‘అస్సాం హింస’ ముస్లిం మిలిటెన్సీకి దారి తీయవచ్చు -మైనారిటీస్ కమిషన్


అస్సాంలోని బోడో జిల్లాల్లో చెలరేగిన హింసలో ముస్లిం ప్రజల భద్రతకు హామీ లభించకపోతే ‘ముస్లిం మిలిటెన్సీ’ కి దారి తీయవచ్చని ‘నేషనల్ మైనారిటీస్ కమిషన్’  (ఎన్ ఎం సి) హెచ్చరించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జీహాదీ సంస్ధల మద్దతుతో అటువంటి మిలిటెన్సీ తలెత్తే అవకాశాలు ఉన్నాయని కమిషన్ తయారు చేసిన నివేదిక హెచ్చరించింది. ‘బోడోలాండ్ టెరిటోరియల్ అటానమస్ డిస్ట్రిక్క్ట్స్’ (బి.టి.ఎ.డి) కింద ఉన్న నాలుగు జిల్లాలను కమిషన్ సందర్శించిన అనంతరం ఈ నివేదిక తయారు చేసిందని ‘ది హిందూ’ తెలిపింది.

విదేశీయులు కాదు

కమిషన్ నివేదిక ప్రకారం బి.టి.ఎ.డి ప్రాంతంలో నివసిస్తున్న బోడోలకు, ముస్లిం లకు మధ్య ఘర్షణ ప్రారంభం అయింది తప్ప వలస వచ్చిన బంగ్లాదేశ్ ముస్లింలకు, బోడోలకూ మధ్య కాదు. అయితే సంవత్సరం పొడుగునా బంగ్లాదేశ్ నుండి వలస కొనసాగిందని కమిషన్ తెలిపింది. ప్లానింగ్ కమిషన్ సభ్యుడు సైదా హమీద్, ఎన్.సి.ఎం సభ్యుడు కె.ఎన్.దారువల్లా లు ఎన్.సి.ఎం తరపున బి.టి.ఎ.డి సందర్శించారు. “మేము గమనించినంతవరకూ, ఈసారి ఘర్షణ బంగ్లాదేశీ వలసదారులకూ, బోడోలకు మధ్య కాదు. బోడోలకూ, బి.టి.ఎ.డి నివాసులైన ముస్లింలకు మధ్య ఈ ఘర్షణ తలెత్తింది” అని ఎన్.సి.ఎం నివేదిక పేర్కొన్నది.

“ఘర్షణ అసమానుల మధ్య జరిగింది. ఎందుకంటే ‘బోడో లిబరేషన్ టైగర్స్’ నుండి మిగిలిపోయిన ఆయుధాలు (ఎ.కె.47 మొ.వి) బోడోల వద్ద ఉన్నాయి. వారితో పోలిస్తే ముస్లింల వద్ద ఆయుధాలు చాలా తక్కువ,” అని కమిషన్ నివేదిక తెలిపింది. ఈ నేపధ్యంలో బోడో లాండ్ లో ముస్లిం ప్రజానీకం పై జీహాదీ ప్రభావం పడవచ్చని నివేదిక హెచ్చరించింది. “దేశంలోని ఇతర ప్రాంతాల మిలిటెంట్ జిహాది సంస్ధలు ఈ ప్రాంతానికి ఆయుధాలు సరఫరా చేయడం ప్రారంభిస్తే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది” అని నివేదిక తెలిపింది.

ముస్లిం, బోడోల మధ్య ఘర్షణలు చెలరేగిన అనంతరం జులై నెలలో కమిషన్ ప్రతినిధులు మత ఘర్షణలు చెలరేగిన కొక్రాఝార్, గోస్సాయ్ గావ్, ధుబ్రి, బిలాసిపర జిల్లాలను సందర్శించారు. బంగ్లాదేశీ వలసదారుల వల్లే హింస తీవ్రరూపం దాల్చిందని కొద్దిమంది రాజకీయ స్వార్ధపరులు, మత సంస్ధలు వాపోతున్న నేపధ్యంలో ఎన్.ఎం.సి నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ఈశాన్య ప్రజలపై దాడులు

అస్సాం ఘర్షణలపై ఇలాంటి పుకార్లు వ్యాపించడంతో దేశ వ్యాపితంగా ఈశాన్య రాష్ట్రాలనుండి వలస వచ్చినవారిపై హింసాత్మక దాడులు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. హైద్రాబాద్, పూణే, మద్రాస్, బెంగుళూరు తదిర చోట్ల ఈ దాడులు జరిగాయి. దాడుల వివరాలను అధికారులు పత్రికలకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. బెంగుళూరులో అస్సాం వ్యక్తిగా భావిస్తూ ఒక టిబెటన్ పై కత్తులతో దాడి జరిగిందని పత్రికలు తెలిపాయి.  దానితో బెంగుళూరు నుండి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున స్వస్ధలాలకు తరలిపోతున్నారు. ఒక్క బుధవారమే 5,000 మందికి పైగా ఈశాన్య ప్రజలు స్వస్ధలాలకు వెళ్లిపోవడానికి టికెట్లు కొన్నారని రైల్వే వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది.

ఈశాన్య ప్రజలపై వ్యాపిస్తున్న పుకార్ల పట్ల కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే హెచ్చరికలు జారీ చేశాడు. పుకార్లు వ్యాపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించాడు. కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు ఆయన ఫోన్ చేసి ఈశాన్య ప్రాంత ప్రజలకు గట్టి భద్రత కల్పించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. కర్ణాటక హోమ్ మంత్రి స్వయంగా బెంగుళూరు రైల్వే స్టేషన్ ను సందర్శించి అక్కడి ఉన్న వేలాది ఈశాన్య ప్రజలకు ‘భయం లేదని’ నచ్చ చెప్పడానికి ప్రయత్నించడం బహుధా అభినందనీయం. అస్సాం ముఖ్యమంత్రి, ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు కూడా జగదీష్ షేట్టర్ కు ఇదే విషయమై ఫోన్ చేసినట్లు పత్రికలు తెలిపాయి.

బోడోయేతరుల తరిమివేత

బోడో జిల్లాల్లో చోటు చేసుకున్న ప్రధాన ఘర్షణలపై విచారణ చేయడానికి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ను ఏర్పాటు చేయాలని ఎన్.ఎం.సి ప్రతినిధి బృందం సిఫారసు చేసింది. తద్వారా న్యాయం దక్కుతుందన్న విశ్వాసం కలుగజేయవచ్చని అభిప్రాయపడింది. కేంద్ర హోమ్ శాఖ, అస్సాం ప్రభుత్వం మరియు బోడో టెరిటోరియల్ కౌన్సిల్ (నాలుగు బోడో జిల్లాల పరిపాలనకు బాధ్యురాలయిన స్ధానిక సంస్ధ) ల మధ్య సవివరంగా చర్చలు జరగాలని కూడా నివేదిక కోరింది. అలాంటి చర్చలు చాలా అవసరమని పేర్కొంది.

ఇతర జాతుల ప్రజలను అక్కడినుండి తరిమి వేసినట్లయితే తమకు ప్రయోజనం కలుగుతుందని బోడోలు భావిస్తున్నారని తాము గమనించినట్లు ఎన్.ఎం.సి ప్రతినిధులు నివేదికలో తెలిపారు. అందుకే తాము అస్సాం ముఖ్యమంత్రితో “బోడో యేతరులు పెద్ద ఎత్తున తరలిపోయేలా చేయడానికి ఎట్టి పరిస్ధితుల్లోనూ పధకాలు వేయవద్దని బోడోలకు గట్టిగా చెప్పవలసిన అవసరం ఉంది. ఆ విధంగా వారు ఎన్నడూ రాష్ట్రాన్ని పొందలేరని చెప్పాలి” అని చెప్పినట్లు ప్రతినిధులు తెలిపారు.

బి.టి.ఎ.డి ప్రాంతంలో ముస్లింలకు, బోడోలకు మధ్య జరిగిన మొదటి విడత హింసాత్మక ఘర్షణలను నివారించడంలో పాలనా యంత్రాంగం ఘోరంగా విఫలం అయిందని నివేదిక పేర్కొంది. బోడో మరియు ముస్లిం క్రిమినల్స్ తో అస్సాం పోలీసులు గట్టిగా వ్యవహరించేలా చేయాలని నివేదిక అస్సాం ముఖ్యమంత్రిని కోరింది. “బోడోలపై చర్యలు తీసుకోవడానికి కింది స్ధాయి పోలీసులు భయపడుతున్న ప్రత్యేక పరిస్ధితి మాకు కనిపించింది. బహుశా వారి వద్ద ఉన్న ఆయుధాలు, వారా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాస్తవం దీనికి కారణం అయి ఉండవచ్చు” అని నివేదిక తన పరిశీలనగా పేర్కొంది.

తమ తమ గ్రామాలను వదిలి ప్రభుత్వ శిబిరాల్లో రక్షణ పొందుతున్న బోడో, ముస్లిం ప్రజలను కమిషన్ ప్రతినిధులు కలిశారు. అక్కడి పరిస్ధితుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు నివశిస్తున్న శిబిరాలు కడు దయనీయంగా ఉన్నాయని తెలిపింది. ఉదాహరణకి గోస్సాయ్ గావ్ జిల్లాలో ఒక పాఠశాలలో ఏకంగా 31 గ్రామాల నుండి వచ్చిన 6,569 మంది ని కుక్కారని తెలిపింది. అనేక శిబిరాల్లో సామర్ధ్యానికి మించి శరణార్ధులను కుక్కారని తెలిపింది.

నేపధ్యం

జులై మూడో వారంలో కొక్రాఝార్ జిల్లాలో ప్రారంభమయిన హింస అత్యంత వేగంగా ఇతర బి.టి.ఎ.డి జిల్లాలకు విస్తరించింది. 2003 లో బి.టి.ఎ.డి ఏర్పాటు ద్వారా బోడో మిలిటెంట్లతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఒప్పందం కుదిరినప్పటినుండి ‘బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్’ నాలుగు బోడో జిల్లాలను (కొక్రాఝార్, చిరంగ్,బక్సా, ఉదల్గురి) పాలిస్తున్నది. మాజీ మిలిటెంట్ సంస్ధ బోడో లిబరేషన్ టైగర్స్ రద్దు అయినప్పటికీ సంస్ధ ఆయుధాలు మిలిటెంట్ల వద్ద కొనసాగుతున్నాయి. ఈ ఆయుధాలు అడ్డు పెట్టుకుని బోడో జిల్లాలనుండి ముస్లింలను తరిమివేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్న ఫలితంగా అప్పుడప్పుడూ ఘర్షణలు జరుగుతున్నాయి.

బోడోల దాడులను ప్రతిఘటిస్తున్న క్రమంలో జులై 20 తేదీన నలుగురు బోడోలను ముస్లింలు చంపడంతో తాజా ఘర్షణల పరంపర కొనసాగుతున్నట్లు ‘ఫ్రంట్ లైన్’ కధనం ద్వారా తెలుస్తున్నది. ఈ ఘర్షణల వలన దాదాపు 4.5 లక్షలకు పైగా ఇరుపక్షాల ప్రజలు గ్రామాలనుండి తరిమివేయబడ్డారు. దాదాపు 244 గ్రామాల్లో ఇళ్ళు తగలబెట్టడం, కూల్చివేయడం జరగడంతో 45,000 మంది కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. దాడులకు భయపడి ప్రజలు పెద్ద ఎత్తున ఇతర జిల్లాలకు తరలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 278 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఫ్రంట్ లైన్ తెలిపింది. ఇందులో బోడోల కోసం 76 శిబిరాలు, ముస్లింల కోసం 199 శిబిరాలు, ఇతరుల కోసం 2 శిబిరాలు ఏర్పాటు చేశారు. బోడో ప్రజలు 1.3 లక్షల మంది ఈ శిబిరాల్లో తలదాచుకోగా ముస్లిం ప్రజలు 3.16 లక్షల మంది శిబిరాల్లో తలదాచుకున్నారు.

One thought on “‘అస్సాం హింస’ ముస్లిం మిలిటెన్సీకి దారి తీయవచ్చు -మైనారిటీస్ కమిషన్

  1. విశేఖర్

    ఈ సమస్యను ఎలా చూడాలి? అమాయక ప్రజలు శిబిరాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. బోడో లాండ్ మిలిటెంట్ల తప్పు ఉన్నట్టు స్పష్టమైనా, పాలకుల పాత్ర కూడా ఈ ఆర్టికల్ లో ఉంటే బాగుండేది.

    -చిట్టిపాటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s