అమెరికా ఇజ్రాయెల్ వద్దన్నా సరే, ఇరాన్ అలీన సభకి వెళ్తా -బాన్


బాన్ కి మూన్ [ఫొటో: ది హిందూ (అసోసియేటెడ్ ప్రెస్)]

ధూర్త రాజ్యాలయిన అమెరికా, ఇజ్రాయెల్ అభ్యంతరాలను పక్కన బెట్టి, ఐక్యరాజ్య సమితి అధిపతి బాన్ కి మూన్ ఇరాన్ వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 30-31 తేదీల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అలీన దేశాల సభ జరగనున్నది. ‘అలీనోద్యమం’ లో సభ్యులైన 119 దేశాలతో పాటు ‘పాలస్తీనా ఆధారిటీ’ కూడా ఈ సభకు హాజరుకానున్నాయి. లిబియా, సిరియా కిరాయి తిరుగుబాట్లలో దుష్ట నాటోకి అధికార ప్రతినిధి తరహాలో ప్రకటనలు ఇచ్చిన బాన్, అమెరికా ఇష్టానికి భిన్నంగా ఇరాన్ నిర్వహించే అలీనోద్యమ సమావేశానికి హాజరు కావడం ఆసక్తికర పరిణామం.

భారత ప్రధాని మన్మోహన్ సింగ్, ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి, ఉత్తర కొరియా ప్రతినిధి… అలీన దేశాల సభకు హాజరు కానున్న ప్రముఖుల్లో కొందరు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్వయంగా ఫోన్ చేసి అభ్యంతరం చెప్పినా, సమితిలో అమెరికా రాయబారి సుసాన్ రైస్ వెళ్ళవద్దని కోరినా టెహ్రాన్ సభకు వెళ్లడానికే బాన్ నిశ్చయించినట్లు ఆయన ప్రతినిధి మార్టిన్ నెసిర్కీ స్పష్టం చేశాడని పిటిఐ తెలిపింది.

ఇరాన్ సభకి బాన్ హాజరయితే దానిని తన విధానాలకు అనుకూలంగా ఇరాన్ వినియోగించుకుంటుందనీ, అందువల్ల సభకు దూరంగా ఉండాలనీ ఇజ్రాయెల్ అలీన దేశాలను కోరింది. సభకు హాజరవడం అంటే ఇరాన్ ఏర్పరిచిన ఉచ్చులోకి నేరుగా నడిచివెళ్లడడమేనని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది. “ప్రాపగాండా కోసం ఇరాన్ ఈ సభను వాడుకుంటుంది. అందులో అనుమానం లేదు. సభ ద్వారా తన విధానాలకు న్యాయబద్ధతను ఆపాదించుకుంటుంది. అక్కడికి వెళ్లడానికి నిశ్చయించుకున్నవారంతా అలాంటి ఉపాయాలను తెలుసుకుని ఉండాలి. ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడాలి” అని ఇజ్రాయెల్ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి యిగల్ పామొర్ ఎ.ఎఫ్.పి తో అన్నాడు. ఇరాన్ సభకు వెళ్లవద్దని ఐరాస లో అమెరికా రాయబారి సుసాన్ రైస్ కూడా బాన్ ని కోరిందని ఎ.ఎఫ్.పి తెలిపింది.

అయితే మాయోపాయాలు పన్నడం, ఉచ్చులోకి లాగడం లాంటి దుష్ట కార్యాలు చేసేది అమెరికా-యూరప్-ఇజ్రాయెల్ దుష్ట కూటమి మాత్రమే. ఆర్ధిక, వాణిజ్య, రాజకీయ, రాయబార ప్రయోజనాల రీత్యా ఉచ్చులు పన్నే అవసరం దుష్టకూటమికే ఉంది తప్ప ఇరాన్ కి లేదు. 300 కి పైగా అణ్వస్త్రాలను దగ్గర పెట్టుకుని ఇరాన్ వద్ద లేని అణు బాంబుతో ప్రపంచానికి ప్రమాదం అంటూ అబద్ధపు కూతలు కూస్తున్నది ఇజ్రాయెల్ దేశమే. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం లో సంతకందారు కాని ఇజ్రాయెల్, సంతకందారు అయిన ఇరాన్ అణు కర్మాగారాల గురించి ప్రమాద ఘంటికలు మోగించడమే పెద్ద మోసం. అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఎ.ఇ.ఎ) పరిశీలకులను దేశంలోకి అనుమతించడానికి పదే పదే తిరస్కరించే ఇజ్రాయెల్, పరిశీలకులను అనేకసార్లు అనుమతించి గూఢచర్యానికి గురయిన ఇరాన్ ని ఆక్షేపించడం దొంగే ‘దొంగ! దొంగ’ అని అరవడం. ఇరాన్ ఉచ్చులో పడొద్దని ఇజ్రాయెల్ చేస్తున్న హెచ్చరిక వెనక ‘ఇరాన్ అణు బాంబు’ పేరుతో తాను వేసిన ఉచ్చులోనుండి ప్రపంచ దేశాలు బైటపడతాయన్న భయం దాగి ఉందన్నది స్పష్టమే.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నియంత హిట్లర్, యూదులపై సాగించిన జాతి విద్వేషాన్నీ, అణచివేతనూ చెప్పుకుని ఇప్పటికీ లబ్ది పొందాలని చూసే రాజ్యం (దేశం కాదు) ఇజ్రాయెల్. అగ్ర రాజ్యం అమెరికా అండ చూసుకుని, అవధులులేని అభద్రతతో మధ్య ప్రాచ్యంలో నిరంతరం అలజడులు సృష్టిస్తూ ప్రపంచ దేశాలకు ఇంధన అవసరాల రీత్యా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కుట్రల రాజ్యం ఇజ్రాయెల్. తన గూఢచార సంస్ధ మొస్సాద్ ని వినియోగించి అమెరికాతో పాటు ప్రపంచం నలుమూలలా (అమెరికాతో సహా) దేశాధిపతులనూ, శాస్త్రవేత్తలనూ, రాజకీయ నాయకులనూ, పౌరులనూ హత్యలు చేయించిన రాజ్యం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అణు కర్మాగారాలపైన కూడా ఐ.ఎ.ఇ.ఎ చేత తనిఖీలు చేయించాలని నిర్ణయించినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జె.ఎఫ్.కెన్నడీ ని హత్య చేయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యం ఇజ్రాయెల్. ఇటువంటి రాజ్యం ఇరాన్ మాయోపాయాల గురించి ఇండియాతో సహా, ప్రపంచ దేశాలను హెచ్చరించ బూనుకోవడం అత్యంత హాస్యాస్పదమే కాక దురహంకారపూరితం కూడా.

ఇరాన్ ని లొంగ దీసుకునే లక్ష్యంతో దాని మిత్ర దేశం సిరియా లో అమెరికా-ఇజ్రాయెల్-యూరప్ దుష్ట కూటమి కిరాయి తిరుగుబాటు నడుపుతున్న సంగతి విదితమే. ముస్లిం మత చాంధస దేశాలయిన గల్ఫ్ దేశాలలోని ఆల్-ఖైదా మిలిటెంట్లను కూడగట్టి వారికి ఆధునిక ఆయుధాలు సరఫరా చేస్తూ సిరియా ప్రజలపై సామూహిక హత్యాకాండలను అవి సాగిస్తున్నాయి. లిబియా విషయంలో కలిసి వచ్చిన చైనా, రష్యాలు ఈసారి సహకరించక పోవడంతో సిరియా సెక్యులర్ పాలకుడు బషర్ అస్సాద్ ను అధికారం నుండి తప్పించడం లేదా హత్య చేయడం దుష్ట కూటమికి కష్టంగా మారింది.

లిబియా కిరాయి తిరుగుబాటు సందర్భంగానూ, ఇప్పుడు సిరియా హత్యాకాండ సందర్భంగానూ ఐరాస అధిపతి బాన్-కి-మూన్ నాటో కి ప్రతినిధిగానే వ్యవహరిస్తూ వచ్చాడు. ప్రపంచ దేశాలన్నింటి మధ్యా శాంతి, సామరస్యాలు నెలకొల్పే లక్ష్యాన్ని విస్మరించి పశ్చిమ కార్పొరేట్ పత్రికల దుష్ప్రచారాన్ని నెత్తినేసుకుని సిరియా ప్రభుత్వ మార్పిడికి అనుకూలంగా ప్రకటనలు జారీ చేశాడు. సిరియాలో విదేశీ కిరాయి మూకల హత్యాకాండలను నిర్ద్వంద్వంగా ఖండించడానికి తిరస్కరించాడు. సిరియా పాలకుడిపై పశ్చిమ కార్పొరేట్ పత్రికల చేసిన ప్రచారం ఒట్టి అబద్ధమేననీ, ఆల్-ఖైదా, ముస్లిం బ్రదర్ హుడ్ తదితర సంస్ధల కిరాయి మూకల హత్యలను సిరియా అధ్యక్షుడికి అంటగడుతున్నాయనీ అనేక సాక్షాలు వెల్లడయినప్పటికీ గుర్తించడానికి నిరాకరించాడు. అటువంటి బాన్-కి-మూన్ ఇరాన్ లో జరగనున్న అలీనోద్యమ సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించుకోవడం, అది కూడా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల హెచ్చరికలను పెడ చెవిన పెట్టి మరీ నిర్ణయించడం ఆసక్తికరం.

అయితే అమెరికా ఒప్పుకోకుండా ఇరాన్ సభకు వెళ్లాలనే బాన్ నిర్ణయించడం నమ్మదగ్గ విషయం కాదనీ, వాస్తవానికి ఈ నిర్ణయం వెనుక అమెరికా ఆమోదం ఉండవచ్చనీ కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. సిరియాలో అతి పెద్ద పట్టణం అలెప్పో లో క్రమక్రమంగా ప్రభుత్వ బలగాలు పై చేయి సాధిస్తుండడంతో, సిరియా విషయమై ఇరాన్ తో ఒక ఒప్పందానికి రావడానికే బాన్ పర్యటన ఉద్దేశించబడిందనీ వీరు సూచిస్తున్నారు. సిరియా విషయాన్ని ఇరాన్ తో ‘నిజాయితీగా చర్చించడానికి’ బాన్ నిర్ణయించాడని ఆయన ప్రతినిధి చెప్పడం ఈ సూచనలకు ఆధారంగా చెబుతున్నారు. సిరియా సమస్యకు పరిష్కారంలో ఇరాన్ కి కూడా తప్పనిసరి భాగస్వామ్యం ఉండాలని బాన్ భావిస్తున్నట్లు ఆయన ప్రతినిధి స్పష్టం చేశాడు. 

అలీన దేశాలకు ఒకప్పటి నాయకురాలు ఇండియానే. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నంతవరకూ అలీనోద్యమ నాయకురాలుగా భారత దేశానికి ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి.  సోవియట్ రష్యా కుప్ప కూలాక, అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించాక భారత పాలకులు అమెరికా పంచన చేరక తప్పలేదు. అమెరికా పంచన చేరిన ఫలితంగా అలీనోద్యమంలో పాత్ర పోషించే అవసరం భారత పాలకులకు లేకపోయింది. ఇజ్రాయెల్ దుష్ట కార్యాలను ఖండించి తిరస్కరించడంలో అప్పటివరకూ అగ్రభాగాన నిలిచిన ఇండియా, యజమానులు మారిన నేపధ్యంలో, ఇజ్రాయల్ తో నెయ్యానికి భారత రాజ్యం (దేశం కాదు) సిద్ధపడింది. ప్రపంచలో అనేక పీడిత జాతుల, ప్రజల పక్షాన నిలిచిన దేశంగా పేరు సంపాదించిన ఇండియా, ఇజ్రాయెల్ స్నేహంతో ఆ పేరు కూడా పోగొట్టుకుంది. భారత ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా, పశ్చిమ బహుళజాతి కంపెనీల కోసం నూతన ఆర్ధిక విధానాలు చేపట్టి, పశ్చిమ ఆర్ధిక వ్యవస్ధలకు అనుబంధ ఆర్ధిక వ్యవస్ధగా మారి అమెరికా-ఇజ్రాయెల్-యూరప్ దుష్టకూటమి పన్నాగాలకు ‘తందానా’ పలికే స్ధాయికి దిగజారింది. ప్రకటిత ఆదర్శాలను, విధానాలను తుంగలో తొక్కి ఐరాస లో ఇరాన్ కి వ్యతిరేకంగా పదే పదే ఓటేయడం అందులో భాగమే.

One thought on “అమెరికా ఇజ్రాయెల్ వద్దన్నా సరే, ఇరాన్ అలీన సభకి వెళ్తా -బాన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s