“పీడన నుండి నన్ను కాపాడడానికి నిలబడ్డ దేశం బ్రిటన్ కాదు, జన్మ భూమి ఆస్ట్రేలియా కూడా కాదు… ఒక సాహసోపేతమైన స్వతంత్ర లాటిన్ అమెరికా దేశం.” ఈ మాటలన్నది జూలియన్ అస్సాంజ్. స్వీడన్ అనే ఒక స్కాండినేవియా దేశాన్ని ముందు నిలిపి దుష్ట శక్తి అమెరికా రెండు సంవత్సరాలుగా సాగిస్తున్న పీడననూ, వేధింపులనూ ఎదుర్కొంటున్న జూలియన్ అస్సాంజ్ అన్న మాటలు. ప్రజా స్వామ్యానికీ, మానవ హక్కులకూ, స్వేచ్ఛా సమానత్వాలకూ భూతల స్వర్గంగా జబ్బ చరుచుకునే ప్రపంచ పోలీసు చీకటి నీతిని నగ్నంగా ఆరేసిన వీరుడికి ‘రాజకీయ ఆశ్రయం’ ప్రకటించిన ఈక్వడార్ సాహసాన్ని ఉద్దేశిస్తూ అన్న మాటలు.
వలస పీడనలో దేశ దేశాలను శతాబ్దాల తరబడి చీకటిలో ముంచినా, ప్రజాస్వామ్యం పుట్టింది తన గడ్డమీదే అంటుంది బ్రిటన్. ఆర్ధిక స్వేచ్ఛ, విద్య, ఆరోగ్యం లతో పాటు పౌర హక్కుల పరిరక్షణలో తనంతటివారు లేదంటుంది ఆస్ట్రేలియా. మానవ నాగరికత సాధించిన స్వేచ్చా విలువలకు కట్టుబడి రాజ్యాధిపతుల ఉక్కు పరిష్వంగం నుండి ‘సమాచార స్వేచ్ఛ’ ను పరిరక్షించే కృషిలో నిమగ్నమైన ఒక ఒంటరి యోధుడికి ఈ పేరు గొప్ప ప్రజాస్వామ్య దేశం, పౌర హక్కుల ఛాంపియన్ ఎందుకూ అక్కరకు రాకుండా పోయాయి.
ప్రకృతి హక్కులను (Rights of Nature) చట్ట బద్ధంగా గుర్తించిన మొట్ట మొదటి దేశం, 300 యేళ్ళ స్పానిష్ వలస పాలన నుండి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం నినదించిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం, ‘అమెరికా కాంతి దీపం’ (Light of America) గా పేరొందిన చిన్న దేశం ఈక్వడార్. అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఆస్ట్రేలియా లతో వ్యాపార ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సదరు వ్యాపార ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ, అన్నింటినీ త్రోసిరాజని ‘జూలియన్ అస్సాంజ్’ కి రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికే కొర్రియా నిర్ణయించడం వెనుక జాగ్రత్తగా చేసిన మూల్యాంకనం ఉన్నదని ‘ది హిందూ’ కధనం దారా అర్ధమవుతోంది.
“తన భూభాగంపైన గానీ, ఇతర దేశాల్లోని రాయబార కార్యాలయాల ఆవరణలలో గానీ శరణు వేడిన ఎవరినైనా కాపాడే సాంప్రదాయ విలువలను అనుసరించి ఈక్వడార్ ప్రభుత్వం ‘పౌరుడు అస్సాంజ్’ కు రాయబార ఆశ్రయం కల్పించడానికి నిర్ణయించింది” అని ఈక్వడార్ విదేశీ మంత్రి రికార్డో ప్లాటినో ప్రకటించడానికి ముందు లండన్ లోని ఈక్వడార్ ఎంబసీ పై పోలీసులు దాడి జరిపారు. ఈ దాడి మున్నెన్నడూ ఎరగనిదనీ, సిగ్గు లేనిదనీ కొందరు అభివర్ణించారు.
ఎందుకు?
ముఖ్యమైన మిత్రులుగా, వాణిజ్య భాగస్వాములుగా ఈక్వడార్ భావించే అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఆస్ట్రేలియాలతో సంబంధాలను ప్రమాదంలో పడవేయగల పనికి ఆ దేశం ఎందుకు పూనుకుందన్నది అంతర్జాతీయ పరిశీలకులను తోలుస్తున్న ప్రశ్న. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఛాంపియన్ గా అవతరించడానికే ఈక్వడార్ అధ్యక్షుడు రాఫెల్ కొర్రియా ఈ పనికి సిద్ధపడ్డాడని కొందరు చెబుతున్నారు. అమెరికాని అవమానపరచడానికేనని మరి కొందరు, భయం లేని నాయకుడిగా ప్రపంచ రాజకీయ పటంపై స్ధానం పొందడానికేనని ఇంకొందరు వివరణ ఇస్తున్నారు.
అస్సాంజ్ వ్యవహారంలో కొర్రియా మొదటినుండీ అంత సీరియస్ గా లేడనీ, అస్సాంజ్ శరణు కోరినప్పటినుండీ అమెరికా, ఇంగ్లండ్, స్వీడన్ లనుండి ఆయన అనేక ఒత్తిడిలను ఎదుర్కొన్నాడనీ కొన్ని పరిశోధనా సంస్ధలు ఈ సందర్భంగా వెల్లడి చేశాయి. ఈక్వడార్ వాణిజ్య భాగస్వాములలో అమెరికాయే పెద్దదనీ, వేలాది ఈక్వడార్ ప్రజల ఉద్యోగాలపై ప్రభావం పడవేసే విధంగా ఆ దేశంతో వాణిజ్య ప్రాధాన్యతా సంబంధాలను తెంచుకుంటాననీ కొని సార్లు అమెరికా బెదిరించిన విషయాన్ని ఆ సంస్ధలు వెల్లడించాయి.
ఈ నేపధ్యంలో ఈక్వడార్ ప్రభుత్వం చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అస్సాంజ్ ఎదుర్కొంటున్న కేసులోని వాస్తవాలను పూర్తి స్ధాయిలో భిన్న కోణాలనుండి ఈక్వడార్ ప్రభుత్వం పరిశీలించినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా అస్సాంజ్ కేసు లో స్వీడన్ పోలీసులు అనుసరించిన పద్ధతులనూ, అందులోని లోపాలనూ ఈక్వడార్ పరిగణనలోకి తీసుకుంది. నైతిక సంబంధమైన అంశాలను కూడా పరిగణించింది.
ఈక్వడార్ రాయబార కార్యాలయ ఆవరణలోనే అస్సాంజ్ ను ప్రశ్నించడానికి అస్సాంజ్ తరపున వాదిస్తున్న న్యాయవాద బృందం అనేకసార్లు స్వీడన్ అధికారులకు అవకాశం ఇచ్చినప్పటికీ నిరాకరించిన విషయాన్ని ఈక్వడార్ ప్రభుత్వం ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. కేసుకు సంబంధించి ‘ప్రశ్నించడానికి’ మాత్రమే అస్సాంజ్ స్వీడన్ రావాలని స్వీడన్ ప్రభుత్వం, పోలీసులు మొదటినుండి చెబుతున్నారు. ఆ ప్రశ్నలకు లండన్ నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానం ఇస్తానని గతంలో కూడా అస్సాంజ్ అనేకసార్లు కోరినా స్వీడన్ పోలీసులు అంగీకరించలేదు. కేవలం ప్రశ్నించడానికే అయితే ఈ నిరాకరణలు ఎందుకని అస్సాంజ్, అతని న్యాయవాదుల నిలదీస్తున్నా సమాధానం లేదు.
“ఈ చర్య భేషుగ్గా ఉంది. చట్ట పరంగా సాధ్యమైనదే. కానీ స్వీడన్ అంగీకరించలేదు” అని ఈక్వడార్ విదేశీ మంత్రిత్వశాఖ ఎత్తిచూపింది. అస్సాంజ్ కేసులో తమ అవగాహన ఏమిటో చెప్పడానికి అమెరికా కూడా నిరాకరించిందనీ, ‘అది ఈక్వడార్, యునైటెడ్ కింగ్ డమ్ ల కు సంబంధించిన ద్వైపాక్షిక అంశం” అని అమెరికా అన్నదనీ ఈక్వడార్ ప్రత్యేకంగా ఎత్తిచూపింది. “అస్సాంజ్ వెల్లడి చేసిన సమాచారాన్ని కలిగి ఉన్న దేశం గానీ, దేశాలు గానీ అతనిపై ప్రతీకారం తీర్చుకుంటాయని బలమైన సాఖ్యం ఉన్నది. ఆ ప్రతీకారం అతని భద్రతకూ, సమగ్రతకూ, చివరికి అతని ప్రాణాలకు కూడా ప్రమాదం తీసుకురావచ్చు” అని ఈక్వడార్ ప్రకటన పేర్కొంది.
ఈ నేపధ్యంలో తనను రాజకీయంగా పీడిస్తున్నారన్న అస్సాంజ్ వాదన న్యాయబద్ధమైనదేనని ఈక్వడార్ విదేశీ మంత్రి పాటినో ప్రకటించాడు. “అతని భయాలు న్యాయబద్ధమైనవేనని రాజకీయ వేధింపులకు ఆయన ఎదుర్కోవచ్చన్న బెదిరింపులు నిజమేనని మేము నమ్ముతున్నాం. తన భూభాగంపైన గానీ, ఇతర దేశాల్లోని రాయబార కార్యాలయాల ఆవరణలలో గానీ శరణు వేడిన ఎవరినైనా కాపాడే సాంప్రదాయ విలువలను అనుసరించి ఈక్వడార్ ప్రభుత్వం ‘పౌరుడు అస్సాంజ్’ కు రాయబార ఆశ్రయం కల్పించడానికి నిర్ణయించింది” అని పాటినో ప్రకటించాడు.
ఈక్వడార్ ప్రభుత్వానికి బెదిరింపులు సాగించిన బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఈక్వడార్ తో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బ్రిటిష్ విదేశీ మంత్రి విలియం ప్రకటించినట్లుగా బి.బి.సి తెలిపింది. ఈక్వడార్ లో రాజకీయ ఆశ్రయం పొందినప్పటికీ జూలియన్ అసాంజ్ బ్రిటన్ వదిలి వెళ్లడానికి అంగీకరించేది లేదని, మరికొంత కాలం ఈ అంశం కొనసాగుతుందని అదే నోటితో హేగ్ ప్రకటించాడు. అయితే ఈక్వడార్ కు ఇంకెంతమాత్రం ఇబ్బందులు కలిగించకూడదన్న సదుద్దేశ్యంతో సోమవారం జూలియన్ ఆసాంజ్ రాయబార కార్యాలయం నుండి స్వచ్ఛందంగా బైటికి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. రాయబార కార్యాలయం నుండి బైటికి రావడం అంటే నేరుగా లండన్ పోలీసుల చేతుల్లోకి అటునుండి అటే స్వీడన్ వెళ్ళే విమానం మీదికి జూలియన్ వెళ్ళినట్లే.