బి.జె.పి ని కూడా టార్గెట్ చేద్దాం: కేజ్రీవాల్, వద్దు: కిరణ్ బేడీ


ఫొటో: ది హిందూ

బొగ్గు కుంభకోణం కి సంబంధించి  బి.జె.పి ని టార్గెట్ చేసే విషయంలో మాజీ అన్నా బృందం కీలక సభ్యులయిన అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ల మధ్య విభేధాలు పొడసూపాయి. బొగ్గు గనులను ప్రవేటు కంపెనీలకు విచ్చలవిడిగా కట్టబెట్టడంలో కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ దోషులేనని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తుండగా, పాలక పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాన దోషి అని కనుక దానినే టార్గెట్ చెయ్యాలనీ కిరణ్ బేడీ భావిస్తోంది. లోక్ పాల్ విషయంలో పూర్తిగా కాకపోయినా కొంతయినా అన్నా బృందానికి బి.జె.పి మద్దతు ఇచ్చింది కనుక ఆ పార్టీని టార్గెట్ చెయ్యరాదని బేడీ భావిస్తోంది. అంతమాత్రాన బి.జె.పి కి తాను మద్దతుదారుని కాదని ఆమె చెబుతోంది. విభేదాల కారణంగా జంతర్ మంతర్ వద్ద అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ తదితరుల నేతృత్వంలో జరిగిన ఆందోళనకు బేడీ హాజరు కాలేదు.

బొగ్గు కుంభకోణానికి బి.జె.పి, సి.పి.ఎం పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించినందున ఆ పార్టీలు కూడా కుంభకోణానికి బాధ్యులేనని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేస్తున్నాడు. లోక్ పాల్ బిల్లు కోసం జరిగిన ఆందోళనకు బి.జె.పి నుండి వచ్చిన మద్దతును ఎలా మరువగలం అని కిరణ్ బేడీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్, బి.జె.పి… ఇరు పార్టీలు బాధ్యులే అయినప్పటికీ కేంద్రీకరణ పాలక పార్టీ కాంగ్రెస్ పైనే ఉండాలని బేడీ చెబుతూ ఏకంగా ఆందోళనకే డుమ్మా కొట్టింది. ఉమ్మడి లక్ష్యం కోసం పని చేసేటపుడు వచ్చే విభేదాలను పరిష్కరించుకునో, వాయిదా వేసుకునో ఆందోళనను ముందుకు తీసుకెళ్ళాలన్న ప్రజాస్వామిక సూత్రాన్ని కిరణ్ బేడీ విస్మరించినట్లు కనిపిస్తోంది.

బి.జె.పి పై భ్రమలు

“నా వ్యక్తిగత దృక్పధాన్ని బృందానికి తెలియజేశాను. పాలక పార్టీ పైన కేంద్రీకరించాలని చెప్పాను. పాలక పార్టీని ప్రతిపక్ష పార్టీ ఇప్పటికే టార్గెట్ చేసి ఉన్నందున, ఇప్పటికిప్పుడు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం వల్ల అధికార పార్టీయే లాభపడుతుంది. వారు ఒక నిశ్చయానికి వచ్చేశారు” అని కిరణ్ బేడీ పిటిఐ కి చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ప్రతిపక్షాలపై ఉన్న అనేక ఆరోపణలు తనకు తెలుసునని చెబుతూ ఆమె ప్రధాన దోషి పాలక పార్టీయేనని దానిపైనే కేంద్రీకరించాలనీ వ్యాఖ్యానించింది.

అరవింద్, భూషణ్ తదితరులు ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ విషయంలోనూ కిరణ్ బేడీకి కొన్ని రిజర్వేషన్లు ఉన్నట్లు కనిపిస్తోంది. “భారత దేశానికి నిజాయితీ గల రాజకీయకుల అవసరం ఉంది. విస్తృతమైన మార్పుల కోసం నేనూ చూస్తున్నాను. కానీ ఓపిక వహించాలి. కలుపుకుపోయే దృక్పధం ఉండాలి. వారితో సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ మద్దతు దొరికే అవకాశాలను వదులుకోకుండా చూసుకోవాలి” అని బేడీ పి.టి.ఐ కి తెలిపింది. ఆందోళనకు ఎందుకు హాజరు కాలేదన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ (కొత్త పార్టీతో కూడా) సంబంధం లేదనీ, తాను వాస్తవికంగా ఆలోచిస్తున్నానని తెలిపింది.

బి.జె.పి నాయకులకు కిరణ్ బేడీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఆందోళనకు మద్దతు ఇచ్చింది గనక, సదరు మద్దతును మర్చిపోలేము గనక, ఆ పార్టీ కూడా అవినీతిలో కూరుకున్నప్పటికీ, దానిని చూసీ చూడనట్లు ఊరుకోవాలని బేడీ సూచిస్తున్నది. బి.జె.పి కి ఇవ్వదలుచుకున్న మద్దతుకు కిరణ్ బేడీ ‘పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య వైరుధ్యాన్ని వినియోగించుకోవడం’ అనే బేనర్ తగిలిస్తోంది. “జైట్లీ, సుష్మా స్వరాజ్, అద్వానీ, గడ్కారీ మా సూచనలకు సానుకూలత (receptive) తెలిపారు. అరవింద్, భూషణ్ లు (తండ్రీ, కొడుకులు) వారితో అనేక సమావేశాలు జరిపారు. కొన్ని మార్గాల్లో మద్దతు ఇవ్వడానికి, వారు (బి.జె.పి నాయకులు) అంగీకరించారు. అన్ని విషయాల్లో అంగీకరించలేదు, కానీ కనీసం పాలక పార్టీ లాగా కొట్టిపారేయలేదు కదా?” అని బేడీ ప్రశ్నించినట్లు ‘ది హిందూ’ తెలిపింది.

కేవలం అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇచ్చిన సూచనల పట్ల సానుకూలంగా ఉన్నంత మాత్రాన, కేవలం కొన్ని సూచనలు ఆమోదించినంత మాత్రాన, బి.జె.పి ని టార్గెట్ చెయ్యవద్దని కిరణ్ బేడీ కోరడం హాస్యాస్పదం. అవినీతి వ్యతిరేక ఉద్యమం లో కొన్ని అంశాలకు మద్దతు పొందడం, మరి కొన్ని సూచనలకు సానుకూలత పొందడం, అనేవి ప్రధాన లక్ష్యం నుండి విడిగా ఉండబోవు. ఉద్యమ ప్రధాన లక్ష్యం లోక్ పాల్ బిల్లు. ఆ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ లాగే బి.జె.పి కూడా సాచివేత వైఖరిని పకడ్బందీగా అమలు చేసింది. ఒక పక్క అవినీతి వ్యతిరేక ఉద్యమం తెచ్చిపెడుతున్న ప్రతిష్టను సొంతం చేసుకోవడానికి ఉద్యమంతో స్నేహం నటిస్తూ, పార్లమెంటులో నిర్ణయాత్మకంగా వ్యవహరించవలసిన సమయంలో శుష్క ప్రసంగాలతో పొద్దు పుచ్చింది. పాలక కాంగ్రెస్ తో కుమ్మక్కై బిల్లు ఆమోదం పొందకుండా చేయడంలో తన వంతు పాత్ర పోషించింది.

రాజకీయ నాయకుల నేరస్ధ నేపధ్యాలపైనా, అవినీతి సామ్రాజ్యాల పైనా అరవింద్, అన్నా లాంటి వారు చేసిన వ్యాఖ్యలను క్రిమినలైజ్ చెయ్యడంలో కాంగ్రెస్ చేసిన కుట్రకు బి.జె.పి తోడు నిలిచింది. రాజకీయ నాయకుల అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడాన్నీ, ప్రజలను మేల్కొలపడాన్నీ రాజకీయ నాయకులపై చేస్తున్న దాడిగా కాంగ్రెస్ ముద్ర వేస్తే బి.జె.పి దానికి తలూపింది. రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు అరవింద్, అన్నా ప్రకటించిన వెంటనే ఉద్యమంలో కేంద్రీకరించిన శక్తులన్నింటినీ ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి ల కూటమి ఉపసంహరించుకున్నట్లు పత్రికలు తెలిపాయి. తమ ఓటు బ్యాంకుకు కొత్త పార్టీ చిల్లి పెడుతుందనీ, అప్పటిదాకా వచ్చిన రాజకీయ ప్రతిష్టను నూతన పార్టీ లాక్కుంటుందని భయంతోనే బి.జె.పి వెనక్కి తగ్గిందని పత్రికలు ససాక్ష్యాలతో విశ్లేశించాయి.

ఇన్ని జరిగినప్పటికీ బి.జె.పి పై భ్రమలను కాపాడుకోవాలని బేడీ చూడడం అత్యంత హాస్యాస్పదం. ఇది ఆమె చెప్పినట్లు వాస్తవిక దృక్పధం కాకపోగా, ప్రకటిత లక్ష్యానికి తూట్లు పొడవడమే. సిద్ధాంత కబుర్లు చెప్పి దేశంలోని అవినీతికి ముఖ్యమైన పోషకురాలుగా ఉన్న బి.జె.పి కి విశ్వసనీయత కల్పించడమే. ఓటు బ్యాంకు కోసం బి.జె.పి చేస్తున్న నాటకాల పట్ల గుడ్డితనం ప్రదర్శించడమే.

అరవింద్ నోట వాస్తవాలు

బి.జె.పి ని టార్గెట్ చెయ్యడంలో అరవింద్ కి లోపల ఏయే కారణాలున్నాయో తెలియదు. ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఎంతో ఇంకా స్పష్టం కాలేదు. అరవింద్ పైనా ఆయన కొత్త పార్టీ పైనా భ్రమలు పెట్టుకోవలసిన అవసరం ప్రస్తుతానికైతే లేదు. కానీ అరవింద్ ఎత్తి చూపిన అంశాలు విస్మరించరానివి. 

అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన అంశాలు చూద్దాం. “కోల్ గేట్ లో సి.పి.ఐ-ఎం, కాంగ్రెస్, బి.జె.పి ల ప్రభుత్వాలను కాగ్ నివేదిక స్పష్టంగా తప్పు పట్టింది. అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధ దేబ్ భట్టాచార్య, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే లు కూడా ప్రవేటు పార్టీలకు బొగ్గు గనులు కేటాయించాలని సిఫారసు చేశారు. తమ సొంత ఇష్టులకు కోల్ బ్లాకులను కేటాయించేందుకు వీలుగా వేలం విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ ముఖ్యమంత్రులు 2005 లో లేఖలు రాశారు… తాము అమాయకులమని చెప్పడానికి ఏ ప్రధాన పార్టీకీ నైతిక సాధికారిత లేదు. కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి బి.ఎస్.యెడ్యూరప్ప వేలం వేయకుండా బొగ్గు గనులను కట్టబెట్టాడు.” (ఇండియా టి.వి న్యూస్, 22 ఆగస్ట్ 2012)

“నాటకాలు రక్తి కట్టించే స్ధలంగా పార్లమెంటు మారిపోయింది. పార్లమెంటు ఎప్పుడు నడవాలో, ఎప్పుడు అడ్డుకోవాలో కాంగ్రెస్, బి.జె.పి లు కుమ్మక్కై నిర్ణయిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు బి.జె.పి మనుషులకు సాయం చెయ్యడాన్నీ, బి.జె.పి అధికారంలో ఉన్న చోట కాంగ్రెస్ మనుషులకి సాయం చెయ్యడాన్నీ గత అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం.  వారి మధ్య చాలా గొప్ప అవగాహన ఉంది… ప్రధాని రాజీనామా కోసం బి.జె.పి చేస్తున్న డిమాండు కేవలం నటన. ప్రధాని బైటికి వెళ్లబోడని బి.జె.పి కి బాగానే తెలుసు.” (ఇండియా టి.వి న్యూస్, 22 ఆగస్ట్, 2012).

ఇవన్నీ వాస్తవాలు. కాంగ్రెస్, బి.జె.పి లు దొందూ దొందే అన్న సంగతి పాలకవర్గాల ఏజెంటు నోటి నుండే రావడం పరిస్ధితి తీవ్రతను చెబుతోంది. కాగా, పాలక పార్టీలలో తామే పులుకడిగిన ముత్యాలమని పార్లమెంటరీ వామ పక్ష పార్టీలు ఇప్పటివరకూ చెప్పుకుంటున్న గొప్పల బండారం బొగ్గు కుంభకోణం బట్టబయలు చేసినట్లయింది. అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకించినట్లు చెబుతూనే పూర్తిగా వ్యతిరేకించడం లేదని సన్నాయి నొక్కులు నొక్కడం, ప్రవేటీకరణకు వ్యతిరేకంగా అధికారం లేని చోట ప్రచారం చేస్తూ అధికారం ఉన్న చోట్ల ప్రవేటీకరణ విధానాలు అమలు చేయడం, భూ సంస్కరణలు అమలు చేయాలని చెబుతూ అధికారంలో ఉన్న చోట భూ సంస్కరణల ఊసే ఎత్తకపోవడం, అధికారం లేని చోట్ల ప్రజా ఉద్యమాలు సాగిస్తున్నట్లు ఫోజు పెడుతూ అధికారంలో ఉన్న చోట్ల ప్రజా రాసులపై పాశవిక అణచివేత అమలు చేయడం… సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలకు ఉన్న సాధారణ అలవాటు. బొగ్గు కుంభకోణం ఆ పార్టీల ద్వంద్వ విధానాల కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా చేరడం సహజ పరిణామమే. పైకి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ మౌలికంగా దోపిడీ వర్గాలకు వత్తాసుగా నిలవడానికే సిద్ధపడ్డాక అవినీతి పంకిలం అంటించుకోవడం ఆశ్చర్యకర పరిణామమేమీ కాదు.

మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన పార్లమెంటరీ నాటకంలో కొత్త అవినీతి వ్యతిరేక పార్టీ ఏ పాత్ర తీసుకోనున్నదో కిరణ్ బేడీ అభ్యంతరాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ కంటే తాము విభిన్నమైన పార్టీ అని చెప్పుకుని చివరికి తానూ అదేనని బి.జె.పి రుజువు చేసుకుంది. అదే కోవలో, ఉనికిలో ఉన్న పార్టీల కంటే భిన్నమని చెప్పుకోవలసిన అగత్యం అరవింద్ కేజ్రీవాల్ చేత కొన్ని వాస్తవాలు పలికిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాలు కేజ్రీవాల్ కొత్తగా చెప్పినా, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఎన్నడో చెప్పినవే. ప్రజా స్వామ్యాన్ని ప్రలోభపూరిత ఎన్నికల స్ధాయికి కుదించిన చోట, ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల జాతర తప్ప ప్రజాస్వామ్యానికి మరో కనీస సంకేతాత్మక వ్యవస్ధ లేని చోట, నోటు తీసుకుని వేసే ఓటు కోసం జనం బారులు తీరిన చోట, అవినీతి నిర్మూలన కోసం అంటూ మరో పార్లమెంటరీ పార్టీని పెట్టడమే పెద్ద అభాస.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s