‘లేచి నిలబడదాం. నిలబడి కలబడదాం’ అని పిలుపునిస్తూ, సోనియా సమర శంఖం పూరించింది. ‘ఆత్మ రక్షణ అనవసరం, కత్తి పట్టి యుద్ధరంగంలోకి దూకండి’ అంటూ సోనియా పిలుపిచ్చిందే తడవుగా చిదంబరం, జైస్వాల్, కపిల్ సిబాల్, మన్మోహన్ సింగ్ తదితర హేమా హేమీలంతా తలా ఒక కత్తి పట్టి దూకనే దూకారు.
‘బొగ్గు తవ్వనే లేదు, ఇక నష్టం ఎక్కడ’ అని చిదంబరం ప్రశ్నించగానే ‘జీరో లాస్’ అననే అన్నాడు అని పత్రికలు రాసేశాయి. ‘అబ్బే జీరో లాస్ అని ఎక్కడన్నాను? తవ్వని బొగ్గుకి లాస్ ఎక్కడ అన్నానంతే’ అంటూ మరుసటి రోజే చిదంబరం వివరణ ఇచ్చుకున్నాడు. చిదంబరం కత్తి అలా మొద్దుబారింది.
చిదంబరం ‘నష్టం ఎక్కడ’ అంటూ వేసిన ప్రశ్నకు బి.జె.పి నాయకుడు అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం ప్రస్తావనార్హం. “చిదంబరం గారి బ్యాంకు ఖాతాలో డబ్బు దొంగిలించి తన ఖాతాలో దొంగ వేసుకుని, ఖర్చు పెట్టకుండా ఉంటే నష్టం జరగనట్లా? ప్రవేటు కంపెనీకి బొగ్గు గని ఇచ్చాక అది ప్రభుత్వం చేతిలోంచి పోయినట్లే. ఈ రోజు కాకపోతే బొగ్గు రేపు తవ్వుకుంటాడు” అని జైట్లీ చురక వేసినా చిదంబరం నుండి ఇంకా సమాధానం రాలేదు.
‘ఇక కేటాయింపులు లేవు, బొగ్గు గనులన్నీ వేలం వేస్తాం’ అన్న ప్రస్తుత బొగ్గు మంత్రి జైస్వాల్ కూడా బొగ్గు గనులు కేటాయించాడు అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ‘బొగ్గు గనులు కేటాయిస్తూ లేఖలు ఇచ్చానంతే. ఇంకా ఎవరికీ కేటాయించనే లేదు’ అని జైస్వాల్ తోక ముడిచి తప్పుకున్నాడు.
2జి స్పెక్ట్రమ్ లో ‘జీరో లాస్’ వాదనను అట్టహాసంగా వినిపించి కోర్టు మొట్టికాయల్నీ, పత్రికల వెక్కిరింపుల్నీ ఎదుర్కొన్న కపిల్ సిబాల్ ఇంకో కత్తి పట్టుకుని వచ్చాడు. ‘బొగ్గు గనుల కేటాయింపులు రద్దు చేస్తే భారత విద్యుత్ ఉత్పత్తికే పెద్ద నష్టం. జి.డి.పి దిగజారుడు తధ్యం’ అని సిబాల్ బల్లగుద్దినా పత్రికలు ఆయన వాదనను ఉతికి ఆరేశాయి. బొగ్గు తవ్వనే లేదని ఒక పక్క చెబుతూ తీయని ఉత్పత్తి వల్ల జి.డి.పి ఎలా తగ్గుతుంది? తొవ్వని బొగ్గు వల్ల విద్యుత్ ఎలా పుడుతుంది? అని పత్రికలు ప్రశ్నించడంతో సిబాల్ మళ్ళీ నోరెత్తలేదు!
‘కాగ్ లెక్కలు తప్పుల తడక. వివాదాస్పదం’ అంటూ పార్లమెంటులో చదవ(లే)ని ప్రకటనలో పేర్కొన్న ప్రధాని మన్మోహన్, ‘ఒకవేళ కాగ్ చెప్పిన నష్టం నిజమే అయినా అంత నష్టం ఉండదు’ అంటూ సన్నాయి నొక్కులతో పరోక్ష అంగీకారం ప్రకటించాడు.
ఇలా మొద్దుబారిన కత్తులతో, బొగ్గుబారిన చారలతో కాంగ్రెస్ చేసే యుద్ధం ఎప్పటికి ముందుకు కదిలేను?