పాకిస్ధాన్ దేశ అత్యున్నత రాజ్యాంగ నాయకుడిపై అక్కడి సుప్రీం కోర్టు రెండో సారి ‘కోర్టు ధిక్కారం’ కేసు కింద విచారణ జరపడానికి ఉద్యుక్తం అవుతోంది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడన్న నేర నిర్ధారణ చేసి మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ని పదవీ భ్రష్టుడిని చేసిన పాక్ సుప్రీం కోర్టు, సరిగ్గా అవే కారణాలతో ఆ తర్వాతి ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై కూడా చర్యలు మొదలు పెట్టింది.
పాకిస్ధాన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ అవినీతి కేసులను తిరగదోడడానికి కొత్త ప్రధాని కూడా తిరస్కరించడమే కోర్టు చర్యలకు కారణం. ముషార్రఫ్ నేతృత్వంలోని మిలట్రీ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్ష చెల్లదని తీర్పు చెప్పాక జర్దారీ పై అవినీతి కేసులపై పునః విచారణ చేయాలని సుప్రీం కోరినప్పటికీ అధ్యక్షుడికి రాజ్యాంగ రక్షణ ఉన్నదని సాకు చెబుతూ ఇరువురు ప్రధానులూ నిరాకరించారు.
అధ్యక్షుడు జర్దారీ పై అవినీతి కేసులను తిరిగి తెరవాలన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించాడన్న నేరానికి మాజీ ప్రధాని గిలానీ పాల్పడ్డాడని కోర్టు నిర్ధారించి నామ మాత్రంగా కొద్ది సెకన్ల పాటు జైలు శిక్ష విధించింది. ఆ శిక్షతో అంతా ముగిసిపోయిందనీ, ప్రధానిగా కొనసాగవచ్చనీ భావించిన గిలానీ లెక్క తప్పింది. గిలానీ ప్రధాని పదవికి అనర్హుడని, అతనిని తొలగించాలనీ కోర్టులో దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ గిలానీ వెంటనే గద్దె దిగాలని తీర్పు చెప్పింది.
ఆ తర్వాత జర్దారీ ప్రాపంకంలోనే పర్వేజ్ అష్రాఫ్ కూడా ప్రధానిగా ఎన్నికయ్యాడు. పదవిలోకి వచ్చినప్పటినుండే ఆయన అధ్యక్షుడు జర్దారీ కేసులను తిరగదోడే ఉద్దేశమేమీ తనకు లేదని ప్రకటించాడు. కోర్టు ధిక్కార విచారణ నుండి ప్రధానిని తప్పించడానికి పాక్ పార్లమెంటు కొత్త చట్టాన్ని తెచ్చింది. చట్టం ఆమోదం పొందినప్పటికీ దానిని కూడా సుప్రీం కోర్టు రద్దు చేసింది. సదరు చట్టం రాజ్యాంగ విరుద్ధం అని తీర్పులో పేర్కోంది. దానితో వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. జర్దారీ పై కేసులు తిరగదోడాల్సిందేనని కోర్టు హుకుం జారీ చేసింది. తదనుగుణంగా ప్రధాని అష్రాఫ్ పై కోర్టు ధిక్కారం నేరాన్ని విచారించడానికి ప్రక్రియ ప్రారంభించినట్లు ‘ది హిందూ’ తెలిపింది.
సుప్రీం కోర్టు ప్రయత్నాలు కొనసాగితే ఒక సంవత్సరంలోనే కోర్టు ధిక్కార నేరాన్ని ఎదుర్కొన్న రెండవ ప్రధానిగా పర్వేజ్ అష్రాఫ్ నిలుస్తాడు. ప్రధానిగా కొనసాగాలంటే కోర్టు ఆదేశాలను అనుసరించి జర్దారీ పై మనీ లాండరింగ్ కేసులు తిరిగి తెరవాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి లేఖ రాయక తప్పని పరిస్ధితిని అష్రాఫ్ ఎదుర్కొంటున్నాడు. జూన్ 22 న ప్రధాని పదవి చేపట్టిన అష్రాఫ్ పదవీకాలం మరో ఆరు నెలలే ఉన్నప్పటికీ ఆ కాస్త కాలం కూడా పూర్తి చేసే పరిస్ధితి కనిపించడం లేదు.
ప్రధానికి షోకాజ్ నోటీసు జారీ చేయక తప్పని పరిస్ధితిని తమకు కల్పించబడిందని కోర్టు వ్యాఖ్యానిస్తూ అష్రాఫ్ ను తన ముందు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలను అనుసరిస్తూ కోర్టు పట్ల తిరస్కారాన్ని ప్రధాని చూపుతున్నాడని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఉండడానికి ప్రధాని పరిమితులు లేకుండా వ్యవహరిస్తున్న నేపధ్యంలో కోర్టు పాటిస్తున్న సంయమనానికి కూడా హద్దులు ఉండబోవని వ్యాఖ్యానించీంది.
సాధారణ పార్లమెంటు ఎన్నికలు జరగడానికి ఇంకా ఆరు నెలలు ఉన్నట్లు తెలుస్తోంది. నవంబరులో ఎన్నికలు జరగవచ్చని కూడా పత్రికలు ఊహిస్తున్నాయి. ఈ లోపే ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించడానికి పౌర ప్రభుత్వం పేరు కింద జమగూడిన జర్ధారీ నేతృత్వంలోని పాలక గ్రూపు, మిలట్రీ నేతృత్వంలోని మరో పాలక గ్రూపు పరస్పరం తీవ్రంగా ఘర్షణ పడుతున్నాయి. కోర్టులు సైతం పాక్ మిలట్రీ పాలకులకు మద్దతుగా నిలుస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరి కొట్లాటలో పాకిస్ధాన్ ప్రజానీకం బలిపశువులుగా మిగిలిపోతున్నారు.
ఉపఖండంలో నానాటికీ హద్దులు దాటుతున్న జుడీషియల్ యాక్టివిజం కి ఇది మరో ఉదాహరణ.