మహా మహులుగా, తలపండిన రాజకీయ పోరాట యోధులుగా, వ్యవస్ధలను నడిపించే దేశ నాయకులుగా, ఆర్ధిక చిక్కుల పరిష్కర్తలుగా ఫోజులు కొట్టే దేశ దేశాల నాయకమ్మన్యులు సైతం అమెరికా ధూర్త రాజ్యం ముందు సాగిలపడి సలాములు కొడుతున్న పాడు కాలం ఇది.
సమస్త భూగోళాన్ని క్షణమాత్రంలో భస్మీ పటలం చేసే అణ్వస్త్ర శస్త్రాల బలిమితో విరగబడుతున్న అంకుల్ శామ్ దేశ దేశాల్లో సాగించిన రహస్య వికృత క్రీడలని, ‘వికీలీక్స్’ ద్వారా ప్రపంచ ప్రజల ముందు ఆరబోసిన డిజిటల్ యోధుడికి మాట సాయం చేయలేని రాజ్య ప్రభువులు ఎందుకని?
మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, ఎల్లలు లేని ప్రపంచ పౌరుడు, సరిహద్దులు లేని ప్రపంచ కుగ్రామం లాంటి ఉదాత్త భావనలు బహుళజాతి కంపెనీలకే తప్ప ప్రజానుభవంలోకి రాకుండానే చెరబట్టిన దుష్ట రాజ్యాల దుర్నీతికి ప్రబల సాక్ష్యం ‘జూలియన్ అస్సాంజ్’ పై పశ్చిమ రాజ్యాలు జమిలిగా సాగిస్తున్న కుత్సిత కుట్రలు.
‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ అనే ఓ మదోన్మత్త రాజ్యం (ప్రజలు కాదు) పై తలపడుతున్న అంతర్జాతీయ యోధుడు ‘జూలియన్ అస్సాంజ్’ కోసం బ్రిటిషర్లు చేస్తున్న ఆందోళన దృశ్యాలు ఇవి. లండన్ లోని ఈక్వడార్ రాయబార కార్యాలయంలో రక్షణ పొందుతున్న జులియన్ ను అరెస్టు చెయడానికి లండన్ పోలీసులు రెండు నెలలుగా కార్యాలయం ముందు రాత్రింబవళ్లు కాపాలా కాస్తున్నారు. పోలీసుల అరెస్టులను, బెదిరింపులను ఎదుర్కొంటూ బ్రిటిష్ నిరసనకారులు సైతం అక్కడే రాత్రింబవళ్లు నిరసనలో ఉన్నారు.
జులియన్ అస్సాంజ్ కి రాజకీయ ఆశ్రయం (political asylum) ఇవ్వడానికి నిర్ణయించినట్లు ఈక్వడార్ గురువారం ప్రకటించింది. ఈక్వడార్ స్వతంత్ర నిర్ణయం మింగుడు పడని బ్రిటన్ పాలకులు, అంతర్జాతీయ చట్టాలకు, జెనీవా కన్వెన్షన్ తీర్మానాలకు విరుద్ధంగా, రాయబార కార్యాలయం పై దాడి చేసయినా జులియన్ ను నిర్బంధిస్తామని నిస్సిగ్గుగా ప్రకటించింది. తద్వారా అంతర్జాతీయ న్యాయ సూత్రాలు పశ్చిమ రాజ్యాల ప్రయోజనాల కోసమే తప్ప కనీసం పశ్చిమ దేశాల ప్రజల కోసం కూడా కాదని నిర్ద్వంద్వంగా చాటుకుంది.
‘సమాచార స్వేచ్ఛ’ పరమావధిగా చేసుకుని అమెరికా, యూరప్ రాజ్యాల బెదిరింపులకు, ఒత్తిడులకు ఎదురోడ్డి నిలిచిన ఫలితమే జూలియన్ పై నేడు అమలవుతున్న నిర్బంధం. జూలియన్ ని చెరబట్టే దురుద్దేశంతో కుట్ర చేసి బనాయించిన ఆరోపణలను తిరస్కరించి అతనికి సహానుభూతిగా నిలవడం, క్రియాశీలక మద్దతు తెలపడం ప్రపంచ ప్రజల కర్తవ్యం.
అసాంజేను చూస్తుంటే, చిన్నప్పుడు చదివిన డేవిడ్ అండ్ గోలియత్ కథ గుర్తుకువస్తుంది. అతిబలిశాలి ఐన గోలియత్ ని డేవిడ్ అనే ఓ చిన్న పిల్లాడు మట్టికరిపించే ఆ కథ చిన్నప్పుడు చాలా ఫాసినేటింగ్ గా అనిపించేది. ప్రస్తుతం నిజజీవితంలో, ప్రపంచాన్ని శాశిస్తున్న అమెరికా అనే అ(ఉ)గ్ర రాజ్యాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న ఓ సాధారణ పాత్రికేయుడ్ని చూస్తుంటే అబ్బురంగా అనిపిస్తుంది.
@ cheekati: డేవిడ్ – గొలియాత్ పోలిక బాగుంది. మహాబలుణ్ణి చిన్న వడిసెలతో మట్టి కరిపించిన డేవిడ్ మల్లే అసాంజ్ కూడా అగ్రరాజ్యం ‘దాచేస్తే దాగని సత్యాలను’ సాహసోపేతంగా వెలికితీసి ప్రపంచానికి చాటుతున్న యోధుడు!