ఫ్రాన్స్ లో లండన్ తరహా అల్లర్లు, ఆర్ధిక సామాజిక సమస్యలే కారణం


డజన్ల కొద్దీ  యువకులు రోడ్లపైకి వచ్చి రోజంతా లూటీలకూ, దహనాలకూ పాల్పడిన ఘటన ఫ్రాన్సులో చోటు చేసుకుంది. ఉత్తర ఫ్రాన్సులోని అమీన్స్ పట్టణంలో జరిగిన ఈ అల్లర్లలో 16 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని పోలీసులు చెప్పగా ప్రజలు ఎంతమంది గాయపడిందీ ఏ పత్రికా చెప్పలేదు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయిన అల్లర్లు అదనపు బలగాల రాకతో మగళవారం తెల్లవారు ఝాము 4 గంటలకు ముగిశాయని ఎ.పి తో పాటు ఇతర వార్తా సంస్ధలు తెలిపాయి. కార్లు ఆపి అందులో వస్తువులు దొంగిలించడం, కార్లు తగలబెట్టడం, బక్ షాట్ ఫైరింగ్ తదితర చర్యలకు యువకులు పాల్పడ్డారని ‘అహ్రమ్ ఆన్ లైన్’ తెలిపింది. దాదాపు వందమంది యువకులు అల్లర్లలో పాల్గొనగా 150 మంది స్ధానిక మరియు ఫెడరల్ పోలీసులు వారితో తలపడ్డారని ఎ.పి తెలిపింది.

కష్టాల్లో ఉన్న స్ధానిక నివాసులకూ పోలీసులకు మధ్య కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయనీ, అవే అల్లర్లకు దారి తీసాయనీ అమీన్స్ మేయర్ గిలెస్ డుమైల్లీ పత్రికలకు తెలిపాడు.  పోలీసులు ‘స్పాట్ చెకింగ్’ పేరుతో వేధిస్తుండడం పట్ల కొద్ది వారాలుగా స్ధానికుల్లో అసంతృప్తి పేరుకుంటూ వచ్చిందని గార్డియన్ పత్రిక తెలిపింది. దరిద్రంతో తీసుకుంటూ కష్టమైన పనులకు కూడా అతి తక్కువ వేతనాలకు సైతం సిద్ధపడే లోకాలిటీలపట్ల ఉండే చిన్న చూపు పోలీసు వేధింపులకు దారి తీస్తుండడంతో పేరుకుంటూ వచ్చిన ఆగ్రహం ఒక్కసారిగా బద్దలయి లక్ష్య రహిత అల్లర్లకు దారి తీసిందని పత్రికల కధనాల ద్వారా తెలుస్తున్నది. అప్పుడప్పుడూ పోలీసుల వేధింపులపై స్వల్ప స్ధాయిలో తిరగబడుతూ వచ్చిన జనం సోమవారం ఒక యువకుడిని అక్రమంగా అరెస్టు చేయడంతో యువకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

‘ది గార్డియన్’ ప్రకారం అమీన్స్ లోని ‘హౌసింగ్ ఎస్టేట్స్’ (పేదలకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చే అద్దె ఇళ్ళు) లో నివాసం ఉండే కుటుంబాల యువకులకూ పోలీసులకు చిన్నపాటి ఘర్షణలు జరుగుతున్నాయి. హౌసింగ్ ఎస్టేట్స్ నివాసులు టార్గెట్ గా జరుగుతున్న స్పాట్ చెకింగ్ లు ఉద్రిక్తతలను పెంచాయి. వేగంగా డ్రైవ్ చేస్తున్నాడంటూ సోమవారం ఒక యువకుడిని అరెస్టు చేశాక అల్లర్లు ప్రారంభం అయ్యాయి. వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ పోలీసులు ఒక యువకుడి కారును నిలిపివేశారు. యువకుడిపై పోలీసులు చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నిమిషాల్లోనే జనం గుమికూడడం పోలీసుల దౌర్జన్యంపై నిరసన తేలిపడం, యువకుల ఆగ్రహం అల్లర్లుగా మారడం జరిగిపోయింది. ఫ్రాన్సు అంతటా హౌసింగ్ ఎస్టేట్స్ నివాసులకూ, పోలీసులకూ మధ్య సంబంధాలు అంతంతమాత్రమేననీ తరచుగా ఘర్షణలు జరగడం పరిపాటేనని గార్డియన్ తెలిపింది. దేశవ్యాపితంగా ఇలాంటి లోకాలిటీలు 15 వరకూ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిందనీ, అందులో అమీన్స్ కూడా ఒకటనీ బి.బి.సి తెలిపింది.

నిరుద్యోగం, దరిద్రం, ఇరుకు ఇళ్ళు, అతి తక్కువ వేతనాలు… ప్రభుత్వం గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రధాన సమస్యలు ఇవే. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే, ప్రజల ఆదాయాలు మెరుగుపడాలి. ప్రజల ఆదాయాలు మెరుగుపడితే అల్లర్లకు కారణాలు ఉండవు. పోలీసులకూ వారి పట్ల చిన్న చూపు ఉండదు. అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి బదులు ఫ్రాన్సు ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధమైన పరిష్కారాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ సొమ్ము కంపెనీలకు బెయిలౌట్లుగా తరలించి ఉద్యోగాలు రద్దు చేసి, కార్మికుల వేతనాలు కత్తిరించి ప్రజల ఆదాయాలను మరింతంగా తగ్గిస్తున్నది. ఫలితంగా ఆర్ధిక సమస్యలు తీవ్రమై సామాజిక సమస్యలుగా రూపు దిద్దుకుంటున్నాయి.

అమీన్స్ అల్లర్ల వెనుక ఆర్ధిక, సామాజిక కారణాలను వదిలేసి శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నట్లు అధ్యక్షుడి ప్రకటన తెలియజేస్తున్నది. అమీన్స్ లాంటి ప్రాంతాల కోసం మరింత సొమ్ము బడ్జెట్ లో కేటాయిస్తానని అధ్యక్షుడు హాలండే ప్రకటించినప్పటికీ ఆ సొమ్ము ప్రజలకోసం కాక పోలీసుల కోసం, మరిన్ని భద్రతా ఏర్పాట్లు పెంచడం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపాడు. అమీన్స్ లాంటి చోట్లను ‘ప్రాధాన్యతా భద్రతా జోన్లు’ గా ప్రకటించి వాటికి మరిన్ని భద్రతా బలగాలను పంపుతానని తెలిపాడు.

ఋణ సంక్షోభం తాలూకు సమస్యలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఎంచుకున్న పరిష్కారాలు యూరప్ ప్రజలను కబళిస్తున్నాయి. ఫలితంగా యూరోపియన్ సమాజాలలో అట్టడుగుకు తొక్కివేయబడిన ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి, ఆగ్రహం బద్దలై అల్లర్లుగా వ్యక్తం అవుతోంది. అల్లర్లకు మూల కారణమైన సామాజిక ఆర్ధిక సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యం పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు ఉండవు. ఆర్ధిక సమస్యల్లో ఉన్న పేదలు పెట్టుబడిదారీ కంపెనీలకు అత్యంత చౌకగా శ్రమ శక్తిని అందించే రిజర్వ్ లేబర్ ఫోర్స్. చౌకగా శ్రమను అమ్ముకునే కార్మికులు పెట్టుబడిదారీ కంపెనీల లాభాల నిరంతర వృద్ధికి ప్రధాన బలగాలు. అందువల్లనే ఎన్ని అల్లర్లు జరిగినా వాటి వెనుక ఉన్న సమస్యల పరిష్కారం కంటే ప్రజల అసంతృప్తిని, ఆగ్రహాన్నీ ఆయుధ బలంతో, బలగాలతో అణచివేయడానికే ప్రభుత్వాలకు అధిక ఆసక్తి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s