మాదులు మన సాటి భారతీయులపైనే మారణహోమం సృష్టించారు. వీరికి కసబ్, అఫ్జల్ గురుల లాగే ఉరి శిక్షలు వేసి ఉంటే సబబుగా ఉండేది. ఇప్పుడు వీరిని జీవితాంతం ప్రజలు కట్టే పన్నులతోనే తిండి పెట్టి పోషించాలి. మరో పక్క మోడీ,BJPలేమో వీరి గురించి నోరెత్తకుండా, కసబ్ ఉరి గురించి ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ దాని నుండి కూడా ఓట్లు రాబట్టుకోవాలని చూస్తూనే ఉంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s