+92, +90 లనుండి మేసేజ్ లా? మీ మొబైల్ సిమ్ క్లోనింగ్ ప్రయత్నం కావచ్చు


మొబైల్ ఫోన్ ల సిమ్ లను క్లోనింగ్ చేసి ఆర్ధిక మోసాలకు పాల్పడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా తెలుస్తోంది. ఒక ఢిల్లీ నివాసి నుండి వచ్చిన ఫిర్యాదును ఛేదించే క్రమంలో సిమ్ కార్డ్ క్లోనింగ్ కోసం జరుగుతున్న ప్రయత్నాల గురించిన సమాచారం వెల్లడయింది. మొబైల్ సిమ్ ను క్లోనింగ్ చేసే సౌకర్యం కొన్ని వెబ్ సైట్లు అందిస్తున్నాయనీ, వీటిని ఉపయోగించి సొంతదారులకు తెలియకుండానే వారి మొబైల్ సిమ్ లను రహస్య కోడ్ తో సహా కాపీ చేసి ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

స్వప్న పాల్ పేరు గల ఢిల్లీ నివాసి ఫోన్ నుండి ఆమె తండ్రి ఎస్.కె.మజుందార్ కు రెండు సంవత్సరాల నుండి బెదిరింపు సందేశాలతో ఎస్.ఎం.ఎస్ లు వస్తున్నాయి. చాలాకాలంగా వీటిని పట్టించుకోని మజుందార్, స్వప్న లు సదరు మెసేజ్ ల ఉరవడి పెరిగిపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును ఛేదించడంలో ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇంకా సఫలం కాలేకపోయారు. సాంకేతిక పరిశోధన ద్వారా కేసును ఛేదించడానికి పోలీసులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. స్వప్న సిమ్ కార్డును క్లోన్ చేయడం ద్వారా అజ్ఞాత వ్యక్తులు ఇది చేయగలుగుతున్నారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.

నోయిడాలోని ఒక ప్రవేటు స్కూల్ లో టీచర్ గా చేస్తున్న స్వప్న తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాలని, లేనట్లయితే చనిపోక తప్పదనీ ఎస్.ఎం.ఎస్ బెదిరింపుల సారాంశం. ఈ విషయమై మజుందార్ కు రెండు రకాల సందేశాలు వస్తున్నాయి. ఒకటి బెదిరిస్తూ వచ్చే సందేశం కాగా మరొకటి దానికి పరిష్కారం చెప్పేది. “సందేశంలో ఉన్న సూచనలు పాటించినట్లయితే నా కూతురుకేమీ జరగదని రెండో ఎస్.ఎం.ఎస్ చెబుతుంది” అని మజుందార్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇండియా టుడే తెలిపింది. సందేశం చివర ఒక హిందూ దేవత పేరు ఉంటుందని మజుందార్ ఫిర్యాదులో తెలిపాడు. ఈ ఫిర్యాదుతో నిర్ఘాంత పోవడం  ఢిల్లీ పోలీసులు వంతయ్యింది.

మజుందార్, స్వప్న

సిమ్ కార్డు క్లోనింగ్ తో ఇది సాధ్యమేనని సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు చెబుతున్నారు. “స్వప్న సిమ్ కార్డు ను ఎవరైనా క్లోన్ చేయడం సాధ్యమే. ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి మెసేజ్ వెళ్లిందంటే ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం. ఈ నిర్దిష్ట కేసులో వారి కుటుంబాన్ని కష్టపెట్టడానికి, వేధించడానికి మోసకారి ఎవరైనా, ఏదైనా వెబ్ సైట్ నుండిఈ మెసేజ్ లు పంపి ఉండవచ్చు కూడా” అని ఒక పోలీసు అధికారి తెలిపాడు. ఆయన ప్రకారం ఈ పనికోసం ఉపయోగపడే వెబ్ సైట్లు అనేకం ఉన్నాయి.

సైబర్ క్రైమ్ నిపుణుడైన పవన్ దుగ్గల్ అనే అధికారి ఇలా చెప్పాడు. “ఇది సిమ్ కార్డ్ క్లోనింగ్ అవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సిమ్ కార్డ్ క్లోనింగ్ కి గురయినపుడు వాడకందారు అనుమతి లేకుండానే అందులోని సమాచారాన్నంతా మరో కార్డులోకి కాపీ చేస్తారు. అలాంటి క్లోనింగ్ కోసం అనేక సాఫ్ట్ వేర్ లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి” అని ఆయన తెలిపాడు. “సాధారణంగా ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి వారి ఖాతానుండి డబ్బు దొంగిలించడానికి సిమ్ కార్డ్ క్లోనింగ్ జరుగుతుంది. కానీ ఈ కేసులో మాత్రం భయపెట్టి, పరిష్కారం కూడా చెప్పడం ద్వారా వారి కుటుంబాన్ని అయోమయానికి గురి చేసి దారి తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నం కావచ్చు.  భారతీయ దేవత పేరును ఉపయోగించడం అంటే ఆ దేవతపై వారి నమ్మకాన్ని వాడుకునే ప్రయత్నం. సాంకేతిక కోణంలో అనుమానించకుండా చేయడానికి జరిగిన ప్రయత్నం” అని దుగ్గల్ తెలిపాడు.

+92, +90 కోడ్ లతో జాగ్రత్త!

ఇండియా టుడే ప్రకారం +92 లేదా +90 కోడ్ తో ప్రారంభం అయ్యే నెంబర్ నుండి వచ్చే కాల్స్ కు గానీ మెసేజ్ లకు గానీ స్పందిస్తే, స్పందించిన వారి ఫోన్ నెంబర్ కోనింగ్ గురయ్యే అవకాశాలు ఎక్కువ. కనీసం 5 సెకండ్ల పాటు అలాంటి ఫోన్ కాల్స్ కు స్పందిస్తే క్లోనింగ్ జరిగిపోతుంది. సి.డి.ఎం.ఏ కార్డుల పై క్లోనింగ్ విజయవంతం అవుతుందనీ, అయితే జి.ఎస్.ఎం కార్డుల క్లోనింగ్ అరుదుగా జరుగుతున్నదనీ పత్రిక తెలిపింది. జి.ఎస్.ఎం సిమ్ కార్డులను క్లోన్ చెయ్యాలంటే సిమ్ కార్డులను ఫోన్ పరికరం నుండి బైటికి తీయాల్సిందే. బైటికి తీశాక ఫోన్ కు సిమ్ కార్డుకు మధ్య క్లోనింగ్ జరిగే పరికరాన్ని ఉంచి కొద్ది రోజుల పాటు ఆపరేట్ చేయాల్సి ఉంటుందని తద్వారా రహస్య కోడ్ తో సహా క్లోనింగ్ చేయవచ్చని పత్రిక తెలిపింది. ఐ.టి చట్టం 2000 లోని సెక్షన్ 66ఎ ప్రకారం సిమ్ కార్డుని క్లోన్ చేసినా, నంబర్ ను దుర్వినియోగం చేసినా శిక్షార్హులు.

రెండురోజుల క్రితమే ఒక స్నేహితుడి ఫోన్ కి +92 కోడ్ తో ప్రారంభం అయే ఒక నెంబర్ నుండి ఒక మేసేజ్ రావడం ఈ బ్లాగర్ చూడడం తటస్ధించింది. అతనికి పెద్దగా చదువుకోకపోవడం వల్ల మిస్ డ్ కాల్ గా భావించి చూడామని కోరడంతో +92 కోడ్ కనిపించింది. గల్ఫ్ లో ఉన్న తన బంధువులనుండి వచ్చిన మెసేజ్ గా అతను భావించాడు. చూస్తే ఏదో ఒక లాటరీ తగిలిందనీ సొమ్ము చేసుకోవడానికి కాల్ చేయాలని దాని సారాంశం. అది చెప్పకుండా స్పందించొద్దని చెప్పి పంపాను గానీ విషయం అర్ధం కాలేదు.  నెట్ లో వెతికితే ఎయిర్ టెల్ కంపెనీ నిర్వహిస్తున్న ఒక ఫోరం లో ఇలాంటి ఫిర్యాదుల వెల్లువ కనిపించింది. 2009 నుండీ ఈ ఫిర్యాదులు నమోదై ఉన్నాయి.

ఎయిర్ టెల్ అధికారి ఒకరు సదరు ఫిర్యాదులకు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. దానిగురించి ఇంకా తమకు తెలియదనీ పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నిస్తామనీ హామీ ఇచ్చి సమాధానం ముగించారు. ఇదంతా 2009 లో జరిగింది. ఆ తర్వాత కూడా ఫిర్యాదులు నమోదైనా పరిష్కారం అయితే చెప్పినట్లు కనపడలేదు. +92 కోడ్ పాకిస్తాన్ ది కనుక ముంబై టెర్రరిస్టు దాడుల కోణంలో స్పందిస్తూ ఇతర ఫోరం లలో కొందరు యూజర్లు సమాధానం చెప్పారు.  మోసకారుల చర్యలు ఒక్కోసారి ఎంతటి దురభిప్రాయాలను కలుగ చేస్తాయో తెలియడానికి ఇదొక ఉదాహరణ. ఇంతకీ మజుందార్ కి వచ్చిన మేసేజ్ లు ఈ కోడ్ ల నుండి వచ్చాయో లేదో తెలియరాలేదు. దురభిప్రాయం కలగొచ్చన్న అనుమానంతో పోలీసులు చెప్పలేదేమో తెలియదు. మొత్తం మీద ఈ రెండు కోడ్ ల నుండి వచ్చే కాల్స్, మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది.

One thought on “+92, +90 లనుండి మేసేజ్ లా? మీ మొబైల్ సిమ్ క్లోనింగ్ ప్రయత్నం కావచ్చు

  1. పింగ్‌బ్యాక్: +92, +90 లనుండి మేసేజ్ లా? మీ మొబైల్ సిమ్ క్లోనింగ్ ప్రయత్నం కావచ్చు | Raja's Realms

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s