సిరియా, పాలస్తీనాలకు మన్మోహన్ బాసట, ప్రతిష్ట కోసం పాకులాట


ఇరాన్ లో జరుగుతున్న అలీనోద్యమ (Non-Aligned Movement) సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ పరువు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సిరియాలో పశ్చిమ దేశాలు సాగిస్తున్న అల్లకల్లోలం పై ఇప్పటిదాకా నోరు మెదపని ప్రధాని “సిరియాలో బైటి దేశాల జోక్యం తగద” ని ప్రకటించాడు. ఇజ్రాయెల్ దురాక్రమణకి వ్యతిరేకంగా డెబ్భై సంవత్సరాలనుండి పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు కూడా మద్దతు ప్రకటించాడు. జి-20 గ్రూపులో అమెరికా, యూరప్ దేశాల సరసన కూర్చుని కూడా ముఖ్యమైన అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ సంస్ధల్లో (ఐక్యరాజ్య సమితి, ఐ.ఎం.ఎఫ్) ఏమాత్రం మెరుగుదల సాధించలేని నేపధ్యంలో భారత పాలకులకు ఇప్పుడు అలీనోద్యమ మూలాలు గుర్తుకు వస్తున్నాయి.

‘అలీనోద్యమం’ 16 వ శిఖరాగ్ర సమావేశాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల నుండి మరో మూడేళ్ళ పాటు అలీన రాజ్యాల కూటమికి ఇరాన్ నాయకత్వం వహించనుంది. కిరాయి తిరుగుబాటు ద్వారా సిరియాలో కీలు బొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించి తద్వారా ఇరాన్ ను లొంగదీసుకోవడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ తో కలిసి కుట్రలు పన్నుతున్న సంగతి విదితమే. చైనా, రష్యాల రాజకీయ మద్దతుతో కిరాయి తిరుగుబాటుని సిరియా ప్రభుత్వం నిలువరిస్తుండడంతో పశ్చిమ దేశాలు అసహనంతో ఉన్నాయి. ఈ నేపధ్యంలో 120 దేశాల అలీన కూటమికి ఇరాన్ నేతృత్వం వహించడం పశ్చిమ దేశాలకు పుండు మీద కారం రాసినట్లుగా ఉన్నది.

అలీనోద్యమ సమావేశాలకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్ కూడా హాజరయ్యాడు. ఇజ్రాయెల్, అమెరికాల అభ్యంతరాలను పక్కకు నెట్టి మరీ ఇరాన్ సమావేశాలకు బాన్ హాజరు కావడం పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారిన మరో పరిణామం. దానితో పాటు ఈజిప్టు కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి కూడా ఇరాన్ సమావేశాల్లో ప్రత్యక్షం కావడం పశ్చిమ దేశాలకు రుచించలేదు. ఈజిప్టు ప్రజల తిరుగుబాటును హైజాక్ చేసి ముస్లిం మత ఛాందస ‘ముస్లిం బ్రదర్ హుడ్’ అధికారంలోకి రావడానికి అన్యమనస్కంగా సహకరించిన అమెరికా, ఇజ్రాయెల్ లు మోర్సి వేసే ప్రతి అడుగునూ భూతద్దం పెట్టి పరిశీలిస్తున్నాయి. అలీనోద్యమ సమావేశాలకు హాజరయినంత మాత్రాన మోర్సి అమెరికా, ఇజ్రాయెల్ ల చేజారినట్లు కాకపోయినా ఆ మాత్రం స్వతంత్రత ప్రదర్శించడం కూడా దురహంకార రాజ్యాలకు మింగుడు పడని పరిణామం.

పశ్చిమ దేశాలు ఎగదోసిన కిరాయి తిరుగుబాటుని ఎదుర్కొంటున్న సిరియా ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్ సింగ్ బేషరతు మద్దతు ఏమీ ప్రకటించలేదు. కనీసం సూత్రబద్ధ మద్దతు కూడా ప్రకటించలేదు. ఓవైపు సిరియా ప్రజల ఆకాంక్షలకు మద్దతు ప్రకటిస్తూ (దానర్ధం సిరియా ప్రభుత్వానికి ముసుగు వ్యతిరేకత , పశ్చిమ దేశాలకు బహిరంగ అనుకూలత ప్రకటించడమే. కిరాయి తిరుగుబాటులో సిరియా ప్రజల ఆంకాంక్షలు లేవన్నది మరువకూడని విషయం) మరో వైపు విదేశీ జోక్యం తగదని ఇరాన్ సమావేశంలో ప్రధాని ప్రకటించాడు. అటొక మాట ఇటొక మాట చెప్పి ‘గోడమీద పిల్లి’ వైఖరిని పధాని మన్మోహన్ ప్రదర్శించాడు. అయితే జి-20 గ్రూపు లో సభ్యత్వం దొరికిన తోడనే మైమరిచి, మూలాలు మరిచి, ప్రపంచంలోని వివిధ దేశాల్లో అణచివేతకు గురవుతున్న జాతుల పోరాటాల పట్ల కనీస సంఘీభావం కూడా ప్రకటించడం మర్చిపోయిన భారత పాలకులు ఒక అంతర్జాతీయ వేదిక పైన ‘సిరియాలో విదేశీ జోక్యం తగదు’ అని చెప్పడం సాపేక్షికంగా మెరుగైన పరిణామమేమో మునుముందు తెలియాల్సిన సంగతి.

జి-20 గ్రూపు సభ్య దేశంగా అమెరికా, యూరప్ దేశాల సరసన కూర్చున్న తర్వాత, జి-77 గ్రూపుని ఇండియా విస్మరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి ఏర్పరచున్న  ఆర్ధిక వేదిక జి-77 గ్రూపు. (ఇపుడిందులో 132 దేశాలు సభ్యులు) ప్రపంచ ప్రజల వనరులు దోచుకుని తెగబలిసిన ఒ.ఇ.సి.డి గ్రూపు దేశాల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు జి77 గ్రూపును ఏర్పరుచుకున్నాయి. (జి77 గ్రూపు చేతుల్లోకి ఆర్ధిక పెత్తనం వెళ్ళిపోతుందన్న భయంతో అగ్ర దేశాలు జి7 గ్రూపుని ఆ తర్వాత ఏర్పరుచుకున్నాయి.) బహుళజాతి కంపెనీల పెత్తనానికి చెక్ పెట్టడానికి ఐక్యరాజ్య సమితిలో ఏర్పడిన UNCTAD లో జి77 గ్రూపు మూలాలు ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలకు మద్దతుగా జి7 కూటమి ప్రపంచ ఆర్ధిక పెత్తనాన్ని లాక్కోవడంతో UNCTAD ప్రతిష్ట క్రమంగా మసకబారింది. UNCTAD ప్రభ తగ్గిపోవడం వెనుక జి7 రాజ్యాలు అభివృద్ధి చెందుతున్న రాజ్యాలపై తెచ్చిన అనేక ఒత్తిడులు పని చేశాయి. జి7 రాజ్యాల ఒత్తిడికి అభివృద్ధి చెందుతున్న దేశాల పాలకులు లొంగిపోవడం వల్లనే వారి ఒత్తిడి పని చేసిందన్నది స్పష్టమే.

నెహ్రూ, ఇందిర కాలాల్లో అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్ట వెలుగొందడానికి  జి77, అలీనోద్యమం లు ప్రధాన కారణాలు. అలీనోద్యమం భారతదేశానికి రాజకీయ ప్రతిష్ట సంపాదించి పెడితే, జి77 భారత దేశ పాలకుల ఆర్ధిక వెసులుబాటుకి దోహదం చేసింది. (ఈ వెసులుబాటును అగ్రాజ్యాల మధ్య బేరమాడే శక్తిని పెంచుకోవడానికే భారత పాలకులు వినియోగించారు తప్ప ఇరాన్ లాగా అగ్ర రాజ్యాల పెత్తనాన్ని ఎదుర్కోవడానికి వినియోగించలేదని గ్రహించాలి.) అలాంటి అలీనోద్యమాన్నీ, జి77 గ్రూపును 1990 ల తర్వాత ఇండియా దాదాపు మర్చిపోయింది. నూతన ఆర్ధిక విధానాలు అమలు చేయడం ద్వారా, అసమాన గాట్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు గేట్లు బార్లా తెరవడంతో వచ్చిన విదేశీ పెట్టుబడులనే అభివృద్ధిగా భారత పాలకులు బాకాలూదుకోవడం మొదలు పెట్టారు. విదేశీ కంపెనీలు దేశీయ ఖనిజ వనరులు (ఇనుము, బాక్సైట్ మొ.వి) తవ్వి తరలిస్తుండగా పెరిగిన జిడిపిని సొంత ప్రతిభగా ప్రచారం చేసుకున్నారు. అసామాన్య మానవ వనరులు, ప్రకృతి వనరులు వినియోగించి సాధించే అభివృద్ధే ప్రజలకు కనీసంగా చేరే అభివృద్ధి అన్న ముఖ్యాంశాన్ని పూర్తిగా విస్మరించారు.

ఈ నేపధ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల అంతర్జాతీయ వేదికలపై భారత్ తన స్ధానం కోల్పోయింది. కోల్పోయినందుకు భారత పాలకులు బాధపడిందీ లేదు. తిరిగి పొందడానికి పాకులాడిందీ లేదు.  ఎందుకంటే వారికిప్పుడు జి77 తో అవసరం లేదు. జి20 అనే కొత్త గ్రూపులో అమెరికా, యూరప్ ల సరసన కూర్చోగలిగే స్ధాయి వచ్చింది మరి. జి20 సమావేశాల్లో ఇండియా ప్రతినిధుల మాటలకి వీసమెత్తు విలువ లేకపోయినా, అక్కడ స్ధానం పొందడమే మహా భాగ్యంగా భావించారు. జి20 లో కూర్చోవడం అంటే ఆ తర్వాత ఐ.ఎం.ఎఫ్ లో వోటింగ్ హక్కులు పెరిగినట్లే అని భావించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం (వీటో హక్కు) పొందడమే తరువాయి అన్నట్లుగా భావించారు. జి-77 గ్రూపు ని వదిలిపెట్టి జి20 లో కొనసాగడానికే భారత్ నిశ్చయించుకున్నట్లు 2010 లో అప్పటి భారత పర్యావరణ మంత్రి జైరాం రమేష్ అట్టహాసంగా ప్రకటించుకోవడం గుర్తుకు తెచ్చుకుంటే భారత పాలకుల హిపోక్రసీ ఏ స్ధాయిలో వెల్లివిరిసిందో అర్ధం చేసుకోవచ్చు.

నిజానికి ప్రపంచ వాణిజ్య సంస్ధ వేదికలపై వ్యవసాయ రంగంలోగానీ, మేధో సంపత్తి హక్కుల విషయంలో గానీ,  పశ్చిమ దేశాల దురన్యాయాలను కనీసంగానైనా ప్రశ్నించగలిగిన స్ధాయి ఇండియాకి వచ్చిందంటే దానికి కారణం జి77 ద్వారా వచ్చి చేరిన బలమే. UNCTAD, జి77 వేదికలను బలహీన పరచడంలోనూ, అలీనోద్యమాన్ని కాగితం పులిగా మార్చడంలోనూ పశ్చిమ దేశాలతో లోపాయకారీగా సహకరించడం ద్వారా ఇండియా, మలేషియా, ఈజిప్టు లాంటి దేశాలు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్నాయి. ఫలితంగా ఐ.ఎం.ఎఫ్ లో మరిన్ని ఓటింగ్ హక్కులు కల్పిస్తామన్న హామీని అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు గాలికి వదిలేసినా ఇండియా కిమ్మనలేక పోయింది. భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వ హోదా పొందగలిగిన స్ధాయి ఇండియాకి ఉన్నదని పైకి చెబుతూ వాస్తవంలో దానికి తగిన ఆచరణ అంగుళం కూడా ముందుకు కదలకపోయినా నోరు తెరవలేకపోయింది.

ఇప్పుడేమో తగుదునమ్మా అంటూ ‘అలీనోద్యమం’ వేదికపై ఐ.ఎం.ఎఫ్ లో అదనపు ఓటింగ్ హక్కుల కోసం, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం దేబిరించడానికి ప్రధాని మన్మోహన్ సిద్ధపడ్డాడు. ఎన్.ఎ.ఎం వేదికపై ఆయన ఏమంటున్నాడో చూడండి. “ప్రపంచ పాలనా కట్టడాలను (global governance structures) ప్రాతినిధ్య పూర్వకంగా, విశ్వసనీయంగా, సమర్ధవంతంగా నిర్మించడానికి ‘మన ఉద్యమం’ నాయకత్వం తీసుకోవాలి. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి (United Nations Security Council), ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లాంటి సంస్ధలను సంస్కరించడానికి (అలీన) ఉద్యమం ఒక అంగీకారానికి వస్తుందని నేను చిత్తశుద్ధితో నమ్ముతున్నాను.” అలీనోద్యమ సమావేశాలను అడ్డం పెట్టుకుని పశ్చిమ దేశాల వద్ద బలం పొందడానికి భారత పాలకులు మరోసారి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఆ ప్రయత్నంలో భాగంగా సిరియా లో విదేశీ జోక్యం తగదని సుతిమెత్తగా చెప్పడానికి, రెండు దశాబ్దాలు విస్మరించిన పాలస్తీనీయుల సమస్యను లేవనెత్తి ‘నోటి మాట మద్దతు’ ప్రకటించడానికీ ప్రధాని మన్మోహన్ ధైర్యం తెచ్చుకున్నాడు.

“పశ్చిమాసియా మరియు ఉత్తరాఫ్రికా ప్రాంతం లోతైన మార్పుకు గురవుతున్నది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రజాస్వామ్య మరియు బహుళపక్ష వ్యవస్ధ కోసం వ్యక్తమయ్యే ప్రజల ఆకాంక్షలకు ఇండియా మద్దతు ఇస్తుంది. అయితే అలాంటి మార్పులు విదేశీ జోక్యం ప్రేరణతో జరగడానికి వీలు లేదు. అది సాధారణ పౌరుల కష్టాలను తీవ్రం చేస్తాయి. సిరియాలో క్షీణిస్తున్న పరిస్ధితి ప్రత్యేకంగా ఆందోళనకరం. సార్వత్రికంగా ఆమోదించబడిన సూత్రాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంలో మన ఉద్యమం ఒక నిర్ణయానికి రావాలి.” ఇంత చెప్పిన మన్మోహన్ ఆ నిర్ణయం ఏమిటో నిర్దిష్టంగా వివరించలేదు. సీమాంతర ఉగ్రవాదం బాధితులమని చెప్పుకుంటూ కూడా, ఒకటిన్నర సంవత్సరాలుగా పశ్చిమ దేశాల మద్దతుతో, సిరియా చుట్టూ ఉన్న టర్కీ, సౌదీ అరేబియా, కతార్, జోర్డాన్ లు చొప్పించిన ఆల్-ఖైదా టెర్రరిస్టుల హత్యాకాండలపై భారత పాలకులు ఒక్క ముక్క మాట్లాడలేదు. అలీన వేదికపై శుష్క ప్రకటనలు, నీటి నీతులు వల్లిస్తే మాత్రం లాభం ఏమిటి?

“పాలస్తీనా సమస్యకు త్వరిత పరిష్కారానికి మద్దతుగా మనం చేసిన ప్రతినను ఈ రోజు పునరుద్ఘాటించాలి. తద్వారా సుదీర్ఘ కాలంగా బాధలు పడుతున్న పాలస్తీనా ప్రజలు శాంతితో, గౌరవంతో తమకంటూ సొంతదైన రాజ్యంలో బతికేందుకు దోహదపడాలి.” అన్న ప్రధాని మాటలు కూడా నీటిమూటలే. ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా సమస్యపై ప్రపంచ దేశాలు చేసిందేమీ లేదు. 2007 లో రెండు లక్షల మంది నివసించే అతి చిన్న పాలస్తీనా భూభాగంపై దురహంకార ఇజ్రాయెల్ అత్యాధునిక ఆయుధ సంపత్తితో ఏకపక్షంగా విరుచుకుపడి 1400 మంది అమాయక పౌరులను బలి తీసుకుంటే, ఇరాన్ తప్ప, నోరు మెదిపిన అలీన దేశమే లేదు.

‘ఎటూ పోనీకుండా నిర్బంధించి కొట్టిన చోటే కొట్టి హింసిస్తే గాజా ప్రజలు భారీ మెజారిటీ తో ఎన్నుకున్న హమాస్ మిలిటెంట్ సంస్ధను దూరం చేసుకుంటారన్న’ ఎత్తుగడతో ఇజ్రాయెల్ ఆ మానవ హననానికి పూనుకుంది. హమాస్ ని వదులుకుని అమెరికా, ఇజ్రాయెల్ చెప్పుచేతల్లో ఉన్న ‘పాలస్తీనా ఆధారిటీ’ ని పాలస్తీనా ప్రజలు ఎన్నుకోవాలని ఇజ్రాయెల్ ఈ దురాగతానికి పాల్పడింది. అంత జరిగినా అమెరికా, యూరప్ లు పదే పదే చెప్పుకునే ‘ఇంటర్నేషనల్ కమ్యూనిటీ’ కుక్కిన పేనులా పడి ఉండింది తప్ప అదేమని కనీసం అడగలేదు. పాలస్తీనా ప్రజల బాధలపై అలీనోద్యమ వేదికపై కన్నీరు కారుస్తున్న మన్మోహన్, ఇజ్రాయెల్ తో పెంచుకున్న కొత్త స్నేహం కోసం పాలస్తీనా ఆక్రందనను పెడ చెవిన పెట్టాడు. అలీనోద్యమ స్ఫూర్తిని గంగలో కలిపాడు. పశ్చిమ దేశాలు ఎగ్గొట్టిన ‘దోహా రౌండ్’ చర్చలను పునః ప్రారంభించే దిక్కులేక, ఆశపడిన వీటో పవర్ ‘అందని ద్రాక్ష పండుగా మారాక మళ్ళీ అలీనోద్యమం గడప తొక్కి పాలస్తీనా కోసం మొసలి కన్నీరు కారుస్తున్నాడు.

ఇరాన్ సమావేశాల్లో మన్మోహన్ ప్రకటించిన ఆదర్శాలు మామూలువి కావు. గ్లోబల్ గవర్నెన్స్ కోసం కొత్త పరికరాలు అభివృద్ధి చేసుకోవడం (ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి, ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లను సంస్కరించి ఇండియాకు పెద్ద పీట వేయాలని ప్రధాని ఉద్దేశ్యం), అంతర్జాతీయ టెర్రరిజం, సామూహిక విధ్వంసక మారణాయుధ వ్యాప్తి నిరోధం, సైబర్ సెక్యూరిటీ మున్నగు అంశాల్లో అలీన వేదిక తన వాణి వినిపించాలని ప్రధాని వాంఛించాడు. అయితే ఈ అంశాలన్నింటిలోనూ అమెరికా, యూరప్ లే ప్రధాన బాధ్యులు. ఒక స్వతంత్ర దేశంగా ఈ అంశాలపై ఊగిసలాట లేని విధంగా ఖచ్చితమైన విధానం ప్రకటించకుండా అలీన వేదికపై ఆదర్శాలు వల్లించడం వల్ల ప్రయోజనం శూన్యం.  ఈ ఆదర్శాలు సాధించాలంటే అమెరికా, యూరప్ దురన్యాయాలను ఎదిరించి నిలవాల్సి ఉంటుంది. కానీ పశ్చిమ సామ్రాజ్యవాద శక్తులకి ఎదిరించి నిలబడ్డ రికార్డు భారత పాలకులకి లేనే లేదు. అదీ కాక, అంతర్జాతీయ సంస్ధలను సంస్కరించాలన్న పేరుతో అగ్ర రాజ్యాల్లాగా తామూ పెత్తనం చేయాలన్న ఆతృతే తప్ప అలీనోద్యమం స్ధాపించిన సమానత్వ విలువలపై గౌరవం లేదు. కాకపోతే, ‘గ్లోబల్ గవర్నెన్స్’ అనే ఆకర్షణీయ పదజాలం మాటున ‘పెత్తనం’ వాంఛను దాచిపెట్టారంతే.

ప్రపంచ ఆదర్శాలు తాము పాటించకుండా ఇతరులకు బోధించడం, ఆదర్శం పాళ్ళు ఏ మాత్రం లేని ఆదర్శాలు వల్లించడం భారత పాలకులకి తగని పని.

(ఫొటోలు: Rediff.com, Indiandefencereview.com)

One thought on “సిరియా, పాలస్తీనాలకు మన్మోహన్ బాసట, ప్రతిష్ట కోసం పాకులాట

  1. చారిత్రకంగా కానీ….న్యాయంగా కానీ ఇరాన్, సిరియా తదితర పశ్చిమాసియా దేశాలతో మనకు ఎంతో సన్నిహితత్వం ఉంది. పైగా పేద దేశాలు, వర్ధమాన దేశాలు భారత్ లాంటి పెద్ద దేశం తమకు అండగా ఉంటుందని ఆశపడతాయి. ప్రచన్న యుద్దం కాలంలో భారత్ చూపిన చొరవ అప్పుడు ఎంతో విలువైనది. అదే తరహా విదేశాంగ విధానం కొనసాగించి ఉంటే మన దేశానికే కాక, మూడో ప్రపంచ దేశాలకు బాగుండేధి. కానీ వీటో పవర్ లాంటి కాగితం కిరీటం కోసం మన దేశం తన స్వభావాన్ని వదులుకుంది. అవసరానికి వాడుకుని వదిలేసే అమెరికా లాంటి గుంట నక్కల పంచన చేరితే మిగిలేది ఏమి ఉండదు. భారత్ పాలకులు ఇకనైనా వెన్నెముకతో వ్యవహరిస్తే మన దేశానికి కాదు..ప్రపంచానికి మేలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s