సంవత్సరం క్రితం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశ వ్యాపితంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయనకి మద్దతు ఇవ్వడానికి రాజకీయ నాయకులు పోటీలు పడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీలకు అతీతంగా సీనియర్ల నుండి ఛోటా మోటా నాయకుల వరకూ అవినీతిపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ అన్నా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న యెడ్యూరప్ప లాంటి వారు సైతం అప్పట్లో ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలింది గాలి జనార్ధన రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి లాంటివారేనని పత్రికలు జోకులు పేల్చాయి.
కానీ ఈ సారి మాత్రం ప్రజల్ని కదిలించడంలో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో కూడిన బృందం విఫలం అయింది. విఫలం అయ్యారు అనడం కంటే పెద్దగా సఫలం కాలేదు అనడం సరిగ్గా ఉంటుంది. ప్రజలు చేరిన చోట రాజకీయ నాయకులు కూడా ఈగల్లా ముసరడం పరిపాటి. ప్రజలను కదిలిస్తున్న అంశాలకు మద్దతు ప్రకటించి ఓట్లు నోల్లుకోవడం మీదనే వారి యావ. తీవ్రమైన అవినీతి కేసుల్లో ఇరుక్కుని కూడా సిగ్గు వదిలి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వడం పాలకవర్గ రాజకీయ నాయకులకే సాధ్యం. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం వస్తే బి.జె.పి మద్దతు రాసుకోవచ్చు. బి.జె.పి నాయకుల అవినీతికి వస్తే కాంగ్రెస్ ఒంటి కాలిపై లేస్తుంది. వీరిరువురి అవినీతి రాచపుండు ప్రాంతీయ కాకులకు ముద్దు. వీరందరి చేతా మోసపోతున్నది అంతిమంగా ప్రజలే.
ఒకవేళ అన్నా హజారే గ్లోబలైజేషన్ వ్యతిరేక ఉద్యమం చేపడితే ఒక్క రాజకీయ పార్టీ కూడా అతనికి మద్దతు ఇవ్వదు. అలాగే కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలకి వ్యతిరేకంగా ఉద్యమం చేపడితే అతని వెనుక ఉన్న అరవింద్ కెజ్రివాల్ లాంటి మార్వాడీలందరూ మాయమైపోతారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం అనగానే అదొక వట్టి కబురు అనుకుని, ఆ కబుర్లతో వ్యక్తిగత పాప్యులారిటీ పెంచుకుందామని ఆ కబుర్లు చెప్పేవాళ్ళతో కలిసి బయలుదేరుతారు.
Read this link: http://sahacharudu.blogspot.in/2012/09/blog-post.html