నోరు మూసుకొమ్మని చైనా ప్రభుత్వ పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ అమెరికాను హెచ్చరించింది. చైనా సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం వద్దని పత్రిక విదేశీ విభాగం గట్టిగా చెప్పింది. చైనా, దాని పొరుగు దేశాల మధ్య తగాదాలు పెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోందని పీపుల్స్ డెయిలీ ప్రధాన పత్రిక కూడా తీవ్రంగా వ్యాఖ్యానించిందని ఎన్.డి.టి.వి తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగా విరోధాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూడడం అమెరికాకి కొత్త కాదనీ ఇటీవలీ కాలంలో చైనా విషయంలో కూడా ఈ ట్రిక్కు వినియోగిస్తున్నదని నిందించింది. దక్షిణ చైనా సముద్రం వ్యవహారం లో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని చైనా పరోక్షంగా దీని ద్వారా హెచ్చరించినట్లయింది.
దక్షిణ చైనా సముద్రంలో ప్రాదేశిక వివాదాలను దగ్గరినుండి పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల చేసిన ప్రకటన పీపుల్స్ డెయిలీ ఆగ్రహానికి కారణం. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా ఆయుధాలను కేంద్రీకరించడం ఉద్రిక్తతలు మరింత పెరిగడానికి దారితీస్తున్నదని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ తన ప్రకటనలో వ్యాఖ్యానించింది. హిందూ మహా సముద్రంతో సహా సప్త సముద్రాలలోనూ, సప్త ఖండాలలోనూ వందలకొద్దీ మిలట్రీ స్ధావరాలు నెలకొల్పి ప్రపంచం అంతటా ఉద్రిక్తతలను రాజేస్తూ స్వతంత్ర దేశాలను దురాక్రమిస్తున్న అమెరికా, చైనా ఆయుధ కేంద్రీకరణపై ఆందోళన చెందడం పెద్ద హిపోక్రసీ.
ఆయుధ కేంద్రీకరణ పట్ల అమెరికా నీతులు చెప్పడం అంటే అచ్చోసిన ఆంబోతు, ముందు కాళ్ళు కట్టుకుని ఆవుదూడ దౌర్జన్యంపై కన్నీళ్లు పెట్టుకోవడమే. ప్రపంచ వనరులను దోచుకుని దుర్మదాంధురాలై కొట్టుకుంటున్న అమెరికా వక్రనీతికి దక్షిణ చైనా సముద్ర ప్రకటన ఒక ప్రబల ఉదాహరణ.
దక్షిణ చైనా సముద్రంలోని వనరులకు సంబంధించి వియత్నాం, ఫిలిప్ఫైన్స్ లతో పాటు ఇతర ఆగ్నేయాసియా దేశాలతో ఉన్న వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు చైనా ఒక ప్రకటన చేసింది. అయితే బహుళపక్ష చర్చల పద్ధతి ద్వారా సమస్య పరిష్కరించుకోవాలన్న వాదనకు అమెరికా మద్దతు ఇస్తూ ఆ వైపుగా వివిధ దేశాలను రెచ్చగొడుతోంది. అమెరికా విధానాన్ని చైనా తిరస్కరిస్తున్నది. దక్షిణ చైనా సముద్రంలో భారత ఆయిల్ కంపెనీ ‘ఓ.ఎన్.జి.సి విదేశ్’ కూడా అన్వేషణ జరుపుతున్నందున ఇక్కడి ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంపై కూడా పడుతుంది.
అమెరికా విదేశాంగ శాఖ ప్రకటనను చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రభుత్వ ఖండనను చైనా ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డెయిలీ ఉచ్చ స్ధితికి తీసుకెళ్లింది. “‘నోరు మూకో’ అని అమెరికాతో అరిచి చెప్పడానికి మాకు పూర్తి యోగ్యత ఉంది. చైనా సార్వభౌమత్వం పరిధిలో ఉన్న విషయాల్లో ఇతర దేశాల్లో చొరబడే దాని విధానం ఎలా సహిస్తాము?” అని పీపుల్స్ డెయిలీ అంతర్జాతీయ విభాగం ప్రశ్నించింది. “మంటలను రాజేయడం, విభజనలను రెచ్చగొట్టడం, ఉద్దేశ్యపూర్వకంగా చైనాతో విరోధాన్ని రెచ్చగొట్టడం ఏమీ కొత్త ఆట కాదు. కానీ వాషింగ్టన్ ఈ ట్రిక్కుని అమలు చేయడానికి దురద ప్రదర్శిస్తోంది” అని పీపుల్స్ డెయిలీ ప్రధాన పత్రిక కటువుగా వ్యాఖ్యానించింది.
బీజింగ్ స్పందన మరిన్ని రాయబార ఉద్రిక్తతలకు దారితీయవచ్చని పత్రికలు విశ్లేషించాయి. సిరియాలో అమెరికా తదితర పశ్చిమ దేశాలు జరిపిస్తున్న కిరాయి తిరుగుబాటుని చైనా, రష్యాలు ఐక్యరాజ్య సమితి వేదికలపై తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. సిరియాపై దురాక్రమణ దాడి చేయడానికి వీలుగా సమితిలో ప్రవేశపెట్టిన దుర్మార్గమైన తీర్మానాలను చైనా, రష్యాలు ఇప్పటికీ మూడు సార్లు వీటో చేశాయి. మరో పక్క సిరియా అధ్యక్షుడు బషర్ అస్సద్ ను చంపడం కోసం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు సాగిస్తున్న కుట్రలు సఫలం కావడం లేదు. దానితో చైనాను గిల్లి కజ్జా పెట్టుకోవడానికి అమెరికా తెగిస్తున్నట్లు కనిపిస్తోంది. దక్షిణ చైనా సముద్ర ఉద్రిక్తతను ప్రేరేపించి సిరియా విషయంలో చైనా ను కట్టడి చేయడానికి అమెరికా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.