టార్చర్ ఛాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ…


కాళ్ళకూ, చెవులకూ ఎలక్ట్రిక్ షాక్ లు, బట్టలు ఊడడదీసి చేతులూ కాళ్ళూ కట్టేసి తలకిందులుగా వేలాడదీసి లాఠీలతో కుళ్లబోడవడం ఇవీ బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నలభైయేళ్ల క్రితం ఎదుర్కొన్న చిత్రహింసలు. యుక్త వయస్సులో లెఫ్టిస్టు గెరిల్లా పోరాటంలో ఉండగా నియంతృత్వ ప్రభుత్వ పోలీసులకు పట్టుబడి మూడేళ్ళ చీకటి కారాగారవాసం అనుభవించిన దిల్మా రౌసెఫ్ తన గత జీవితాన్ని బహిరంగంగ ఇంతవరకూ ఏ పత్రికకూ, వ్యక్తులకూ చెప్పలేదు. ఎస్టెల్లా అనే యుద్ధ నామం (nom de guerre) తో గెరిల్లా యుద్ధంలో పాల్గొన్న దిల్మా టార్చర్ చాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ ఎదగడం, ప్రజా జీవితం నుండి పాలకవర్గాలకు సేవకురాలుగా పరివర్తన  చెందిన ఫలితం.

బ్రెజిల్ లో 1964 నుండి 1985 వరకూ నియంతృత్వ పాలన సాగింది. ఆనాటి నియంతృత్వ పాలన ఛాయలు, విరోధాలు ఇప్పటికీ బ్రెజిల్ లో వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయి. నియంతృత్వ పాలకులు ప్రజలపై సాగించిన దురన్యాయాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం ట్రూత్ కమిషన్ నియమించింది. ట్రూత్ కమిషన్ విచారణ వల్ల అప్పటి అణచివేతలు, చిత్రహింసల కధలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గుండెల్ని వణికించే ఆనాటి భయానక హింసల వివరాలు బ్రెజిల్ ప్రజల్లో కొంతమందికి పాత జ్ఞాపకాలు గుర్తుకు తెస్తుండగా, అనేకమందికి వారెరుగని చీకటి చరిత్రను విప్పి చూపుతున్నాయి.

చిత్రహింసల కొలిమి

అర్బన్ గెరిల్లా గ్రూపులో సభ్యురాలయిన దిల్మా 1970 లో నియంతృత్వ పాలకులకు పట్టుబడింది. పట్టుబడే నాటికి ఆమె వయసు 22 సంవత్సరాలే. 3 సంవత్సరాల పాటు ఆమె జైలులో అనుభవించిన  చిత్ర హింసల విషయం ఇప్పుడు ప్రముఖంగా చర్చించబడుతోంది. ఆమెను ఇంటరాగేట్ చేసిన వారు ఆమెను పదే పదే ఎలక్ట్రిక్ షాక్ లకు గురి చేశారనీ, కాళ్ళకూ, చెవులకూ వైర్లు తగిలించి షాక్ ఇచ్చేవారనీ, పూర్తి నగ్నం కావించి కాళ్ళూ చేతులూ కట్టేసి ఒక కర్రకు తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేసేవారనీ తమకు అందిన సమాచారం ఆధారంగా పత్రికలు వెల్లడిస్తున్నాయి.

పోలీసు రికార్డుల్లో గెరిల్లాగా…

ఇంటరాగేషన్ లో దిల్మా ను హింసించినవారిలో 76 సంవత్సరాల మారిషియో లోపేస్ లీమా ఒకరు. అప్పటి మిలట్రీలో లెఫ్టినెంట్ కల్నల్ గా చేసిన లోపేస్, తనపై ఆరోపణలు నిజం కాదని చెబుతున్నప్పటికీ దిల్మా ను ‘మంచి గెరిల్లా’ గా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. లోపేస్ లాంటి అనేకమంది మాజీ మిలట్రీ పాలకులను బ్రెజిల్ లోని హక్కుల సంఘాలు ఇతర ప్రజా సంఘాలు వెంటాడుతున్నాయి. బ్రెజిల్ వ్యాపితంగా అనేక నగరాలలోని వారి ఇళ్లను చుట్టుముడుతున్నారు. 1979 లో నియంతృత్వ ప్రభుత్వం ప్రకటించిన ‘క్షమాభిక్ష’ మాజీ మిలట్రీ అధికారులను ‘టార్చర్’ ఆరోపణలనుండి ఇప్పటికీ రక్షణ  కల్పిస్తోంది. అయినప్పటికీ గత మే నెలలో మొదలయిన ట్రూత్ కమిషన్ చీకటి చరిత్రను తవ్వితీస్తుండడంతో వారిని గతం వెన్నాడుతోంది. 400 మందికి పైగా ప్రజలను చంపిన బ్రెజిల్ నియంతృత్వ పాలకులు అనేకవేలమందిని చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

నియంతృత్వాలకు వ్యతిరేకంగా సాయుధ గెరిల్లా పోరాటాలు నడిపి అనంతరం రాజకీయ నాయకులుగా దేశాలను ఏలుతున్నవారిలో దిల్మా రౌసెఫ్ ఒంటరి కాదు. అమెరికా మద్దతుతో లాటిన్ అమెరికా దేశాలను ఏలిన అనేకమంది నియంతలు దేశ వనరులను అమెరికాకి అప్పజెప్పి ప్రజలను తమ హింసాత్మక పాలనలో అణచివేశారు. సదరు నియంతలకు ఎదురోడ్డి పోరాడిన వారు ఇతర దేశాల్లోనూ అధికారాన్ని చేపట్టారు. చిలీ మాజీ అధ్యక్షుడు మిచెల్లే బాచెలెట్ వారిలో ఒకరు. 1973 మిలట్రీ కుట్రతో అధికారం లాక్కున్న పినోచెట్ పాలనలో దారుణమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్న బాచెలెట్ అనంతరం చిలీ అధ్యక్షుడు అయ్యాడు. ఉరుగ్వే అధ్యక్షుడు జోస్ ముజికా సైతం ‘తుపమారో గెరిల్లా ఆర్గనైజేషన్’ నాయకుడుగా అరెస్టయ్యి 14 సంవత్సరాల కారాగారంలో తీవ్ర హింసను అనుభవించాడు.

తన నిర్బంధ జీవితంపై దిల్మా ఇంతవరకూ మౌనాన్ని వీడలేదు. నియంతృత్వ బాధితురాలుగా గుర్తింపబడడానికి నిరాకరించడమే ఆమె మౌనానికి అర్ధం కావచ్చు. కానీ నియంత్రత్వం నీడలో సాగిన చీకటి చర్యలను వెలికితీయడానికి కృషిని ఆమె ప్రభుత్వం కొనసాగిస్తోంది. ది హిందూ కధనం ప్రకారం బహిరంగంగా ఆమె ఎన్నడూ తనపై సాగిన క్రూర నిర్బంధకాండను ప్రస్తావించలేదు. ట్రూత్ కమిషన్ గురించి మాట్లాడింది కూడా తక్కువే. కమిషన్ పై గానీ, తన జైలు జీవితం పైగానీ స్పందించడానికి ఆమె నిరాకరించినట్లు ‘న్యూయార్క్స్ టైమ్స్’ తెలిపింది. బల్గేరియన్ వ్యాపారికీ, బ్రెజిలియన్ స్కూల్ టీచర్ కీ జన్మించిన దిల్మా ఆర్ధికంగా ఒకింత ఉన్నత స్ధితిలోనే పరిగినప్పటికీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ‘పల్మారెస్ ఆర్మ్ డ్ రివల్యూషనరీ వేన్ గార్డ్’ లో చేరి ఉద్యమంలోకి దూకింది.

మంచి గెరిల్లా

జైలు నుండి విడుదలయ్యాక పోర్టో అలెగ్రే నగరంలో ఆమె తిరిగి చదువు ప్రారంభించింది. 1976 లో కూతురు పుట్టాక స్ధానిక రాజకీయాల్లో ప్రవేశించింది. టెక్నోక్రాట్ గా ఎదుగుతూ జాతీయ ప్రాముఖ్యం సంపాదించింది. మాజీ అధ్యక్షుడు లూలా డి సిల్వా కు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, విద్యుత్ మంత్రిగా పని చేసి తన గురువు ప్రాపకంలో దేశాధ్యక్ష పదవిని అలంకరించింది. 2010 ఎన్నికల్లో లూలా పార్టీ తిరిగి ఎన్నిక కావాడానికి దిల్మా పైనే ఆయన ప్రధానంగా ఆధారపడ్డాడని చెబుతారు. టార్చర్ చాంబర్లలో దిల్మా అనుభవించిన చిత్రహింసల చరిత్ర ఈ కాలం అంతటా మరుగునే ఉండిపోయింది. నియంతృత్వాన్ని ఎదిరించిన మహిళల గురించి ఒక రచయిత పుస్తకం రాస్తున్న సందర్భంగా దిల్మా కొద్ది వివరాలను ఆ రచయితకు చెప్పడంతో 2005 లో కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.

గురువు లూలా డిసిల్వా తో…

దిల్మా రౌసెఫ్ ను ‘మంచి గెరిల్లా’ గా చెబుతూనే ఆమెను హింసించిన విషయాన్ని లిమా లోపేస్ నిరాకరిస్తున్నాడు. ఇతర మాజీ మిలట్రీ పాలకులు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. బ్రెజిల్ ఆర్మీ కి సెక్రటరీ జనరల్ గా పని చేసిన ‘ఎడ్వర్డో రోచా పైవా’ ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ దిల్మా విషయాన్ని ప్రస్తావించాడు. దిల్మా సాయుధ మిలిటెంటు గ్రూపులో పని చేసిందని, సోవియట్ తరహా నియంతృత్వాన్ని స్ధాపించాలని ఆ గ్రూపు కోరుకుందనీ చెప్పాడు. తిరుగుబాటుదారులు కూడా చిత్రహింసాలకు పాల్పడ్డారని వాదించాడు. “మిలట్రీ హయాంలో టార్చర్ జరిగిందా? అవును. బ్రెజిల్ లో ఈరోజు టార్చర్ ఉన్నదా? ఉంది” అని ఆయన వ్యాఖ్యానించాడు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలకు తానెప్పుడూ పాల్పడలేదని దిల్మా చెప్పినా మాజీ మిలట్రీ అధికారుల వ్యాఖ్యలను ఖండించడానికి ఆమె ప్రయత్నించలేదు. అంతేకాక టార్చర్ బాధితులకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారం అందుకున్నవారిలో దిల్మా కూడా ఒకరు. ‘టార్చర్ నెవర్ ఎగెయిన్’ (టి.ఎన్.ఎ) అనే సంస్ధకు తనకు వచ్చిన 10,000 డాలర్లను ఇస్తానని ఆమె ప్రకటించింది కూడా. మిలట్రీ హింసలకు వ్యతిరేకంగా చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఏర్పరిచిన టి.ఎన్.ఎ కార్యాలయం ఇటీవల విధ్వంసానికి గురవడాన్ని బట్టి మాజీ మిలట్రీ నియంతల ప్రాపకంలో ఎదిగిన ధనికవర్గాల శక్తి తగ్గిపోలేదని అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నికల ఉపన్యాసాల్లో గానీ, ప్రభుత్వ మీటింగుల్లో గానీ, వ్యక్తిగత సంభాషణల్లోగానీ ఏనాడూ తాను ఎదుర్కొన్న హింసను ప్రస్తావించని దిల్మా రౌసెఫ్ అంతరంగం కొన్ని పశ్చిమ పత్రికలకు కొరుకుడు పడని విషయం. కాగా, తమ హయాంలో చిత్రహింసలు నిజమేననీ, (ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న) ఇప్పటి హయాంలోనూ చిత్ర హింసలు నిజమేననీ నియంతృత్వ పాలన నాటి సైన్యాధికారులు ముక్తాయించడం దీనంతటికీ కొసమెరుపు. దేశ వనరులను దోచుకోవడానికి పాలకవర్గాలలో ఒకే గ్రూపు చేసే ప్రయత్నాలు నియంతృత్వం రూపం ధరిస్తే, ఇతర గ్రూపులకు కూడా దోచుకునే అవకాశం కల్పించడం ప్రజాస్వామ్యంగా చెప్పబడుతుందని బ్రెజిల్ నియంతృత్వ సైన్యాధికారుల ముక్తాయింపు విప్పి చెబుతున్న సత్యం. యుక్త వయస్సులో ప్రజలకోసం బతికినప్పటికీ అనంతరం దోపిడీ వ్యవస్ధలోనే టెక్నోక్రాట్ గా, రాజకీయవేత్తగా, దేశాధ్యక్షురాలిగా ఎదగడం ద్వారా దిల్మా రౌసెఫ్ తాను ప్రజల పక్షం నుండి పాలకవర్గాల పక్షం చేరిపోయాయని స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడామె ‘మంచి గెరిల్లా’ గా మాజీ నియంతృత్వ ప్రభువుల చేత మన్ననలు అందుకుంటోంది.

4 thoughts on “టార్చర్ ఛాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ…

 1. విశేఖర్ గారూ,
  ఉదయమే హిందూలో ఈ వార్త చదివాను. మంచిగెరిల్లాగా మాజీ నియంతృత్వ ప్రభువుల చేత మన్ననలు అందుకోవడం ఆ ప్రభువులు, వారి తైనాతీ అధికారులు ప్రస్తుతం స్వచర్మ రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలేమో మరి. నలభై ఏళ్ల క్రితం తాము తలకిందులుగా, నగ్నంగా వేలాడదీసి హింసించిన ఈ యువగెరిల్లా ఇప్పుడు మంచి గెరిల్లా అయిపోయిందని హింసించిన వారే కితాబివ్వడం వెనుక ఖచ్చితంగా స్వప్రయోజనాలున్నాయి.

  ఈ వార్త చదివినప్పటినుంచి మరోసారి నాకు ఇరాన్ మహిళా గెరిల్లా రాసిన “చిత్రహింసల కొలిమిలోంచి” నవల పదే పదే గుర్తుకొస్తోంది. హెచ్‌‌బిటి వాళ్లు పాతికేళ్ల క్రితమే ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించారు కూడా.

 2. రాజశేఖర రాజు గారూ,

  ఈ కధనం నిజానికి న్యూయార్క్ టైమ్స్ పత్రికది. న్యూయార్క్ టైమ్స్ తో పాటు గార్డియన్, డి.పి.ఎ (జర్మని), అసోసియేటెడ్ ప్రెస్ లాంటి సంస్ధల కధనాలను ‘ది హిందూ’ ప్రచురిస్తోంది. ఇవన్నీ లిబరల్ ముసుగు ధరించే పత్రికలు. ప్రజాస్వామ్యం కి గట్టి మద్దతుదారులుగా ప్రకటించుకుంటూ లిబరల్ ప్రభుత్వాల దురాగతాలను తెలియనట్లు నటిస్తుంటాయి. నిర్ధారణ చేయలేను గానీ ‘ది హిందూ’ కూడా దాదాపు అలాగే కనిపిస్తుంది.

  “చిత్రహింసల కొలిమిలోంచి” పుస్తకం నేను చూసాను. కానీ చదివినట్లు గుర్తులేదు. మీరు చెప్పాక చదవాలని అనిపిస్తోంది. కొని చదువుతాను.

  మీరు ఇచ్చిన లింక్ ద్వారా బాల గోపాల్ గారి ‘దళిత’ సంకలనం చదివాను. ఇంకా కొన్ని పేజీలు మిగిలి ఉన్నాయి. ఆయన తాత్విక చింతన పరిణామం అందులో కనిపిస్తోంది. ప్రారంభంలో కులం పై ఆయన చేసిన రాజకీయ విశ్లేషణ చాలా బాగుంది. ఆచరణలో కులాన్ని ఎదుర్కోవాలో, రేఖామాత్రంగానే అయినా, చక్కగా చెప్పాడు. మీ లింకు ద్వారా నాకా ఉపయోగం కలిగింది. ధ్యాంక్స్ చెప్పడానికి ఈ విషయాన్ని సందర్భం కాకపోయినా ప్రస్తావిస్తున్నాను.

 3. విశేఖర్ గారూ,
  ధన్యవాదాలు. బాలగోపాల్ గారి ‘దళిత’ సంకలనం చదువుతున్నారు కదూ. పూర్తిగా చదివాక ముప్పయ్ ఏళ్ల జీవితాచరణలో భావజాల పరంగా ఆయనలో వచ్చిన మార్పులను, మిత్రులకు కూడా శత్రువుగా మారిపోయిన ఆయన వ్యక్తిత్వంలోని సానుకూల అంశాలను తప్పకుండా ఒక కథనం రూపంలో రాసి ప్రచురించండి.

  మార్క్సిజం మూలాలనే ఆయన శంకించి ఉండవచ్చు, విప్లవోద్యమాలు తన పట్ల రాజకీయ సహనభావాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకునేంత తీవ్రస్థాయిలో ఆయన ప్రతిహింసా పోరాటాలలో దొర్లుతున్న అపసవ్య ధోరణులను కఠినంగానే ఎత్తి చూపించి ఉండవచ్చు.

  కాని ప్రతిహింసాత్మక పోరాటాలలోని తప్పుడు ధోరణులను ఆయన ఎత్తిచూపడంలో, ఏరకంగానూ బయటి సమాజం సమర్థించలేని విప్లవోద్యమ లోపభూయిష్ట ఆచరణను ఖండించడంలో ఆయన పౌరసమాజం వాణిని మాత్రమే వ్యక్తీకరించారని నా అభిప్రాయం. తన వ్యక్తీకరణలో ఇసుమంత వ్యక్తిగత ప్రయోజనమూ లేదనే నా నమ్మిక.

  బాలగోపాల్ బూర్జువా శిబిరంలో చేరిపోయారనేంత తీవ్ర ఆరోపణలను ఉద్యమాలు ఆయనపై మోపిన సమయంలోనూ, ఆయన పట్ల అవగాహనలో పొరపాటు దొర్లుతోందని నాకు బలంగా అనిపించేది. కాని పౌరహక్కుల ఉద్యమం నుంచి విడివడ్డాక కూడా మిగిలిన 11 ఏళ్ల జీవితాచరణలో ఉద్యమం గురించి ఆయన పల్లెత్తు మాట అనలేదు.

  ఆయన పుస్తకాలు ‘దళిత,’ ‘నిగాహ్,’ ‘రాజ్యం-సంక్షేమం,’ ‘రూపం సారం’ వంటి అచ్చయిన, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదివితే ఆచరణలో జరిగే తప్పులు మొత్తం ఉద్యమంపై, సిద్ధాంతంపై ఎంత చెడు ప్రభావం వేస్తాయి అనే అంశంపై తన ఆవేదన స్పష్టంగా బోధపడుతుంది.

  “మన వామపక్ష ఉద్యమాలలో మొదటినుంచీ కూడా కలుపుకుని పోయి ఐక్యంగా, బలంగా, ఉమ్మడిగా ఉండేకంటే కూడా ఎవరికి వాళ్లు చీల్చుకుని పోయేటటువంటి పోకడే ఎక్కువ. అది ఇవ్వాళ చాలా దూరం పోయింది.”
  “ఒకనాడు ప్రజలలో మన దీర్ఘకాలికమైన బాగుకోసం, రేపటి బాగు కోసం ఇవ్వాళ త్యాగం చేద్దాము అనేటటువంటి ఒక రాజకీయ గుణం, సామాజిక గుణం కూడా బలంగా ఉండింది. ఎక్కడో అది కూడా దెబ్బతినింది.”
  “సామ్రాజ్యవాదమనేది పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ఒక వ్యక్తి కాదు. దానికి ప్రతినిధి ఒక వ్యక్తి కాదు, ఒక చోటు, ఒక స్థలం కాదు – అదొక విస్తృతమైన సామాజిక సంబంధం. ఆ విస్తృత సామాజిక సంబంధానికి వ్యతిరేకంగా చేసే పోరాటమనేది చాలా మెలకువతో, విజ్ఞతతో వ్యవహరించవలసిన అవసరముంటుంది.”
  “ఇప్పుడు మన దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నయా ఉదారవాదం అనేటటువంటి ఆ ఫిలాసఫీలో చాలా కీలకమైన ఆలోచన ఏమిటంటే ఎవరి వనరులతో వాళ్లు తమకున్న సామర్థ్యం మేరకు ప్రయోజనం పొందుతూ పోతారు. వనరులు లేనివాళ్లు చస్తారు. బతికితే బతుకుతారు. వనరులున్న వాళ్లనుంచి ఏమయినా కొంత రాలితే వీళ్లు ఏరుకుని తింటారు అనే ఫిలాసఫీ ఒకటి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థను శాసిస్తోంది. వనరులు అనేవాటిని ప్రభుత్వం ప్రయత్నపూర్వకంగా ప్రజానీకానికి జీవనాన్ని కల్పించే రూపంలో అభివృద్ధి చేయాలనే ఆలోచన పూర్తిగా పక్కకు పోయి వనరులు ఉన్నవాడిదే సొత్తూ..లేనివాళ్లకు లేవు వాళ్లకు బతుకు ఉండేదీ లేనిదీ పరిస్తితులను బట్టి ఉంటుంది అనే ఒక అబిప్రాయం వచ్చింది.”

  ఈ అభిప్రాయాలను వెలువరించిన వ్యక్తి ఏ శిబిరంలో ఉండాలో అర్థమవుతుందా విశేఖర్ గారూ, కాని పౌరహక్కుల భావనపై కొత్త కాంతి ప్రసరించిన ఈ మనిషిని దూరం చేసుకున్నారు. ఉద్యమం ఉనికికే భంగకరంగా మారుతున్న ధోరణులను ప్రశ్నించిన వ్యక్తిని వెలి వేసినంత పని చేశారు.

  నేను ఇంతకు ముందు కూడా మీ బ్లాగులోనే మన దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో రాజకీయ సహనభావం లోపించడం గురించి వ్యాఖ్యానించాను. దశాబ్దాలుగా ఉద్యమంలో కొనసాగిన వారు కూడా పార్టీ పంధాను కాస్త వ్యతిరేకిస్తే చాలు.. ఇక మనుషులే కాకుండా పోతారు. 3వ ప్రపంచ దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ పెడధోరణి పార్టీకి, ఉద్యమానికి బయట మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోందేమో మరి.

  దళిత సంకలనం పూర్తయ్యాక మీరు బాలగోపాల్ ఉపన్యాసాల సంకలనం ‘రాజ్యం-సంక్షేమం’ని తప్పకుండా చదవండి. perspectives ప్రచురణలు తీసుకొచ్చిన ఈ పుస్తకంలోని ప్రతి రచనా స్ఫూర్తిదాయకమైనదే. చివరలో ఉన్న ‘చైనా ఆర్థికాభివృద్ధి – సింహావలోకనం’ అనే పెద్ద వ్యాసాన్ని తప్పకుండా చదవండి. ఈ మనిషిని ప్రజా ఉద్యమం ఎలా దూరం చేసుకుందా అనిపిస్తుంది.

  బోల్షెవిక్కులు రష్యాలో తిరుగుబాటు చేసి 1917లో మెన్షెవిక్కుల ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు బోల్షివిక్కుల నేత లెనిన్, రష్యాలో మార్క్సిస్ట్ తత్వవేత్త, మెన్షవిక్కుల సమర్థకుడైన ప్లెహనోవ్‌ను, బోల్షెవిక్ శ్రేణులు ఎక్కడ నిర్బంధంలోకి తీసుకుంటాయో అని గాభరాపడి ప్లెహనోవ్‌ని ఏమీ చేయవద్దని డిక్రీ జారీ చేశాడని మనం చదువుకున్నాము.

  విప్లవోద్యమం పతాక స్తాయికి వెళ్లిన దశలో కూడా, బోల్షెవిక్ సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్లెహనోవ్‌ పట్ల లెనిన్ సహనభావం ప్రదర్శించాడు. భారతీయ కమ్యూనిస్ట్ ఉద్యమం నేర్చుకోలేకపోయిన గొప్ప గుణాల్లో ఇదీ ఒకటేమో మరి.

  బాలగోపాల్ రచనల ఆన్‌లైన్ లింక్‌లు

  ప్రాచీన భారతదేశ చరిత్ర (డిడి కొశాంబి మూలరచనకు పరిచయం)

  Click to access 3.MATA%20TATHVAMPAI%20BALAGOPAL.pdf

  రూపం – సారం సాహిత్యంపై బాలగోపాల్

  Click to access 5.RUPAM-SARAM.pdf

  దళిత

  Click to access 6.DALITA.pdf

  చీకటికోణాలు

  Click to access chikatikonalu.pdf

  ప్రజాతంత్ర ప్రత్యేక సంచిక

  Click to access balagopal-special-weekly-oct-18-24-part1.pdf

  రాజ్యం – సంక్షేమం

  Click to access 1.RAJYAM-SANKSHEMAM.pdf

  హక్కుల ఉద్యమం – తాత్విక దృక్పథం

  Click to access hakkula-udyamam-1-2-parts-11.pdf

  హక్కుల ఉద్యమం – తాత్విక దృక్పథం

  Click to access hakkula-udyamam-3-part.pdf

  నిగాహ్ (1998-2003)

  Click to access 2.NIGAH.pdf

  రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్
  http://blaagu.com/chandamamalu/2012/03/08/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D/#comments

  నా ఈ వ్యాఖ్య పరిధిని కూడా మించిపోయిన పెద్ద స్పందనేమో మరి.

 4. రాజశేఖర గారు గారు

  ప్రతిహింసా పోరాటాలలోని తప్పుడు ధోరణుల గురించీ, బాలగోపాల్ ను శత్రువుగా ఎంచి దూరం చేసుకోవడం గురించీ మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. శత్రువులు కూడా మెచ్చిన రాజనీతిజ్ఞుడుగా లెనిన్ కి పేరు. మావో సైతం శత్రువుల పట్లా, మిత్రుల పట్లా వ్యవహరించవలసిన తీరు గురించి అనేక సందర్భాల్లో వివరించాడు. సమాజ మార్పు కోసం పని చేస్తున్నవారికి ఉండవలసిన ఓర్పు గురించి పదే పదే చెప్పాడు. భారతదేశ విప్లవోద్యమం బాలారిష్టాలతో ఇంకా తీసుకుంటోంది. తప్పుల నుండి గుణపాఠాలు తీసుకోవడానికి దాదాపు అన్ని గ్రూపులూ ఏదో ఒక స్ధాయిలో నిరాకరిస్తున్నాయి. సెక్టేరియన్ ధోరణులను ఎదుర్కొంటున్నాయి. దశాబ్దాల ఎదురు దెబ్బలు సైతం పాఠాలు నేర్పలేకపోవడం ఒక వైపరీత్యమే. ఫ్యూడల్ ధోరణులు విప్లవ పార్టీలలో ‘సమస్యలు సృష్టించే మేరకైనా’ చొరబడ్డాయేమోనని అనిపిస్తుంది.

  మీరు ఇచ్చిన లింక్స్ లో కొన్ని చదివాను. అయినా మళ్ళీ చదివితే ఉపయోగమే తప్ప నష్టం లేదు. అనేకానేక ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s