పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు


ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల ప్రత్యక్ష మద్దతు, సహాయాలతో కిరాయి తిరుగుబాటు సైన్యం సిరియాను అల్లకల్లోలంలో ముంచెత్తుతున్న సంగతి విదితమే. సదరు కిరాయి బలగాలను సిరియాలో అతి పెద్ద పట్టణం అలెప్పో నగరంనుండి సిరియా ప్రభుత్వ బలగాలు తరిమి కొట్టిన నేపధ్యంలో సౌదీ, ఇరాన్ దేశాధిపతుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆగర్భ శత్రువులు

మధ్య ప్రాచ్యంలో ఇరాన్, సౌదీ అరేబియా లు ఆగర్భ శత్రువులు. ఇస్లాంలోనే షియా శాఖకు ఇరాన్ పాలకుల మద్దతు ఉండగా, సున్నీ శాఖకు సౌదీ అరేబియా రాజు మద్దతు ఉంది. బషర్ అస్సాద్ నేతృత్వంలోని సిరియా ప్రభుత్వం , లెబనాన్ లోని ఒక పాలక ముఠా,  పాలస్తీనీయులు నివసించే గాజాను ఏలుతున్న ‘హమాస్’… మొదలైనవారు ఇరాన్ ప్రాపకంలో ఉండగా కతార్, బహ్రెయిన్, యు.ఎ.ఇ, యెమెన్ లాంటి గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా నీడలో కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా పాలక శిబిరం అమెరికా, యూరప్ లకు చెందిన బహుళజాతి కంపెనీల కనుసన్నల్లో ఉండగా ఇరాన్ నేతృత్వంలోని శిబిరం స్వతంత్రంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నది.

సద్దాం హుస్సేన్ అనంతరం సెక్యులరిస్టు బాత్ పార్టీ ఆధిపత్యం నుండి చేజారిన ఇరాక్ లో షియా తెగ ప్రభుత్వంలో ఆధిపత్యం సాధించడంతో ఆ దేశం కూడా ఇరాన్ శిబిరంలో, సంపూర్ణంగా కానప్పటికీ, చేరినట్లు కనిపిస్తున్నది. ఇరాన్ పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రంగా ఎదగడం ఇష్టం లేని పశ్చిమ సామ్రాజ్యవాదులు ఆ దేశాన్ని లొంగదీసుకునే ప్రయత్నంలో భాగంగా సిరియాలో కిరాయి తిరుగుబాటును ప్రేరేపించి ఆ దేశ ప్రజలపై మారణహోమం సాగిస్తున్నారు. ఈ కిరాయి తిరుగుబాటులోని సైనికులకు సౌదీ అరేబియా, కతార్, టర్కీ (నాటో లో ఏకైక ముస్లిం దేశం) లు నెలజీతాలు చెల్లిస్తుండగా అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు అత్యాధునిక ఆయుధాలతో పాటు, గూఢచార మద్దతు ఇస్తున్నాయి. లిబియా, ఆఫ్ఘనిస్ధాన్, కతార్, యెమెన్ తదితర దేశాలకు చెందిన ఆల్-ఖైదా మరియు ఇతర ముస్లిం టెర్రరిస్టు బలగాలు సిరియా కిరాయి తిరుగుబాటులో ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో, ఏ విధంగా చూసినప్పటికీ ఇరాన్, సౌదీ అరేబియా దేశాల అత్యున్నత ప్రతినిధి బృందాల మధ్య జరగనున్న సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగినది. ఇరాన్ ప్రతినిధి బృందానికి ఆ దేశ అధ్యక్షుడు అహ్మది నెజాద్ స్వయంగా నాయకత్వం వహిస్తుండడం, ఇరాన్ అధ్యక్షుడికి సౌదీ అరేబియా రాజు వ్యక్తిగతంగా ఆహ్వానం పంపడం పశ్చిమాసియా రాజకీయాలలో అనూహ్య పరిణామం. ఇరాన్ ప్రతినిధి బృందం సోమవారం మదీనా చేరుకుందని ‘ది హిందూ’ తెలిపింది. మక్కా లో వాస్తవానికి 57 దేశాల ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్’ (ఒ.ఐ.సి) మహా సభ (కాన్ఫరెన్స్) రెండురోజుల పాటు జరగనుండగా దానికి ముందే ఇరాన్, సౌదీ ల సమావేశం జరగనున్నది.

అలెప్పో ఓటమే ప్రేరణ?

సమావేశంలో సిరియా అంశమే ప్రధాన ఎజెండాగా చర్చలు జరగనున్నట్లు తెలుస్తున్నది. ‘ఫ్రీ సిరియా ఆర్మీ’ పేరుతో కిరాయి తిరుగుబాటు నడుపుతున్న బలగాలను కొద్ది రోజుల క్రితమే అతి పెద్ద నగరం ‘అలెప్పో’ నుండి ప్రభుత్వ బలగాలు తరిమేసాయి. అలెప్పో నగరాన్ని వశం చేసుకున్నట్లయితే లిబియా నగరం బెంఘాజీ తరహాలో అక్కడినుండి సిరియా ప్రభుత్వ బలగాలపై పై చేయి సాధించవచ్చని పశ్చిమ దేశాలు భావించాయనీ కానీ వారి ఆశలు వమ్ము అయ్యాయని పత్రికలు విశ్లేషించాయి. (కల్నల్ గడాఫీ సైన్యం బెంఘాజీ ప్రజలపై సామూహిక హత్యాకాండకి దిగనున్నాడంటూ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు అబద్ధాలు సృష్టించి లిబియా పై దాడికి దిగాయి.)  ఈ నేపధ్యమే ఇరాన్ చర్చలకు సౌదీ అరేబియాను పురి కొల్పినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.

విదేశీ సహాయంతో ‘ఫ్రీ సిరియన్ ఆర్మీ’ జరుపుతున్న మారణహోమాన్ని సిరియా ప్రభుత్వం సమర్ధవంతంగా ప్రతిఘటిస్తుండడంతో నూతన ఎత్తుగడలు వేయవలసిన అవసరం దురాక్రమణదారులకు ఏర్పడిందని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ పాలనా వ్యవస్ధ మూల స్తంభాలన్నింటి ప్రతినిధులు ఇరాన్ తరపున చర్చలలో పాల్గొంటున్నందున ఇరు దేశాల పాలకుల మధ్య పంపకాలపై పెద్ద ఎత్తున చర్చలు జరగవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్, సౌదీ ల మధ్య విభేధాలు మౌలికమైనవే అయినందున అంత తేలికగా ఏకాభిప్రాయం రాకపోవచ్చు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రతినిధిబృందం అంగీకరించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. “శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం ద్వారా మా అభిప్రాయాలూ తెలియజేస్తాం. చర్చల ద్వారా ఖాళీలు పూరించుకుని విభేధాలు తగ్గించుకుంటాం” అని ఇరాన్ విదేశీ మంత్రి ‘అలీ అక్బర్ సలేహీ’ తెలిపాడు. ఇరాన్ బెదిరించినట్లుగా పర్షియన్ గల్ఫ్ లో హోర్ముజ్ ద్వీపకల్పం వద్ద అంతర్జాతీయ ఆయిల్ రవాణాను అడ్డుకున్నట్లయితే సౌదీ ఆయిల్ రవాణాకు తీవ్ర ఆటంకాలు కలిగే ప్రమాదం ఉన్నది. ఈ అంశం కూడా సౌదీ ఆహ్వానం లో ఒక పాత్రవహించినట్లు తెలుస్తున్నది.

ఇరాన్ క్రియాశీలక మద్దతు

సిరియాలో పశ్చిమ దేశాలు సాగిస్తున్న దుర్మార్గాలకు కారణం ఇరాన్ పై దాడికి సిరియా ‘ముందస్తు యుద్ధ భూమి’ (ఫ్రంట్) కావడమే. సిరియాలో ఆల్-ఖైదా నేతృత్వంలో తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్లయితే ఆ దేశం ఇక అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నేతృత్వంలోని పశ్చిమ దేశాల ఆధీనంలోకి వచ్చినట్లే. సిరియా తమ చేతికి వచ్చాక ఇరాన్ ను లొంగదీసుకోవడం పశ్చిమ దేశాలకు సులువు అవుతుంది. అందుకే సిరియా అధ్యక్షుడిని హత్య చేయడానికి గరిష్ట శక్తులను దుష్టత్రయ దేశాలు (అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్) ఒడ్డుతున్నాయి. అయితే ఇరాన్ కూడా స్ధాన బలిమితో సర్వశక్తులనూ ఒడ్డుతుండడంతో దుష్టత్రయ దేశాల పని కష్టంగా మారింది.

‘ఇరానియన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ అధిపతి సయీద్ జలీల్ ఇటీవల సిరియా, లెబనాన్, ఇరాక్ లను సందర్శించిన సందర్భంగా సిరియా అధ్యక్షుడు బాషర్ అస్సాద్ కు మద్దతును పునరుల్లేఖించాడు. సిరియాలో అధికారమార్పిడికి ఇరాన్ అంగీకరిస్తున్నదని చెబుతూనే ఆ మార్పు సిరియా దేశంలోపలి నుండే రావాలి తప్ప విదేశాల నుండి వస్తే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశాడు. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, నిజాయితీగా జరిగే ఎన్నికల ద్వారానే ఆ మార్పులు రావాలని తెలిపాడు.

గత సంవత్సరం ప్రారంభంలో ప్రజాందోళనలు ప్రారంభం అయినప్పటినుండే దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పరచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సిరియా అధ్యక్షుడు ప్రకటించాడు. ఎమర్జెన్సీ ఎత్తివేయడం, కొత్త రాజ్యాంగం రాయడానికి ఏర్పాట్లు చేయడం, చెప్పిన ఆరునెలలలోపే ఎన్నికలు జరపడం మొదలయిన చర్యలు చేపట్టినప్పటికీ, ప్రజాస్వామ్యం పట్ల నిజాయితీ లేని పశ్చిమ దేశాలు, పత్రికలు పట్టించుకోలేదు.

‘ఫ్రెండ్స్ ఆఫ్ సిరియా’ (వీరిలో ఇండియా కూడా ఉంది) పేరుతో పశ్చిమ దేశాలు అంతర్జాతీయ స్ధాయిలో సమావేశాలు నిర్వహిస్తున్న నేపధ్యంలో ఇరాన్ కూడా అంతర్జాతీయ సమావేశాన్ని గత వారంలో టెహ్రాన్ లో నిర్వహించింది. ఇందులో 29 దేశాలు పాల్గొనడం గమనార్హం. ఈ నెలాఖరులో ‘అలీన దేశాల సమావేశం’ నిర్వహించడానికి కూడా ఇరాన్ ఉద్యుక్తం అవుతున్నది. ఇందులో కూడా సిరియా సమస్యను ప్రముఖంగా చర్చకు రానున్నది. అలీనోద్యమానికి ఒకప్పుడు నాయకత్వ పాత్రలో ఉన్న ఇండియా ఇపుడా పాత్రను త్యజించి పశ్చిమ దేశాల దుర్మార్గాలకు వంతపాడడం వెనుక భారత పాలకులు అంతకంతకూ ఎక్కువగా అమెరికా-యూరప్-ఇజ్రాయెల్ ల దుష్టకూటమి సరసన చేరుతున్న పరిణామం ఉన్నది.

3 thoughts on “పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

  1. విశేఖర్ గారూ,
    సంక్లిష్ఠమైన మధ్య ప్రాచ్యం (middle east) రాజకీయాల్ని అర్థం చేసుకోవడంలో ఈ పోస్టు ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్స్.

  2. మహత్ గారూ, రాజశేఖర రాజు గారు ఈ విషయం అడుగుతారని భావిస్తుండగా మీరు అడిగారు. నిన్ననే ఒక ఆర్టికల్ రాసాను. అయితే అది సమగ్రం కాదు.

    అస్సాంలో హింసాత్మక ఘర్షణలు మొదలయినప్పటినుండీ ఆ విషయమై రాద్దామని ప్రయత్నిస్తున్నాను. కాని పూర్తి సమాచారాన్ని (కాస్త సమగ్రంగా విశ్లేషించడానికి అవసరమైన సమాచారం) పత్రికలు ఇవ్వలేదు. హింస ఎలా మొదలయిందన్న సమాచారాన్ని పత్రికల్లో ఇటివలి వరకూ రాలేదు. బహుశా అలాంటి సమాచారం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతాయన్న అనుమానం వల్ల ప్రభుత్వమే పత్రికలపై పరిమితి విధించినట్లు కనిపిస్తోంది. మత ఘర్షణల వార్తలను స్వప్రయోజనాలకు వాడుకోవడానికి మతోన్మాద సంస్ధలు ఎలాగూ ప్రయత్నిస్తాయి. అందువల్ల ప్రధాన స్రవంతి పత్రికలు ఇటీవలి వరకూ సంయమనం పాటించాయనుకుంటా.

    నిన్న రాసిన ఆర్టికల్ సంతృప్తికరంగా లేదు. సాధారణంగా ఇలాంటి ఘర్షణలకు ఆర్ధిక మూలాలు ఉంటాయి. ఇతర కారణాలు కూడా ఉన్నా అవి సహకారంగా ఉంటాయి తప్ప మూల కారణాలుగా ఉండవు. కొన్ని సార్లు ఇతర కారణాలు కూడా మూలంగా పని చేసినా, అలాంటి సందర్భాల్లో ఘర్షణలు త్వరగానే సమసిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి మూల కారణాలపై నిర్ధారిత సమాచారం దొరకనందున అస్సాం హింస పై త్వరగా రాయలేకపోయాను. మరో ఆర్టికల్ లో సమగ్రంగా రాయవచ్చన్న ఆలోచనతో ‘మైనారిటీ కమిషన్’ నివేదిక ఆధారంగా నిన్న ఆర్టికల్ రాసాను. అది చదివి మీ అభిప్రాయం చెప్పండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s