అమెరికా డిఫెన్స్ విచ్ఛేదన దిశలో చైనా మిసైళ్ళ అభివృద్ధి -టైమ్స్


అమెరికా తరచుగా గొప్పలు చెప్పుకునే క్షిపణి రక్షణ వ్యవస్ధను ఛేదించే వైపుగా చైనా తన మిసైళ్లను అభివృద్ధి చేస్తున్నదని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది. యూరప్ దేశాలకు కూడా ఇరాన్, ఉత్తర కొరియాల మిసైళ్ళ నుండి రక్షణ కల్పించే ‘మిసైల్ డిఫెన్స్ సిస్టమ్’ (ఎం.డి.ఎస్) ఏర్పాటు పూర్తి చేశామని అమెరికా కొద్ది నెలల క్రితం ప్రకటించింది. యూరోప్ కోసం అని చెబుతూ మధ్య యూరప్ నుండి తన సరిహద్దు దేశాల వరకూ ఆయుధ వ్యవస్ధను అమెరికా నిర్మించడం పై రష్యా అనేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరం అనుకుంటే చెప్పాపెట్టకుండా సదరు వ్యవస్ధను నాశనం చేయడానికి కూడా వెనకాడనని రష్యా గత మే నెలలో హెచ్చరించింది కూడా. అటువంటి మిసైల్ రక్షణ వ్యవస్ధను ఛేదించే మిసైళ్లను చైనా అభివృద్ధి చేస్తోందన్న వార్త అమెరికా, యూరప్ లకు ఆందోళనకరం.

వెలమైళ్ళ దూరాలను చేధించే ఖండాతర బాలిస్టిక్ మిసైళ్ళ (Intercontinental Ballistic Missiles -ICBM) నిర్మాణం, ఐ.సి.బి.ఎం ల నుండి రక్షణ, ఇవి రెండూ ప్రధాన రాజ్యాలు పోటీ పడే ఆయుధాల్లో ఒకటి. ఎనిమిది దేశాలు మాత్రమే ఐ.సి.బి.ఎం లు కలిగి ఉన్నాయి. (రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్) భూ ఉపరితలం నుండి ప్రయోగించే ఐ.సి.బి.ఎం లు ఈ దేశాలన్నింటికి ఉండగా, సముద్రం (సబ్ మెరైన్) నుండి ప్రయోగించే ఐ.సి.బి.ఎం లు ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలకు తప్ప మిగతా ఆరు దేశాలకు ఉన్నాయి. మిసైల్ రక్షణ వ్యవస్ధ ఉందని అమెరికా మాత్రమే చెబుతుంది.

అణ్వాయుధాలను తీసుకెళ్లడానికి ఐ.సి.బి.ఎం లను ఉద్దేశించినందున వీటి తయారీ, అభివృద్ధి ప్రధాన దేశాల మధ్య ఏదో ఒక రూపంలో (తరచుగా ప్రకటనల రూపంలో) ఉద్రిక్తతలకు దారి తీస్తుంటాయి. ఇరాన్, ఉ.కొరియా ల మిసైళ్లనుండి రక్షణకే ఎం.డి.ఎస్ అభివృద్ధి చేశానని అమెరికా చెబుతున్నప్పటికీ అది ఒట్టిమాట. రక్షణ కోసం అని చెప్పే ఎం.డి.ఎస్ ప్రధానంగా దాడి చేయడానికేనని నిపుణులు చెబుతారు. అలాంటి మిసైల్ డిఫెన్స్ సిస్టం కు కూడా దొరకని మిసైళ్లను చైనా అభివృద్ధి చేస్తున్నదనీ, చాలా వరకూ పురోగమించిందనీ టైమ్స్ చేసిన విశ్లేషణని ఎన్.డి.టి.వి ప్రచురించింది.

బహుళ సంఖ్యలో అణ్వాయుధాలను ఐ.సి.బి.ఎం లపై ప్రతిష్టించే సామర్ధ్యాన్ని చైనా అభివృద్ధి చేస్తున్నదని చైనాకు చెందిన ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక బుధవారం చెప్పినట్లు టైమ్స్ తెలిపింది. గ్లోబల్ టైమ్స్ (జి.టి) పత్రిక చైనా కమ్యూనిస్టు పార్టీ నడిపే పత్రిక. అలాంటి క్షిపణి ‘డాంగ్ ఫెంగ్ – 41’ ను చైనా ఇప్పటికే పరీక్షించిందని వచ్చిన వార్తలను జి.టి ఖండించింది.

డమ్మీ అణ్వాయుధాలు

అమెరికా మాజీ గూఢచార అధికారి లారీ వోట్జెల్ ను ఉటంకిస్తూ ఒకేసారి పది అణ్వాయుధాలు మోసుకెళ్ళే ఐ.సి.బి.ఎం ను చైనా అభివృద్ధి చేస్తున్నదని టైమ్స్ తెలిపింది. అమెరికా కాంగ్రెస్ నియమించిన ‘అమెరికా చైనా ఆర్ధిక మరియు భద్రతా సమీక్ష కమిషన్’ కు లారీ ప్రస్తుతం కమిషనర్ గా ఉన్నాడు. ఆయన ప్రకారం అసలు అణ్వాయుధాలతో పాటు డమ్మీ అణ్వాయుధాలు కూడా ఐ.సి.బి.ఎం పై నిలిపే టెక్నాలజీని చైనా అభివృద్ధి చేస్తున్నది. డమ్మీ అణ్వాయుధాలకి కూడా అసలు ఆయుధాల లాగే వేడి, విద్యుదయస్కాంత ఉపకరణాలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నది. తద్వారా డమ్మీ ఆయుధాలు కూడా అసలు ఆయుధాల లాగే ‘మిసైల్ డిఫెన్స్ సిస్టం’ ను మోసగించే లక్ష్యం ఇందులో ఉందని లారీ తెలిపాడు. ఇలా చేయడం వల్ల చైనా ఐ.సి.బి.ఎం లపై ఎన్ని అణ్వాయుధాలు వాస్తవంగా ఉన్నదీ వేసే అంచనా తప్పవుతుందని ఆయన తెలిపాడు. ఇది పెద్ద ప్రభావం కలిగించే అంశమని తెలిపాడు.

లారీ ప్రకారం సబ్ మెరైన్ లనుండి ప్రయోగించే ఐ.సి.బి.ఎం లను కూడా చైనా ఇటీవలి వారాల్లో పరీక్షించింది. అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధను మోసగించడానికి వీటిని చైనా వినియోగించవచ్చు. మిసైల్ రక్షణ వ్యవస్ధలో భాగంగా అమెరికా ప్రతిష్టించిన రాడార్లలో అత్యధికం ప్రచ్చన్న యుద్ధ కాలంలో నిర్మించినవేననీ, అవి ధృవ ప్రాంతాలపై నుండి వచ్చే మిసైళ్లను గుర్తించడానికి ఉద్దేశించినవని వోట్జెన్ తెలిపాడు.

మేమూ రక్షణకే

తమ ఆయుధాలన్నీ ఇతరులు సాగిస్తున్న చర్యలకు ప్రతిస్పందనగా తయారు చేస్తున్నవేనని చైనా అంటోంది. ఇతర దేశాలు, ముఖ్యంగా అమెరికా మిలిటరీ శక్తులను అభివృద్ధి చేసుకునే పనిలో నిరంతరాయంగా నిమగ్నమై ఉన్నందునే చైనా కూడా మిలట్రీ వ్యవస్ధను అభివృద్ధి చేసుకుంటున్నదని చైనా తెలిపింది. “మేము మళ్ళీ మళ్ళీ చెపుతున్నాం. అణు శక్తిని వినియోగించడంలో చైనా మొదటి దేశంగా ఉండదని. మమ్మల్ని మేము రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మాకు ప్రధాన భయం అమెరికా నుండే ఎదురవుతోంది” అని బీజింగ్ లోని సింఘువా యూనివర్సిటీ ప్రొఫెసర్ సూన్ ఝే అన్నాడని టైమ్స్ తెలిపింది.

ఉత్తర కొరియా మిసైళ్లనుండి రక్షణ పొందడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతున్నా చైనా కు ఆ విషయంలో వేరే అభిప్రాయం ఉందని టైమ్స్ అంటోంది. చైనా అధికారులు గానీ, నిపుణులు గానీ అమెరికా లక్ష్యం చైనాయేనని భావిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియా ఒక లక్ష్యం అయితే అయిఉండవచ్చు గానీ, అమెరికా ఆయుధ లక్ష్య విస్తరణలో చైనా కూడా లక్ష్యంగా ఉందన్నది స్పష్టమేనని చైనా నిపుణుల అభిప్రాయం.

అణ్వాయుధ ప్రయోగం గురించి ఉత్తర కొరియా చేసే ప్రకటనలు కేవలం రక్షణాత్మక పరిస్ధితులని నుండి వచ్చేవే తప్ప అమెరికాలాగా దురహంకారంతోనో, సామ్రాజ్యవాద వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంతోనో చేసేవి కావు. పొరుగు దేశం దక్షిణ కొరియా భూభూగంపై ఆ ప్రాంతంలోనే భారీ సైనిక స్ధావరాన్ని అమెరికా నిర్వహిస్తోంది. జపాన్ లో అమెరికా రహస్య అణ్వాయుధాలతో స్ధావరాలను నిర్వహిస్తోంది. వీటివల్ల రాని ప్రమాదం ఉత్తర కొరియా వల్ల వస్తుందని చెప్పడం అత్యంత హాస్యాస్పదం.

వెలమైళ్ళ దూరంలో ఉంటూ కూడా దక్షిణ చైనా సముద్రం పై దురహంకారపూరితంగా ప్రకటనలు జారీ చేసే అమెరికా వల్ల ప్రపంచంలోని అన్నీ దేశాలకూ ప్రమాదమే. అమెరికా మిత్ర దేశాలు గా చెప్పే దేశాలకు కూడా అమెరికా వల్ల నిరంతర ప్రమాదం పొంచి ఉంటుందని ఇరాక్ పై దశాబ్దకాలం పాటు సాగిన అత్యంత హేయమైన ఆంక్షల అమలు, అనంతరం జరిగిన దురాక్రమణ దాడి స్పష్టం చేశాయి. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రణ కోసం పాకిస్ధాన్ ని మిత్ర దేశంగా ప్రకటించి పాక్ భూభాగంపై ఇప్పటికీ డ్రోన్ దాడులతో వేలమంది ప్రజలను హత్య చేస్తున్న అమెరికా ఎవరికీ మిత్రదేశం కాదు. మిత్రత్వాన్ని కూడా బలవంతంగా రుద్దే అమెరికా రాజ్యం ఎవరికీ మిత్రదేశం కాజాలదు.

One thought on “అమెరికా డిఫెన్స్ విచ్ఛేదన దిశలో చైనా మిసైళ్ళ అభివృద్ధి -టైమ్స్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s