భారతీయులు గానీ, ఆసియన్లు గానీ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించిన ఒక ‘ఉద్యోగ ప్రకటన’ ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సూపర్ మార్కెట్ లో క్లీనర్ ఉద్యోగాల కోసం ‘గమ్ ట్రీ’ (Gumtree) వెబ్ సైట్ లో వచ్చిన ప్రకటన ఇండియన్లు, ఆసియన్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయనవసరం లేదని పేర్కొంది. ఈ ప్రకటన పట్ల సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఆగ్రహం వ్యక్తం అయింది. ప్రకటన జారీ చేసిన ‘కోల్స్’ సూపర్ మార్కెట్ స్టోర్ ను ప్రజలు బహిష్కరించాలని అనేకమంది పిలుపివ్వడంతో ప్రకటనను ఉపసంహరించుకున్నారని ఎన్.డి.టి.వి తెలిపింది.
ఆస్ట్రేలియాకు చెందిన సూపర్ మార్కెట్ చెయిన్ కంపెనీ ‘కోల్స్’ కోసం ఒక ప్రవేటు కాంట్రాక్టర్ సంస్ధ ‘గమ్ ట్రీ’ వెబ్ సైట్ లో ఈ ప్రకటన జారీ చేసింది. హోబర్ట్ లోని ‘ఈస్ట్ లాండ్స్ షాపింగ్ సెంటర్’ లో క్లీనర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ చేసిన ప్రకటన అది. “Store requires no Indians or Asians please. MUST SPEAK ENGLISH” అని సదరు ప్రకటన పేర్కొంది. ఆదివారం జారీ అయిన ఈ ప్రకటనను సోమవారం ఉపసంహరించుకున్నారని తెలుస్తున్నది.
తమ స్టోర్ లలో క్లీనింగ్ కోసం నియమించబడిన కాంట్రాక్టు కంపెనీ ప్రకటనను జారీ చేసిందని కోల్స్ ప్రతినిధి అంగీకరించాడు. తమ కంపెనీకి తెలియకుండా ఈ ప్రకటన జారీ అయిందనీ, ప్రకటనలోని అంశాలు తమకు కూడా బాధ కలిగించాయని కోల్స్ ప్రతినిధి జిమ్ కూపర్ చెప్పాడని ఎన్.డి.టి.వి తెలిపింది.
ప్రకటన ఇచ్చిన క్లీనింగ్ కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టాస్మానియా యాంటీ-డిస్క్రిమినేషన్ కమిషనర్ రాబిన్ బ్యాంక్స్ ప్రకటించింది. “జాతి కారణంగా ఒక వ్యక్తిని నిషేధించడం చట్ట విరుద్ధం” అని బ్యాంక్స్ పేర్కొంది. కొన్ని జాతుల పట్ల వివక్ష పాటిస్తున్నట్లుగా తనకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని కూడా బ్యాంక్స్ తెలిపింది. ప్రకటనను ప్రచురించిన వెబ్ సైట్ కూడా చట్టపరమైన చర్యలకు తీసుకోవచ్చని బ్యాంక్స్ తెలిపింది. వివక్షాపూరితమైన అంశాలను ప్రచురించడం గానీ, ప్రదర్శించడం గానీ చేయరాదని చట్టం స్పష్టంగా చెబుతోందని ఆమె తెలిపింది.
కొత్త కాదు
ఆస్ట్రేలియాపై జాతి వివక్ష ఆరోపణలు కొత్త కాదు. ఆస్ట్రేలియా మూలవాసుల పైన శతాబ్దాలుగా తీవ్రమైన జాతి వివక్ష అమలు చేసిన చరిత్ర ఆస్ట్రేలియాలోని తెల్ల జాతి దురహంకారులకు ఉన్నది. వారి భూములు, వనరులు అనుభవిస్తూ మూలవాసులను కటిక పేదరికంలో మగ్గేలా వివక్ష అమలు చేశారు. 2.2 కోట్ల జనాభాలో కేవలం 2 శాతం మాత్రమే ఉన్న మూలవాసులు ఇంకా దరిద్రంలోనే మగ్గుతున్నారు. అయినప్పటికీ మానవ హక్కులు, ప్రజారోగ్యం, సమానత్వం అమలు చేయడంలో తాము ఎంతో ముందున్నామని చెప్పుకోవడానికి ఆస్ట్రేలియాకు ఎంతో ఇష్టం.
ఆస్ట్రేలియాలో జాతి వివక్ష (racism) విస్తృతంగా (rampant) ఉన్నదని ఐక్యరాజ్య సమితి 2009 లో తేల్చి చెప్పింది. మధ్యపానం, మానవ హక్కుల పేరు చెప్పి ఆస్ట్రేలియా మూలవాసులపై ప్రభుత్వం వివక్షను అడ్డుకునే మార్గాలు మూసివేసిందని 11 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన సమితి బృందం తేల్చి చెప్పింది. ఐక్య రాజ్య సమితి అధ్యయనమే కాకుండా స్ధానిక యూనివర్సిటీలు 11 సంవత్సరాల పాటు సంయుక్తంగా జరిపిన సర్వే సైతం ఆస్ట్రేలియాలోని జాతి వివక్షను ధృవ పరిచింది.
ఇండియా, శ్రీలంక, చైనా లనుండి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగులు, కార్మికులపై వివక్ష సర్వసాధారణమని ఇతర ఆస్ట్రేలియన్ల కంటే రెట్టింపు వివక్షను ఈ దేశాలవారు ఎదుర్కొంటున్నట్లు తేలిందని ‘యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ సిడ్నీ’ పరిశోధకులు తెలిపారు. ఆస్ట్రేలియాలో రేసిజం ఉందన్న విషయం 85 శాతం మంది ఆస్ట్రేలియన్లు భావిస్తున్నట్లు యూనివర్శిటీల సర్వేలో వెల్లడయింది.
భారతీయ విద్యార్ధులు అనేకమంది ఆస్ట్రేలియాలో హత్యలకు, ప్రమాదకర దాడులకు గురయిన సంగతి అందరూ ఎరిగినదే. భారతీయులపై దాడులు చేసినందుకు 12 నెలల్లో 70 మందిని అరెస్టు చేశామని ఆస్ట్రేలియా విదేశీ మంత్రి స్టీఫెన్ స్మిత్, 2010 మార్చిలో ఇండియా సందర్శించిన సందర్భంగా తెలిపాడు. ఆ తర్వాత హత్యలు, దాడుల వార్తలు పెద్దగా లేనప్పటికీ ఇతర మార్గాల్లో వివక్ష కొనసాగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ నేపధ్యంలో కోల్స్ సూపర్ మార్కెట్ కంపెనీ జారీ చేసిన వివక్షా పూరిత ప్రకటన ఆశ్చర్యకరం ఏమీ కాదు. తన వద్ద ఇంకా నేక ఫిర్యాదులు విచారణ నిమిత్తం ఉన్నాయని ప్రభుత్వ అధికారి (బ్యాంక్స్) స్వయంగా చెప్పినందున అనుమానాలు కూడా అనవసరం.