2జి కుంభకోణం: లక్ష 76 వేల కోట్ల కాగ్ అంచనా కూడా తక్కువేనా?


సహజ వనరు అయిన 2జి స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇష్టారీతిన పంచి పెట్టడం వలన భారత ప్రభుత్వ ఖజానాకు గరిష్టంగా 1,76,645 కోట్ల నష్టం వచ్చిందని ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఎ.జి) 10 నవంబర్, 2010 తేదీన నివేదిక వెలువరించింది. కాగ్ నివేదిక అంచనా వేసిన మొత్తం భారీగా ఉండడంతో పత్రికలు దానిని సంచలనం చేశాయి. అప్పటి నుండీ ఏదో ఒక రూపంలో (కేసులు, ఖండన మండన ప్రకటనలు, నీరా రాడియా టేపులు, మంత్రుల ‘జోకర్ స్ధాయి’ ప్రకటనలు, సి.బి.ఐ విచారణ, సుప్రీం మొట్టి కాయలు) 2జి స్పెక్ట్రమ్ పత్రికల్లోనూ, ప్రజల్లోనూ నానుతూనే వచ్చింది. కంపెనీలకు ఇచ్చిన 122 లైసెన్సులను సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా రద్దు చేసేయడంతో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి ఒక తార్కిక ముగింపు వచ్చినట్లయింది.

నేపధ్యం

లెక్కల్లోకి వెళ్ళేముందు నేపధ్యాన్ని క్లుప్తంగా గుర్తు తెచ్చుకుందాం. కాగ్ నివేదిక ద్వారా 2జి కుంభకోణం బహుళ ప్రచారంలోకి వచ్చినప్పటికీ సి.బి.ఐ విచారణ ప్రారంభం కావడానికీ, సుప్రీం కోర్టు రంగంలోకి దూకడానికీ పునాది అంతకు ముందే పడింది. 10 జనవరి, 2008 తేదీన ఎ.రాజా దర్శకత్వంలో ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ‘(డి.ఒ.టి) 2001 నాటి ధరలకు 122 2జి లైసెన్సులను 18 కంపెనీలకు మంజూరు చేసింది. అవడానికి 18 కంపెనీలు అయినా బినామీ ముసుగులు తీసేస్తే అవి 8 కంపెనీలే. లైసెన్సులు పొందిన కంపెనీలలో కొన్ని అసలు ఏ మాత్రం అనుభవం లేని పసి కూనలు. లైసెన్సు పొందిన వెంటనే కొన్ని కంపెనీలు వాటిని ఇతర కంపెనీలకు అమ్ముకుని భారీగా లబ్ది పొందాయి.

వీటిని గమనించి కాబోలు మే 4, 2009 న ‘టెలికాం వాచ్ డాగ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధ ‘లూప్ టెలికాం’ కంపెనీకి అక్రమంగా కేటాయింపులు జరిగాయని సి.వి.సి (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) కి ఫిర్యాదు చేసింది. మరో వారం రోజులకి స్వాన్ టెలికాం కంపెనీకి అక్రమ కేటాయింపులు జరిగాయని అరుణ్ అగర్వాల్ అనే అవ్యక్తి సి.వి.సి కి మరో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులను అనుసరించి 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులపై విచారణ చేయాలని సి.వి.సి, సి.బి.ఐ ని పురమాయించాడు. సి.బి.ఐ విచారణకు మొదటి అడుగు అక్కడే పడింది.

అనంతరం సి.బి.ఐ విచారణను అడ్డుకోవడానికీ, చిక్కులు కల్పించడానికి రాజకీయ నాయకులు, కంపెనీలు చేయని ప్రయత్నం లేదు. కంపెనీల మధ్య పోటీ వలన నీరా రాడియా లాంటి లాబీయిస్టులు టెలికాం మంత్రి ఏ.రాజా తోనూ మీడియా పెద్దలతోనూ జరిపిన సంభాషణలు చానెళ్లకు ఎక్కాయి. ఈ సంభాషణలను రికార్డు చేసింది ఆదాయ పన్ను శాఖ కాగా చానెళ్లకు ఎలా అందిందీ తెలియరాలేదు. విచారణ సాగుతుండగానే సి.బి.ఐ విచారణాధికారి వినీతి అగర్వాల్, ఆదాయ పన్ను శాఖ అధికారి మిలప్ జైన్ లను ప్రభుత్వం బదిలీ చేసిపారేసింది. ఈ నేపధ్యంలో కుంభకోణంపై ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) చేత విచారణ జరిపించాలని మే నెలలో ప్రశాంత్ భూషణ్ (అన్నా బృందం సభ్యుడు) నేతృత్వంలోని ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ (సి పిల్) ఢిల్లీ హై కోర్టును కోరగా దానిని కోర్టు కొట్టివేసింది. దానితో ‘సి పిల్’ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అప్పటినుండి 2జి కేసులో సుప్రీం కోర్టు క్రియాశీలక పాత్ర నిర్వహించింది.

రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు నత్త నడక సాగుతున్న సి.బి.ఐ విచారణపై సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించి పరుగులేత్తించింది. ఈ లోపు డి.ఒ.టి చేత ప్రభుత్వ పెద్దలు సుప్రీం ముందు పిటిషన్ వేయించారు. ప్రభుత్వ విధాన నిర్ణయం ప్రకారమే లైసెన్సులు జారీ అయ్యాయనీ, కనుక విధాన నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కాగ్ కి లేదనీ ఆ పిటిషన్ లో డి.ఒ.టి వాదించింది. ఈ వాదనను కోర్టు అంగీకరించలేదు. లైసెన్సుల కేటాయింపులు జరిగినప్పుడు టెలికాం కార్యదర్శిగా ఉన్న పి.జె.ధామస్ సి.వి.సి గా నియమితుడవడం ఆయనే 2జి కేసు పర్యవేక్షణకు పూనుకోవడం కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పరిస్ధితిని గమనించిన సుప్రీమ్ కోర్టు సి.బి.ఐ విచారణను తానే పర్యవేక్షిస్తానని డిసెంబర్ 16, 2010 తేదీన ప్రకటించింది.

ఈ కాలంలోనూ ఆ తర్వాతా రాజకీయ నాయకుల జోకర్ చేష్టలు పత్రికలను, ప్రజలను అలరించాయి. కొండోకచో వొళ్ళు మండించాయి. నవబరు 15, 2010 తేదీన ఏ.రాజా నుండి టెలికాం శాఖ ను స్వీకరించిన కపిల్ సిబాల్ కాగ్ లెక్కలను అపహాస్యం చేయడానికి ప్రయత్నించి తానే నవ్వులపాలయ్యాడు. లక్ష 76 వేల కోట్లు నష్టంగా చెప్పిన కాగ్ లెక్కలు సరికాదని, అసలు నష్టమే లేదు (జీరో లాస్) పొమ్మని పత్రికలను సమావేశపరిచి మరీ సిబాల్ వాదించాడు. ఆయన వాదనను పత్రికలు తూర్పారబట్టాయి. ప్రతిపక్షాలు ఉతికి ఆరేశాయి. సుప్రీం కోర్టు పద్ధతిగా మసులుకోమని హెచ్చరించింది. ఆ తర్వాత కపిల్ సిబాల్ 2జి కుంభకోణం గురించి పల్లెత్తు మాటంటే ఒట్టు. మంత్రిగా చేసిన ప్రకటనలు తప్ప అదనంగా ఒక్క అక్షరం పొల్లు పోవడానికి కూడా ఆయన సాహసించలేదు. ఫిబ్రవరి 2, 2011 న రాజా అరెస్టుతో మొదలుకొని కనిమొళి, కార్పొరేట్ కంపెనీల అధిపతులు, ప్రభుత్వ కార్యదర్శులు కటకటాల వెనక్కి వెళ్లడం తెలిసిందే. 2జి లైసెన్సులను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు 122 లైసెన్సులనూ రద్దు చేస్తున్నట్లు ఫిబ్రవరి 2, 2012 న తీర్పు చెప్పింది. రద్దు చేసిన లైసెన్సులను నాలుగు నెలలలోపు తిరిగి వేలం వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వర్తమానం

ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2జి స్పెక్ట్రమ్ లైసెన్సులను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2జి స్పెక్ట్రమ్ లో దాదాపు 52.73 Megahertz వరకూ వేలం వేయడానికి నిర్ణయించి దానిని 5 Megahertz బ్లాకులుగా విభజించించింది. ఇలా విడదీయడం వలన కంపెనీలు తమకు అవసరమైన ప్రాంతాల బ్లాకులకు మాత్రమే బిడ్డింగ్ చేసి ఇతర బ్లాకులను వదిలేస్తాయనీ తద్వారా వేలంలో ఆదాయం తగ్గిపోతుందనీ ‘ది హిందూ’ లాంటి పత్రికలు అనుమానం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ప్రారంభ ధరే కపిల్ సిబాల్ లాంటి కంపెనీల తరపు జోకర్ల ‘జీరో లాస్’ వాదనను వందడుగుల గోతిలో తొక్కి పారేసింది.

ఒక్కో 5 Megahertz బ్లాకుకు ప్రారంభ విలువ రు. 14,000 కోట్లుగా కేంద్ర కేబినెట్ ఆగస్టు 3 న నిర్ణయించింది. దాని ప్రకారం ఒక్కో Megahertz స్పెక్ట్రమ్ ప్రారంభ ధర రు. 2,800 కోట్లు గా ప్రభుత్వం అంచనా వేసినట్లు. కాగ్ గరిష్ట అంచనా రు. 1,76,645 కోట్లు. కాగ్ ప్రకారం చూస్తే ఒక్కో Megahertz స్పెక్ట్రమ్ ధర రు. 3,350 కోట్లు. కాగ్ లెక్కకీ కేబినెట్ లెక్కకీ తేడా రు. 550 కోట్లు మాత్రమే. నిజానికి డి.ఒ.టి (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) స్పెక్ట్రమ్ ప్రారంభ ధరను ఒక్కో బ్లాకు (5 Megahertz) కు రు. 18,000 కోట్లుగా నిర్ధారించింది. అంటే ఒక Megahertz ప్రారంభ ధర 3,600 కోట్లు. (ఈ ధరను కేంద్ర కేబినెట్ కుదించి వేసింది.) ఇది కాగ్ గరిష్ట అంచనా కన్నా రు. 250 కోట్లు ఎక్కువ. ఇది కూడా ప్రారంభ ధర మాత్రమే అని గమనంలో ఉంచుకోవాలి.

ఈ లెక్కన మంత్రులు, అధికారుల నిర్వాకం వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టం కాగ్ గరిష్ట అంచనా కంటే ఎక్కువే. కాగ్ కనిష్ట అంచనా 36,000 కోట్లు మాత్రమే కనుక నష్టం కూడా దానికే పరిమితం చేయడానికి మంత్రులు, అధికారులు, కంపెనీల ప్రతినిధులు పత్రికల్లో, చానెళ్లలో గట్టి ప్రయత్నాలు చేశారు. తద్వారా రాజ్యాంగ సంస్ధ అయిన కాగ్ ని అప్రతిష్ట పాలు చెయ్యడానికీ, తమ తప్పేమీ లేదని చెప్పుకోవడానికీ వారు ప్రయత్నించారు.

డి.ఒ.టి నిర్ధారించిన ధర ప్రకారం లెక్కిస్తే వేలానికి ఉంచిన స్పెక్ట్రమ్ ప్రారంభ ధర రు. 1,89,828 కోట్లు. అంటే కాగ్ గరిష్ట అంచనా కంటే రు. 13,183 కోట్లు అధికం. వేలంపాటలో కంపెనీలకు ఎక్కువ మార్జిన్ ఇవ్వడానికి వీలుగా కేబినెట్, డి.ఒ.టి నిర్ధారించిన ధరలో కోత పెట్టిందని కొందరు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. వేలం పూర్తయ్యాక ఇలాంటి అనుమానాల విశ్వసనీయతను అంచనా వేయడం సముచితంగా ఉంటుంది. వేలాన్ని ఇప్పుడప్పుడే మొదలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి లో లైసెన్సులు రద్దు చేస్తూ నాలుగు నెలల్లోపు వేలం జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించగా, ప్రభుత్వం జూన్ లో ఆగస్టు 31 వరకూ వాయిదా కోరింది. మళ్ళీ నవంబరు 12 న వేలం జరుపుతానంటూ ప్రభుత్వం నిన్న (ఆగస్టు 9) కోర్టును కోరింది.

వేలం వలన మొబైల్ ఛార్జీలు పెరగక తప్పదని గత కొద్ది నెలలుగా కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ వాదనను ప్రభుత్వ సంస్ధ ‘టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా’ (ట్రాయ్) కొట్టి పారేస్తోంది.  మాజీ మంత్రి రాజా సైతం తన కేటాయింపుల వల్లనే ప్రజలు అత్యంత తక్కువ ధరలకు మొబైల్ ఫోన్లలో మాట్లాడుకోగలుగుతున్నారని సుప్రీం కోర్టులో వాదించాడు. కొందరు ఆర్ధికవేత్తలు కూడా ఇలాంటి వాదనలను నెత్తికెత్తుకున్నారు. అయితే ఈ వాదనలన్నింటినీ స్వంతంత్ర నిపుణులు కూడా అనేకులు తిరస్కరించారు. టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ తాను అన్నీ కోణాలనుండి విశ్లేషణ జరిపాననీ మొబైల్ టారిఫ్ లు పెరుగుతాయన్న వాదనలో నిజం లేదని స్పష్టం చేసింది. వేలం ధర 20 సంవత్సరాల పాటు విస్తరించి ఉండడమే దానికి కారణమని కూడా వివరించింది.

వినియోగదారులకు సరసరమైన ధరలకు సేవలు అందించడానికి ప్రభుత్వ రెవిన్యూ ను వదులుకోవచ్చని 2జి స్పెక్ట్రమ్ విషయంలో ఆ సూత్రాన్నే పాటించామని ప్రభుత్వంలో అనేకులు గతంలో సూత్రాలు వల్లించారు. కానీ వాస్తవంలో జరిగింది ప్రభుత్వమూ, ప్రజలూ నష్టపోవడం, ప్రవేటు కంపెనీలు లబ్ది పొందడమే. ప్రజలకు జరిగిన నష్టం ఒక నాటితో ముగిసేది కాదు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల రెవిన్యూ వసూలు కావడానికి ప్రభుత్వాలు ప్రజలపై అనేక పన్నులు విధించి వేధిస్తాయి. దాదాపు  ప్రజలకు ఇస్తున్న

సబ్సిడీ ని క్రమంగా రద్దు చేయాలని ప్రపంచ బ్యాంకు దగ్గర్నుండి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు మాంటిక్ సింగ్ అహ్లూవాలియా ల వరకూ నిత్యం ప్రభోధిస్తుంటారు. కానీ అమెరికా, యూరప్ దేశాలు కంపెనీలకు, ప్రజలకు ఇచ్చే సబ్సిడీలతో పోలిస్తే భారత ప్రజలు పొందుతున్నది నామమాత్రమే. ప్రజలకు ఇస్తున్న సబ్సిడీనీ కూడా కంపెనీలకి తరలించాలన్న దురుద్దేశమే ఈ తుంటరి వాదనలకు మూలం.

ఎకనమిక్ టైమ్స్ ప్రకారం 2011-12 లో భారత దేశంలో సబ్సిడీ బిల్లు రు. 2,23,000 కోట్లు. ఇది జి.డి.పి లో 2.5 శాతం మాత్రమే. (అమెరికా, యూరప్ లలో ఇది 40 శాతం పైనే ఉంటుందని వికీ పీడియా ద్వారా తెలుస్తున్నది.) ఇందులో ప్రజలకోసం కేటాయించేది చాలా తక్కువ. బియ్యం,కిరోసిన్, గ్యాస్, ఎరువులు, ఉపాధి హామీ పధకం లాంటి స్కీములు ప్రజలకోసం అని చెప్పబడుతున్నాయి. వీటికి గత బడ్జెట్ లో జరిగిన కేటాయింపులు 1,79,554 కోట్లు. ఈ మొత్తంలో ప్రజలకు చేరవలసిన బియ్యం, కిరోసిన్, గ్యాస్, ఎరువులు అన్నీ బ్లాక్ మార్కెట్ కు తరలివెళ్లి ధనికుల బొజ్జలే నింపుతాయి. సబ్సిడీలను తగ్గించడం అంటే ప్రజలకు అరకొరగా చేరేదానిలోనే కోత పడుతుంది. ఎందుకంటే అసలు లెక్కల్లో తేలేది అదే కనుక. బ్లాక్ మార్కెట్ కి తరలివెళ్ళేది స్ధిరంగా ఉంచడానికి మంత్రులు, అధికారులు, గూండాలు స్ధిరంగా ప్రయత్నిస్తుంటారు, ప్రభుత్వం ఉండేది వారి చేతుల్లోనే గనక.

ఈ విధంగా ప్రజల నోళ్ళు కొట్టే బదులు సహజ వనరులను అప్పనంగా ఇవ్వకుండా వేలానికి ప్రభుత్వాలు సిద్ధపడితే ఖజానాకు ఎంత ధనం సమకూరుతుందో 2జి కుంభకోణం ఉదంతం స్పష్టం చేస్తున్నది. (దీనర్ధం వేలంలోనే ప్రజల ప్రయోజనాలు ఉన్నాయని కాదు) కానీ ప్రభుత్వాలు అది చేయలేవు. కారణం వారు అసలు యజమానులు కాదు. వారి అసలు యజమానులు సామ్రాజ్యవాదులు. సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు దేశ వనరులను అప్పనంగా అప్పజెప్పడానికే భారత పాలకులు పని చేస్తున్నారు. ప్రజలు, విప్లవ గ్రూపులు, అప్పుడప్పుడూ స్వప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు చేసే పోటీ పోరాటాలు… వీటి వలన కోర్టులకు తత్వం గుర్తుకు వస్తోంది. ఇదే విధంగా విచ్చలవిడిగా వనరులను అప్పజెప్పే పని పాలకులు కొనసాగిస్తే ఇప్పటి వ్యవస్ధ ఎల్లకాలం కొనసాగదని కోర్టులకు స్పష్టంగానే తెలుసు. కోర్టులు కూడా వ్యవస్ధకు కాపలాదారులే గనక పార్లమెంటు, ఎక్జిక్యూటివ్ లు విఫలం అవుతున్నట్లు కనిపిస్తున్నపుడు స్వయంగా రంగంలోకి దిగి వ్యవస్ధ ఉన్నది ప్రజలకోసమే అన్న భ్రమలను తిరిగి నిలబెడతాయి. 2జి కుంభకోణం విషయంలోగానీ ఇతర అవినీతి కేసుల్లోగానీ జరుగుతున్నది అదే. ఇది జ్యుడీషియల్ యాక్టివిజం గా కనబడినా వాస్తవానికి ప్రజలకు దుర్భరంగా మారిన వ్యవస్ధను నిలబెట్టే ప్రయత్నమే.

2 thoughts on “2జి కుంభకోణం: లక్ష 76 వేల కోట్ల కాగ్ అంచనా కూడా తక్కువేనా?

  1. 2జి స్పెక్ట్రమ్ కుంబకోణాన్ని మొదట బయట పెట్టింది సిపిఎమ్ దానికి సంబంధించిన లింకు
    http://cpim.org/content/scam-spectrum-allocation-hold-enquiry
    కాని దీనిని అందరూ దాచిపెడుతున్నారు. సిపిఎం ఈ విశయాన్ని ముందుకు తెచ్చింది అని చెప్పటం సరిఅయినదని భావిస్తున్నాను

  2. 2g కుంభకోణం ప్రక్రియ బిజెపి టైమ్‌లో మొదలైంది. ఆ కుంభకోణం ఎప్పటికైనా బయటపడేదే. కానీ ఆలస్యంగా కాంగ్రెస్ టైమ్‌లో బయటపడింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s