2002 ఫిబ్రవరి 28 తేదీన అహ్మదాబాద్ శివార్లలోని నరోడ-పాటియా లో ముస్లింలపై సాగిన నరమేధానికి దోషులెవరో ప్రత్యేక సెషన్స్ కోర్టు గుర్తించింది. ముఖ్యంగా చేతిలో తుపాకి ధరించి, హిందూ మతం పేరుతో మూకలను రెచ్చగొట్టి, వారికి కత్తులు, కరవాలాలు సరఫరా చేసి తమను తాము రక్షించుకోలేని నిస్సహాయ మహిళలపైనా, పసి పిల్లలపైనా, వృద్ధులపైనా అత్యంత క్రూరంగా, అమానవీయంగా హత్యాకాండకి నాయకత్వం వహించిన మహిళా డాక్టర్ గా డాక్టర్ మాయాబెన్ కొడ్నానిని కోర్టు గుర్తించింది.
రీసెర్చ్ స్కాలర్ పేరుతో వచ్చిన తెహెల్కా విలేఖరి ముందు తానే అనేకమందిని నరికాననీ, గర్భిణీ పొట్ట చీల్చి బిడ్డను కూడా చంపేశాననీ అంగీకరించిన బాబూ భజరంగిని కూడా దోషిగా కోర్టు గుర్తించింది. వీరిరువురూ సంపన్న వ్యాపారులే. ఆర్ధికంగా బలహీనులైన వర్గాల ప్రజలను కార్యకర్తలుగా మలుచుకుని వారికి మతోన్మాదాన్ని ప్రబోధించి తాము ఆర్ధికంగా లబ్ది పొందే సంపన్న వర్గానికి చెందినవారు. వీరిరువురి దోష నిర్ధారణ, శిక్షలు పరమ అవశ్యం. దోషులందరికీ శిక్షలు అవశ్యమే అయినా చర్చించవలసిన ఇతర అంశాలు కొన్ని ఉన్నాయి.
ఇటువంటి సంపన్న స్వార్ధపరులను అనుసరించి మతోన్మాదాన్ని తలెక్కించుకుని తోటి పీడితవర్గాల ప్రజలపై హత్యాకాండకు తెగబడిన హీనులెవరో ఈ ఫోటోలు చూస్తే అర్ధం అవుతుంది. వీరిలో ఒకరికి తన కొడుకికి కనీసం చొక్కా కొనివ్వలేని నిరుపేద. కంటికి ధారగా విలపిస్తున్న నలుగురు నిస్సహాయ మహిళలను నిరాధారం కావించిన ఉన్మాది మరొకరు. తానేంచేసి కటకటాల వెనక్కి చేరుకున్నదీ ధైర్యంగా చెప్పుకోలేని అమానవీయ కర్కశత్వం మరొకరిది. వీరంతా పేద వర్గానికో లేదా మధ్యతరగతి వర్గానికో చెందినవారేనని ఫోటోలు చూస్తే అర్ధం అవుతుంది. ఇలాంటివారికి మతోన్మాద మూర్ఖత్వం, క్రూరత్వం ఏమి సంపాదించి పెట్టింది?
ఇలాంటి లక్షలాది నిరుపేద, మధ్యతరగతి ఉన్మాదుల మతతత్వం మోడి లాంటివారికి ముఖ్యమంత్రిత్వం సంపాదించిపెట్టింది. దశాబ్దం పాటు గుజరాత్ రాష్ట్రాన్ని ఏలగలిగిన ఏకచ్ఛత్రాధిపత్యం నరేంద్రమోడీకి సాధించిపెట్టింది. ప్రధాని మంత్రి పదవి కోసం పోటీపడగల శక్తులను కూడా మోడి కి సమకూర్చిపెట్టింది. కానీ మోడి ప్రతీకార సిద్ధాంతాన్ని తలకెక్కించుకున్న పీడితవర్గాల కార్యకర్తలు మతోన్మాదం ద్వారా తాము సొంతగా బాపుకున్నదేమిటి? తమ పిల్లలకు, తమపై ఆధారపడ్డవారికి సమకూర్చిందేమిటి?
న్యాయ శాస్త్ర పుస్తకాలలో రాసిపెట్టుకున్న సూత్రాలు అక్షరాలా కాకపోయినా కనీసంగానైనా భారత దేశ కోర్టులు ఆచరిస్తే, అనుసరిస్తే… వేలాది మతోన్మాద కార్యకర్తలు ఈపాటికి జైలు ఊచలు లెక్కబెట్టడమో, మరణ శిక్షలకు గురికావడమో జరిగి ఉండాలి. సమాన న్యాయం నిజమే అయితే మోడి నిజస్వరూపం ఏమిటో ప్రజలకు అవగతమై అతనిని గుజరాత్ పొలిమేరలకు తరిమికొట్టి ఉండాలి. లేదా బాబూ భజరంగి తరహాలో శేష జీవితాన్ని ఊచల వెనుక లెక్కించే పరిస్ధితిలో ఉండాలి. కానీ జరిగిందీ, జరుగుతున్నదీ ఏమిటి?
పలుకుబడి గలవారు, సాక్ష్యాలను కొనేయగల పరపతి ఉన్నవారు ఈనాటికీ అధికార పదవుల్లో సేదతీరుతున్నారు. నిరుపేద, అండలేని ముస్లింల ఇళ్ళు తగలబెట్టి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలను నిర్మించుకున్నవారి లక్ష్యం నెరవేరింది. ముస్లిం వ్యాపారులను తరిమేసి వ్యాపార లబ్ది పొందిన హిందూ సంపన్నుల సంపద మరింత పెరిగింది. అభివృద్ధి పేరుతో గుజరాత్ సంపన్నుల దోపిడి కొనసాగుతోంది. దానితో పాటు గుజరాత్ ప్రజల పేదరికం, అవిద్య, పౌష్టికాహార లోపం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి.
మతోన్మాదం సంపన్న ముఠాలకు అధికారం, సంపదలు సాధించిపెట్టే పరికరం అయితే కోట్లాది నిరుపేద పీడిత, తాడిత వర్గాల ప్రజలకు జీవన విధ్వంసం తెచ్చిపెట్టే విలయం. ఈ విలయంలో సమిధలు కాకముందే గుజరాత్ ప్రజలు కళ్ళు తెరవాలి. తమను పీడిస్తున్న మతోన్మాద దెయ్యాన్ని వదిలించుకోవాలి. ఏ మతమైనా ఉన్మాదానికి చెల్లు చీటీ ఇచ్చేలా ఇకనుండైనా జాగ్రత్త పడాలి.
>> మతోన్మాదం సంపన్న ముఠాలకు అధికారం, సంపదలు సాధించిపెట్టే పరికరం అయితే కోట్లాది నిరుపేద పీడిత, తాడిత వర్గాల ప్రజలకు జీవన విధ్వంసం తెచ్చిపెట్టే విలయం. >>
మీ పరిశీలనా, విశ్లేషణా ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
తమ తల్లులూ, పిల్లలూ గుండెలవిసేలా రోదించే దృశ్యాలు దోషుల్లో పశ్చాత్తాప భావన కలిగించాయో లేదో!
శిక్షలు ప్రకటించాక దోషుల కుటుంబాల వాళ్ళు మోడి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్నది ఒక వార్త. కాగా, దోషిత్వం (conviction) తేల్చాక శిక్షలు ప్రకటించేలోపే దోషుల తరపువాళ్ళు నరోడా వెళ్ళి ముస్లింలను బెదిరించారట. తమవారికి పెద్ద శిక్షలు వేస్తే మీ అంతు చూస్తామని బెదిరించారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది. దానితో నరోడా నివాసులు ఇంకా బిక్కు బిక్కు మంటున్నారట. దోషుల సంగతేమో గానీ వారి కోర్టు తీర్పు తర్వాత కూడా వారి సంబంధీకులు ప్రతీకారంతో ఉన్నారంటే ‘ముస్లిం ప్రజానీకం’ పై ఎంత తేలిక భావమో అర్ధం చేసుకోవచ్చు. వారికి ఎవరూ అండరారన్న ధైర్యం ఉన్మాదుల చెంత భద్రంగా ఉన్నట్లే.