2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు


Image: Onionlive.com

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తూ జనవరి 11, 2013 లోపు వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జనవరి 18 కల్లా వేలంలో విజయం సాధించిన కంపెనీల జాబితా తనకు సమర్పించాలని కోరింది. లేనట్లయితే సంబంధిత అధికారులపై ‘కోర్టు ధిక్కార’ నేరం కింద చర్యలు తీసుకోవలసి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్సులను కోర్టు రద్దు చేయడమే ప్రభుత్వానికి చెంప పెట్టు కాగా, వేలం పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు ఎదుర్కొనే కాడికి తెచ్చుకోవడం ప్రభుత్వాధినేతల సిగ్గులేనితనం.

తాను విధించిన గడువే అంతిమమనీ, ఈ విషయంలో ఇక దేశంలోని ఏ కొర్టూ మరొక విజ్ఞప్తిని స్వీకరించబోదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. వేలం వాయిదా పడిన రీత్యా, సెప్టెంబరు 7 తో ముగియవలసిన ప్రస్తుత లైసెన్సులు వచ్చే సంవత్సరం జనవరి 18 వరకు అమలులో కొనసాగడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.  వేలం ప్రక్రియకు ‘ఔటర్ లిమిట్’  (వేలం పూర్తయ్యే తేదీ) ని కేంద్ర ప్రభుత్వం తెలియజేయకపోవడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. “ఔటర్ లిమిట్ ని నిర్ణయించకపోతే వేలం ప్రక్రియ అసలు జరగనే జరగదు” అని ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం చేసే విధంగా వ్యాఖ్యానించింది. “ఫిబ్రవరి 2 తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నది ఒక వాస్తవం” అని తన అనుమానాలకు ఆధారం కూడా చూపింది.

ప్రవేటు కంపెనీలకు అతి తక్కువ ధరలకు మంజూరు చేసిన 122 2జి స్పెక్ట్రమ్ లైసెన్సులను రద్దు చేసి జూన్ 2 లోపు వేలం పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2 న తీర్పు చెప్పిన సంగతి విదితమే. ఈ గడువును వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడంతో ఆగస్టు 31 న వేలం మొదలు పెట్టి సెప్టెంబర్ 7 నాటికి కేటాయింపులు పూర్తి చేయాలని కోర్టు కోరింది. ఆ గడువును కూడా వాయిదా వేయాలని ప్రభుత్వం మళ్ళీ కోరడంతో సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2 తీర్పుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ‘అండర్ టేకింగ్’ ఇస్తే వాయిదా వేసే విషయం పరిశీలిస్తానని కోర్టు చెప్పగా టెలికాం శాఖ ‘అండర్ సెక్రటరీ’ సంతకంతో ఆగస్టు 24 న ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చింది. దీనిని కోర్టు తిరస్కరించింది. టెలికం సెక్రటరీ హోదాకు తగ్గని అధికారి సంతకంతో అండర్ టేకింగ్ కావాలని కోరింది. ఆమేరకు ప్రభుత్వం తలోగ్గాకే వేలం గడువు వాయిదాకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

అయితే టెలికం సెక్రటరీ సమర్పించిన అఫిడవిట్ లో ‘ఔటర్ లిమిట్’ ప్రస్తావించకపోవడం పట్ల సుప్రీం బెంచి అసంతృప్తి వ్యక్తం చేసింది. వేలం ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నదీ లేనిదీ జనవరి 13 తేదీన తాను తెలుసుకుంటానని కోర్టు తెలిపింది. అప్పటికి కూడా వేలం ప్రక్రియ పూర్తికాకపోతే తదనుగుణంగా చర్యలు ప్రారంభిస్తానని హెచ్చరించీంది. నవంబరు 12 న మొదలు పెట్టి 60 రోజుల్లో బిడ్డింగ్ పూర్తి చేయాలని, జనవరి 11 కల్లా కేటాయింపులు పూర్తి చేయాలని ఆదేశించింది. వేలం ప్రారంభించడంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా టెలికం శాఖ వ్యవహరించకపోతే కోర్టుకి తెలియజేసే హక్కు పిటిషనర్లు కలిగి ఉంటారని కోర్టు తెలిపింది. ఆ మేరకు అధికారులపై సు మోటు చర్యలు కోర్టు తీసుకుంటుందని తెలిపింది. ఈ విషయమై దేశంలోని ఏ కోర్టూ అదనపు పిటిషన్లు స్వీకరించబోదని కూదాయ తెలిపింది.

ప్రభుత్వ అవినీతి పుండు, కంపెనీ కాకికి ముద్దు 

సుప్రీం కోర్టు 2జి లైసెన్సులు రద్దు చేసి వేలం వేయాలని తీర్పు చెప్పాక తీర్పును అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం విధి. వేలం వేయడం వల్ల నష్టపోయేది ప్రవేటు టెలికం కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ఆదాయం స్పెక్ట్రమ్ వేలం ద్వారా సమకూరుతుంది గనుక కోర్టు తీర్పు ను ప్రభుత్వం ఆగమేఘాల మీద అమలు చేయవలసి ఉంది. ప్రజానుకూల ప్రభుత్వం అయితే, ప్రజల ప్రయోజనాల కోసం పని చేసే ప్రజాస్వామిక ప్రభుత్వం అయితే ఇంత నీచంగా వేలం ప్రక్రియలోని ప్రతి చర్యనూ, తేదీలతో సహా, కోర్టు పర్యవేక్షణలోకి వెళ్లిపోయే పరిస్ధితిని తెచ్చుకోదు.

కోర్టు తీర్పులో ఏ చిన్న రంధ్రం కనపడినా దానిని ప్రవేటు కంపెనీలకు ఉపయోగపెట్టడానికే ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని కోర్టు మొట్టికాయలు స్పష్టం చేస్తున్నాయి. 2జి కుంభకోణం మొదలయినప్పటినుండీ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, మంత్రులు గానీ, అధికారులు గానీ అనేక విధాలుగా అత్యంత హీనమైన స్ధాయిలో కోర్టునుండి అక్షింతలు ఎదుర్కొన్నారు. అయినా ఈ నీతిమాలిన ప్రభుత్వానికి సిగ్గూ, ఎగ్గూ అంటూ లేకుండా పోయింది. దూషణలే తక్కువ అన్నట్లుగా అక్షింతలు కురిపించినా దులుపుకుని పోవడమే విధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. ప్రవేటు కంపెనీ కాకులు పొడుచుకు తింటున్నా ప్రభుత్వ ఎద్దుకు నెప్పి తెలియడం లేదు.

తోలు మందపు ధనిక స్వామ్యం

2జి కుంభకోణంలో సుప్రీం కోర్టు సుదీర్ఘ మొట్టికాయల పర్వం ద్వారా అర్ధం అయే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత దేశంలోని సో కాల్డ్ ప్రజాస్వామిక ప్రభుత్వం అసలు ఏ మాత్రం ప్రజలకోసం పని చెయ్యడం లేదనే. పెట్రోల్ ధరలు పెంచవలసి వచ్చినపుడల్లా ఫిస్కల్ డెఫిసిట్ గురించి మన్మోహన్ ప్రభుత్వంలోని పెద్దలంతా ఒకటే విధంగా ఆందోళన ప్రకటిస్తారు. పెట్రోల్ రేట్లు పెంచకపోతే దేశం ఇక అధః పాతాళంలోకి కూరుకుపోయినట్లే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. రైతుల రుణాలపై వడ్డీ మాఫీ చెయ్యాలంటే నేలపై పడి దొర్లుతూ ఏడుస్తారు, వాళ్ళ ముల్లె ఏమో దోచిపెడుతున్నట్లు. గ్యాస్ బండలపై సబ్సిడీ మోయలేకపోతున్నామనీ, కిరోసిన్ సబ్సిడీ వల్ల ప్రభుత్వం బొక్కబోర్లా పడుతోందనీ, ఉచిత విద్యుత్ వల్ల అసలు విద్యుత్ వ్యవస్ధే సర్వ నాశనం అవుతోందనీ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా లాంటి వారు దుఃఖం ఆపుకుంటూ మాట్లాడుతారు.

ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఆపితే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ దౌడు తీస్తుందని చెప్పే మాంటెక్, 2జి స్పెక్ట్రమ్ ని దాదాపు ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడి ఎరగడు! (పైగా రెండు టాయిలెట్ల కోసం ఐదు లక్షలు మంచి నీళ్లలా ఖర్చు చేసే పొదుపరి.) ఇలాంటి వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు? కంపెనీల కోసం ప్రభుత్వం తన ఖజానాకే ఓజోన్ రంధ్రం అంత చిల్లి పెడుతుంటే గగ్గోలు పెట్టరెందుకని? ఎందుకంటే వీళ్ళ ఆత్మ, శరీరం అంతా పెట్టుబడిదారుల కోసం, భూస్వాంయుల కోసం, విదేశీ కంపెనీల కోసం అంకితమైపోయింది గనక. అందుకే సుప్రీం కోర్టు కర్రు కాల్చి వాత మీద వాత పెట్టినా వీళ్ళ మందపు చర్మాలకి ఆనదు గాక ఆనదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s