ఫుకుషిమా సముద్ర చేపల్లో భారీ రేడియేషన్


ఫొటో: ది హిందు (ఎపి)

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద సముద్ర చేపల్లో భారీ స్ధాయి రేడియేషన్ కనుగొన్నట్లు ‘టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ’ (టెప్కో) తెలిపింది. సముద్ర తీరానికి 20 కి.మీ దూరం లోపల పట్టిన చేపల్లో రికార్డు స్ధాయిలో అణుధార్మిక సీసియం రేడియేషన్ కనుగొన్నామని టెప్కో ప్రకటించిందని ‘ది హిందూ’ తెలిపింది. ప్రమాదానికి గురయిన ఫుకుషిమా అణు రియాక్టర్ల నుండి కలుషిత నీటిని సముద్రంలో కలిపేస్తున్న నేపధ్యంలో ఇటీవలివరకూ ఫుకుషిమా చుట్టు పక్కల చేపలు పట్టడం పై అప్రకటిత నిషేధం అమలులో ఉంది.

మంగళవారం టెప్కో వెల్లడించిన సమాచారం ప్రకారం ఒక కిలో గ్రాము చేపల్లో 25,800 బిక్యూరల్స్ సీసియం రేడియేషన్ నమోదయింది. జపాన్ ప్రభుత్వం నిర్ణయించిన భద్రత స్ధాయి కంటే 258 రెట్లు ఎక్కువ. ఒకటిన్నర సంవత్సరాల తర్వాత కూడా చేపల్లో భారీ స్ధాయి రేడియేషన్ నమోదు కావడం గమనార్హం. ‘ది హిందూ’ పత్రిక ప్రకారం ప్రమాదం జరిగిన నెలరోజుల లోపే అణు ధార్మికతతో కలుషితమైన 11,000 టన్నుల నీటిని టెప్కో సముద్రంలో కలిపింది. ‘మెల్ట్ డౌన్’ జరిగిన రియాక్టర్ల నుండి కరిగిపోయిన అణు ఇంధనం కలిసిన నీరు భూమి పోరల్లోకి ఇంకి మంచినీటి ప్రవాహంలో కలవకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు గత మే నెలలో టెప్కో ప్రకటించింది. ఇది ఎంతవరకు సఫలం అయిందో తర్వాత తెలియరాలేదు.

చేపల్లో తాజాగా కనుగొన్న రేడియేషన్ గతం కంటే బాగా పెరిగిందని జపాన్ ఫిషరీస్ ఏజన్సీ ద్వారా తెలుస్తున్నది. మార్చి నెలలో పట్టిన చెర్రీ సాల్మన్ చేపల్లో కిలో గ్రాముకి 18,700 బిక్యూరల్స్ రేడియేషన్ నమోదయిందని ఫిషరీస్ ఏజన్సీ ని ఉటంకిస్తూ పత్రిక తెలిపింది.

చేపల్లో భారీ రేడియేషన్ కనుగొన్న నేపధ్యంలో ఫుకుషిమా చుట్టు పక్కల విస్తార సముద్ర ప్రాంతంలో పూర్తి స్ధాయి పరిశోధన నిర్వహించాలని జపాన్ గ్రీన్ పీస్ అధికారి వకావో హనోకా కోరాడు.  ఈ పని ఇంతవరకు జరగలేదని ఆయన తెలిపాడు. ఫుకుషిమా సముద్ర జలాల్లోని చేపల్లోనూ, సముద్ర నాచులోనూ అత్యధిక స్ధాయి రేడియేషన్ ఉన్నట్లు తమ సంస్ధ సర్వేలో కనుగొందని ఆయన తెలిపాడు. సముద్ర ప్రవాహాలు, సముద్ర అడుగు నిర్మాణాలు రేడియేషన్ విస్తరణకు దోహదం చేస్తాయని ఆయన వివరించాడు.

అమెరికా ఆహార గొలుసు (food chain) లో కూడా

రేడియేషన్ విస్తరణలో చేపలు వేగవంతమయిన వాహకాలుగా పని చేస్తున్నాయని రాయిటర్స్ గతంలో తెలిపింది. మే 28 తేదీన రాయిటర్స్ వార్తా సంస్ధ అందించిన సమాచారం ప్రకారం గాలి, నీరు కంటే వేగంగా చేపలు ఫుకుషిమా రేడియేషన్ ను కాలిఫోర్నియా తీరానికి కొనిపోయాయి. కాలిఫోర్నియా చేపల్లో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్న ఫలితంగా ఈ అంచనాకు శాస్త్రజ్ఞులు వచ్చారని ఆ సంస్ధ తెలిపింది. శాన్ డీగో వద్ద ఆగస్టు 2011 లో పట్టిన చేపల్లో ఫుకుషిమా రేడియేషన్ (సీసియం-134, సీసియం-137) ను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఫుకుషిమా సునామీ వల్ల ఏర్పడిన శిధిలాలను సముద్రంలో ప్రయాణం చేసి అలాస్కా, వాయవ్య పసిఫిక్ తీరాలకు చేరడానికంటే ముందే చేపలు రేడియేషన్ ని అమెరికాకి తెచ్చాయని దీని ద్వారా తెలిసి వచ్చింది. చేపల్లో ప్రవేశించిన రేడియేషన్ ఎంత తక్కువయినప్పటికీ ఫుడ్ చైన్ లోకి ప్రవేశించినట్లే.

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పత్రికలో ప్రచురించిన పరిశోధన నివేదికకు నాయకత్వం వహించిన మేడిగాన్ ఈ చేపలు తినడం వల్ల ప్రమాదం ఉందా లేదా అన్నది తాను చెప్పలేనని తప్పుకున్నాడు. అయితే భధ్రతా పరిమితులంటూ విధించిన పరిమితికంటే చేపల్లో కనుగొన్న రేడియేషన్ తక్కువేనని చెప్పాడు. కానీ పరిసరాల కంటే 5 రెట్లు రేడియేషన్ చేపల్లో ఎక్కువ ఉందని సదరు పరిశోధన తెలిపింది. శరీరానికి బాహ్యంగా ఉండే రేడియేషన్ పై విధించే భద్రతా పరిమితి శరీరంలోపలికి ప్రవేశించిన రేడియేషన్ కు వర్తించదనీ అనేకమంది శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్న సత్యం. ఈ అంశాన్ని ప్రస్తావించకుండా కొంతమందికి రేడియేషన్ ఎంత ఉన్నా ప్రమాదంగానే భావిస్తున్నారంటూ అణు కంపెనీల సమర్ధకులు వ్యంగ్యం చేయడం పరిపాటిగా మారింది.

రాయిటర్స్ ప్రకారం లీక్ అయిన రేడియేషన్ లో ఎక్కువ భాగం ప్రమాదం జరిగిన కొద్ది రోజుల లోపలే వెలువడింది. టెప్కో చెప్పిన భూగర్భ లీకేజీని కార్పొరేట్ కంపెనీలు ప్రస్తావించిన సందర్భాలు తక్కువ. బహుశా గాలిలో అయితేనే లీకేజి, భూమిలో జరిగితే లీకేజి కాదని వీరి భావం కావచ్చు. రాయిటర్స్ ప్రకారం చూసినా లీకయిన రేడియేషన్ లో  ఎక్కువ భాగం పోగా మిగిలింది ఆ తర్వాత విడుదలయిందనే అర్ధం.

భారత దేశంలో అణు కర్మాగారాలపై భారత అణు నియంత్రణా బోర్డుకి నియంత్రణ లేదనీ, అసలు ప్రమాదం జరిగితే తీసుకునే భద్రతా చర్యలపైన బోర్డుకే అవగాన లేదనీ, భారత అను కర్మాగారాల్లో భద్రత మృగ్యమని బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక చెప్పినట్లు చానెళ్ళు చెబుతున్నాయి. ‘ప్రమాదం జరిగితే ఎలా?’ అని కుదంకుళం ప్రజలు అడుగుతున్నా ప్రభుత్వాలు, కంపెనీలు సమాధానం ఇవ్వని నేపధ్యంలో కాగ్ నివేదిక అణు ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. అయితే బడా బొగ్గు కుంభకోణం ముందు అణు నివేదిక తేలిపోయినా ఆశ్చర్యం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s