ఈక్వడార్ రాయబార కార్యాలయంలో శరణు పొందిన జూలియన్ ఆసాంజే ని ఏ పరిస్ధితిలోనైనా అరెస్టు చెయ్యాల్సిందేనని లండన్ పోలీసులకు వచ్చిన రహస్య ఆదేశాలు బట్టబయలయ్యాయి. పోలీసు అధికారి చేతిలో ఉన్న ఆదేశ పత్రాలలోని అక్షరాలు విలేఖరుల కంటికి చిక్కడంతో రహస్య పధకం వెల్లడయింది. ఈక్వడార్ ‘రాజకీయ ఆశ్రయం’ లో రక్షణ పొందుతున్నప్పటికీ ఎట్టి పరిస్ధితుల్లోనూ జూలియన్ ఆసాంజే ను అరెస్టు చెయ్యడానికి బ్రిటన్ నిశ్చయించిందని తెలిసి వచ్చింది. వివిధ దేశాల మధ్య రాయబార సంబంధాల విషయమై కుదిరిన అంతర్జాతీయ ‘వియన్నా ఒప్పందం’ పై గానీ, ‘జెనీవా కన్వెన్షన్’ తీర్మానాలపై గానీ తనకు పట్టింపు లేదని బ్రిటన్ చాటినట్లయింది.
వికీ లీక్స్ చీఫ్ ఎడిటర్ ఆసాంజే ఈక్వడార్ ఎంబసీ నుండి బైటికి వచ్చే “అన్ని పరిస్ధితుల్లోనూ (under all circumstances)” అతనిని అరెస్టు చేయాలంటూ చేతి రాతతో వచ్చిన ఆదేశాల పత్రాలున్న ‘క్లిప్ బోర్డ్’ ను ఓ పోలీసు అధికారి కేజువల్ గా పట్టుకుని ఉండగా ‘ప్రెస్ అసోషియేషన్’ సంస్ధ పోటో గ్రాఫర్ కెమెరా కంట పడింది. ఎంబసీ నుండి జూలియన్ బైటికి వచ్చే అన్ని అవకాశాలను ప్రస్తావిస్తూ ఏ పరిస్ధితిలోనూ ఆయన వెళ్లిపోకుండా అడ్డుకుని అరెస్టు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నట్లు టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి మరీ జూలియన్ ను అరెస్టు చేయడానికి ‘రహస్య పధకం’ రూపు దిద్దుకున్నదన్న అనుమానాలు దీని ద్వారా బలపడ్డాయని పత్రికలు వ్యాఖ్యానించాయి.
ఈక్వడార్ ఎంబసీ బయట లండన్ పోలీసులు రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నారు. ఏదో ఒక ఉపాయం పన్ని ఆసాంజే ను ఈక్వడార్ తీసుకెళ్లవచ్చని అనుమానిస్తూ డేగ కళ్ళతో కాపలా కాస్తున్నారు. రాయబార రక్షణ (diplomatic immunity) ఉన్న వాహనంలో అసాంజే ను తీసుకెళ్లవచ్చని ఆదేశాల్లో ప్రస్తావించారు. లేదా అసాంజే ప్రాణాలకు సైతం ప్రమాదం కలిగే విధంగా ఉన్నా, ఒక బ్యాగ్ లో ఉంచి తీసుకెళ్లవచ్చని మరొక అవకాశాన్ని ఊహిస్తున్నారు. లేదా ఐక్యరాజ్య సమితి లో ఈక్వడార్ తరపున ఒక ఉద్యోగిగా నియమించి తద్వారా రాయబార హోదా కల్పించి అసాంజే ను తీసుకెళ్లవచ్చని మరొక అవకాశాన్ని ఆదేశాలలో ఊహించారు. ఇంకా ఇతర అవకాశాలు ప్రస్తావించినప్పటికీ పోలీసు అధికారి చేతికింద ఉండడం వల్ల కనిపించలేదని (లేదా అర్ధం కాలేదని) తెలుస్తోంది.
పోలీసుల దృష్టి మళ్లించి అసాంజే ను తరలించే అవకాశాలున్నాయని ‘restricted’ గా గుర్తించిన మార్గదర్శక ఆదేశాలు హెచ్చరించినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. ఎంబసీ ముందు హంగామా సృష్టించి, ఆ గొడవలో తరలించవచ్చన్నది బ్రిటన్ ప్రభుత్వ అనుమానం. అన్ని అవకాశాలనూ అడ్డుకునేందుకు వీలుగా SO20 అనే టెర్రరిస్టు వ్యతిరేక సంస్ధ సహాయం తీసుకోవాలని ఆదేశాలు పేర్కొన్నాయి. శుక్రవారం ఫోటో గ్రాఫర్ల కెమెరాకు చిక్కిన ఆదేశాలపై ప్రభుత్వం స్పందించలేదని పత్రికలు తెలిపాయి.
స్వీడన్ లో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జూలియన్ ను అక్కడికి తరలించడానికి బ్రిటన్ ప్రయత్నిస్తున్నది. అత్యాచార ఆరోపణలను జూలియన్ తిరస్కరించాడు. స్వీడన్ ప్రాసిక్యూటర్ మొదట ఆరోపణలలో పస లేదని కేసు నమోదు చేయడానికి తిరస్కరించాడు. జూలియన్ స్వీడన్ నుండి లండన్ వచ్చాక మరో పోలీసు అధికారి తిరిగి ఆరోపణలను నమోదుచేశాడు. దానితో స్వీడన్ ఉద్దేశాలపై అనుమానాలు బయలుదేరాయి. స్వీడన్ కి రప్పించి అక్కడినుండి అమెరికాకి తరలించడానికి రహస్య పధకం వేశారని జూలియన్ అతని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నప్పటికీ అమెరికాకి తరలించబోమన్న హామీని ఇవ్వడడానికి కూడా స్వీడన్ తిరస్కరిస్తున్నది. ఈక్వడార్ రాయబార కార్యాలయంలోనే అసాంజే ను ప్రశ్నించే అవకాశం ఈక్వడార్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ దానిని సైతం స్వీడన్ తిరస్కరించింది. దానితో అసాంజే అనుమానం నిజమేనని తాము భావిస్తున్నట్లు ఈక్వడార్ ప్రభుత్వం ప్రకటించింది.
వ్యక్తుల స్వేచ్ఛ గురించీ, మానవ మరియు ప్రజాస్వామిక హక్కుల గురించీ లెక్చర్లు దంచుతూ అమెరికా, బ్రిటన్ లు ప్రపంచ దేశాలకు పాఠాలు చెబుతాయి. చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాల్లో రాజకీయ హక్కులు లేవని కన్నీళ్లు పెట్టుకుంటాయి. వాస్తవానికి ఆ దేశాలలో ప్రజాస్వామ్యం మేడి పండే నని జులియన్ ఎదుర్కొంటున్న విచ్ హంట్ రుజువు చేస్తున్నది.
విశేఖర్ గారూ,
సామ్రాజ్యవాద దేశాల డొల్లనీతి, మేడి పండు ప్రజాస్వామ్యం గురించిన అదనపు సోర్స్‌గా నమస్తే తెలంగాణా లోని కింది వ్యాసం చూడండి.
లాటిన్ అమెరికా సాహసం
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=5&ContentId=143839