ఈక్వడార్ ధిక్కారం, బ్రిటన్ బెదిరింపుల మధ్య అస్సాంజ్ కి రాజకీయ ఆశ్రయం మంజూరు


దక్షిణ అమెరికా దేశం ‘ఈక్వడార్’ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ బెదిరింపులను ఎడమ కాలితో తన్నేస్తూ ‘జూలియన్ అస్సాంజ్’ కు ‘రాజకీయ ఆశ్రయం’ ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వీడన్ లో తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న జూలియన్ అస్సాంజ్ ను స్వీడన్ కూ, అక్కడి నుండి అమెరికాకు తరలించాలని అమెరికా, యూరప్ దేశాలు పన్నిన కుట్రను భగ్నం చేసే కృషిలో తన వంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. గొప్ప ప్రజాస్వామ్య దేశాలం అంటూ తమ జబ్బలు తామే చరుచుకునే కంపెనీ స్వామ్య రాజ్యాల గుట్టు మట్లను నగ్నంగా ఆరేసిన జూలియన్ ఒంటరి పోరాటానికి దన్నుగా నిలిచింది.

ప్రపంచ వ్యాపితంగా అమెరికా, యూరప్ దేశాలు సాగిస్తున్న దుర్మార్గాలను ‘వికీ లీక్స్’ ద్వారా ఎండగట్టినందుకు పశ్చిమ రాజ్యాలు జూలియన్ అస్సాంజ్ పై కక్ష కట్టాయి. అసలు కేసే లేదని స్వీడన్ అటార్నీ జనరల్ సైతం నిర్ధారించిన ఫిర్యాదును తిరగదోడి బ్రిటన్ వెళ్ళిపోయిన అస్సాంజ్ ను వెనక్కి రప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అభియోగాలు కూడా నమోదు చేయని కేసులో ‘కేవలం ప్రశ్నించడానికే’ అంటూ స్వీడన్ తరలించడానికి  సకల శక్తులూ ఒడ్డాయి. స్వీడన్ కు రప్పించి అక్కడినుండి అమెరికాకి అప్పజెప్పే కుట్ర సాగుతున్నదని జూలియన్, అతని అభిమానులు ఆరోపిస్తున్నారు. స్వీడన్, అమెరికాలు ఈ ఆరోపణను తిరస్కరిస్తున్నాయి. కానీ ధూర్త రాజ్యమైన అమెరికా మాటలు నమ్మడానికి వీలు లేదు.

‘రాజకీయ ఆశ్రయం’ కే నిర్ణయం

జూలియన్ ను స్వీడన్ కి అప్పగించాలని బ్రిటన్ సుప్రీం కోర్టు జూన్ నెలలో తీర్పు చెప్పింది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు కొడిగట్టడంతో జూలియన్ బ్రిటన్ లోని ఈక్వడార్ రాయబార కార్యాలయాన్ని శరణు వేడాడు. అంతర్జాతీయ రాయబార చట్టాల ప్రకారం ఆయా దేశాల అనుమతి లేకుండా రాయబార కార్యాలయాల్లోకి చొరబడి అక్కడ శరణు పొందుతున్నవారిని అరెస్టు చేయడం వీలుకాదు. దానితో గడువు ముగిసినప్పటికీ జులియన్ ను బ్రిటన్ పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అప్పటినుండీ ఆయన ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో కొనసాగుతున్నాడు. రాజకీయ రక్షణ కోసం జూలియన్ పెట్టుకున్న దరఖాస్తుపై ఈక్వడార్ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం కోసం ఇన్నాళ్లూ ప్రపంచం ఎదురు చూస్తోంది.

జూలియన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి ఈక్వడార్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోనున్నాడని గత రెండు రోజులుగా పత్రికలు ఊహాగానాలు ప్రారంభించాయి. వారి ఊహలను నిజం చేస్తూ జూలియన్ అస్సాంజ్ కి రాజకీయ రక్షణ (political asylum) ఇవ్వడానికి ఈక్వడార్ అధ్యక్షుడు ‘రాఫెల్ విసెంటే కొర్రియా డెల్గాడే’ నిర్ణయించాడని గురువారం ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన వెలువడక ముందే బుధవారం బ్రిటన్ ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. ఈక్వడార్ ప్రజలకు అధికారిక నోట్ పేరుతో ఆ దేశ ప్రభుత్వానికి ఈక్వడార్ లోని తమ రాయబార కార్యాలయం ద్వారా లేఖ పంపింది. ఈ లేఖ ద్వారా తమ ప్రభుత్వాన్ని బెదిరించడానికి బ్రిటన్ ప్రయత్నించడం పట్ల ఈక్వడార్ నిరసన తెలిపింది.

బ్రిటిష్ కాలనీ కాదు

“ఈరోజు యునైటెడ్ కింగ్ డమ్ ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా స్పష్టమైన బెదిరింపు అందుకున్నాం. జూలియన్ అస్సాంజ్ ను వారికి అప్పజెప్పకపోతే లండన్ లోని మా రాయబార కార్యాలయంపై దాడి చేస్తామని లేఖలో బెదిరించారు” అని ఈక్వడార్ విదేశీ మంత్రి రికార్డో పాటినో దేశ రాజధాని క్విటో లో చెప్పాడని బి.బి.సి తెలిపింది. “బ్రిటిష్ అధికారిక సందేశం లోని ప్రత్యక్ష బెదిరింపును మేము తిరస్కరిస్తున్నట్లు నొక్కి చెప్పదలిచాము. ఒక ప్రజాస్వామిక, నాగరిక, చట్టాలకు కట్టుబడి ఉండే దేశం నుండి ఇలాంటి బెదిరింపు రావడం సరైనది కాదు” అని పాటినో విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు.

“బ్రిటిష్ అధికారిక సందేశంలో ప్రకటించిన చర్య అమలు చేసినట్లయితే, దానిని అనంగీకార యోగ్యమైన, స్నేహ విరుద్ధమైన, శత్రుపూరితమైన చర్య గా ఈక్వడార్ పరిగణిస్తుంది. మా సార్వభౌమాధికారంపై దాడిగా పరిగణిస్తుంది. మేము స్పందించక తప్పని పరిస్ధితిని మాపై రుద్దినట్లు అవుతుంది. మేము బ్రిటిష్ కాలనీ కాదు” అని పాటినో తీవ్ర స్వరంతో స్పందించాడు. బి.బి.సి ప్రకారం ఈ ప్రకటన చేస్తున్నపుడు పాటినో మొఖంలో కోప ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించాయి. అంటే అదేదో మర్యాదకోసమో, దేశ సార్వభౌమాధికారం పైన గౌరవం ఉందని తమ ప్రజల ముందు నటించడానికో కాకుండా పాటినో హృదయాంతరాల నుండి సదరు ప్రకటన వెలువడిందని అర్ధం.

ఈ మధ్యకాలంలో ప్రపంచ రాజకీయ యవనికపై చూసి ఎరగని గొప్ప ‘మొనగాడి’ ప్రకటని ఇది. పశ్చిమ దేశాలు చెప్పే ప్రజాస్వామ్య కబుర్లు, వల్లించే అంతర్జాతీయ సూత్రాలు గాలి మూటలేనని నగ్నంగా విప్పి చూపుతున్న ప్రకటన ఇది. దేశీయ వనరులన్నింటినీ పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలకి అప్పజెప్పి వారు విదిల్చే ఎంగిలి కమీషన్ల కోసం ఆబగా ఎదురు చూసే పాలకులే మెజారిటీ మూడో ప్రపంచ దేశాలలో ఉన్న పరిస్ధితిల్లో ఒక విదేశీ (ఆస్ట్రేలియా) పౌరుడి కోసం ఈ మాత్రం సాహసాన్ని కనబరచడం మామూలు విషయం కాదు.

సామ్రాజ్యవాద ధిక్కారం

తన పెరటిదొడ్డిగా భావిస్తూ లాటిన్, మధ్య అమెరికాలలో, దశాబ్దాల తరబడి అమెరికా అనేక దుర్మార్గాలను, హత్యాకాండలను, ప్రత్యక్ష దోపిడీని సాగించింది. వీటన్నింటిని అనుభవించిన వెనిజులా, ఈక్వడార్, బొలీవియా, అర్జెంటీనా… తదితర  దేశాల పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రంగా నిలదొక్కునే ప్రయత్నాలు కొద్ది కాలంగా చేస్తున్నది. దానిలో భాగంగా డంకేల్ ఒప్పందం దరిమిలా ఉనికిలోకి వచ్చిన ‘ప్రపంచ వాణిజ్య సంస్ధ’ కు సాగిలపడడం తప్ప మరో మార్గం లేదని భారత దేశంతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల పాలకులు చెప్పిన మాటలు అబద్ధాలేనని రుజువు చేస్తూ సాపేక్షికంగా స్వతంత్ర  ఆర్ధిక వ్యవస్ధలను అభివృద్ధి చేసుకుంటున్నాయి.

స్వదేశీ ప్రజలను దోపిడీ చేసయినా సరే, ఆర్ధిక స్వతంత్రతను కోరుకునే వర్గాలు సార్వభౌమత కోసం పడే తపన ప్రతి అంశంలోనూ ప్రతిఫలిస్తుంది. అంతర్జాతీయ రాజకీయ రంగం అయినా, రాయబార సంబంధాలయినా, దేశీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలోనైనా తమదైన ప్రతిష్టను నిలుపుకోవాలన్న తపనను ఈ వర్గాలు కనబరుస్తాయి. ఇతర ఖండాలలోని ఇరాన్, సిరియా, గాజా, ఆఫ్ఘన్ తాలిబాన్, జింబాబ్వే, గడాఫీ లిబియా, ఉత్తర కొరియా (ఇటీవలి వరకూ) మొదలైన దేశాల పాలక వర్గాలు ఈ కోవలోని వారే. వీరిలో తర తమ బేధాలున్నప్పటికీ వీరు కనబరిచే స్వతంత్రతను భారత పాలకులు ఎన్నడూ చూపలేదు.

అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ, ఫ్రాన్సు, జపాన్ తదితర సామ్రాజ్యవాద దేశాల వద్ద బేరం ఆడే విషయంలో భారత పాలకులు ప్రదర్శించే కొంటె చేష్టలు వారి స్వతంత్రతకు తార్కాణం కాజాలవు. దేశ ఇనప గనులను సౌత్ కొరియా కంపెనీ పోస్కోకు అప్పజెప్పినా, బ్రిటిష్ మిట్టల్ కి అప్పజెప్పినా అది పరాధీనతే తప్ప స్వంతగా ఉక్కు పరిశ్రమ పెట్టి లాభాలన్నీ తామే మిగుల్చుకునే స్వతంత్రత కాదు. వాల్ స్ట్రీట్ పెట్టుబడులతో రిలయన్స్ కంపెనీ తవ్వి తీస్తున్న గ్యాస్, పెట్రోలియం ల లాభాలు చేరేది వాల్ స్ట్రీట్ బ్యాంకర్లకే. మెజారిటీ వాటాల రూపంలో, వడ్డీల రూపంలో, ఇంకా అనేకానేక రహస్య చెల్లింపుల రూపంలో లాభాలన్నీ పోగా రిలయన్స్ అంబానికి కమిషన్ మిగిలితే అది రిలయన్స్ అంబానీ స్వతంత్రత కాదు. పోస్కో, మిట్టల్ ల మధ్య అధిక కమిషన్ కోసం చేసే బేరసారాలనూ, రిలయన్స్ అంబానీకి మిగిలే కొద్ది పాటి కమిషన్లను స్వతంత్రతగా చెప్పడం మోసపూరితం.

ఈక్వడార్, వెనిజులా, బొలీవియా, అర్జెంటీనా, క్యూబా తదితర దేశాల పాలక వర్గాలు ఈ విధంగా కమిషన్లతోనే సంతృప్తి పడడానికి నిరాకరిస్తున్నారు. పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలకు గుండు గుత్తగా వనరులను అప్పజెప్పడానికి నిరాకరిస్తున్నారు. పెట్టుబడుల భాగస్వామ్యం ఉన్న చోట ప్రధాన భాగాన్ని డిమాండ్ చేస్తున్నారు. అర్జెంటీనా నుండి ఇటీవల స్పెయిన్ ఆయిల్ కంపెనీ ‘రెప్సోల్’ ను తరిమి వేయడం ఇందులో భాగంగానే చూడాలి. ఆర్ధిక రంగంలో జరిగే ఇటువంటి స్వతంత్ర అభివృద్ధి రాజకీయ, సాంస్కృతిక రంగాల్లోనూ, అంతర్జాతీయ సంబంధాల్లోనూ అనివార్యంగా ప్రతిఫలించిన ఫలితమే జూలియన్ అస్సాంజ్ విషయంలో బ్రిటన్, ఈక్వడార్ ల మధ్య జరుగుతున్న ఘర్షణ. జూలియన్ అస్సాంజ్ కి ఈక్వడార్ ఇవ్వజూపిన ‘రాజకీయ రక్షణ’, బ్రిటన్ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి ఈక్వడార్ చాటుతున్న ధిక్కారం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s