‘లండన్ ఒలింపిక్స్ 2012’ స్ట్రీట్ ఆర్ట్ -ఫోటోలు


ప్రఖ్యాత వీధి చిత్రకారుడు బ్యాంక్సీ, లండన్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న సందర్భంగా రెండు వీధి చిత్రాలను తన వెబ్ సైట్ లో ప్రదర్శించాడు. ఈ చిత్రాలు ఏ వీధిలో ఉన్నదీ ఇంకా ఎవరికీ తెలిసినట్లు లేదు. బ్యాంక్సీ కూడా ఆ వివరాలేవీ చెప్పలేదు. (ఆ మాటకొస్తే తన వెబ్ సైట్ లో ఆయన ఉంచిన ఏ చిత్రానికీ వివరాలు లేవు.) వెబ్ సైట్ లో ప్రదర్శించేదాకా ఆ చిత్రాల సంగతి ఎవరికీ తెలిసినట్లు కూడా కనిపించడం లేదు.

దానికి కారణం స్పష్టమే. ఒలింపిక్స్ కి కొన్ని నెలలముందు నుండే గ్రాఫిటీ ఆర్ట్ ఉన్న గోడలను కప్పేస్తూ బ్రిటిష్ పోలీసులు సున్నం వేయడం మొదలు పెట్టారు. పోలీసుల చర్యపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ వారు వెనకడుగు వేయలేదు. ప్రిన్స్ విలియమ్స్ పెళ్లి సందర్భంగా కూడా ప్రభుత్వ ఆర్భాటాలపై విమర్శలు చేస్తారన్న అనుమానంతో అనేకమందిని అరెస్టు చేసి రాచరికంపై భక్తి ప్రపత్తులు చాటుకున్న గొప్ప ప్రజాస్వామ్య దేశం బ్రిటన్.

ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ముందు కొందరు వీధి చిత్రకారులను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసారు. వారిపైన ఆరోపణలు ఏవీ లేనప్పటికీ కఠినమైన షరతులు విధించి వారికి బెయిల్ ఇచ్చారు. స్ప్రే పెయింట్ డబ్బాలు కలిగి ఉండరాదనీ, అరెస్టయి బెయిల్ పై విడుదలయిన ఇతర ఆర్టిస్టులతో కలవడం గానీ మాట్లాడడం గానీ చేయరాదనీ, ఒలింపిక్స్ వేదికలకు మైలు దూరంలోపల కనపడరాదనీ, ఎటువంటి రైల్వే వ్యవస్ధలలోకి కూడా ప్రవేశించరాదనీ షరతులు విధించినట్లు బి.బి.సి మూడు వారాల క్రితం తెలిపింది. ఈ నేపధ్యంలోనే కాబోలు బ్యాంక్సీ గ్రాఫిటీ ఆర్ట్ ఉన్న చోటు ఇంకా వెల్లడి కాలేదు.

ఇక్కడ ఉన్న ఫొటోల్లో మొదటి రెండు చిత్రాలు బ్యాంక్సీ గీసినవి. ఒలింపిక్స్ రక్షణ కోసం అంటూ నివాస భవనాలపై యుద్ధ మిసైళ్లను ప్రతిష్టించిన బ్రిటన్ ప్రభుత్వాన్ని అవహేళను చేస్తూ బ్యాంక్సీ గీసిన చిత్రం మొదటిది. పోల్ వాల్ట్ క్రీడాకారుడు ముళ్ళ కంచెను పాత పరుపు మీదికి దాటుతున్న చిత్రం రెండవది. మూడవది టిమ్ కాలిగాన్  ‘వెల్ కం టు లండన్ ఒలింపిక్స్’ టైటిల్ తో గీసిన చిత్రం. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ లండన్ ఒలింపిక్స్ కి ముందు తమ లోగోను అనుమతి లేకుండా ఎవరూ వాడరాదని డిక్రీ జారీ చేసింది. దానిని అవహేళన చేస్తూ ‘క్రిమినల్ చాక్ లిస్ట్’ గీసిన చిత్రం నాల్గవది.

ఒలింపిక్స్ క్రీడల వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని విమర్శలు వచ్చాయి. అదీ కాక భోపాల్ గ్యాస్ లీక్ తో పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాక వేలమంది మరణాలకూ, మరిన్ని వేలమంది అంగవైకల్యాలకూ కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీని కొనుగోలు చేసిన డౌ కెమికల్స్ లండన్ ఒలింపిక్స్ ను స్పాన్సర్ చేస్తున్నది. ఈ అంశంపై గీసిన ‘మౌ మౌ’ గీసిన చిత్రం అయిదవది. ఈ చిత్రంపైన బ్రిటిష్ పోలీసులు సున్నం వేసేశారు. లండన్ ఒలింపిక్స్ మస్కట్ ‘బిగ్ బెన్’ ను ప్రతీకాత్మకంగా చూపిన చిత్రం ఆరవది. ఒలింపిక్స్ లోగోపై రెట్ట వేస్తున్న పావురాన్ని ఏడవ చిత్రం లో చిత్రించారు. లండన్ ఒలింపిక్స్ కు మరో స్పాన్సర్ అయిన మెక్ డొనాల్డ్ లోగోను, ఒలింపిక్స్ లోగోను బ్రిటిష్ పోలీసులతో కలిపి చివరి ఫ్రాఫిటీలో చిత్రించారు. చివరి రెండు వీధి చిత్రాలను ఎవరు గీసీందీ సమాచారం లభ్యం కాలేదు.

6 thoughts on “‘లండన్ ఒలింపిక్స్ 2012’ స్ట్రీట్ ఆర్ట్ -ఫోటోలు

  1. విశేఖర్ గారూ,
    మీ కథనంతో నాకివ్వాళ ఒక కొత్త విషయం బోధపడింది. ప్రజాస్వామ్యం దాని మౌలిక సారంలో పక్కా నియంతృత్వమే అన్న సత్యం బోధపడింది. అది బూర్జువా ప్రజాస్వామ్యమైనా, నూతన ప్రజాస్వామ్యమైనా, సోషలిస్టు ప్రజాస్వామ్యమైనా వ్యక్తి స్వేచ్చను నిగూఢ బంధనాలతో హరిస్తున్నాయన్నదే ఆ సత్యం.

    బూర్జువా ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా చెప్పుకునే గ్రేట్ బ్రిటన్‌లోనే కళారూప నిరసన ఇలా బంధనాలకింద మగ్గుతోందంటే వర్గ నియంతృత్వానికి ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థలు కళాత్మక నిరసనలపై ఎలా ఆధిపత్యం చలాయిస్తాయో చెప్పపని లేదు.

    వీధి చిత్రకారులు “స్ప్రే పెయింట్ డబ్బాలు కలిగి ఉండరాదనీ, అరెస్టయి బెయిల్ పై విడుదలయిన ఇతర ఆర్టిస్టులతో కలవడం గానీ మాట్లాడడం గానీ చేయరాదనీ, ఒలింపిక్స్ వేదికలకు మైలు దూరంలోపల కనపడరాదనీ, ఎటువంటి రైల్వే వ్యవస్ధలలోకి కూడా ప్రవేశించరాదనీ షరతులు విధించినట్లు బి.బి.సి మూడు వారాల క్రితం తెలిపింది.”

    ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా చెప్పబడుతున్న బూర్జువా కేంద్రంలోనే వీధిచిత్రకారుల గతి ఇలా ఉందంటే మనం ఇక ‘ఆ నియంతృత్వం’ గురించి ‘ఈ నియంతృత్వం’ గురించి విమర్శలు చేయనవసరం లేదు. ‘వ్యక్తి స్వేచ్ఛగా పుట్టాడు. కాని శృంఖలాబద్దుడవుతున్నాడం’టూ బూర్జువా తత్వశాస్త్రజ్ఞుడు రూసో పేర్కొన్న మహా వాక్యం ఈనాటికీ సత్యదాయకమై ఉంటోంది.

    ‘ఉనికిలో ఉన్న ప్రతిదాన్ని శంకించు, ప్రశ్నించు’ అన్న మార్క్స్ కొటేషన్ -ఇది కూడా తన స్వంత ఉల్లేఖన కాదనుకుంటాను- ని నిజం చేస్తూ ఈ వీధి చిత్రకారులు తమ కళ ద్వారా ప్రజాస్వామ్యం బోలుతనాన్ని నగ్నంగా చాటుతున్నారు. వీళ్లు నిజంగానే మనకాలపు కళా విప్లవకారులు -రెవల్యూషనరీస్ ఆఫ్ ఆర్ట్- అని ఘంటాపధంగా చెప్పవచ్చు.

    అన్నట్లు ఈ గొప్ప సృజనకారుడు.. రాజ్య కళ్లు గప్పి సంవత్సరాలుగా లండన్ వీధులను చిత్రకాంతులతో వెలిగిస్తున్న వాడు అయిన బాంక్సీ భావజాలపరంగా కమ్యూనిస్టు కాదనుకుంటాను. కమ్యూనిస్టేతర కళాకారులకే ఒక ఉన్నత బూర్జువా కేంద్రంలో ఇలాంటి ఆంక్షలు ఎదురవుతున్నాయంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ మాట అలా ఉంచుదాం… కళాత్మక స్వేచ్ఛకు కూడా ఎన్ని పరిమితులున్నాయో అర్థమవుతుంది.

    రాజ్య వ్యవస్థ ఏదయినా కావచ్చు.. అది ఎన్ని ముసుగులయినా ధరించవచ్చు కాని సృజనాత్మక నిరసనను జన్మహక్కుగా చేసుకుని స్వేచ్ఛను నిర్భీతిగా, నిర్మలంగా వ్యక్తీకరిస్తున్న ఈ సరికొత్త విప్లవకారులకు అభివందనాలు. ఏ సమాజానికైనా ఇలాంటి స్వేచ్చా విప్లవకారులు కావాలి.

    దయచేసి వీధిచిత్రకారులపై ఇంతవరకూ మీరు ప్రచురించిన అన్ని పోస్టులను ఒకే చోట చూసుకునేలా ఒక విడి కేటగిరీని రూపొందించండి. ధన్యవాదాలు..

  2. రాజశేఖర రాజు గారూ, అవును, కదా! ప్రజాస్వామ్యం దాని మౌలిక సారంలో నియంతృత్వం కనకనే ‘కార్మికవర్గ నియంతృత్వం’ అని కారల్ మార్క్స్ కుండబద్దలు కొట్టింది.

    కాకపోతే నూతన ప్రజాస్వామ్యంలో గానీ, సోషలిస్టు నిర్మాణంలో గానీ (ఆ మాటకొస్తే ఏ సామాజిక ఆచరణలోనైనా గానీ) తప్పులు, ఒలికిపోవడాలు సహజమే కదా. ఆ విధంగానే బూర్జువాలు తిరిగి తలెత్తుకోకుండా చేయడానికి అమలు చేసే కార్మిక వర్గ నియంతృత్వం ఒలికిపోయి కార్మికులపైకే వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు విమర్శ-ఆత్మ విమర్శల ద్వారా, ‘ప్రజలనుండి ప్రజలవద్దకు’ సూత్రం అమలు ద్వారా ఇంకా అందుబాటులో ఉండె అనేక సాధానాల ద్వారా వాటిని అరికట్టవలసిన బాధ్యత ‘సోషలిస్టు రాజ్యం’ పైన ఉంటుంది.

    మళ్ళీ అక్కడ కూడా (రాజ్యం స్ధాయిలో) పాత సమాజాల వాసనలు కొనసాగుతాయి కనుక తప్పులు జరిగే అవకాశం అక్కడా ఉంటుంది. సూత్రాల అమలు, అభివృద్ధి ఎంత నిరంతరమో, తప్పులు దొర్లడం సవరించుకోవడం అంతే నిరంతరం గా జరిగి తీరవలసిందే. అనుభావాలు పేరుకొనే కొద్దీ తప్పులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ లోపే ప్రత్యర్ధి వర్గాలు పై చేయి సాధించడమే రష్యా, చైనాలలో జరిగిన పరిణామం. మీకు తెలియదని కాదు గాని, ఇతర చదువరులకోసం రాస్తున్నాను.

    మీరు చెబుతున్న స్వేచ్ఛ సాపేక్షిక బంధనాలు పూర్తిగా తెంచుకున్న స్వేచ్ఛ కాదు కదా?!

    అయితే, మీరు చెప్పిన అర్ధంలోనే, ప్రజలకు సాంస్కృతిక స్వేచ్ఛ తప్పనిసరి. పరిమిత అర్ధంలో సామాజిక స్వేచ్ఛ కూడా. బూర్జువా సంస్కృతిగా చెబుతూ ఈ స్వేచ్ఛలను అరికట్టే తొందరపాటుకి సోషలిస్టు రాజ్యం గురికాకుండా ఉండవలసి ఉంటుంది. సాంస్కృతిక విప్లవంలో ఆర్ధిక వర్గాల ఆధిపత్యాన్ని కూలదోయడానికి అశేష ప్రజానీకానికి అప్పగించబడిన బాధ్యత ఒలికి పోవడం వల్ల కూడా తీవ్రమైన తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే కార్మికవర్గ రాజ్యం దానికి కాపలా కాయాలి. అలాంటి కాపలా మళ్ళీ అవసరమైన స్వేచ్ఛలలోకి జొరబడరాదు. ఇలాంటి వాటికి గీతలు, గోడలు ఉండవు గనక తప్పులు సహజమే మరి.

    అవును. బ్యాంక్సీ కమ్యూనిస్టు భావజాలాన్ని ఎక్కడా వ్యక్తం చేయలేదు. ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న పాలకవర్గాల అధారిటీ చుట్టూ ఆయన చిత్రాలు ఉంటాయి. ఆయన కమ్యూనిస్టు అయితే బి.బి.సి ఆయనని నెత్తిన పెట్టుకునే సాహసం చేయకపోను. బి.బి.సి ని కూడా లెఫ్టిస్టు గా అభివర్ణించే అజ్ఞానులకు కూడా కొదవలేదనుకోండి.

    వీధి చిత్రకారులపై విధించిన బెయిల్ షరతులు ఫాసిస్టు లక్షణాలకి ఏ మాత్రం తీసిపోనివి. అసలు స్ప్రే పెయింట్ డబ్బాలే ఉంచుకోవద్దనడం అంటే ఇతర చోట్ల బొమ్మలు వేసే స్వేచ్ఛను హరించడమే. ఒలింపిక్స్ ని చూసే హక్కును కూడా రద్దు చేసేశారు. పోలీసులు, కోర్టుల దుర్మార్గం ఒక విషయం అయితే, స్వేచ్ఛ పట్ల వారికున్న భయం మరో విషయం.

    మీ వ్యాఖ్య సమయానుకూలమైన అంశాలను ఎత్తి చూపడమే కాక, గుర్తించవలసిన అంశాలను మరోసారి నొక్కి చెప్పింది. కృతజ్ఞతలు.

  3. విశేఖర్ గారూ,
    మీ స్పందన మరింత అర్ధవంతంగా, సుబోధకంగా ఉంది. స్వేచ్ఛతో సహా ప్రతిదీ సాపేక్షమే. కాలాతీత, సమాజాతీత స్వేచ్ఛలు ఎక్కడా ఉండవు.

    కాని, నిరసన తెలిపితేనే ఒలింపిక్స్ పరువు, మహా గొప్ప గ్రేట్ బ్రిటన్ పరువు గంగలో కలుస్తాయని భయపడటం అంటే ఆ పరువు ప్రతిష్టల బోలుతనం చక్కగా అర్థమవుతూనే ఉంది. బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా కూడా బీజింగ్ చుట్టుపట్లా వంద మైళ్ల దూరంలో బిచ్చగాళ్లనేవాళ్లను ఎవరినీ లేకుండా చేశారట. ఇక్కడ బూర్జువా పరువు, అక్కడ కమ్యూనిస్టు ముసుగులోని బూర్జువాల పరువు రెండూ సమానమైపోయాయి చూడండి.

    ఒలింపిక్స్‌కు నిరసన, బిచ్చగాళ్లు అనే రెండు వాస్తవికతలను కనిపించకుండా చేయడానికి రాజ్యం ఎంత హేయమైన ఎత్తుగడలను అవలంబించిందో చూడండి. ఇది పరవంచన అనడం కంటే ఆత్మవంచన లేదా స్వీయ వంచన అంటేనే బాగుంటుంది.

    “తప్పులు, ఒలికిపోవడాలు సహజమే కదా. ఆ విధంగానే బూర్జువాలు తిరిగి తలెత్తుకోకుండా చేయడానికి అమలు చేసే కార్మిక వర్గ నియంతృత్వం ఒలికిపోయి కార్మికులపైకే వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. …

    సూత్రాల అమలు, అభివృద్ధి ఎంత నిరంతరమో, తప్పులు దొర్లడం సవరించుకోవడం అంతే నిరంతరం గా జరిగి తీరవలసిందే. అనుభావాలు పేరుకొనే కొద్దీ తప్పులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ లోపే ప్రత్యర్ధి వర్గాలు పై చేయి సాధించడమే రష్యా, చైనాలలో జరిగిన పరిణామం.”

    అవసరమైన స్వేచ్ఛలను ఏ సమాజమైనా హరించకుండా ఉండడానికి ఇలాంటి ఆత్మవిమర్శ నిరంతరం అవసరం.

    ఆన్‌లైన్‌లో 1930-40ల నాటి స్టాలిన్ రచనలు చదువుతుంటే సోవియట్ సమాజమూ, అక్కడి కార్మికవర్గపు సమున్నత కృషి, చివరకు స్టాలిన్ కూడా కొత్తగా అర్థమవుతున్నారు.

    ప్రపంచం మొత్తంగా ఏకమై స్టాలిన్ మీద దుమ్మెత్తి పోయనివ్వండి. కానీ ఆయన తన కాలపు సమాజానికి, తన యుగపు వాస్తవికతకు బంధితుడు. ఈ సత్యాన్ని ప్రపంచంలో ఏ ఒక్కరి కంటే మిన్నగా అన్నా లూయూ స్ట్రాంగ్ తన ‘స్టాలిన్ యుగం’ అనే పుస్తకంలో అతి స్పష్టంగా చెప్పింది. పాతికేళ్లకు ముందు ఈ పుస్తకం చదివాను. ఇప్పుడు ఇది తెలుగులో అందుబాటులో ఉందా చెప్పండి. తీసుకోవాలి.

    మొన్న తిరుపతికి వెళ్లినప్పుడు కాపిటల్ పరిచయంతో సహా రంగనాయకమ్మ గారి సిద్ధాంత రచనలు కొన్నింటితో పాటు ‘మార్క్స్ ఎంగెల్స్ ఆత్మీయుల స్మృతులు’ అనే పుస్తకం విశాలాంధ్రలో తీసుకున్నాను.

    ఇది ముప్పై ఏళ్లకు ముందు వచ్చిన సోవియట్ ప్రగతి ప్రచురణలకు పునర్ముద్రణ. ఎవరు ప్రచురించిందీ వివరాలు లేవు. శ్రీ చుక్కపల్లి పిచ్చయ్యగారి సౌజన్యంతో అని మాత్రమే ఉంది. అనువాదకులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు. వెల రూ.45లు. మీ వద్ద లేకుంటే వెంటనే తెప్పించుకోండి. మార్క్స్ ఎంగెల్స్ ల వ్యక్తిగత జీవితంపై వారి సమకాలికుల, మిత్రుల, సహచరుల అద్వితీయ స్మృతులను ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. మార్క్, జెన్నీల కుటుంబం 1850లలో ప్రవాసులుగా లండన్‌లో అనుభవించిన దుర్భర దారిద్ర్యం, బాధాకరమైన జీవతం గురించి ఈ పుస్తకం హృద్యంగా తెలుపుతోంది. తప్పకుండా తీసుకుని చదవండి. ప్రజాశక్తి బుక్‌షాపులో కూడా దొరకవచ్చు. రోజువారీ జీవితంలో పని ఒత్తిడులతో పుస్తకాలు చదవటం తగ్గుతోంది. ఇది నిజంగా మన ఆధ్యయనానికి నష్టదాయకమేనని అర్థమవుతోంది.

    ధన్యవాదాలు.

  4. బ్రిటిష్ ప్రభుత్వానికి వీధి చిత్రాల విమర్శలు పక్కలో బల్లెంలా తయారయ్యాయన్నమాట. రాజ్యం విధించే ఆంక్షలను ధిక్కరించి కళా సృజన చేస్తున్న బ్యాంక్సీ తెగువను మెచ్చుకునితీరాలి.

    విశేఖర్ గారూ, ఈ అద్భుత కళాకారుడి గురించి తెలిసింది నాకు మీ బ్లాగు ద్వారానే. సందర్భం వచ్చినప్పుడల్లా ఇతడి కళను పోస్టులుగా వేస్తున్నందుకు అభినందనలు.

    రాజు గారూ, ఈ పోస్టుపై మీ వ్యాఖ్య చాలా హృద్యంగా ఉంది. మీరన్నట్టు- ‘లండన్ వీధులను చిత్రకాంతులతో వెలిగిస్తున్న’ బ్యాంక్సీ, ఇతర చిత్రకారులు నిజంగానే ‘మనకాలపు కళా విప్లవకారులు’!

  5. రాజశేఖర రాజు గారు, మీ వ్యాఖ్యలే ‘అధ్యయనాన్ని విస్మరిస్తున్న సంగతిని’ నాకు తరచుగా గుర్తుకు తెస్తున్నాయి. పుస్తకాల పురుగుగా పేరు బడ్డ నేను చాలా పుస్తకాలు కొని కూడా అల్మరాలో భద్రపరిచి ఉంచాను. రొమిలా ధాపర్, అంబేద్కర్ రచనలు, ఇర్ఫాన్ హబీబ్ మొదలయిన వారి పుస్తకాలు కొని అలానే ఉంచాను. మీరిచ్చిన లింక్స్ ను తిరగవెయ్యడానికే ప్రత్యేక కార్యక్రమం పెట్టుకోవాలసి వస్తోంది. ఆఫీసు తప్ప నన్ను కదిలించేవారు ఎవరూ లేకపోయినా పుస్తకాలని అప్పుడప్పుడూ మాత్రమే చదువుతున్నాను. అందుకు బ్లాగ్ నిర్వహణ ఒక ముఖ్య కారణంగా ఉంటోంది. ప్రకటిత లక్ష్యాన్ని మార్చుకోవలసిన అవసరం తరుముతోంది. ఎలాగా అన్నది చూడాలి.

    మీరు చెప్పిన పుస్తకాల కోసం ప్రయత్నిస్తాను. స్టాలిన్ యుగం చాలా కాలం క్రితం చదివినది. ప్రారంభ కాలంలో చదివింది గనక ఎక్కువగా ఎక్కలేదు. గుర్తు కూడా లేదనుకోండి. స్టాలిన్ విషయమై మీరు చెప్పింది నిజం. అప్పట్లో ఏకైక సొషలిస్టు రాజ్యం నాయకుడిగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఏ పరిస్ధితుల్లో ఏ తప్పులు దొర్లాయో విశ్లేషించకుండా దుమ్మెత్తి పోయడం సరికాదు. పరిస్ధితులకు అతీతంగా జరిగే తప్పులను ఎత్తి చూపవలసిందే. కాని ప్రతితప్పునూ ఒకే గాటన కట్టేయడం ఉపయోగపడే విషయం కాదు.

    వేణు గారు, బ్యాంక్సీ గురించి నాకూ కాకతాళీయంగా తెలిసింది. నెట్ తిరగేస్తుండగా చూసి సమాచారాన్ని ప్రిజర్వ్ చేయడానికి బ్లాగ్ లో ఉంచాను. ప్రజా పోరాటాలు ఎన్ని రంగాల్లో, ఎన్ని ఫేసెట్ లలో జరుగుతాయో బ్యాంక్సీ ఉదాహరణ చెబుతుంది. కళారంగంలో ఘర్షణ, పోరాటలు ఎంత మిలిటెంట్ గా జరుగవచ్చో, అవి పాలక వర్గాలకు ఎంతగా గుబులు పుట్టిస్తాయో బ్యాంక్సీ శక్తివంతగా రుజువు చేస్తున్నాడు. ఈ పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టు దృక్పధం అవసరం లేదని కూడా అర్ధం అవుతోంది. అయితే అలాంటివి సంఘటిత రూపం తీసుకోవాలంటే, అర్ధవంతగా మారి పునాదులు కదలాలంటే ప్రస్తుతానికి మార్క్సిజం తప్ప మరో దారి లేదు. అరుంధతీ రాయ్ రచనను మొదట చూసినపుడు ఆమె నిజాయితిగా అవి రాస్తున్నట్లయితే ఖచ్చితంగా లెఫ్ట్ వైపుకు రావడం తధ్యం అనుకున్నాను. చివరికి అదే జరిగింది. వాస్తవం వైపుకి రావడం అంటే వాస్తవాలను సిద్ధాంతీకరించిన మార్క్సిజాన్ని స్వీకరించడమే.

  6. వేణు గారూ,
    ఈ పోస్టూ, దానిపై వ్యాఖ్యలు మిమ్మల్ని స్పందింపజేసినందుకు చాలా సంతోషం. నిజం చెప్పనా! విశేఖర్ గారు మొదట్లో వీధిచిత్రకారులను పరిచయం చేసినప్పుడు అంతగా నా మనసుకు అవి ఎక్కలేదు. కాని ఆ పోస్టులపై, మీ వ్యాఖ్యలు ఒకటి రెండు చూసిన తర్వాతే ఏదో ప్రత్యేకత వీటిలో ఉందనిపించి వాటిని అనుసరించడం మొదలెట్టాను. తర్వాత వీటికోసం వేచి ఉండటం కూడా ఆలవాటైపోయింది.

    రాజ్య వ్యవస్థ దృష్టిలో బ్యాంక్సీ అనే ఆయుధం పట్టని వీధి చిత్రకారుడు మోస్ట్ వాంటెడ్ మ్యాన్ అన్నమాట. బ్రిటిష్ లేదా బూర్జువా ప్రజాస్వామ్యం పరువు నిజంగా ఇక్కడే పోయింది మరి. ఏ ముష్కర యంత్రాంగానికీ ఇతగాడు భవిష్యత్తులో కూడా దొరకకూడదని తన స్వేచ్ఛా కాంక్షను సహస్ర ముఖాలతో లండన్‌ వీధుల్లో వెలిగించాలని కోరుకుంటున్నాను.

    విశేఖర్ గారూ,
    “మీ వ్యాఖ్యలే ‘అధ్యయనాన్ని విస్మరిస్తున్న సంగతిని’ నాకు తరచుగా గుర్తుకు తెస్తున్నాయి.”

    ఇక్కడ సందర్భోచితం కాకున్నా ఒక మాట చెప్పాలి. తిరుపతిలో విశాలాంధ్ర బుక్‌షాప్‌తో నాకు 1983 నుంచి పరిచయం. పల్లెలో, తాలూకాలో చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్రలతోనూ తర్వాత డిటెక్టివ్ పుస్తకాలతోనూ కాలం గడుపుతున్న నాకు యూనివర్శిటీ విద్యకు వచ్చాకే విశ్వ సాహిత్యాన్ని ఆబగా అందిపుచ్చుకునే అవకాశం లభ్యమైంది. తిరుపతిలో పీజీ, ఎంఫిల్ పరిశోధనకోసం ఉన్న అయిదేళ్లలో హోటల్‌కు వెళ్లి ఏదైనా ఇష్టమైనది తిన్న ఘటనలు చాలా చాలా తక్కువ.

    నెలలో పది రూపాయలు మిగిలితే వెంటనే విశాలాంధ్రకు పరుగెత్తడమే. రూపాయి, రెండు రూపాయలకు దొరికే ఉద్గ్రంధాలు, రష్యన్ క్లాసికల్ నవలలు అయిదో పదో కొనుక్కుని నెలంతా చదువుకోవడం. 83లో గోర్కీ నవల ‘అమ్మ’ తెలుగు అనువాదం పూర్తి అనువాదం- వెల ఆరు రూపాయలు. ‘ప్రశాంత ప్రత్యూషాలు,’ ‘అజేయ సైనికుడు’ అనే రెండు నవలలూ కలిసి ఆరు రూపాయలు. ఒక్కొక్కటి 300 పేజీల పైబడిన పుస్తకాలివి.

    ఈ రోజు విశాలాంధ్రలో ఇవి సొరుగులలో బయటికి కనబడవు. కొనేవారి అభిరుచి, గిరాకీ ఉన్న పుస్తకాలు వేరే అయిపోయాయి. వ్యక్తిగత విజయాన్ని, కెరీర్‌ని, వ్యక్తి స్వార్థాన్ని ప్రేరేపించే బూర్జువా వ్యక్తిత్వ సొల్లు గురించి వాగే పుస్తకాలకు ప్రాధాన్యత వచ్చేసింది. విశాలాంధ్రకు పోతే మనకు నచ్చే పుస్తకాలు బయటికి కనబడవు. మనమే వెతుక్కోవాలి.

    విశాలాంధ్ర ప్రస్తుత మేనేజర్‌ని, నా చిరకాల మిత్రుడిని ‘మహామేధావి మార్క్స్, తదితర పుస్తకాలు ఏవయినా ఉన్నాయా?’ అని అడిగితే తను ఒక్కసారిగా నవ్వేశాడు. ‘సంవత్సరానికి ఒకసారి మీరు తిరుపతికి వస్తారు. ఇలాంటి పుస్తకాలను గురించి మాకు గుర్తు చేస్తారు. మిగతా జనాలకు ఎవ్వరికీ అవి గుర్తులేకుండా పోయాయి,’ అని వ్యంగ్య ప్రకటన చేస్తూ నాకవసరమైనవి పై ర్యాక్స్ లోంచి వెతికి ఇచ్చాడు.

    అంతకుముందున్న విశాలాంద్ర మేనేజర్‌ని గతంలో సైద్ధాంతిక రచనల కోసం నేను వాకబు చేస్తే ‘మీకింకా పుస్తకాల పిచ్చి పోలేదు. ఎలా బాగుపడతారో,’ అన్నాడు. తను కూడా పాతికేళ్లుగా నాకు తెలుసు.. అలా అన్న వాడు కొన్నాళ్లకే ఐపి పెట్టి కుటుంబంతో సహా పారిపోయాడు. చీటీ వ్యాపారం చేస్తూ 30 లక్షల దాకా ముంచేసి పారిపోయాడని ప్రతీతి. రెండేళ్లుగా తన ఆచూకీ తెలియదు. కమ్యూనిస్టు వ్యాపారిగా మారితే, బూర్జువాల కంటే మిన్నగా కొంప ముంచుతాడు అనేది చాలా కాలంగా వింటూవచ్చాను.

    అధ్యయనాన్ని విస్మరించడం అంటే మన ఉనికిని మనం విస్మరించడమే. శరవేగంగా మారుతున్న సామాజిక జ్ఞానాన్ని విస్మరించడమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s