వినియోగం కోసం తయారు చేసుకున్న వస్తువుల మారకం కోసం మనిషి సృష్టించిన సాధనమే డబ్బు. మారకాన్ని సులభతరం చేయడానికి పుట్టిన డబ్బు మనిషి జీవితాన్ని సంక్లిష్టం చేసింది. సామాజిక జీవనంలో భాగంగా పుట్టి సమాజాన్ని తన వశం చేసుకుంది. ఏం చేసయినా తనను వశం చేసుకున్నవాడిని అందలం ఎక్కించింది. శ్రమ తప్ప ఏమీ చేయ(లే)నివాడిని పాతాళానికి తోక్కేసింది. అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నా తమ్ముడు, భార్య భర్త… ఇలా సమస్త సంబంధాల్లోకి జొరబడి మానవత్వాన్ని, మానవ బంధాలను సైతం శాసిస్తోంది.
మనిషి, డబ్బుకి తన పగ్గాలను అప్పజెప్పిన ఫలితాలను వ్యక్తీకరించడానికి పోర్ట్ లాండ్ (అమెరికా) కి చెందిన జిమ్మీ హికీ ఫోటో ప్రాజెక్టు ఒకటి చేపట్టాడు. తన డబ్బులో కొద్ది మొత్తాన్ని ‘ఒక డాలరు’ నోట్లుగా మార్చి మిత్రుడిని ‘మనీ మేన్’ మోడల్ గా మార్చాడు. మానవ సంబంధాలు డబ్బు సంబంధాలుగా ఎలా మారాయో ఈ ఫోటోల ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు. “What Have We Done” శీర్షికతో గ్యాలరీ ప్రదర్శన నిర్వహించాడు. తాను ప్రత్యేకంగా ఇచ్చే సందేశం ఏమీ లేదని, ఫోటోలు చూసి ఎవరికి వారే ఊహించుకోవాలనీ చెబుతూనే అసలు సంగతి చెప్పకనే చెప్పాడు.
అమెరికా జెండా చేతబట్టి దేశభక్తి వ్యాపారమయం అయిందన్నాడు. చదువు డబ్బుకి బందీ అయిందనీ, డబ్బు లేనిదే ఇంధనం, ఆహారం, ఇల్లు, ఉద్యోగం ఏమీ దక్కవనీ తెలిపాడు. పెట్రోలు వెలికి తీసినా, పంటలు పండించినా అంతిమ ఉత్పత్తి డబ్బేనన్నాడు. డబ్బుంటే ఏ సుఖమైనా దరి చేరుతుందని, లేకుంటే ఏదీ, ఎవరూ కన్నెత్తయినా చూడరనీ చెప్పాడు. చివరికి లిబర్టీ విగ్రహం ప్రతిబింబించే అమెరికన్ స్వేచ్ఛ సైతం డబ్బుకి లోబడిందేనని సంకేతాత్మకంగా తెలిపాడు. అసలు మనిషి ప్రతిబింబం కూడా డబ్బేనని నిరసించాడు. జిమ్మీ హికీ వెబ్ సైట్ అందించిన ఈ ఫోటోల సందేశంతో విభేదించడం అసంభవం.