నిష్కళంకుడి బండారం బట్టబయలు, 1.86 ల.కోట్ల బొగ్గు కుంభకోణానికి మన్మోహన్ సారధ్యం


నిష్కళంకుడుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే ప్రధాని మన్మోహన్ సింగ్ నిజ స్వరూపం ఏమిటో దేశానికి తెలిసి వచ్చింది. 1.86 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సారధ్యం వహించి ప్రజల వనరులను ప్రవేటు ముఠాలకు అప్పజెప్పిన మన్మోహన్ ‘మిస్టర్ అన్ క్లీన్’ గా అవతరించాడు. 2జి కుంభకోణం గురించి తనకు తెలియదని బుకాయించి తప్పించుకున్న ప్రధాని ‘బొగ్గు కుంభకోణం’ లో కన్నంలో వేలితో అడ్డంగా దొరికిపోయాడు. బొగ్గు గనులను వేలం వేయాలన్న ప్రతిపాదన 2004 లో స్వయంగా చేసి కూడా ఆ ప్రతిపాదన చట్టం రూపం దాల్చకుండా ప్రధాని తొక్కి పెట్టిన వైనాన్ని రాజ్యాంగ సంస్ధ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) తన నివేదికలో ఎండగట్టింది. ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చే మార్గాన్ని తొక్కి పెట్టిన ప్రధాని నిర్వాకం వల్ల ఖజానాకి 10.67 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ముసాయిదా నివేదికలో పేర్కొన్న కాగ్ అంతిమ నివేదికలో నష్టాన్ని 1.86 లక్షల కోట్లకు తగ్గించింది. ప్రభుత్వ రంగ కంపెనీలను జాబితానుండి తలగించడంతో పాటు, అండర్ గ్రౌండ్ గనులకు సంబంధించి తగిన సమాచారం లేనందువల్ల నష్టం అంచనా తగ్గిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.

ఎలా జరిగింది?

2006 నుండి 2009 వరకూ బొగ్గు గనుల శాఖ ప్రధాని మన్మోహన్ చేతిలోనే కొనసాగింది. బొగ్గు శాఖ మంత్రి గానే కాక ప్రధాన మంత్రిగా కూడా బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ పాత్ర ఉందని కాగ్ ప్రస్తావించిన వివిధ అంశాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ద్వారా నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులను కేటాయించే పద్ధతి కాకుండా వేలం వేయడం (competitive bidding) ద్వారా కేటాయించడానికి 14 అక్టోబర్ 2004 తేదీన ప్రధాని పర్యవేక్షణలో జరిగిన సమావేశం నిర్ణయించిందని కాగ్ వెల్లడి చేసింది. 28 జూన్ 2004 వరకు అందిన దరఖాస్తుదారులకు ఎటువంటి ఫీజు లేకుండా నామినేషన్ పద్ధతిలో గనులను కేటాయించాలని, ఆ తర్వాత అందిన దరఖాస్తులకు వేలం ద్వారా కేటాయించాలని నిర్ణయం జరిగింది. అయితే ఈ నిర్ణయం ఇప్పటికీ అమలు కాలేదు. అమలుకు మామూలుగా ఏమీ అడ్డంకులు లేనప్పటికీ, లేని అడ్డంకులను ప్రధాన మంత్రి కార్యాలయమే సృష్టించిందని కాగ్ ఆక్షేపించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలు చేయడం మాని స్క్రీనింగ్ కమిటీ ద్వారానే 155 బొగ్గు బ్లాకులను ప్రభుత్వ, ప్రవేటు కంపెనీలకి కేటాయించడం కొనసాగించారని తెలిపింది.

2005 జూన్ లో ప్రధాన మంత్రి కార్యాలయం వేలం పద్ధతికి మొదటి అడ్డంకిని సృష్టించింది. కాగ్ ప్రకారం బొగ్గు బ్లాకులు కలిగి ఉన్న రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణించడానికి వీలుగా ‘వేలం పద్ధతి’ లో ‘బొగ్గు మరియు లిగ్నైట్’ గనులు కేటాయించాలని బొగ్గు గనుల శాఖ కేబినెట్ నోట్ లో చేసిన ప్రతిపాదనను ‘సవరిస్తామని’ 2005 ఆగస్టు నాటి పి.ఎం.ఒ (ప్రధాన మంత్రి కార్యాలయం) నోట్ పేర్కొంది. బొగ్గు శాఖ సమావేశంలో వేలం పద్ధతిని ప్రతిపాదించడం, పి.ఎం.ఒ నోట్ లో ఆ ప్రతిపాదనను సవరిస్తానని చెప్పడం ‘మిస్టర్ క్లీన్’ గారి విన్యాసంగా గమనించవచ్చు. ఆ తర్వాత మరో అడ్డంకి ఆ నోట్ లోనే ప్రవేశపెట్టింది. వేలంలోకి బొగ్గుతో పాటు ఇతర గనులను కూడా వేలం పద్ధతిలోకి వచ్చే విధంగా “మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ (ఎం.ఎం.డి.ఆర్) 1957” ను సవరించాలని నోట్ లో పేర్కొంది. ప్రభుత్వానికీ, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం వదిలిపెట్టి అవకాశం వచ్చిన చోటల్లా ప్రవేటు కంపెనీలకు లబ్ది చేకూర్చే విధంగా సరికొత్త అడ్డంకులను రంగంలోకి తెచ్చినట్లు ఇక్కడ గమనించవచ్చు. 1957 చట్టాన్ని సవరించాలన్న క్లాజును అదనంగా చొప్పించడంతో ‘వేలం పద్ధతి’ నిర్ణయాన్ని అమలు చేయకుండా మరింత వాయిదా వేశారు.

ప్రతిపాడిన నిర్ణయాన్ని ఓ వైపు వాయిదా వేస్తూ మరోవైపు నామినేషన్ పద్ధతిలో ఇష్టానుసారం (2జి తరహాలో) బొగ్గు గనుల్ని కంపెనీలకి కట్టబెట్టారు. పారదర్శకత లేకుండా చేసిన కేటాయింపుల వల్ల ఖజానాకి వచ్చిన నష్టాన్ని కాగ్ కనిష్ట అంచనాలతో సగటు ధరను పరగణిస్తూ అంచనా వేసింది. ఒక్కో బ్లాక్ కి సంబంధించిన లెక్క వేసేటపుడు అదే రకమైన బొగ్గు గనిలో ప్రభుత్వ రంగ కంపెనీ కోల్ ఇండియా కు వాస్తవంగా ఉత్పత్తి ఖర్చులు కేటాయింపులు జరిగిన సంవత్సరంలో ఎంత పడుతున్నదీ సి.ఏ.జి లెక్కించింది. కోల్ ఇండియా అమ్మకం ధరకూ, ఉత్పత్తి ఖర్చుకూ మధ్య తలెత్తిన తేడాను 90 శాతం తో సి.ఏ.జి హెచ్చించింది. అంటే అసలు నష్టంలో 90 శాతం వరకే సి.ఏ.జి పరిగణనలోకి తీసుకుంది. ఆ విధంగా వచ్చిన తేడా ఆ నిర్ధిష్ట బ్లాక్ ను కొనుగోలు చేసిన కంపెనీకి చేకూరిన విండ్ ఫాల్ గెయిన్ (గాలివాటున వచ్చిన లాభం) గా సి.ఏ.జి లెక్క తేల్చింది. అంచనా వేసిన నిల్వల కంటే పది శాతం తక్కువగా బొగ్గు లభ్యం అవుతుందన్న అంచనాతో సి.ఏ.జి తొంభై శాతం మాత్రమే పరిగణలోకి తీసుకుంది. సి.ఏ.జి అంచనా వేసిన తేడా, బొగ్గు కంపెనీలకు మామూలుగా వచ్చే లాభాల కంటే అదనమని గుర్తించాలి. మైనింగ్ ప్లాన్, బొగ్గు వెలికి తీయడానికి అయ్యే ఖర్చులు, అమ్మకం సమయంలో బొగ్గుకి ఉన్న వాస్తవ ధర, బొగ్గు క్వాలిటీ.. వీటన్నింటిపైనా ఆధారపడి వాస్తవ విండ్ ఫాల్ గెయిన్ ఉండవచ్చని సి.ఏ.జి పేర్కొంది. అంటే తాను లెక్కించిన దాని కంటే అధిక విండ్ ఫాల్ గెయిన్ కంపెనీలు పొందవచ్చని సి.ఏ.జి సూచించింది.

కంపెనీలకు కేటాయించిన ప్రతి ఒక్క బ్లాకుకు చెందిన ‘జియోలాజికల్ రిపోర్టు’ ను పరిశీలించిన సి.ఏ.జి ఇలా కేటాయించిన బొగ్గు నిల్వల మొత్తం 33,169 మిలియన్ టన్నులు ఉందని వెల్లడించింది. ఈ బొగ్గుతో 150,000 మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని పరిశ్రమల వర్గాల ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా గత మార్చిలో (ముసాయిదా నివేదిక లీక్ చేస్తూ) తెలిపింది. భారత దేశం మొత్తం మీద ఇపుడు ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను మరో 50 సంవత్సరాలపాటు ఈ బొగ్గు నిల్వల ఉత్పత్తి చేస్తాయని సదరు పత్రిక తెలిపింది. ప్రవేటు సంస్ధలకు ఈ కేటాయింపులవలన రు. 4.79 లక్షల కోట్లు, ప్రభుత్వ కంపెనీలకు రు. 5.88 లక్షల కోట్లు లబ్ది చేకూరిందని సి.ఏ.జి తన ముసాయిదా నివేదికలో తెలిపింది. అయితే ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా ప్రవేటు కంపెనీలకే బొగ్గు తవ్వకం కాంట్రాక్టులు ఇచ్చేస్తాయి. కనుక ప్రభుత్వ కంపెనీలకు విండ్ ఫాల్ గెయిన్స్ వల్ల అదనంగా చేకూరే లబ్ది పెద్దగా లెక్కలోనిది కాదని పత్రిక తెలిపింది.

“మిస్టర్ అన్ క్లీన్” మన్మోహన్

వేలం పద్ధతి అమలులోకి రావడానికి బొగ్గు శాఖ విధించిన డెడ్ లైన్ జూన్ 28, 2004. కాగ్ నివేదిక ప్రకారం జులై 2004 నుండి ఇప్పటివరకూ 155 బొగ్గు గనుల్ని ప్రధాని నేతృత్వంలోని ‘స్క్రీనింగ్ కమిటీ’ ద్వారా నామినేషన్ పద్ధతిన వివిధ ప్రభుత్వ, ప్రవేటు కంపెనీలకి కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అసలు పారదర్శకత లేదని, లక్ష్యం లేదనీ కాగ్ ఆక్షేపించింది. ఉన్నత స్ధానాల్లోని రాజకీయ నాయకులనుండీ, అధికారులనుండీ అనేక ఒత్తిడులు ఈ కేటాయింపుల వెనుక పని చేశాయని ఆరోపించింది. వేలం వేయాలంటూ జూన్ 2004 లో తీసుకున్న నిర్ణయం కేవలం పాలనాపరమయన నిర్ణయమేననీ, దాని అమలుకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులూ లేవనీ, జులై 2006 లో ‘లా అండ్ జస్టిస్’ మంత్రిత్వ శాఖ సమర్పించిన ‘లీగల్ ఒపీనియన్’ కూడా చెప్పిందని కాగ్ ఎత్తిచూపింది. అయినప్పటికీ పి.ఎం.ఒ దానికి మొగ్గు చూపలేదు. వేలం విధానానికి ప్రధాని కార్యాలయం ఎలా గండి కొట్టి వాయిదా వేసిందీ ‘ఫస్ట్ పోస్ట్’ సమకూర్చిన క్రింది అంశాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ కాగ్ నివేదికలో ఉన్నవే.

11 సెప్టెంబరు 2004: వేలం పద్ధతిలో సమస్యలు ఉన్నాయంటూ బొగ్గు శాఖకు పి.ఎం.ఒ ఒక నోట్ పంపింది.

1 నవంబరు 2004: కోల్ బ్లాకులు వేలం వేయడానికి ఆర్డినెన్స్ అవసరం లేదనీ, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఒక బిల్లు ద్వారా అవసరమైన సవరణ చేయవచ్చనీ పి.ఎం.ఒ ఆదేశాలు.

25 ఫిబ్రవరి 2005: బొగ్గు గనుల వేలం వేసే ప్రతిపాదన పై ముందుకు వెళ్ళరాదని ప్రధాని మన్మోహన్ ఆదేశాలు. వేలం వల్ల బొగ్గు గనుల కేటాయింపు మరింత ఆలస్యం అవుతుందన్న అభిప్రాయాలతో మన్మోహన్ పూర్తిగా ఏకీభవించడం వల్ల ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. నామినేషన్ పద్ధతిలో స్క్రీనింగ్ కమిటీ చేసే కేటాయింపుల్లో పారదర్శకత ఉండదన్న బొగ్గు శాఖ వాదనను కూడా మన్మోహన్ తిరస్కరించాడు. అంటే వేలం వదిలి పాత పద్ధతిలోనే కేటాయించాలని ప్రధాని తేల్చాడన్నమాట.

16 మార్చి 2005: అయినప్పటికీ బొగ్గు శాఖ కార్యదర్శి ‘వేలం పద్ధతి’ కోసం ప్రయత్నాలు కొనసాగించాడు. బొగ్గు గనుల కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలంటే వేలం తప్పని సరని కేబినెట్ నోట్ ను బొగ్గు మంత్రి మన్మోహన్ కి పంపాడు. ఈ నోట్ ని తాజాకరించి తనకు పంపాలని పి.ఎం.ఒ ఆదేశించింది.

9 ఆగస్టు 2005: వేలం పద్ధతి కుదరదనీ, స్క్రీనింగ్ కమిటీ ద్వారానే కేప్టివ్ మైనింగ్ కోసం బొగ్గు గనుల కేటాయింపులు కొనసాగాలని పి.ఎం.ఒ బొగ్గు శాఖకు పంపిన నోట్ లో స్పష్టం చేసింది. కొత్త వేలం విధానం ఆచరణలోకి వచ్చేదాకా బొగ్గు కేటాయింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

7 ఏప్రిల్ 2006: బొగ్గు గనులతో పాటు ఇతర ఖనిజ వనరులన్నీ వేలం విధానం కిందికి చేర్చేలా “మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ (ఎం.ఎం.డి.ఆర్) 1957” ను సవరించడం సముచితంగా ఉంటుందని పి.ఎం.ఒ సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇతర గనులతో  ముడి పెట్టి తద్వారా వేలం విధానాన్ని ఇంకా వాయిదా వేయించే ఎత్తుగడ ఇది.

27 ఏప్రిల్ 2006: రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో ఉన్నందున 1957 చట్టాన్ని సవరించే యోచనను మరోసారి సమీక్షించాలన్న బొగ్గు శాఖతో పి.ఎం.ఒ ఏకీభావం. దీనితో వృత్తం పూర్తయింది. వేలం విధానాన్ని ఆలస్యం చేసే పనిలో పి.ఎం.ఒ కి బొగ్గు శాఖ జతకలిసినట్లయింది.

ఎలా తగ్గింది?

ముసాయిదా నివేదికలో 10.67 లక్షల కోట్ల నష్టాన్ని (ప్రవేటు కంపెనీలకి 4.8 ల. కోట్లు) కాగ్ అంచనా వేయగా అంతిమ నివేదికలో దానిని 1.86 లక్షల కోట్లకు తగ్గించింది. ఈ తగ్గింపు ఎలా జరిగిందో తెలుసుకోవడం ఒకందుకు ఉపయోగం. కాగ్, మొదట పొరబాటున లెక్కించినట్లు ఈ తగ్గింపులో అనిపించినప్పటికీ అది నిజం కాదు. అండర్ గ్రౌండ్ గనుల కేటాయింపులకు సంబంధించి తనకు సమాచారం లేదని కాగ్ చెప్పినా, విచిత్రంగా, ఏయే కంపెనీలకు అండర్ గ్రౌండ్ గనులు కేటాయించారో జాబితా ఇచ్చింది. పైగా భూగర్భ బొగ్గు గనుల తవ్వకానికి ప్రవేటు కంపెనీలు అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తాయనీ తద్వారా మామూలుకంటే ఎక్కువ లాభాలను అవి పొందుతాయని కూడా చెప్పింది. కాగ్ నివేదికలోని ఈ అంతుబట్టని వైరుధ్యానికి అర్ధం ఏమిటో మునుముందు తెలుస్తుందేమో చూడాలి.

ముసాయిదా నివేదికలో ప్రభుత్వ రంగ కంపెనీలకు వచ్చే లాభాలను కూడా కలిపి లెక్కించడం, అంతిమ నివేదికలో ప్రభుత్వ కంపెనీలను తొలగించడం వల్ల నష్టం అంచనాలో కొంత తేడా వచ్చింది. కానీ ఈ తేడాలో పరిమితులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా తవ్వకాల కాంట్రాక్టులు ఇచ్చేదీ ప్రవేటు కంపెనీలకే. ఆ విధంగా ప్రభుత్వ కంపెనీలకి చేరవలసిన గాలివాటు లాభాలు స్వదేశీ, విదేశీ ప్రవేటు కాంట్రాక్టర్ల జేబుల్లోకే చేరతాయి. వీటిని కాగ్ పరిగణించలేదు. ముసాయిదాలో 31 మార్చి 2011 నాటి ధరల ప్రకారం  గాలివాటు లాభాలను లెక్కించారనీ, అంతిమ నివేదికకి వచ్చేసరికి కేటాయింపులు జరిగినప్పటి ధరలు పరిగణించారనీ అందువల్ల కూడా అంచనా తగ్గిందని కొన్ని పత్రికలు తెలిపాయి. కానీ ఆ విధంగా చూసినప్పటికీ నష్టం 6.31 లక్షల కోట్లని ముసాయిదా నివేదికే చెప్పింది. అందువల్ల ఈ కారణానికి కూడా పరిమితులున్నాయని అర్ధం అవుతున్నది. 

నష్టం అంచనా తగ్గుదలకి చెబుతున్న మరో కారణం సమాచారం లేకపోవడం. ముసాయిదాలో 76 ప్రవేటు కంపెనీలని కాగ్ చెబితే అంతిమ నివేదికలో 57 కంపెనీలనే ఉంచింది. ఈ 57 కంపెనీలకి ఓపెన్ కాస్ట్ గనులు కేటాయిస్తే మిగిలిన 19 కంపెనీలకి భూగర్భ గానులని కేటాయించారని కాగ్ చెప్పింది. భూగర్భ గనులకి సంబంధించి ఆధారపడదగిన డేటా అందుబాటులో లేదనీ, అందువల్ల 19 కంపెనీలకి చేకూరే గాలివాటు లాభాలని లెక్కించలేదని చెప్పింది. అంటే తెలియకపోవడం వల్ల అంచనా తగ్గింది తప్ప నష్టం జరగలేదని భావించడం వల్ల కాదన్నమాట. అయితే భూగర్భ గనుల్లో బొగ్గు నాణ్యమైనదనీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రవేటు కంపెనీలు అధిక లబ్ది పొందుతాయనీ కాగ్ చెప్పకుండా ఉండలేకపోయింది.

సమర్ధనలు, బుకాయింపులు

ముసాయిదా నివేదిక లీక్ అయినప్పటినుండీ ప్రభుత్వమూ, ప్రవేటు కంపెనీలు అనేక బుకాయింపులకు దిగాయి. ‘ప్రభుత్వ కంపెనీల కంటే మేమే బాగా బొగ్గు తవ్వుతాము, దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తాము’ అని కొన్ని ప్రవేటు కంపెనీలు చెప్పుకోగా, గాలివాటు లాభాలు ఒత్తిడే అని బుకాయించాయి. ప్రభుత్వ కంపెనీలు లాభసాటి కాదని వదిలేస్తే మేము తీసుకున్నామని జిందాల్ లాంటి కంపెనీలు ఫోజులు పెట్టాయి. కొన్ని చిన్న, మధ్య రకం కంపెనీలు గాలివాటు లాభాలు నిజమేనని అంగీకరించాయి. చాలా బ్లాకులు విద్యుత్, స్టీల్ కంపెనీలకు కేటాయించినందున ఆ బొగ్గుని బహిరంగ మార్కెట్లో వ్యాపారం చేసుకోవడం కుదరదని బొగ్గు మంత్రిత్వ శాఖ చెపుతోంది. విద్యుత్ రేట్లను నియంత్రించే వ్యవస్ధలు ఉన్నందున సి.ఏ.జి లెక్కించిన విండ్ ఫాల్ గెయిన్స్ అంత ఉండకపోవచ్చని బొగ్గు శాఖ చెబుతోంది. స్టీల్, సిమెంటు విషయానికి వస్తే మార్కెట్లలో పోటీ పడవలసి ఉన్నందున ఆ మేరకు కంపెనీలు తమ లాభాలను వినియోగదారులకు అందిస్తాయని ఆ శాఖ చెబుతోంది.

బొగ్గు శాఖ చెప్పేవేవీ వాస్తవం లో జరుగుతున్నవి కావు. మార్కేట్ పోటీవల్ల ధరలు తగ్గడం, జనం లబ్ది పొందడం ఇంతవరకూ జరగలేదని నానాటికీ పేరుగున్న ఇళ్ల నిర్మాణ ఖర్చులే చెబుతున్నాయి. స్టీలు, సిమెంటు ధరలు ప్రతి సంవత్సరం అంతకంతకూ పెరగడమే తప్ప కనీసం నిలకడగా ఉన్న దాఖలాలే లేవు. ఒకే సంవత్సరం చూసుకున్నా ప్రతి సీజన్ కీ ధరలు పెరుగుతూ పోతాయి. కంపెనీలకు వచ్చే ఆయాచిత లాభాలు వినియోగదారుల వరకూ రావడం అన్నది ఒట్టిమాట. పెట్రోల్, డీజెల్ ధరలు అంతర్జాతీయ మార్కేట్లో తగ్గినపుడు సదరు తగ్గుదలను ప్రజలకు చేర్చే పనిని ప్రభుత్వాలే చేయడం లేదు. అలాంటిది ప్రవేటు కంపెనీలు ప్రభుత్వ తప్పిదం ద్వారా తమకు చేకూరే ఆయాచిత లాభాలను ప్రజలకు చేరుస్తాయా? అదీ కాక ప్రభుత్వ ఖజానాకి వస్తున్న నష్టాన్ని రాబట్టుకోవడం, చేసిన తప్పులను సరిదిద్దుకోవడం మాని ప్రవేటు కంపెనీలకు అదనపు లాభాలు చేకూరడాన్ని సమర్ధించుకోవడం తగని పని. అది ప్రజా స్వామ్య ప్రభుత్వాలు చేయదగిన పని కాదు. గాలి జనార్ధన రెడ్డికి కేటాయించిన ఓబులా పురం బొగ్గు గనులు వాస్తవానికి విదేశాలకు తరలించి అమ్ముకోవడానికి కాదు. కడప జిల్లాలో తలపెట్టిన ‘బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ’ కోసం ‘క్యాప్టివ్ మైనింగ్ క్లాజీ’ విధించి అవి కేటాయించారు. వాస్తవంలో జరిగినదేమిటి? గాలి గారు బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ అసలు కట్టనే లేదు. ఫ్యాక్టరీ కట్టకుండానే ఇనుప గనుల్ని తవ్వుకుని చైనాకి అమ్మేశాడు. లబ్ది పొందింది గాలి కుటుంబం, ఢిల్లీ నుండి హైద్రాబాద్ వరకూ అతని వెనుక ఉన్న దళారీ శక్తులు  మాత్రమే. విలువైన ఇనుప గనులు భారతీయులు కట్టుకున్న ఇళ్లకేవీ ఉపయోగపడకపోగా చైనాకి తరలివెళ్ళాయి.

బొగ్గు శాఖ వాదనలు సి.ఏ.జి కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. “బొగ్గు సహజ వనరు. ప్రవేటు వారికి అప్పజెప్పవలసి వస్తే వారి మధ్య పోటీ నిర్వహించి ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికి అమ్మాలి. (అంటే వేలం వెయ్యాలి). వేలం వెయ్యడం ద్వారా వ్యవస్ధలో పారదర్శకత, లక్ష్య శుద్ధి ఏర్పడతాయి. నిజానికి 2 జి స్పెక్ట్రమ్ విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు చేసిన పరిశీలన సి.ఏ.జి అభిప్రాయం తో ఏకీభవిస్తోంది కూడా. సహజ వనరులపై ప్రభుత్వానికే యాజమాన్యం ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. సహజ వనరులకు ప్రభుత్వం ఒక ట్రస్టీగా, కాపలాదారుగా వ్యవహరించాలని కోర్టు పేర్కొన్నది” అని సి.ఏ.జి బొగ్గు శాఖ వాదనను తిప్పి కొట్టింది. “ప్రవేటు కంపెనీలు వనరులను పెంపొందించవచ్చు (augment). కానీ దాని లక్ష్యం ప్రజల ప్రయోజనాలను నెరవేర్చేదిగానే ఉండాలి. నిజాయితీ, బాధ్యత లతో ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రభుత్వంగానీ, దాని ఏజన్సీలు లేదా ఉపకరణాలుగా వ్యవరించే సంస్ధలు గానీ ప్రవేటు సంస్ధలకు లబ్ది చేకూర్చితే ఆ చర్యలకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి. పారదర్శకత, విచక్షణ పాటించాలి. అటువంటి విధానాలకు లక్ష్య శుద్ధి ఉండాలి. దేశ పౌరుల తరపున ప్రభుత్వం వనరులపై చట్టబద్ధమైన యాజమాన్యం కలిగి ఉంటుంది. సహజ వనరులను తక్కువ ధరలకు ప్రవేటు వారికి అప్పజెపితే అది నేరుగా వినియోగదారులకు చేరేదిగా ఉండాలి” అని సి.ఏ.జి బొగ్గు శాఖ వాదనలు తిరస్కరించింది. విద్యుత్ ధరలను రెగ్యులేటరీ కమిషన్ నియంత్రిస్తుందన్న బొగ్గు శాఖ వాదనను కూడా సి.ఏ.జి తిరస్కరించింది. ఆ నియంత్రణలు వ్యాపార కంపెనీలకు వర్తించవన్న సంగతిని గుర్తు చేసింది. బొగ్గు శాఖ ప్రధాని మన్మోహన్ ఆధీనంలో ఉన్న సంగతి ఇక్కడ మరొకసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.

జూన్ 2004 లో బొగ్గు మంత్రిత్వ శాఖ తనతో పంచుకున్న అభిప్రాయాలను కూడా సి.ఏ.జి గుర్తు చేసింది. “కోల్ ఇండియా సంస్ధ తన బొగ్గు గనులను తవ్వి తీసిన బొగ్గును సరఫరా చేసే ధరకూ, క్యాప్టివ్ బొగ్గుగనులు పొందిన కంపెనీలకు బొగ్గు ఉత్పత్తి కోసం అవుతున్న ఖర్చుకూ భారీ తేడా ఉంది. ఆ విధంగా కంపెనీలకు ‘విండ్ ఫాల్ గెయిన్స్’ భారీగా సమకూరుతుంది. ఈ గెయిన్స్ లో కొంత భాగాన్ని ప్రభుత్వం వాస్తవంగా వేలం వేయడం దారా పొందవలసి ఉంది” అని బొగ్గు శాఖ తనతో అభిప్రాయాలూ పంచుకుంటూ వ్యాఖ్యానించిందని సి.ఏ.జి గుర్తు చేసింది. ఈ విధంగా వేలం వేయడంద్వారా విండ్ ఫాల్ గెయిన్స్ ని ప్రభుత్వమే సొంతం చేసుకునేందుకు తగిన విధాన పరమైన ప్రక్రియ జూన్ 28, 2004 తేదీన ప్రారంభం అయినప్పటికీ ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని సి.ఏ.జి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది.

కాగ్ పై బురద జల్లుడు

గుర్తొచ్చినప్పుడల్లా రాజ్యాంగం పై గౌరవం ప్రకటించుకునే రాజకీయ నాయకులు వారి దుర్మార్గాలను కొద్దో, గొప్పో ఎండగడుతున్న ఇతర రాజ్యాంగ సంస్ధలపైన బురద జల్లడమే పనిగా పెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద సంఖ్యలు చెప్పి ‘సంచలనం’ కోసం కాగ్ ప్రయత్నిస్తున్నదని వారు చేసే ఆరోపణల్లో ఒకటి. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కు కాగ్ కి లేదనడం మరో బుకాయింపు. 2జి వివాదంలో గానీ, ఆరుబయట పాడైపోతున్న తిండి గింజలను ఉచితంగా పేదలకు పంచాలని చెప్పినపుడు గానీ కోర్టులపైన ప్రధాని మన్మోహన్ ఇదే వాదన చేశాడు. ఆయా సంస్ధలు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పడం మాని రాజ్యాంగం అంటూ గాలి సూత్రాలు వల్లించడం ప్రజలపట్ల వహించవలసిన బాధ్యనుండి తప్పించుకోవడానికే. ఆపాదమస్తకమూ తమకంటిన బురదను కొంత తమ విమర్శకులకు అంటిస్తే ‘నీకూ బరద అంటింది గనక, నేను కడుక్కోను’ అని చెప్పడం ఇది.

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల వల్ల 1.76 లక్షల ఆదాయం గల్లంతయిందని కాగ్ చెప్పినపుడు కూడా కాగ్ పైన ఇదే రకం బురదని కాంగ్రెస్ చల్లింది. 2జి కుంభకోణంపై ఓ పక్క సుప్రీం కోర్టు సీరియస్ గా విచారణ మొదలు పెడితే మరో పక్క కపిల్ సిబాల్ లాంటి జోకర్ మంత్రులు 2జి కేటాయింపుల్లో నష్టమే లేదు పొమ్మని కోర్టు చేత మొట్టికాయలు కూడా తిన్నాడు. మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన స్పెక్ట్రమ్ కేటాయింపులను కోర్టు రద్దు చేసి వేలం వేయాలని తీర్పు చెప్పాక ఇటీవల ప్రారంభ ధరని ఒక్కో 5 Megahertz బ్లాక్ కి 14,000 కోట్లుగా కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వేలానికి ఉంచింది 52.73 Megahertz. అంటే కేంద్ర కేబినెట్ ప్రారంభ ధరే 1,47,644 కోట్లు. కాగ్ లెక్క ప్రకారం ఇది 1,76,645 కోట్లు. తేడా దాదాపు 29,000 కోట్లు మాత్రమే. కపిల్ సిబాల్ గారి ‘జీరో లాస్’ వాదనా, పెద్ద సంఖ్యలతో ‘సంచలనం’ సృష్టించేందుకు కాగ్ ప్రయత్నిస్తున్నదన్న వాదనా ఎంత మోసపూరితమో దీనిద్వారా అర్ధం అవుతుంది.

ఇక ప్రభుత్వ రాజ్యాంగ వీధుల్లో కాగ్ జోక్యం చేసుకుంటుందన్న ఆరోపణను ఆగస్టు 20 న ‘ది హిందు’ తో మాట్లాడుతూ కాగ్ అధికారి ఒకరు శక్తివంతంగా తిప్పికొట్టాడు. ‘క్రోనీ కేపిటలిజం’ కి సంబంధించిన వ్యాపారాలకు ముంగింపు పలకడమే తమ విధి అని తేల్చి చెప్పాడు. తద్వారా ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వదేశీ, విదేశీ కంపెనీల ద్వారా పోగుబడుతున్న విచ్చలవిడి పెట్టుబడులు ‘క్రోనీ కేపిటలిజం’ లో భాగం తప్ప దేశ ప్రజలకి ఏ మాత్రం లాభకరం కాదని కాగ్ స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తు చేస్తూ, సదరు వైఫల్యానికి బాధ్యులను గుర్తించి తప్పులను సవరించుకునే పని వదిలి తనపై వ్యంగ్య బాణాలు వదలం వేయడమని ప్రశ్నించింది. ప్రభుత్వం అందజేసిన లెక్కల ద్వారానే తాము నష్టం లెక్కించాము తప్ప తమ ఊహాలతో గాలిలోనుండి సృష్టించలేదని సోదాహరణంగా వివరించింది. బొగ్గు కేటాయింపులను స్క్రీనింగ్ కమిటీ ద్వారా కాక వేలం ద్వారా చేయాలని చెప్పింది తాను కాదనీ, బొగ్గు శాఖ కార్యదర్శే దానిని ప్రతిపాదించగా ప్రధాని స్వయంగా ఆమోదించిన విధానమనీ చెబుతూ ప్రభుత్వ విధానంలో తాను చొరబడిందేక్కడ అని ప్రశ్నించింది. స్క్రీనింగ్ కమిటీ ద్వారా నామినేషన్ కేటాయింపులు చేసే విధానంలో పారదర్శకత లేదనీ, వేలం వేయడం సరైనదని బొగ్గు కార్యదర్శి చేసిన ప్రతిపాదనను ఆమోదించి కూడా ప్రధాని ఆలస్యం చేయడం వల్లనే కంపెనీలకు గాలివాటు లాభాలు సమకూరాయని చెప్పిన సంగతిని గుర్తు చేసింది. 2జి విషయంలో కూడా మొదట ప్రధాని, ఆయనను అనుసరించి ఆర్ధిక శాఖ కార్యదర్శి 2జి స్పెక్ట్రం వేలం వేయాలని వాదించారనీ, దానిని మంత్రి రాజా విస్మరించడం వల్లనే నష్టం వచ్చింది తప్ప తాను ఊహించింది కాదని గుర్తు చేసింది.

ప్రభుత్వ ప్రగతిపై తాము ఇంకా 150 ఆడిట్ నివేదికలు వెల్లడించే పనిలో ఉన్నామని కాగ్ అధికారి మరో బాంబు పేల్చాడు. కాగ్ అధిపతి వినోద్ రాయ్ మే 2013 లో పదవి విరమణ చేయనున్నాడనీ ఆలోపు ఈ నివేదికలన్నీ వెలువడతాయని ఆయన స్పష్టం చేశాడు. “ప్రతి రంగంలోనూ ప్రభుత్వ పాలనా వైఫల్యం ఒక విశిష్ట రోగంగా మారింది. దానివల్ల ప్రభుత్వంపై సానుకూల నివేదికలు తయారు చేయడం మాకు అసాధ్యంగా మారింది” అని కాగ్ అధికారి తెలిపాడు.

చెరిగిపోతున్న ప్రభుత్వ, ప్రవేటు విభజన రేఖ

భారత దేశంలో ప్రభుత్వ కంపెనీలకీ, ప్రవేటు కంపెనీలకి ఉన్న విభజన రేఖ నానాటికీ చెరిగిపోతున్న విషయాన్ని గుర్తించాలి. కొద్ది పాటి మూలధనంతో ప్రభుత్వ రంగ పరిశ్రమలను మొదటినుండీ గణనీయ స్ధాయిలో దళారీ పెట్టుబడిదారులు నియంత్రిస్తూ వచ్చారు. నూతన ఆర్ధిక విధానాల అండతో ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ వచ్చింది. పైకి దేశీయ ప్రభుత్వ, ప్రవేటు రంగ కంపెనీలు గా కనపడినా ఇందులో సామ్రాజ్యవాద పెట్టుబడుల ఆధిపత్యం నానాటికీ చిక్కనవుతోంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలలో మూలధనంలో విదేశీ బహుళజాతి కంపెనీల వాటా క్రమ క్రమంగా పెంచుతున్నట్లే మాన్యుఫాక్చరింగ్, ముడి సరుకుల ప్రాసెసింగ్, సేవలు తదితర రంగాల్లో సైతం సామ్రాజ్యవాద పెట్టుబడులను నేరుగా ప్రవేశపెడుతున్నారు. సామ్రాజ్యవాదుల పరోక్ష నియంత్రణ నుండి ప్రత్యక్ష నియంత్రణ వైపుకి ప్రవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వ కంపెనీలని కూడా నెడుతున్నారు. ఈ పరిస్ధితికి బొగ్గు కంపెనీలు మినహాయింపు కాదని వేరే చెప్పనవసరం లేదు.

2 జి స్పెక్ట్రమ్ ని ప్రారంభంలో కొనుగోలు చేసినవారు కూడా భారత కంపెనీలే ప్రభుత్వం నుండి లైసెన్సు లు పొందిన కొద్ది కాలానికే అవి విదేశీ కంపెనీలకి స్పెక్ట్రమ్ ని అధిక ధరలకు అమ్ముకుని పెద్ద ఎత్తున లాభాలు పొందాయి. స్పెక్ట్రమ్ లైసెన్సులు పొందిన కంపెనీల్లో అధిక కంపెనీలకు టెలీ కమ్యూనికేషన్ల రంగంలో ఏ మాత్రం అనుభవం లేనివి. దానికి కారణం అవి ఏవో ఒక బడా కంపెనీకి బినామీ కంపెనీలు కావడమే. ఊరూ పేరు లేని కొత్త కంపెనీలకు స్పెక్ట్రమ్ లైసెన్సులు సంపాదించిన బడా కంపెనీలు అనంతరం ఆ కంపెనీలను తామే కొనుగోలు చేసినట్లు నాటకం ఆడాయి. అదీ కాక బొగ్గు, విద్యుత్, స్టీల్ కంపెనీల విషయానికి వస్తే ప్రవేటు కంపెనీలేవీ ఒకే ఒక వ్యాపార కుటుంబం ఆధీనంలో లేవు. లేదా మొత్తంగా భారతీయ కంపెనీల ఆధీనంలోనే ఉన్న సంస్ధలు కావు. ప్రతి భారతీయ ప్రవేటు కంపెనీలోనూ విదేశీ కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. విదేశాలకు ముఖ్యంగా అమెరికా, యూరప్ లకు చెందిన ప్రవేటు మానుఫాక్చరింగ్ కంపెనీలే కాక వాల్ స్ట్రీట్ కి చెందిన బడా బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు వీటిలో ద్రవ్య పెట్టుబడులను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను వాల్ స్ట్రీట్, యూరప్ ల ద్రవ్య కంపెనీలే గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న విషయం దృష్టిలో పెట్టుకున్నట్లయితే బొగ్గు గానుల్ని ఆయాచితంగా పొందిన కంపెనీల ద్వారా లబ్ది పొందేదేవరో ఇట్టే అర్ధం అవుతుంది. భారత దేశంలో మారు మూల పల్లెలకు వ్యాపించిన మైక్రో ఫైనాన్స్ కంపెనీల లో సైతం వాల్ స్ట్ఱీట్ కంపెనీల ద్రవ్య పెట్టుబడులు ఉన్న నేపధ్యంలో వాల్ స్ట్రీట్ కంపెనీల దోపిడీ హస్తాలు ఆంద్ర ప్రదేశ్ లోని మారు మూల వీధుల్లోకి కూడా చొచ్చుకు వచ్చాయని అర్ధం కాగలదు.

బొగ్గు గనులను పొందిన ప్రభుత్వ కంపెనీలలో ఎన్.టి.పి.సి ముఖ్యమైనది. బొగ్గు వ్యాపార కంపెనీ ఎం.ఎం.టి.సితో పాటు అనేక పశ్చిమ బెంగాల్ కంపెనీలు, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్ లకు చెందిన ఖనిజాలు, గనుల అభివృద్ధి సంస్ధలు బొగ్గు గనులు పొందినవాటిలో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్ధ తన గనులను గాలి జనార్ధన రెడ్డి, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అల్లుడు లాంటి ప్రవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పిన సంగతి మన ముందు ఉంది. కనుక ప్రభుత్వ సంస్ధలకు గనులు అప్పజెప్పినందువలన లాభపడేది ప్రజలో, దేశమో కాదని అర్ధం చేసుకోవచ్చు.

ఏతా వాతా తేలేదేమంటే భారత పాలకవర్గాల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే బొగ్గు కుంభకోణం అంతగా ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. బొగ్గు కుంభకోణం కాగ్ ద్వారానైనా  బైటికి రావడమే వార్త తప్ప పాలకుల అవినీతి వార్త కాదు. సామ్రాజ్యవాదులు, దేశీయ బడా పెట్టుబడుదారులు, భూస్వాములతో కూడిన ప్రవేటు ముఠా దేశాన్ని ఏలడమే ఒక పెద్ద అవినీతి కుంభకోణం. శతాబ్దాలుగా ప్రపంచం అంతటా సాగుతున్న ఈ అవినీతి ప్రవాహం దారి తప్పి పిల్లకాలువగా బైటికి వచ్చిన ఫలితమే 2జి, బొగ్గు కుంభకోణాల వెల్లడి. ఈ పిల్ల కాలువ త్వరలోనే ఎండిపోతుంది. లేదా సజావుగా మళ్ళీ ప్రవాహంలో కలిసిపోతుంది. ఎండిపోవడం, కలిసి పోవడం ఎలా జరుగుతుందన్నదే వార్త. మిస్టర్ (అన్) క్లీన్’, పార్లమెంటరీ అజాత శత్రువు ప్రణబ్, త్యాగ శీలి సోనియమ్మ, యువరాజు రాహుల్, టైగర్ మోడి.. ఇత్యాదులంతా అవినీతి ప్రవాహానికి కాపలాదారులే. త్యాగ శీలికి పలుకుబడి నశిస్తే యువరాజా దానిని పూరిస్తాడు. ‘సెక్యులరిజం’ కి కాంతి నశిస్తే అది ‘హిందూ జాతి సెంటిమెంటు’ నేనున్నానంటుంది. వీరి నాటకాలను ప్రజలే వమ్ము చేయాలి.

4 thoughts on “నిష్కళంకుడి బండారం బట్టబయలు, 1.86 ల.కోట్ల బొగ్గు కుంభకోణానికి మన్మోహన్ సారధ్యం

  1. సంకీర్ణ ప్రభుత్వంలో మద్దత్తునిస్తున్న పార్టీల కోరికలను కాదనలేకపోవడంవల్లే 2జి కుంభకోణం అన్న నిష్కళంకుడికి తను నిర్వహిస్తున్న శాఖలోనే భారీ కుంభకోణం బయట పడింతరువాత ఏమంటారో చూడాల్సిందే.

  2. ఇక అనేదేముంది? 2జి విషయంలో చెప్పినట్లు ‘నాకు తెలియదు’ అనలేడు గనక నోరు మూసుకుని ఉండడమే ఆయన చేయగలిగింది. కాకపోతే ప్రతిపక్ష బి.జె.పి కి కాంగ్రెస్ అవినీతి తిమింగలం ముందు ‘మేము చిన్న చేపలమే’ అని చెప్పుకునే అవకాశం దక్కింది.

  3. మన్మోహన్ నిష్కళంకుడేమీ కాదు. అతను గ్లోబలైజేషన్‌ని బలంగా సమర్థించడం వల్ల గ్లోబలైజేషన్ అనుకూల పత్రికలు అతనికి నిష్కళంకుడనే బిరుదు ఇచ్చాయి, అంతే. లాలూ ప్రసాద్ గ్లోబలైజేషన్‌ని బలంగా సమర్థించినా అతనికి కూడా అదే బిరుదు వస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s